డైలీ సీరియల్

పూలకుండీలు - 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారం పది రోజులుగా ఏదో విషయంలో కోడలి అంతరంగంలో తమకు తెలియని అలజడి ఏదో అగ్గిలా రగులుతుందన్న విషయాన్ని ఎప్పుడో పసిగట్టినా అదేంటో అర్థంగాక, ఆమెను అడిగే ధైర్యం చేయలేక సందర్భం కోసం ఎదురుచూస్తున్న ఆ వృద్ధురాలు కోడలిని పట్టుకొని తనూ వలవలా ఏడవసాగింది.
ఆ స్థితిలో వున్న అత్తాకోడళ్ళను చూసిన ముసలాయిన కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ‘‘నేనెంతోమంది అత్తా కోడల్లను చూశానుగాని నా కోడల్లాంటి కోడల్నీ, నా భార్య లాంటి అత్తను యాడ సూడలేదు. వీల్లు అత్తా కోడల్లు కాదు ఏ జన్మలోనో తల్లీ బిడ్డలయ్యుంటారు. అందుకే ఒకల్లంటే ఒకల్లకు వల్లమాలిన ప్రేమ’’ అనుకుంటూ వాళ్ళిద్దరివంకా గర్వంగా చూసుకుంటూ పైమీది తువ్వాలుతో కన్నీళ్ళను ఒత్తుకోసాగాడు.
తన కూతురు కుటుంబం కూడా తమలాగే పేద కుటుంబమే అయినప్పటికీ ఈ కుటుంబంలో ఉన్న ఆత్మీయతానుబంధాలు తమ కుటుంబంలో లేవని తెలిసిందే ఐనప్పటికీ ఆ క్షణంలో వాళ్లమధ్య పెనవేసుకున్న అనుబంధం తన ముందు ప్రత్యక్షంగా కన్పించడంతో శాంతమ్మ తండ్రికి దుఃఖం ఆగక తనూ వాళ్ళతో పాటుగా ఏడుస్తూ వారి దుఃఖాన్ని సంతోషంగా పంచుకున్నాడు.
తమ దుఃఖాన్ని ఇరుగుపొరుగువాళ్ళు వింటే లేనిపోని ఆరాలు మొదలుపెడతారన్న ఆలోచనతో ఠక్కున ఏడుపు ఆపిన శాంతమ్మ బలవంతంగా ముఖంమీద నవ్వు పులుముకుంటూ అత్తమామలకు ఇష్టమని భద్రాచలం నుండి వస్తూ కర్రీ సెంటర్లో తీసుకొచ్చిన చికెన్ వేసి అన్నం వడ్డించింది.
వియ్యకుండితో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అన్నం తిన్న శాంతమ్మ అత్తమామలు ఇంకాసేపట్లో కోడలు తమను వదిలిపెట్టి ఊరికిపోతుందన్న ఆలోచనతో వౌనంగా మారిపోయి ‘‘అటు పిల్లలు, ఇటు కోడలు ఎవ్వరూ లేకుండా రేపటినుండి ఈ గుడిశెలో గుడ్డి కొంగల మాదిరిగా ఎట్లుండాలో?’’ అన్న ఆలోచన ఎద లోతుల్లో సుడులు రేపుతుంటే బితుకు బితుకున చూస్తుండిపోయారు.
అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తుంది.
ఇరుగు పొరుగు వాళ్ళు పడుకున్న తరువాత అత్తమామలకు మళ్లీ మళ్లీ జాగ్రత్తలు చెప్పిన శాంతమ్మ తండ్రిని వెంట బెట్టుకొని మట్టి రోడ్డు మీదుగా నడిచి భద్రాచలం రోడ్డెక్కింది. అక్కణ్ణుండి ఆటో పట్టుకొని కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కి చేరుకుంది.
మణుగూరు ప్యాసింజర్ రోజుకన్నా రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుందని తెలియడంతో తండ్రి వంక తిరిగిన శాంతమ్మ ‘‘నాయినా! నేను పోతలేగాని నువ్వు బస్సెక్కి ఇంటికపో.. పిల్లగాల్లు అమ్మను ఏం ఏడిపిస్తున్నారో ఏమో’’ ఏడుపుతో స్వరం పూడుకుపోతుంటే మాట్లాడలేక మాట్లాడుతూ తల వంచుకుంది శాంతమ్మ.
‘‘్భద్రాచలానికి ఎప్పుడంటే అప్పుడు బస్సులుంటాయి. నిన్ను ఎక్కించేపోతాను’’ అంటూ కూతురు పక్కనే కూర్చున్నాడు తండ్రి జగ్గయ్య.
