డైలీ సీరియల్

యమహాపురి 51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజా తడబడలేదు, ‘నీ ఊహ సరైనదే. ఆయన నాతో తను నరకపురికి రాజునన్నాడు. ఊరిని తను వెయ్యి కళ్లతో కాపాడుతుంటానన్నాడు. ఊరి క్షేమం కోసం ఏడాదికోసారి విదేశయాత్ర చెయ్యాలనీ, రెండు నెలలదాకా తిరిగి ఊళ్లోకి వెళ్లకూడదనీ, ఎట్టి పరిస్థితిలోనూ ఆ నియమం తప్పకూడదనీ అన్నాడు’’ అన్నాడు.
‘‘అది మాకు తెలుసు. ఆయన మాకు రాజే కాదు. దేవుడు కూడా. దేవుడు ఎక్కడున్నా తన భక్తుల్ని కాపాడుకోగలడు. మరి నినె్నందుకు పంపాడో అది చెప్పు’’ అన్నాడు అప్పన్న కటువుగా.
‘‘అదే చెబుతున్నా విను. ఆయన దేవుడని నువ్వే అన్నావుగా. ఆ దేవుడికి ఉన్నట్లుండి తెలిసిందట- తాను విదేశాల్లో ఉండే ఈ రెండు నెలల్లోనూ నరకపురికి అరిష్టమున్నదని. అది తెలిసి ఆయన విలవిల్లాడిపోయాడు. విదేశయాత్ర మానేసినా, తిరిగి ఊళ్ళోకి వెళ్లినా నియమం తప్పినట్లవుతుందిట.
దాంతో తన శక్తి తగ్గిపోతుందిట. అరిష్టాన్ని ఎదుర్కొనడం తనవల్ల కాదట. దూరాన ఉండి ఆ అరిష్టాన్ని ఎదుర్కొనడం అసాధ్యమట. అందుకని జగదానందస్వామి దీవెనలు పొందిన నన్ను తనకి ప్రతినిధిగా ఎన్నుకున్నాడు. తన శక్తిలో కొంత నాకిచ్చాడు. ఇక్కడికి వెళ్లమన్నాడు’’ అన్నాడు రాజా.
‘‘ఇలాంటి కబుర్లు ఎవరైనా చెప్పొచ్చు. నేను నమ్మను’’ అన్నాడు అప్పన్న.
‘‘ఆ మాటే నేనూ ఆయనకి చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. ‘నా శాసనం నీ ముఖంలో ఉంటుంది. నీ చేతి రేఖల్లో వుంటుంది. మా ఊరి చెక్‌పోస్టులో నేను నియమించిన అప్పన్న అఖండుడు. ఎక్కడ వ్రాసిన నా శాసనాన్ని చదవగల శక్తి వాడికుంది. వాడు నిన్ను లోపలకి రానిస్తాడు’ అన్నాడాయన. ఆ మాట పట్టుకుని నేనిక్కడికి వచ్చాను’’ అన్నాడు రాజా.
అప్పన్న ముఖం వెలిగింది. ‘‘నేను యమ అనుచరుణ్ణి. పొగడ్తలకు లొంగేవాణ్ణి కాను. సరైన ఋజువు లేకుండా నిన్ను లోపలకు పంపలేను’’ అన్నాడు.
‘‘పొగడ్తలకు లొంగవని నువ్వు నీ నోటితో చెప్పక్కర్లేదు. నిన్ను చూడగానే ఆ విషయం తెలిసిపోయింది. ఐనా నేను నిన్ను పొగిడానంటే- ఆ పొగడ్తలు నావి కాదు. నరకపురి రాజు యమవి’’ అని ఓ క్షణం ఆగి, ‘‘నువ్వు నన్ను లోపలకు వెళ్లనివ్వకపోతే ఈ ఊరు సర్వనాశమైపోతుందని యమ అన్నాడు. ఆ తర్వాత యమ తిరిగొచ్చేక ఊళ్ళో ఇంకా ఎవరైనా మిగిలుంటే, వాళ్లలో నువ్వుంటే- యమ నీ పని పట్టడం ఖాయం’’ అన్నాడు రాజా.
‘‘బెదిరిస్తున్నావా?’’ అన్నాడు అప్పన్న.
‘‘పొగిడితే ఆ పొగడ్తా కాదు, బెదిరిస్తే ఆ బెదిరింపూ నాది కాదు. ఆపైన నీ ఇష్టం’’ అన్నాడు రాజా నెమ్మదిగా దృఢంగా.
అప్పన్న కళ్లలో కలవరం కనబడింది. వాడు రాజా ముఖంలోకి నిశితంగా చూశాడు.
‘‘ఏయ్, నీ మాటల్లో నిజముంది. నాకు నీ ముఖంలో యమ శాసనం కనబడుతోంది. ఏదీ నీ చేతులు చూపించు. వాటి రేఖల్లో కూడా యమ శాసనం ఉన్నదేమో చూస్తాను’’ అన్నాడు.
రాజా తన రెండు చేతులూ వాడి ముందు చాచాడు.
అప్పన్న ముందు వాటిని మామూలుగానే చూశాడు. తర్వాత ఉన్నట్లుండి రాజాకి రెండు చేతులూ జోడించి, ‘‘అజ్ఞానంతో నిన్ను అనుమానించి ఇంతసేపు నిలబెట్టి మాట్లాడాను. నన్ను క్షమించు’’ అన్నాడు.
అప్పన్నలో ఉన్నట్లుండి ఇలాంటి మార్పు ఊహించినట్లు లేదు. రాజా ఆశ్చర్యపడి చేతులు వెనక్కి తీసుకుని అరచేతుల్లో రేఖలు పరీక్షగా చూసుకున్నాడు. అందులో నిజంగానే యమ శాసనం ఉందేమో- అది తనకి కనిపిస్తుందేమోనని.
ఈలోగా అప్పన్న, ‘‘ఒరేయ్ గణపతీ! రాజాగారొచ్చారు. రాసకో. చేతిక వాచీ ఉందిగా- టైం కూడా వేసుకో’’ అన్నాడు.
పక్కనే ఓ బల్ల వెనుక కుర్చీలో కూర్చున్న ఓ సన్నని పొడుగాటి వ్యక్తి- తన ముందున్న పుస్తకంలో ఆ వివరాలు రాసుకుంటుంటే- ‘‘రాజా అంటే పేరనుకునేవు. మా మాటలన్నీ విన్నావుగా. మన యమ వచ్చేదాకా ఈయనే మనకి రాజు. ఆ విషయం కాగితంమీద రాసి ఇలా ఇవ్వు’’ అన్నాడు అప్పన్న మళ్లీ.
గణపతి తన బల్లమీదున్న మరో చిన్న పుస్తకంలోంచీ ఓ పసుపు పచ్చని కాగితాన్ని చింపి, దానిమీద ఏదో వ్రాసి అప్పన్నకిచ్చాడు. అప్పన్న ఆ కాగితాన్ని రాజాకిచ్చి, వినయంగా వంగి నమస్కరించి ‘‘తమరీ కాగితం తీసుకుని లోపల యమ ప్రాంగణానికి వెళ్లండి. రెండు నెలలు ఈ రాజ్యాన్ని ఏలుకోండి’’ అన్నాడు.
రాజా ఆ కాగితం చూశాడు. ‘యమ శాసనంతో, యమ వచ్చేదాకా, మన కొత్త రాజు- రాజా’ అని వ్రాసి ఉంది ఆ కాగితంలో. అతడు మనసులో నవ్వుకున్నాడు.
ప్రాణభయంతో రక్షణ కోసం ఆ ఊళ్ళో అడుగెడుతున్నాడు తను. ఊరిని అరిష్టం నుంచి కాపాడ్డానికి వచ్చాడని తనని ఆ ఊళ్ళో అడుగెట్టనిచ్చారు. మున్ముందు ఏం జరుగుతుంది?
రాజా రాజాలా కాకుండా తడబడుతూ ముందడుగు వేసి ఊళ్ళో అడుగుపెట్టాడు. చుట్టూ ఓసారి చూశాడు.
నరకపురి...
చూడ్డానికి అన్ని ఊళ్ళలాగే ఉంది. కానీ ఇది అన్ని ఊళ్లలాంటిదీ కాదు.
ఇలాంటి ఊరొకటి ఉంటుందనీ అందులో తను అడుగుపెడతాననీ అతడెప్పుడూ అనుకోలేదు.
కానీ దేవుడు తననిక్కడికి పంపాడు. కాదు కాదు తరిమాడు.
‘‘ఇప్పుడేం చెయ్యాలి?’’ అనుకుంటే- అప్రయత్నంగా భారమైన నిట్టూర్పు వచ్చింది.
వీధుల్లో జన సంచారం ఎక్కువగా లేదు. ముందుగా ఓ ముసలమ్మ కనిపించింది. అతడామెను యమ ఇంటి గురించి అడిగాడు. ఆమె అతడి మాట విననట్లుగా వెళ్లిపోయింది. ‘చెవుడేమో?’ అనుకున్నాడు రాజా.
ఆ తర్వాత ఓ యువకుడు కనిపించాడు. యమ ఇంటి గురించి అడిగితే, దారి చూపించాడు. ఎలా వెళ్లాలో చెప్పాడు. ‘‘ఇల్లెలా గుర్తుపట్టాలి?’’ అన్నాడు రాజా.
‘‘మా ఊరికి అదొక్కటే మేడ’’ అని వెళ్లిపోయాడా యువకుడు.
అప్పుడు రాజా పరీక్షగా చూస్తే- ఊళ్ళో రోడ్లు మహానగరపు వీధి రోడ్లలా మెరిసిపోతున్నాయి. వాటి పక్కన ఎత్తయిన పచ్చని చెట్లు చల్లని గాలినీ, నీడనీ ఇస్తున్నాయి.
ఇల్లు చిన్నవైనా గవర్నమెంటు క్వార్టర్సులా తీర్చిదిద్దినట్లున్నాయి.

ఇంకా ఉంది

వసుంధర