డైలీ సీరియల్

పూలకుండీలు - 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యను చూస్తూనే ‘‘నొప్పి ఎట్లుంది? ఇంత సీరియస్ అయినదాకా నాకెందుకు చెప్పలేదు?’’ ఆందోళనతో నిలువెల్లా కదిలిపోతూ శాంతమ్మపైన ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాడు ఎల్లయ్య.
తన ఆరోగ్యంపట్ల భర్త పడుతున్న ఆదుర్దాకూ ఆప్యాయతకూ గుండె లోతుల్లో బయలుదేరిన దుఃఖపు అల్పపీడనం కనుల తీరం దాటి ఎద మైదానంపైన వర్షిస్తుంటే అతణ్ణి ఆర్తిగా తన గుండెలకు హత్తుకుంటూ ‘‘అంత మాయ లెక్క జరిగిపోయింది’’ అంటూ మార్మికంగా మాట్లాడింది శాంతమ్మ.
ఇంతలో ఏవో కాగితాలు పట్టుకొని వచ్చిన ఓ నర్సు ‘‘ఈ కాగితాలమీద సంతకాలు చేయండీ!’’ అంటూ ఎల్లయ్యతో సంతకాలు తీసుకుంది.
సంతకాలు చేసిన తరువాత నర్సు వంక చూస్తూ ‘‘మరి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు?’’ అంటూ అడిగాడు ఎల్లయ్య.
‘‘ఏమో తెలియదు. ఆపరేషన్ చేసే డాక్టరమ్మ అనుకోకుండా నిన్న రాత్రే షిరిడీ వెళ్లింది. రెండు, మూడు రోజుల తరువాత ఆవిడ వచ్చాక చేస్తారేమో.
ఐనా మీరు సంతకాలు చేశారు గదా ఇంక మీతో పనేం వుండదు. అవతల మీకు అర్జంట్ పనుంటే వెళ్లిపోవచ్చు ఇక ఆవిడ విషయమంతా మేం చూసుకుంటాం’’ అంటూ అక్కడ జరిగే గూడుపుఠానీ అంతా తెలిసి వున్నదానిలా ఓ లెక్క ప్రకారం ఎంతవరకు మాట్లాడలా అంతవరకే మాట్లాడుకొచ్చిందా నర్సు.
ఆపరేషన్ చేసే డాక్టరమ్మ ఇంకా రెండు, మూడు రోజుల దాకా రాదన్నమాట చెవిన పడగానే ఆశాభంగం చెందినవాడిలా అయిపోయిన ఎల్లయ్య ఆ నర్సు వంకా భార్య వంకా అయోమయంగా మార్చి మార్చి చూడసాగాడు.
ఎల్లయ్య చూస్తుండగా శాంతమ్మకు రెండు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు చేసిన నర్సు అతను సంతకాలు చేసిన కాగితాలు తీసుకొని తన దారిన తాను తిరిగి వెళ్లిపోయింది.
హాస్పిటల్లో రెండు రోజులున్నా డాక్టరమ్మ షిరిడీ నుండి రాకపోవడంతో ఎల్లయ్య ‘‘రెండు రోజులు అనవసరంగా ఇక్కడ గడిచిపోయాయి. ఈ రెండు రోజుల్లో ఇంటిపొయ్యి ముసలోల్లను, పిల్లల్ని చూసొచ్చినా బాగుండేది. అవతల కంపెనీలో పని అర్జంటుంది. ఒక్క రోజని చెప్పొచ్చి మూడు రోజులిక్కడే వున్నాను. ఇంకా లేటైతే మా ఆర్.ఇ వూకోడు. పది రోజులాగి మల్లావస్తా’’ అంటూ శాంతమ్మను ఒక్కదాన్నీ వదిలిపెట్టి పోలేక పోలేక తిరిగి ముంబై బయలుదేరాడు.
అతను బయలుదేరి వెళ్ళే ముందు ‘మొన్న నాకు ఫోన్ చేసినవ్‌గదా నా నెంబరెట్లా తెలిసింది?’ అంటూ అడిగింది.
‘‘నా ఫోన్ పోవడంతో ఒక్క నెంబర్ కూడా నా దగ్గర లేక చాలా ఇబ్బంది పడ్డాను. అనుకోకుండా మొన్న ఆ ఆర్‌ఎంపి లింగయ్య నెంబర్ దొరికింది. వెంటనే వాడికి చేశాను. కానీ వాడెందుకో ఫోనెత్తలేదు’’ అంటూ బదులిచ్చాడు’’ ఎల్లయ్య.
‘‘అయ్యో ఆ ఫోన్ నేను హైదరాబాద్ వచ్చేటపుడు నాకు ఫోన్ లేదని తెలిసి ఆ ఆర్‌ఎంపి లింగయ్య ఆస్పత్రి నుంచి వచ్చాక ఇద్దువులే వుంచు అంటూ నాకిచ్చాడు. ఆ ఫోన్ ఇదే’’ అంటూ తన చేతిలోని ఫోన్ భర్తకు చూపించింది శాంతమ్మ.
‘‘మరి అంతకుముందు నీ దగ్గరుండే ఫోనేమయ్యింది?’’ ఆవిడ చేతిలోని ఫోన్ని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు ఎల్లయ్య.
‘‘ఆ మైనింగ్ కాలేజీ ఆడోల్లు నన్ను పనిలోనుండి తీసేసేటప్పుడు ‘మా ఫోన్ మాకిచ్చెయ్యమని తీసుకున్నారు’ అంటూ అపుడు జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటీ భర్తకు వివరించింది.
‘‘సర్లే ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకుగ్గాని నువ్వు జాగర్తగుండు’’ అంటూ శాంతమ్మను మృదువుగా దగ్గరికి తీసుకున్నాడు ఎల్లయ్య.
***
ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్లీ ఏడు నెల్లదాకా ఇటు తిరిగి చూడడానికి కూడా తీరనంత పని ఒత్తిడిలో పడిపోయాడు ఎల్లయ్య.
‘‘పది రోజుల్లో వస్తానని వెళ్లినవాడివి ఏడు నెల్లైపోతున్నా ఇటు తిరిగి చూడకపోతివీ!’’ అంతాంతరాల్లో ఇంకో మూడు నెల్లు ‘‘అతను రాకుండా వుంటే బాగుండు’’ అనుకున్న శాంతంమ్మ పైకి మాత్రం అట్ల అంటూ అడపా దడపా ఫోన్ చేస్తున్న భర్తకు బదులివ్వసాగింది.
ఆవిడ ఫోన్ చేసినపుడల్లా ‘‘ఇక్కడ మా పని అయిపోవచ్చింది. అందుకే ఎవ్వరికీ శలవులియ్యడంలేదు. పని అయిపోంగానే ఫైనల్ తీసుకొని ఎమ్మటే రైలెక్కుతా సరేనా’’ అంటూ బదులిస్తూ వచ్చిన ఎల్లయ్య ఫోన్ చేసిన ప్రతిసారీ ‘‘ఎంత పెద్ద ఆపరేషనైనా పేషెంట్‌ను ఓ వారం పది రోజులుంచుకొని ఇంటికి పంపుతరుగాని వాళ్ళేంది నెలలకొద్ది ఆస్పత్రిలో వుంచుకుంటున్నారు!? అవతల ఇంటి దగ్గర పిల్లగాల్లు, పెద్ద మనుషులు ఎట్లున్నారో ఏమో’’ అంటూ పదే పదే శాంతమ్మను అడగసాగాడు.
‘‘ఏమో నాకు మాత్రం ఏం తెలుసు? రిపోర్టులన్నీ బొంబాయి పంపించ్చినం. అయ్యి వచ్చిందాకా ఇక్కనే్న వుండాలని కొన్నాల్లు. వచ్చినంక నువ్వింక కొన్నాల్లు ఆస్పత్రిలోవుండి చూపించుకోవాలని కొన్నాల్లు, కుట్లు పచ్చిచేసినై ఇంకా మందులు వాడాల్నని కొన్నాల్లు డిచ్చార్చి చెయ్యకుంట ఆస్పత్రిలోనే నన్ను ఆగబడుతున్నారు.
అసలేంది కతని నా మంచానికి అవతల వున్నోల్లని ఆరా తీస్తే ఆరోగ్యశ్రీ పతకం కింద చేరినోల్లను ఎన్నాల్లు ఆస్పత్రిల వుంచుకుంటే అన్ని డబ్బులు వాల్లకు గవర్నమెంట్ నుండి వస్తాయంట. అందుకే ఆరోగ్యశ్రీ పథకం కింద చేరినోల్లను తొందరగా ఇంటికి పంపరని అంటున్నారు’’’ అంటూ ఆపద్ధర్మంగా అబద్ధాలు చెప్పసాగింది.
అందరూ వుండీ ఎవ్వరూ లేనిదానిలా కోరి కోరి తలకెత్తుకున్న అజ్ఞాతవాసాన్ని వంటరిగా అనుభవిస్తూ గృహ నిర్బంధంలో వున్న రాజకీయ ఖైదీలా రోజులు లెక్కించుకోసాగింది శాంతమ్మ.
నార అరిగిపోయిన ఎద్దులబండి మాదిరిగా రోజులు చాలా నెమ్మదిగా నడిచిపోసాగాయి.
ఇంతలో...

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు