డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ .... 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భరణి శవాన్ని మొదటిసారి చూసింది నువ్వేనా?’’
‘‘అవునండీ. నేను సాయంత్రం వచ్చేసరికి గెస్ట్‌హౌస్ దగ్గర భరణిగారి కారు కనిపించింది. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. భరణిగార్ని కలుద్దామని లోపలకి వెళ్లిన నాకు లోపల ఎవరూ ఉన్న అలికిడి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి మొత్తం గదులన్నీ వెదికాను. పైన బెడ్రూంలో మంచమీద చనిపోయిన భరణీగారు కనిపించేసరికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. వెంటనే పెద్దయ్యగారికి ఫోన్ చేశాను’’
‘‘్భరణి తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడా?’’
‘‘అవునండీ’’
‘‘అతడితోపాటూ ఎవరు వస్తూ వుంటారు?’’
‘‘ఆయన స్నేహితులతోనే ఎక్కువగా వస్తూ ఉంటారండీ’’
‘‘అదే, స్నేహితులంటే ఎవరు? వాళ్ళ పేర్లు నీకు తెలుసా?’’
‘‘కొంతమంది ఎక్కువగా వచ్చేవాళ్ల పేర్లు తెలుసండీ. శ్రీనుగారూ, రాజుగారూ, సూర్యగారూ, ఇంకా సుందరంగారూ’’
‘‘వాళ్ళు ఇక్కడికి దేనికోసం వచ్చేవాళ్ళు ఎక్కువగా? మందు పార్టీల కోసమా?’’ గొంతు తగ్గించి అడిగాడు పాణి.
కొద్దిగా తటపటాయిస్తున్నట్టుగా ఆలోచించి, పాణి చూడడానికి సౌమ్యంగా కనిపిస్తుండడంతో ధైర్యం తెచ్చుకున్నట్టుగా చెప్పాడు తిరుపతయ్య. ‘‘మందు పార్టీలకే వచ్చేవారు. కానీ దానికన్నా భరణీ బాబుగారు ఇక్కడికి అమ్మాయిలతో గడపడానికి ఎక్కువగా వచ్చేవారు. కాలేజీలో వారితోపాటూ చదివే అమ్మాయిలని తరచుగా ఇక్కడికి కార్లో తీసుకొచ్చి రోజంతా గడిపి వెడుతూ ఉండేవారు’’.
ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు పాణి. కొద్దిసేపటి తరువాత అడిగాడు ‘‘ఆ అమ్మాయిల పేర్లు నీకు తెలుసా?’’
‘‘లేదండీ. ఒకరిద్దరు నన్ను పలకరించి మాట్టాడేవారు కానీ ఎప్పుడూ పేర్లు అడగలేదు నేను ఎవర్నీ’’ అని కొద్దిసేపు ఆగి ఆ తరువాత ఏదో గుర్తుకు వచ్చినవాడిలా నెమ్మదిగా అన్నాడు ‘‘్భరణి బాబుగారే కాదండీ, ఆయన స్నేహితులు కూడా ఆయన లేనప్పుడు అప్పుడప్పుడూ వచ్చి ఇక్కడ ఉండి వెడుతూ ఉంటారు’’.
‘‘వాళ్ళ వెంట కూడా అమ్మాయిలు ఉండేవారా?’’ అనుమానంగా అడిగాడు పాణి.
‘‘ఒక్కోసారి ఉండేవారు. ఒక్కోసారి ఒంటరిగానో, స్నేహితులతో పార్టీలకనో వచ్చేవారు’’.
‘‘స్నేహితులు వచ్చేముందు భరణి ఫోన్ చేసి చెప్పేవాడా?’’
‘‘లేదండీ- భరణిగారితో వచ్చినపుడు చూసేవాడ్ని కదా? ఆయనతోపాటూ వచ్చే ఆయన స్నేహితులెవరైనా ఎప్పుడైనా వస్తే తాళాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూసేవాడ్ని. తన స్నేహితులు ఎవరు ఎపుడు వచ్చినా కాదనద్దనేవారు భరణీగారు’’.
‘‘సరే అయితే’’ అని వెళ్ళబోతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగి అన్నాడు పాణి ‘‘అవునూ! బిగ్ బజార్ నుంచి గిఫ్ట్ తెచ్చుకున్నారా? ఏమిచ్చారు?’’
