డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీరా బయటికి వచ్చాక చూస్తే వర్షం వచ్చేలా వుంది వాతావరణం. నువ్వు ఇంటికెళ్ళడానికి ఇబ్బంది పడతావేమోనని నీకోసం ఎదురుచూస్తూ ఇక్కడే వున్నాను’’ అన్నాడు వరుణ్.
హరిత అతడిని ఇబ్బందిగా చూసింది. ఎందుకతను తనమీద అవసరమైన దానికన్నా ఎక్కువ శ్రద్ధ కనబరుస్తాడు? ‘‘్థంక్స్ వరుణ్, నేను ఇంటికి జాగ్రత్తగానే వెళ్లిపోతానే్లగానీ నువ్వు ఇంటికి బయలుదేరు. వర్షం వచ్చేలా వుంది’’ అంది నవ్వుతూ.
‘‘నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళతాను పద’’ అన్నాడతను.
అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి బైక్‌లమీద తిరగడం అక్కడ సాధారణమైన విషయం. వరుణ్ కూడా తనని చాలాసార్లు తన బైక్‌మీద రమ్మని అడిగాడు. తనతో ఏర్పడిన చదువుని అతడు అడ్వాంటేజ్‌గా తీసుకోవాలనుకుంటున్నాడన్న అనుమానం వల్ల కన్నా, తల్లికి తెలిస్తే ఏమంటుందోనన్న భయం వల్లా హరిత ప్రతిసారీ తిరస్కరిస్తుంది.
‘‘వద్దు వరుణ్.. నేను బస్‌లో వెళ్తాను’’ అంది ఆమె ఎప్పటిలాగానే.
‘‘నీకిష్టముండదని తెలుసు. కానీ ఇవాళ బస్ రాదు. తెలంగాణ గొడవట.. సడెన్‌గా బంద్ అనౌన్స్ చేసారు వాళ్ళు. అందుకే అడిగాను. నువ్వు ఇబ్బంది పడతావని ఇందాకటినుంచీ ఇక్కడే ఎదురుచూస్తున్నాను’’ అన్నాడు తలదించుకుని.
అతడి మాటలకి హరిత నొచ్చుకుంటున్నట్లుగా చూసింది. విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా తను అలా వెంటనే తిరస్కరించి వుండాల్సింది కాదు అనుకుంది. కనీసం కొంచెం మృదువుగానైనా చెప్పి వుండాల్సింది అనుకుంది.
అతడికి అవుననీ కాదనీ చెప్పలేక సందేహిస్తూ నిలబడింది. ఒక పక్క తనకోసం అంతలా తాపత్రయపడుతున్న అతడిని చూస్తుంటే జాలేసోంది. మరోపక్క తను చేస్తున్నది తప్పేమో అన్న సంశయం.. ఎటూ తేల్చుకోలేక నిలబడింది.
‘‘నీకు అంతగా అభ్యంతరమైతే వద్దులే హరితా.. ఆటోలేమైనా దొరుకుతాయేమో చూస్తాను’’ అన్నాడు. అతడు బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోయాడు.
‘‘వద్దులే వరుణ్.. బైక్‌మీదే వెళ్దాం’’ చెప్పింది హరిత.
అతను బైక్ స్టార్ట్ చేసాక ఆమె వెనకాల ఎక్కి కూర్చుంది. ఎక్కుతుంటే అప్రయత్నంగా ఆమె చేతులు వణికాయి. అతడు సున్నితంగా బాలెన్స్ చేస్తూ బైక్ స్టార్ట్ చేశాడు.
మబ్బులు మరింత చిక్కబడ్డాయి.. గాలి మరింత చల్లబడింది. ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతోందనన్నట్లుగా అతను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయసాగాడు. ఆ విషయం ఆమెకి అర్థవౌతోంది. ఎంత జాగ్రత్తగా వున్నా ఇద్దరి శరీరాలూ తగులుతున్నాయి. అతడి శరీరం నుంచి తేలి వస్తున్న అదోరకమైన పరిమళం ఆమెకి కొత్తగా వుంది.
‘‘జాగ్రత్త.. నన్ను పట్టుకో. లేకపోతే పడిపోతావ్’’ అన్నాడతను వెనక్కి తిరిగి చూస్తూ.
హరిత మొహమాటంగా బైక్ వెనుకనున్న రాడ్‌ని పట్టుకుని కూర్చుంది.
కాలం నెమ్మదిగా కదులుతోందో లేక అతడు బైక్‌ని నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడో తెలియడంలేదు కానీ, తమ ఇల్లు ఎంతకీ వస్తున్నట్లుగా అనిపించడంలేదు. రోజూ తను దిగే బస్టాపుకి కొంచెం ముందుగా అతడికి చెప్పింది ‘‘ఇక్కడ ఆపేయ్ వరుణ్.. దిగిపోతాను’’.
అతడు చాలా నెమ్మదిగా బండి ఆపాడు. హరిత దిగి అతడికి బై చెబుదామనుకునేంతలోగానే వాళ్ళముందునుంచి కాలేజ్ నుంచి వస్తున్న బస్ వేగంగా దూసుకుని వెళ్లి బస్టాప్‌లో ఆగింది.
దాన్ని చూసి హరిత ఆశ్చర్యంగా ‘‘అదేమిటీ? బస్సులన్నీ బందన్నావు కదా? ఇదెలా వచ్చింది?’’ అంది.
వరుణ్ తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు. ‘‘అయాం సారీ హరితా.. నేను నీకు అబద్ధం చెప్పాను’’ అన్నాడు.
ఆమె విస్తుపోతూ చూసిందతని వంక.
‘‘క్షమించు హరితా.. నేను చేసింది తప్పే.. కానీ ఏం చేయమంటావు చెప్పు? నాకు నిన్ను చూస్తుంటే నీతో మరింతగా మాట్లాడాలని, నీకు మరింతగా దగ్గరవ్వాలనీ, చాలా బలంగా అనిపిస్తుంది. నిన్ను బైక్‌మీద ఎక్కించుకుని తిప్పాలనీ, ఇరవై నాలుగ్గంటలూ నీతో కబుర్లు చెప్పాలనీ అనిపిస్తుంది. కానీ నువ్వేమో నాతో అవసరానికి మించి మాట్లాడవు. స్నేహం చేస్తూనే నాకు దూరంగా వుంటూన్నావనిపిస్తుంది. అందుకే ఈరోజు నినె్నలాగైనా నా బైక్‌మీద ఎక్కించుకోవాలన్న పంతంతో అలా అబద్ధం చెప్పాను. ఆవేశంలో అలా చేసినా ఇప్పుడు మాత్రం నిజంగానే బాధపడుతున్నాను. అయాం రియల్లీ సారీ’’ గొంతులో సిన్సియారిటీ ధ్వనిస్తుండగా అన్నాడతను.
తప్పు చేసిన చిన్నపిల్లాడిలా వుందతని ముఖం ఆ క్షణంలో..
హరితకేమనాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో చిన్న చిన్న చినుకులతో వర్షం మొదలైంది. అతడివంక కోపంగా ఒకసారి చూసి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయింది.
****
అలా ప్రారంభమైన వర్షం మర్నాడు ఉదయానికి కూడా తగ్గలేదు. ‘‘వర్షమొస్తోంది కదా? కాలేజ్ మానెయ్యి ఈ రోజు’’ అంది సుమతి హరితతో.
హరితకెందుకో ఆ రోజు కాలేజ్ మానేసి ఇంటి ద గ్గర వుండాలనిపించలేదు. అంతకుముందు రోజు జరిగిన సంఘటనతో ఆమె చాలా డిస్ట్రబ్ అయింది. బైక్‌మీద వస్తుంటే తనలో కదలాడిన భావాలు, తనని బైక్‌మీద ఎక్కించుకోవాలన్న తపనతో అబద్ధం చెప్పి తన ముందు తల దించుకుని నిల్చున్న వరుణ్.. అన్నీ తల్చుకుంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ ఆమెని నిలవనీయడంలేదు. అతడి మీద కోపం రావడంలేదు. తనతో స్నేహం చేయడం కోసం అతడు పడుతున్న ఆరాటం చూస్తుంటే అతడిమీద జాలేస్తోంది. మనసునిండా ఆలోచనలతో అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వుండడంకన్నా కాలేజ్‌కి వెళ్ళడమే నయమనిపించిందామెకి.
సుమతి చెబుతున్నా వినకుండా గొడుగేసుకుని కాలేజ్‌కి బయలుదేరింది. కాలేజ్‌లో ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళు వరుణ్‌కోసం వెదకసాగాయి. సాయంత్రం వరకూ అతడామెకి కనబడలేదు. హరితకేం తోచనట్లుగా అనిపించింది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