డైలీ సీరియల్

యమహాపురి 68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే- నరకపురిలో జనాలకి పడే శిక్షల్లో భౌతికమైన హింస తక్కువ, మానసికమైన హింస ఎక్కువ.
అహం తెలియనివారికి, విలువలను నమ్మనివారికి, శీలానికి ప్రాధాన్యమివ్వనివారికి- ఆయన శిక్షలు శిక్షలే కాకపోవచ్చు.
‘‘అది టామీ. దాన్ని నువ్వు మనిషనుకున్నావా?’’ అని మాత తనతో అన్నప్పుడు- ఆమె మనిషి కాదనీ ఓ జంతువనీ తను కూడా అనుకుంటే ఏమయ్యేది? ఆమెకు పడిన శిక్ష అమానుషమనిపించేదా?
యమ తెలివైనవాడు. ఆ ఊరిమీద ఎలాంటి పట్టు సాధించాడంటే- శతాబ్దాలు గడిచినా విప్లవం రాదక్కడ.
‘‘ఇప్పుడు నేనేం చెయ్యాలి?’’ అనుకున్నాడు రాజా. ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో స్ఫురించలేదు.
‘‘ఏదైనా చేద్దామనుకున్నా ఇలాంటి జనానికి ఏం చెయ్యగలను?’’ అంటూ తప్పించుకునే దారి కూడా వెదికాడు.
‘‘నీకు జగదానందస్వామి దీవెన ఉన్నది. ఈ ఊరి జనం నిన్ను యమకి అనుచరువడివని నమ్మారు’’ అంటూ మనసు ఆ దారిని మూసేసింది.
అప్పుడు రాజాకి స్ఫురించింది. నరకపురి జనం తను యమకి అనుచరుడని నమ్మేరు. తనేం చెప్పినా వినడానికీ, చెయ్యడానికీ సుముఖంగా ఉన్నారు. మాత కూడా తనకి సహకరిస్తానని భరోసా ఇచ్చింది.
ఎటొచ్చీ పొరపాటున కూడా తాను యమని వేలెత్తి చూపకూడదు. యమకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏం చేసినా యమ పేరిట చెయ్యాలి. యమ పేరు మంత్రంలా పనిచేసి జనాన్ని తనకి వశం చేస్తుంది.
ఇది అవకాశంగా తీసుకోవాలి. జనాలకి మానాభిమానాలు నేర్పాలి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు రుచి చూపాలి.
మనిషి రక్తం మరిగిన పులి మనిషిని వెదికి వేటాడుతుంది. స్వేచ్ఛ మరిగిన బానిసలు స్వేచ్ఛకోసం ఎంతటి విప్లవాన్నయినా తెస్తారు.
యమ తిరిగొచ్చేసరికి ఈ ఊరి జనమే తనకి అండ అవుతారు. తామంతా కలిసి యమని వేటాడొచ్చు.
అలా తన సమస్య తీరిపోతుంది. నరకపురి వాసులకు యమ పాలన నుంచి విముక్తి లభిస్తుంది. బహుశా అందుకే జగదానందస్వామి తనకి దీవెనలందించాడేమో!
ఈ నిర్ణయానికి వచ్చేక రాజాకి వెంటనే నిద్రపట్టింది.
***
మర్నాడు నిద్ర లేచి కాలకృత్యాలయ్యాక- రాజా, మాతని కలుసుకుని ఆమెతో మాట్లాడాలన్నాడు.
మాత అతణ్ణి ఆలోచనా మందిరానికి తీసుకెళ్లింది. ఇద్దరూ కూర్చున్నాక- ‘‘ఉన్నదున్నట్లు నీ మనసులోని మాట చెప్పు’’ అంది.
రాజా తటపటాయించలేదు. ‘‘యమకి తనీ ఊళ్ళో అనుసరిస్తున్న విధానాలపట్ల కొంత అసంతృప్తి ఉంది. తనకు తానుగా వాటిని మార్చడం ఇష్టం లేదు. అందుకే నన్ను ప్రతినిధిగా పంపాడు. నేనాయన ఆదేశాల్ని పాటించి ఈ ఊరి జనానికి కొత్త జీవితాన్నిస్తాను. యమ వచ్చేదాకా వారా జీవితాన్ని అనుభవిస్తారు. ఆయన వచ్చేక ఏ జీవితం బాగుందో యమకి చెబుతారు. కొత్త పద్ధతి నచ్చితే- యమ ఇకమీదట కూడా ఆ పద్ధతినే అనుసరిస్తాడు. నచ్చకపోతే- నాకు శిక్ష పడుతుంది. ఆయన ఏ శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తాను. ఇదీ నా నిర్ణయం’’ అన్నాడు రాజా- కొంత నిజాన్నీ కొంత అబద్ధాన్నీ అందంగా మేళవించి.