చెప్పినట్టుగానే రెండు గంటల తరువాత మణుగూరు ప్యాసింజరొచ్చి స్టేషన్లో ఆగింది.
ఆడవాళ్ళ డబ్బాలో కూతురికి చోటు సంపాదించి కూర్చోబెట్టాడు జగ్గయ్య.
మరోపావు గంట తరువాత వందలమంది ప్యాసింజర్లతోపాటు శాంతమ్మనూ ఎక్కించుకున్న రైలు ఎవరో శతృవు తన గుండెలమీద ఈడ్చి పెట్టి గుద్దినట్టు కెవ్వున కేక పెట్టుకుంటూ హైదరాబాద్ నగరానికి అభిముఖంగా సాగిపోయింది.
రైలు కనబడకుండా పోయిందాకా స్టేషన్లోనే నిలుచున్న జగ్గయ్య బరువెక్కిన గుండెలతో భద్రాచలం బస్సు కోసం రైల్వే స్టేషన్‌లో నుండి బయటకు నడిచాడు.
10
శాంతమ్మ ఎక్కిన ప్యాసింజర్ రైలు మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ స్టేషన్లో ‘‘నేనొచ్చానహో’’ అన్నట్టు పెద్దగా గావుకేక వేస్తూ ఆగింది.
అందరితోపాటు తనూ మెల్లగా రైలు దిగిన శాంతమ్మ పుట్టలోనుండి చీమలు ఎల్లినట్లు ఒకరిని ఒకరు ఒరుసుకుంటూ సాగిపోతున్న జనాన్ని చూసి ‘‘ఏం జనం! ఏం జనం! ఈ జనంలో ఆర్‌ఎంపి లింగయ్య చెప్పిన ఆ మనిషిని పట్టుకునేదెట్లా?’’ అనుకుంటూ బెంగగా ఓ చోట నిలబడిపోయింది.
అంతలో...
ఆమె చేతిలోని సెల్‌ఫోన్ హఠాత్తుగా ప్రాణం పోసుకుంది.
ఉలిక్కిపడుతూ ఫోనెత్తిన శాంతమ్మ ‘ఎవరు?’ అంది బెరుకు బెరుకుగా.
‘‘శాంతమ్మేనా మాట్లాడేది?’’ అటునుండి అడిగారెవరో
‘‘ఔను’’ అదే బెరుకుతో బదులిచ్చింది శాంతమ్మ.
‘‘నేను మీ వూరి ఆర్‌ఎంపి లింగయ్య ఫ్రెండ్ వెంకటరెడ్డిని’’ అంటూ తనను తను పరిచయం చేసుకున్నాడు అవతలి వ్యక్తి.
‘‘ఆ మీరేనా?’’ ఎందుకో గుండెల్లో అదోరకమైన ఆందోళన మొదలౌతుంటే తనను రాసుకుంటూ వెళుతున్న ప్రయాణీకులను విస్తుబోయి చూస్తూ అంది శాంతమ్మ.
‘‘ఆ ఆ నేనే. ఇంతకూ నువ్వెక్కడున్నావ్?’’ అడిగాడు వెంకటరెడ్డి.
‘‘నేనిక్కడ బెల్టు మెట్లకాడున్నా’’ చుట్టూ పరికించి చూస్తూ బదులిచ్చింది శాంతమ్మ.
‘‘ఐతే అక్కన్నుంచి సూటిగా ఈ ఫ్లాట్‌ఫాం చివరిదాకా వస్తే ఇక్కడో గుడి వుంటుంది. నేనా గుడి మొదటి మొట్టుమీద తెల్లడ్రెస్సు తొడుక్కుని నెత్తిమీద ఎర్రటోపీ పెట్టుకుని పేపర్ చదువుకుంట కూర్చొని వుంటాను. నేను కూడా నిన్ను గుర్తుపట్టటానికి నువ్వు ఏ రంగు చీర కట్టుకున్నావో’’ అంటూ ప్రశ్నించాడు వెంకటరెడ్డి.
‘‘నేను నెమలి పింఛం రంగుమీద తెల్లపూలున్న కాటన్ చీర కట్టుకున్నాను’’ గుండెల్లో ఆందోళనను కొంతమేరకు సంభాళించుకుంటూ బదులిచ్చింది శాంతమ్మ.
‘‘సరే మంచిది అట్లనే ముందుకొచ్చేయ్యి’’ అంటూ ఫోన్ కట్‌చేశాడు వెంకట్‌రెడ్డి.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు