భక్తి కథలు

జైమిని భారతం -101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సమయంలో అనేక వేల శాఖలతో ఒక మఱ్ఱి వృక్షం మాత్రం నిలిచి ఉంటుంది. ఆ మఱ్ఱాకుపై ముద్దులు మూట కట్టే పాపడు ఒకడు శయనించి ఉంటాడు. పదారవిందాన్ని కరార విందంతో పట్టుకొని ముఖార విందంపై ఉంచి బోసి నవ్వులు నవ్వుతూ అప్పుడప్పుడు మనోహరంగా ఏడుస్తూ ఉంటాడు.
ఆ ఆది శిశుమూర్తి దర్శన భాగ్యం ఎన్నోసార్లు చేసిన వాణ్ణి. నా వయస్సెంతని చెప్పగలను? ఆ మఱ్ఱాకుపై పవళించిన అప్పటి శిశువే- ఈ శ్రీకృష్ణుడు. మీ అందరి సహవాసంతో ఇలా అయ్యేడు. ఈ బాలకుడే ఇపుడు లక్ష్మిని పెండ్లాడి త్రైలోక్య గృహస్థుడయ్యేడు’’ అంటూ బకదాల్భ్యుడు గోవిందుణ్ణి దగ్గరకు పిలిచి కౌగిలించుకొన్నాడు.
‘‘మహాత్మా! బకదాల్భ్యా! నువ్వు ఇరవై బ్రహ్మకల్పాలు చూసినవాడవు. నువ్వే విష్ణుడవు. నీ దర్శనంవల్ల యుధిష్టిరుని అశ్వమేథం సఫలత పొందుతుంది’’ అన్నాడు శ్రీకృష్ణుడు మునికి నమస్కరించి.
‘‘ఆగాగు! ఇంత గర్వభారం పైన మోపడం నీకు ధర్మమా గోవిందా! మునుపు బ్రహ్మ గర్వం నా గర్వం నశింపజేసిన సంఘటన జరిగింది. దానిని గురించి చెపుతాను విను.
బకదాల్భ్యుడు చెప్పడం మొదలుపెట్టేడు.
‘పూర్వం ఎప్పుడో పద్మకల్పంలోని మాట. తపస్సు చేసుకొంటున్న నా ముందు బ్రహ్మ ప్రత్యక్షమయ్యేడు. ఆయన రాజహంసపై కూర్చుని ఉన్నాడు.
‘బకదాల్భ్యా! ఈ మఱ్ఱాకుల మాటున తపస్సులు చేసి బడలిపోకు! ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను’ అన్నాడు గర్వంతో ఆ బ్రహ్మగారు. పోనీ- నేనైనా ఊరుకోవాలా? ఊరుకోకుండా ‘ఇరవై బ్రహ్మకల్పాలు తపస్సు చేసింది. వరాలు పొంది నీ చేతి కింద బ్రతకడానికా?’ అన్నాను నేను. ఇంతలో హఠాత్తుగా ఒక భయంకరమైన సుడిగాలి మా ఇద్దరిమధ్యన పుట్టి మమ్మల్ని చుట్టేసింది. ఆ గాల్లో మేమిద్దరం ఎండుటాకుల్లా ఎగిరిపోయి మరో బ్రహ్మాండ భాండంలో పడ్డాం. ఆశ్చర్యం. అక్కడ ఎనిమిది ముఖాలుగల బ్రహ్మ మాకు సాక్షాత్కరించి ‘మీరెవరు? ఇక్కడికెందుకొచ్చేరు?’ అని ప్రశ్నించేడు.
నేను చతుర్ముఖ బ్రహ్మను. ఈ తాపసి నా శిష్యుడని నాకు ప్రత్యక్షమైన బ్రహ్మ అనగానే ఆ అష్టముఖ బ్రహ్మ పకపకా నవ్వి ‘నా ఎదుట నిలబడి బ్రహ్మనని చెపుతావా! బ్రహ్మ నువ్వా నేనా! మీ ఇద్దరూ ఇక్కడే నా సేవకులుగా పనిచేయండి’ అన్నాడు. అతని మాటలు పూర్తిఅయ్యేయో లేదో ఉగ్ర ఝంఝామారుతం మా ముగ్గుర్నీ మరో బ్రహ్మాండ గోళానికి విసిరేసింది. ఏం చేస్తాం! పోయి పడ్డాం అక్కడ!
ఆ బ్రహ్మాండంలో వదాన్యులు, సుకృతులైన పురుషులు మా ముగ్గుర్నీ మీరెక్కడివారు? ఏ లోకంలో ఉంటారని అడిగేరు. అష్టముఖ బ్రహ్మ తన లోకం బ్రహ్మలోకమని మేము తన శిష్యులమని చెప్పగానే మా ముందు పదహారు ముఖాల బ్రహ్మ ప్రత్యక్షమయ్యేడు.
మళ్లీ సుడిగాలి మమ్మల్ని మరో బ్రహ్మాండంలోనికి విసిరేసింది. అక్కడ మేమందరం ముప్ఫై రెండు ముఖాల బ్రహ్మను దర్శించేము. ఈ విధంగా మేము అనేక బ్రహ్మాండాల్ని అనేక ముఖాల బ్రహ్మల్నీ చూస్తూ చివరకు సహస్ర ముఖ బ్రహ్మను చూసేం. అక్కడ సనక సనందనాది ఋషులు శ్రీమన్నారాయణుని గుణగానం చేస్తున్నారు.
శ్రీమహావిష్ణువు ఆదరంతో అందరి బ్రహ్మల్ని పలుకరించి మరల ఎవరి బ్రహ్మాండాలలో వారిని నిలిపాడు. సర్వజగన్నియామకునికి దోయిలించి అందరు బ్రహ్మలూ వెనుదిరిగేరు. వారికి గర్వభంగం అయింది- నాకూనూ!
ఇది ఎప్పుడో పద్మకల్పంలో జరిగిన కథ.

- ఇంకా ఉంది

- బులుసు వేంకటేశ్వర్లు