‘‘నరకపురివాసులకోసం నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నీకు ఈ విషయంలో నా పూర్తి సహకారం ఉంటుంది’’ అంది మాత.
***
యమ ప్రాంగణంలో రాజాకోసం పెద్ద సభ ఏర్పాటయింది. దానికి గ్రామస్థులందరికీ ఆహ్వానం అందింది.
యమ ఆదేశమంటే మాటలా- ఆ సభ జనంతో క్రిక్కిరిసిపోయింది.
రాజా జనాన్ని ఉద్దేశించి, ‘‘యమ సాక్షాత్తూ ఆ దేవుడి ప్రతినిధిగా ఈ ఊరికొచ్చాడు. అది మీ అదృష్టం. సాక్షాత్తూ ఆ యమ ప్రతినిధిగా నేను మీ ఊరికొచ్చాను. ఇది నా అదృష్టం’’ అన్నాడు. సభ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది.
రాజా కొనసాగించాడు. ‘‘మీరు పాపులు. మీకు తగిన శిక్షలు విధించడానికి యమ దివినుంచి భువికి వచ్చాడు. మీ కష్టార్జితాన్ని భువినుంచి దివికి పంపి ఈ పాపవిముక్తి కోసం కృషి చేశాడు. ఇప్పుడు మీకు పాపవిముక్తి అయింది. నరకపురి నాకపురి కానున్నది.
మీరు ఇన్నాళ్ళూ ఒక తరహా జీవితానికి అలవాటుపడ్డారు. ఇప్పుడు మీకు కొత్త జీవితాన్ని రుచి చూపమని యమ నన్ను ఆదేశించాడు. యమ వచ్చేలోగో మీరీ జీవితాన్ని పూర్తిగా అనుభవించండి. ఆయన వచ్చేక మీకు పాత జీవితం కావాలో, కొత్త జీవితం కావాలో మీరే ఎన్నుకోవచ్చు. ఐతే ఆయన వచ్చేదాకా ఇప్పుడిక్కడ జరుగుతున్న మార్పు బయటి ప్రపంచానికి తెలియకుండా మనమధ్యనే రహస్యంగా ఉంచుదాం’’ మళ్లీ కరతాళ ధ్వనులతో సభ దద్దరిల్లిపోయింది.
‘‘ఈ రోజునుంచీ మనమంతా సమానులం. ఎవరూ ఎవరికీ సేవకులు కారు. ఎవరికీ ఏ శిక్షలున్నా అవి రద్దు. నేటినుంచీ ఈ కొత్త జీవితం మొదలౌతుంది. దీని రుచి మీ ఊహకందదు’’ అన్నాడు రాజా.
గ్రామస్థులు రాజా చెప్పింది విన్నారు. చప్పట్లు కొట్టారు. ఐతే అతడన్న ఈ కొత్త జీవితమేమిటని కానీ, దాని రుచి గురించి కానీ- వాళ్లు ఊహించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ‘‘‘జరగాల్సింది జరుగుతుంది. ఇష్టాయిష్టాలతో, కష్టనష్టాలతో నిమిత్తం లేకుండా అనుభవించడమే’’ అనుకోవడానికి అలవాటుపడ్డ మనుషులు మరి!
***
రాజా చురుగ్గా కార్యాచరణకు దిగాడు. ముందుగా రాణిని నరకపురికి రప్పించుకున్నాడు.
‘‘ఈ ఊరు నీది. ఇక్కడి అణువణువూ నీకు తెలుసు. అంతా కర్మఫలాన్ని అనుభవిస్తుంటే- మన గీత మనమే మార్చుకోవాలి అనుకునే అతి కొద్దిమందిలో నీవూ ఉన్నావు. అందుకు అవకాశం రావడంలేదని మనస్తాపం చెందుతున్నావు. ఇప్పుడా అవకాశం వచ్చింది. జనం నన్ను యమ అనుచరుడిగా స్వీకరించారు. నేనేం చేసినా ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామస్థులందరికీ తెలియదు కానీ- ఈ ఊళ్లో మనం యమకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తున్నాం.

ఇంకా ఉంది

వసుంధర