భక్తి కథలు

హరివంశం 147

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీసౌందర్యం, నీ సౌభాగ్యం, నీ పతివాల్లభ్యం లోకంలో అసదృశం. మాకీ ఉపకారం చేసినందుకు నీ కోర్కె ఏదైనా తీర్చాలని నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది ఏం కోరుకుంటావో కోరుకో అని లాలనగా సత్యభామమనడిగింది శచీదేవి. అపుడా వనజాక్షి ఎంతో వినమ్రతతో ‘నాకేమి లోటుందని నిన్ను అడగను! నాకెటువంటి కొరతా లేదు. నీ నెయ్యం నా పట్ల ఉంటే నాకదే చాలు’ అని చెప్పింది.
ఇంద్రోపేంద్రులు సంతోషభరిత చిత్తులై అదితిదేవి మందిరానికి వెళ్ళారు. ఆమె పాదాలకు ఇద్దరూ నమస్కరించారు. ఇంద్రుడప్పుడామెకు ఆమె కుండలాలు సమర్పించాడు. శ్రీకృష్ణుణ్ణి గూర్చి పొగిడాడు. ఆయన ప్రశంసనీయ పరాక్రమం గూర్చి ఆమెకు చెప్పాడు. ఆమె ఎంతో హర్షంతో ముకుందుడికి దీవెనలిచ్చింది. ఇద్దరు కుమారులను ప్రేమతో అభినందించింది. శచీ సత్యభామలు ఆమెకు ప్రణమిల్లగా ఆనందపూర్వకంగా దగ్గరకు తీసుకుని ఆదరించింది.
నాయనా, నా పరితాపం తీర్చావు. మూడు లోకాలలో ఆపదలను గట్టెక్కించగల వారు నీకన్నా మరెవరుంటారు! త్రైలోక్య విజయివి నీవు. నీవు భూలోకంలో వున్నంతకాలమూ శరణాగత రక్షకుడిగా కీర్తి పొందుతావు. నీవు చేసే గొప్ప కార్యాలు, ప్రస్తుతి పాత్రమవుతాయి. ఈ సత్యభామ నీకు ప్రేమాపుటిల్లాలు. ఈ నా కోడలి గుణగణాలు, ప్రియవల్లభత్వం మానవలోకంలో చరితార్థం పొందుతాయి అని అదితిదేవి వాళ్ళిద్దరినీ వాత్సల్యంతో ఆశీర్వదించింది. అపుడు తల్లి దగ్గర, అన్న దగ్గర శెలవు తీసుకొని సత్యభామ సహితుడై గరుడారూఢుడై నందనోద్యానాన్ని చూడటానికి గోవిందుడు వెళ్ళాడు.
ఆ నందనోద్యాన సౌందర్యం వర్ణనాతీతం. ఇక్కడి పూల వాసనలకు భ్రమసి తుమ్మెదలు మందాకినిలో పద్మ మధువులు ఒల్లవు. అచ్చర కనె్నలిక్కడ నిత్యం వృక్ష డోలికలతో క్రీడిస్తూ ఉంటారు. అప్సరసలు రోజుకోతీరున ఇక్కడి పుష్పాలు తమ సిగలలో అలంకరించుకుంటారు. ఆకాశ చారులైన సిద్ధ దంపతులై అలసిపోయి ఇక్కడి మనోహరమైన నీడలలో విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడికి సమీపంలోనే ఉన్న మేరు పర్వత సెలయేళ్ళనుంచి మృదు శీతలానిలాలు నందనోద్యానంలోని పూల వాసనలను మోసుకొని ఆకాశ విమాన చారులకు సమ్మోదం కలిగిస్తాయి. ఇక్కడి వృక్షాలు, లతలు సర్వ రుతువులలోనూ పూచి ఫలించి సోయగాలతో కలలాడుతూ ఉంటాయి. అవన్నీ కల్పవృక్ష మహిమాన్వితమైనవే.
శచీదేవికి ఈ పారిజాత తరువంటే ఇంతింతనరాని మక్కువ. దివిజ లోకాలన్నింటా పారిజాతానికి ఘనమైన ప్రీతి పాత్రత ఉంది. ఆరాధ్యగౌరవం ఉంది. ఈ తరువును సమీపించిన వారందరికీ, దీని సౌగంధ్యం సోకినవారందరికీ తమ పూర్వ జన్మల స్మరణ కలుగుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు, సత్యభామ పారిజాత పాదపం సమీపించగానే తాను దివ్య దేవతా వనితను అనే భావం మదిని ఉల్లసింపజేసింది సత్యకు. అందువల్ల లీలా వినోద ప్రేమాభిరామ నయనయై తరళ లోచనాలతో ఈ వృక్షం నాకు కావాలి. దీనిని మనతో తీసుకొని పోదాము అని విభుణ్ణి ప్రార్థించింది. ఓహ్! ఇదెంత చిన్న కోరిక, దీని కోసం నన్ను ప్రాధేయపడాలా! అని ఆ తరువును వెంటనే పెకలించి గరుత్మంతుడి వీపుపై పదిలపరిచాడు. సత్యభామ శ్రీకృష్ణ ప్రభువును ఆలింగనం చేసుకొని ఆయన చేతి ఆసరాగా తాను ముందు సపర్ణుణ్ణి అధిరోహించింది. ఆ తరువాత ఆ ప్రియా మనోరథ వరదాయి అయిన ఆ చుతురుడు కూడా గరుత్మంతుణ్ణి ఆరోహించాడు. గరుత్మంతుడు వాళ్ళను తీసుకొని బయలుదేరాడు. వాళ్ళు దేవలోకం దాటి వెళుతుండగా నందన వనానికి కావలి ఉన్న కింకర పరివారం ఆయనను ప్రతిఘటించింది.

ఇంకా ఉంది