ఆ ప్రశ్నకి ఒక్క క్షణం తడబడ్డాడు తిరుపతయ్య. ‘‘లేదండీ. మాకే బహుమతీ రాలేదంట. ఆ ఫోన్‌చేసిన వాళ్ళెవరో మాకు తెలియదన్నారు వాళ్ళు. రెండు మూడు గంటలు ఎదురుచూసి వాళ్ళ చుట్టూ తిరిగి చివరకి విసుగొచ్చి వెనక్కి వచ్చేసాం’’ అన్నాడు.
కాసేపు పాణి ఏమీ మాట్లాడకపోయేసరికి అన్నాడు తిరుపతయ్య భయం భయంగా ‘‘అయ్యా, నన్నిప్పుడే వదిలేస్తారా?’’
పాణి జాలిగా చూసాడు అతడి వంక ‘‘పోలీసులు నిన్ను కొద్దిరోజులు లాకప్‌లో ఉంచుతారు. ఏమీ చెయ్యరు. నాలుగు రోజుల్లో వదిలేస్తారు. కంగారు పడాల్సిన పనిలేదు’’ అన్నాడు.
‘‘్భరణీగారు ఎలా చనిపోయారో నిజంగా నాకు తెలియదండీ. దీనికీ నాకూ ఏ సంబంధమూ లేదు’’ దాదాపు ఏడుస్తున్నట్టుగా అంటూ పాణి కాళ్ళమీద పడబోయాడు అతడు.
అతడ్ని చూస్తే పాణికి తన భార్య అంజలి తరచుగా చెప్పే ‘ఉరుము ఉరిమి మంగలంమీద పడ్డట్టు’ అన్న సామెత గుర్తుకు వచ్చింది. అలాంటి ‘మంగలాని’కి అచ్చమైన నిర్వచనంలా కనిపించాడు తిరుపతయ్య.
‘‘ఆ విషయం నాకు తెలుసు. కానీ నిజం తేలడానికి నిన్ను కొన్నాళ్లు ఇదే విషయమీద మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తారు. నినె్నవరేమడిగినా ఉన్నదున్నట్టు నిజం చెప్పు. నీకే భయమూ ఉండదు’’ అతడి భుజమీద తట్టి చెప్పి బయటికి నడిచాడు పాణి.
బయటికి వచ్చాక పోస్టుమార్టమ్ ఏర్పాట్లు చూస్తున్న రవీంద్ర అన్నాడు పాణితో ‘‘్భజంగరావుగారితో మాట్లాడతారా?’’
పాణి చిన్నగా నవ్వి అన్నాడు ‘‘అవసరం లేదు. భరణి గురించి ఆయనకి తెలిసినది చాలా తక్కువ. భరణి లాంటి యువకుడి గురించి తెలుసుకోవాలంటే అతడి స్నేహితులతో మాట్లాడాలి. నాకు భరణీ స్నేహితుల వివరాలు కావాలి. మగా, ఆడా అందరివీ. ఫోన్ నెంబర్లు కూడా కావాలి’’
***
గెస్ట్‌హౌస్ నుంచి నేరుగా తను ఉంటున్న హోటల్ రూమ్‌కి వెళ్ళాడు పాణి. అతడు వెళ్ళేసరికి అతడి భార్య అంజలి హోటల్ రూమ్‌లో అతడి కోసం ఎదురుచూస్తూ వుంది. అంజలికి కొత్త ప్రదేశాలు చూడడమంటే సరదా. అందుకే అతడు టూర్లమీద ఎప్పుడూ ఇతర ప్రదేశాలకి వెళ్లినా వీలైన అన్ని చోట్లకీ ఆమెని కూడా తీసుకుని వెడుతూ ఉంటాడు. ఆ రోజు హైదరాబాద్‌లో పని ముగించుకుని మర్నాడు విశాఖపట్నం, అరకు లోయలు చూడడానికి వెడదామనుకున్నారు.
‘‘హమ్మయ్య.. వచ్చేసారా? టాంక్‌బండ్ చూడ్డానికి వెడదామనుకున్నాం కదా? మర్చిపోయారేమో అనుకున్నాను’’ అతడిని చూడగానే అంది ఆమె కాఫీ మేకర్లో కాఫీ కలపడానికి సిద్ధపడుతూ.
తనకిష్టమైన కాఫీ సువాసనని ఆస్వాదిస్తూ సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ అన్నాడు పాణి ‘మంగలం అంటే ఎవరు?’ అవడానికి తెలుగువాడే అయినా, ముంబాయిలో స్థిరపడడంవల్ల పాణికి తెలుగు పెద్దగా తెలియదు.
‘మంగలమా?’ ఆశ్చర్యంగా అంది అంజలి.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