డైలీ సీరియల్

యమహాపురి 61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇంత చిన్న సాయానికి అంత పెద్ద మాటలొద్దు. మావల్ల ఓ కుటుంబం నిలబడితే అదే పెద్ద సంతోషం నాకు’’ అన్నాడాయన.
అలా వ్యాఘ్రేశ్వరుడు అనంతం ఇంటికి వచ్చాడు. అక్కణ్ణించి అతడి జీవితంలో స్వర్ణయుగం మొదలైంది.
వ్యాఘ్రేశ్వరుడు ఇంజనీరింగులో చేరేసరికి అనంతం కూతురు జయకి పద్దెనిమిదేళ్లు. ఆమె తమ్ముడు ప్రభాకరానికి పధ్నాలుగేళ్లు.
అనంతం, భార్య అతణ్ణి కన్నబిడ్డలతో సమంగా నెత్తిన పెట్టి చూసుకునేవారు. పిల్లలు ముగ్గురూ ఏకోదరుల్లా కలిసిమెలిసి ఉండేవారు.
వ్యాఘ్రేశ్వరుడు ఇంజనీరింగు ఫైనలియర్లో వుండగా జయకి పెళ్లయింది. ఆమె అత్తారింటికి వెడుతున్నపుడు ఒకర్నొకరు వదల్లేక- వ్యాఘ్రేశ్వరుడు ఘొల్లుమన్నాడు, జయ భోరుమంది. వారి అనుబంధాన్ని బంధు మిత్రులు అబ్బురంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత వ్యాఘ్రేశ్వరుడికీ, ప్రభాకరానికీ అనుబంధం మరింత పెరిగింది.
వ్యాఘ్రేశ్వరుడు ఇంజనీరయ్యాడు. ‘‘నువ్వి తెలివైనవాడివి. ఇంకా చదువుకో. అప్పుడే ఉద్యోగానికి వెళ్లకు’’ అని అనంతం చెప్పాడు. కానీ ఆ సమయానికే కృష్ణమూర్తికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. శాంతకి కొడుకు సాయం అవసరమైంది. అతడు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత వ్యాఘ్రేశ్వరుడికి ఉత్తరాది ప్రాంతాన ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల్ని తీసుకుని అక్కడికి వెళ్లిపోతూ అనంతానికో ఉత్తరం వ్రాశాడు వ్యాఘ్రేశ్వరుడు.
‘‘బాబాయ్! నాన్న ఆరోగ్యం పూర్తిగా పాడయింది. ఇన్నాళ్లూ తన సుఖం మాత్రమే చూసుకున్న ఆయన ఇప్పుడు సేవలు చేయించుకోవడానికి తప్ప పనికిరాడు. ఆ సేవలు కూడా ఆయనకి బ్రతుకునిస్తాయి తప్ప సుఖాన్నివ్వవు. నాకైతే ఆయనపట్ల రోడ్డు పక్కన అనాథలా పడున్న సాటి మనిషిమీద కలిగేపాటి సానుభూతి కూడా లేదు. కానీ అమ్మకోసం ఆయన బాధ్యత నేను మోయక తప్పదు. ఈ పోరాటంలో కొంతకాలం నేను మీతో టచ్‌లో వుండకపోవచ్చు. కానీ- నా మనసులో నీకూ, పిన్నికీ ఉన్న స్థానాన్ని నా తల్లిదండ్రులకు కూడా ఇవ్వలేను’’ అని వ్రాశాడతడు. అదే అతడి చివరి ఉత్తరం.
ఆ తర్వాత అతడే ఊళ్లు తిరిగాడో, దేశాలు తిరిగాడో, ఏమనుభవాలు పొందాడో ఎవరికీ తెలియదు.
ఈలోగా జయ భర్త ఏదో ఫ్రాడ్‌లో ఇరుక్కున్నాడు. జైలుకెళ్లకుండా తప్పించుకుందుకు పది లక్షలు కట్టాలన్నారు. ఆ డబ్బు సద్దడానికి అనంతం పొలం కొంత తాకట్టు పెట్టాడు. భార్య నగలు కొన్ని అమ్మాడు. కొంత అప్పు చేశాడు. ఆ గండం గడిచేక జయ భర్త మళ్లీ పుంజుకుని బాగా గడించసాగాడు. కానీ మామగారి అప్పు తీర్చలేదు. ‘‘మా నాన్న తనకేమీ కానివాళ్లనే స్వంత డబ్బుతో ఇంజనీరింగు చదివించాడు. కన్నకూతురికిచ్చిన డబ్బు అప్పనుకుంటాడా?’’ అంది జయ. అది మెప్పో, దెప్పో తెలియదు.
అనంతం కూతుర్ని బాకీ తీర్చమనలేదు. కానీ అప్పట్నించీ ఆయన ఆర్థిక ఇబ్బందులు పెరగడమే తప్ప తరగలేదు. గుండెపోటుతో ఆయనా, మానసిక వ్యథతో ఆయన భార్యా పోటా పోటీలుగా త్వర త్వరగా వెళ్లిపోయారు.
అప్పటికి ప్రభాకరం ఇంజనీరింగ్ ఫైనలియర్లో ఉన్నాడు. ‘‘నా తమ్ముణ్ణి ఆదుకుందుకు నేనున్నాను’’ అంటూ జయ అతణ్ణి చేరదీసింది. భర్త వ్యాపారంలో భాగస్వామిని చేసింది. తనే మాలతిని ఎంపిక చేసి ఆమెతో వివాహం జరిపించింది.
జయ భర్త అసలు సిసలు వ్యాపారస్థుడు. ఆయనకు నీతి, నిజాయితీలకంటే లాభాలే ముఖ్యం. సంస్కారం కంటే సంపాదనే ముఖ్యం. అందుకు ప్రభాకరం పూర్తిగా భిన్నం. అతడికి వ్యాపార విషయమై బావతో పొసగలేదు. అక్క దగ్గిర మొర పెట్టుకునేవాడు.
‘‘నీ బావ జీనియస్. ఈ రోజులకి తగ్గ పద్ధతులు పాటిస్తున్నారు. నేను చెప్పానని నిన్ను తీసుకున్నారు కానీ ఆయనతో భాగస్వామ్యం కోసం పెద్ద పెద్దవాళ్లే వెంటబడుతున్నారు. ఆయన మాట వింటే బాగుపడతావ్. లేదూ జీవితంలో పైకి రాలేవ్’’ అని తమ్ముణ్ణి హెచ్చరించిందామె.
ఐనా ప్రభాకరం మనసు చంపుకుని బావతో పనిచెయ్యలేకపోయాడు. భాగస్వామ్యాన్ని వదులుకుని- తను వేరే ఉద్యోగంలోకి వెళ్లిపోయాడు.
జయకి కోపం వచ్చింది. తమ్ముడితో మాట్లాడ్డం మానేసింది. అందుకు ప్రభాకరం నొచ్చుకునేవాడు.
‘‘వదిన అంతలా చెప్పినపుడు మీరు అన్నయ్యగారితో కలిసుండాల్సిందేమో’’ అంది మాలతి అతడితో ఒకసారి.
‘‘వ్యాఘ్రేశ్వరం అన్నయ్య నిజానికి నాన్నకేమీ కాడు. కానీ ఆయన తనకి ఉన్నదాంతోనే అన్నయ్యని ఇంజనీర్ని చేశాడు. అన్నయ్యనుంచి ఏమాశించలేదు. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగాను. నాకది బాగా వంటబట్టింది. అక్కయ్య కూడా ఆ వాతావరణంలోనే పుట్టింది కానీ- అది బావ ఇంటి వాతావరణం మహిమో లేక ఆడపిల్ల కాబట్టి తప్పలేదో, లేక నిజంగానే తనకీ ఇదే బాగుందనిపించిందో మరి- ఆ వాతావరణాన్ని తనూ ప్రోత్సహిస్తోంది.
నేనక్కడ ఇమడలేను. మన పిల్లలు కూడా అలాంటి వాతావరణంలో ఉండడం నాకిష్టం లేదు. ఉన్నంతలో కలో గంజో తాగి బ్రతకొచ్చు కానీ మనకిష్టమైన పద్ధతిలోనే బ్రతుకుదాం. ఈ రోజు కాకపోతే రేపు- అక్కయ్య మనని అర్థం చేసుకుంటుంది. మాదెలాగూ రక్తసంబంధం’’ అన్నాడు ప్రభాకరం.
ఆ దంపతులకి ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దవాడు రాజా, రెండోవాడు గోపాల్.
గోపాల్‌కి ఏడాది తిరక్కుండా ఓ రోడ్డు ప్రమాదంలో ప్రభాకరం చనిపోయాడు. అంతే- అతడి కుటుంబం వీధిన పడే పరిస్థితి రావడానికి ఎన్నాళ్లో పట్టలేదు.
అప్పుడు నేనున్నానంటూ మళ్లీ వచ్చింది జయమ్మగా మారిన జయ. ప్రభాకర్‌కి పల్లెటూళ్లో ఉన్న ఆస్తులకి పవరాఫ్ అటర్నీ తీసుకుని- ఆ కుటుంబాన్ని తనింటికి తరలించింది. రెండేళ్లలోనే- ప్రభాకరం ఆస్తులన్నీ కరిగిపోయాయని, వాళ్లకి తన దయాధర్మభిక్ష వెయ్యడం ఆరంభించింది. వాళ్లమీద పెట్టే ప్రతి పైసకీ ఖర్చు వ్రాయడం మొదలెట్టింది. ‘‘తమ్ముడు నా మాట విని మాతోనే కలిసుంటే, ఈనాడు మీరూ మాతో సమంగా ఉండేవారు’’ అని నిష్ఠూరమాడేది.

ఇంకా ఉంది

వసుంధర