డైలీ సీరియల్

ఒయాసిస్ 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘స్వామీజీ.. మన కంపెనీలో పార్ట్‌నర్ స్వామీ.. నిన్ననే చేరింది..’’ అన్నాడు రాజశేఖర్.
‘‘శుభం.. లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలు అవుతుంది.. వర్కింగ్ పార్ట్‌నరా? స్లీపింగ్ పార్ట్‌నరా?’’ అని అడిగాడు స్వామీజీ.
‘‘వర్కింగ్ పార్ట్‌నర్ స్వామీజీ.. యం.డి.గా అపాయింట్ చేశాను.. ఒళ్లు దాచుకోకుండా కష్టపడి పనిచేస్తుంది స్వామీజీ..’’ అన్నాడు రాజశేఖర్.
‘‘నీ పేరేమిటి?’’ అని అడిగాడు స్వామీజీ.
‘‘దీప్తి..’’
‘‘నక్షత్రం..?’’
ఏ నక్షత్రమో, ఏ గోత్రమో ఇవేవీ దీప్తికి తెలియదు.. ఆలోచిస్తూ ఉండిపోయింది.
‘‘నీది మేషరాశి.. సింహలగ్నం.. నీ ముఖ వర్ఛస్సును బట్టి చెప్పగలను. నీకు చాలా ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది.. పట్టిందల్లా బంగారం అవుతుంది.. ఆయుష్మాన్ భవ..’’ అని దీవించాడు.
తర్వాత రణధీర్‌ను పాదాభివందనం చేయమని సైగ చేశాడు రాజశేఖర్.
రణధీర్ ఆయనకు నమస్కారం చేస్తుంటే దీప్తి ఆయన గురించి చెప్పింది.
‘‘చక్రపాణిగారు స్వామీజీ.. సినిమా ప్రొడ్యూసర్..’’
స్వామీజీ ఆయన్ను ఆశీర్వదించారు.. ‘‘మీదే ప్రాంతం?’’
‘‘తూర్పు గోదావరి.. స్వామీజీ...’’
‘‘తూర్పు గోదావరి.. రామచంద్రాపురం.. గోపాల రాజుగారు తెల్సునా? ఆయన్ని తెలియనివారు లేరు ఆ ప్రాంతంలో..’’
‘‘తెల్సు స్వామీజీ..’’ అన్నాడు రణధీర్.
‘‘ప్రస్తుతం ఏం సినిమా తీస్తున్నారు?’’
‘‘ఇంకా సినిమా పేరు పెట్టలేదు స్వామీజీ.. స్క్రిప్ట్ వర్కే పూర్తయింది. ఇద్దరు అమ్మాయిల కథ..’’ అన్నాడు రణధీర్.
‘‘అది చాలా పెద్ద హిట్ అవుతుంది.. చక్రపాణి.. ఏ నక్షత్రం..’’
‘‘శతభిషం స్వామీజీ..’’
‘‘శతభిషం.. కుంభం.. నీకు స్ర్తి మూలకంగా బాగా కల్సొస్తుంది. త్వరలోనే అఖండమైన కీర్తి ప్రతిష్ఠలూ, విశేష ధనార్జనా.. కలుగుతాయి..’’ అన్నాడు స్వామీజీ గడ్డం నిమురుకుంటూ.
రణధీర్ మళ్లీ పాదాభివందనం చేసి ‘‘త్వరలో తమ పాదపూజ చేసుకుంటాను.. స్వామీజీ.. తమ ఫొటో ఒకటి ఇస్తే మా ఆఫీసులో పెట్టుకుని పూజ చేసుకుంటాను.. ’’ అన్నాడు రణధీర్.
‘‘మా శిష్యుడు చిదానందాన్ని అడుగు.. ఇస్తాడు..’’ అన్నాడు స్వామీజీ.
తర్వాత హాల్లో చండీ హోమం ప్రారంభమైంది.. రాజశేఖర్, దీప్తి ఇద్దరూ భార్యాభర్తల్లా పక్క పక్కన కూర్చుని హోమంలో వేయాల్సినవి వేశారు.
పూర్ణాహుతి సమయంలో స్వామీజీ వచ్చి హోమంలో పాల్గొన్నారు.
‘‘చండీదేవి శక్తి స్వరూపిణి.. ఏ కోర్కె కోరుకున్నా, నెరవేర్చి తీరుతుంది. రాక్షస సంహారం చేయటానికి త్రిమూర్తులకు కూడా శక్తి చాల్లేదు, చండీదేవి ఆ పని చేయగలిగింది. ఆమె మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది..’’ అంటూ హోమగుండంలో ఒక దర్బను కాల్చి ఆ నల్లని మసితో రాజశేఖర్‌కి, దీప్తికి, రణధీర్‌కీ నుదుట బొట్టు పెట్టారు.
‘‘ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు...’’ అని దీవించాడు స్వామీజీ.
స్వామివారి భోజనం అయ్యాక, మిగిలినవారూ భోజనాలు చేశారు. రాజశేఖర్ సిల్కు లాల్చీ, ధోవతుల్లోనుంచి తెల్లపాంటూ ఖద్దరు షర్టులోకి మారాడు. అచ్చు రాజకీయ నాయకుడిలా ఉన్నాడిప్పుడు.
సాయంత్రం నాలుగు గంటలకు హడావుడి అంతా తగ్గాక రాజశేఖర్, దీప్తి, రణధీర్ కూర్చుని మాట్లాడుకున్నారు. ముందు రాజశేఖర్, రణధీర్‌ని అడిగాడు.
‘‘మీరు ప్లాన్ చేస్తున్న సినిమా వివరాలేంటి?’’ అని అడిగాడు.
‘‘ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరు హీరోలు.. స్టార్ వాల్యూ కోసం ఇప్పుడు మంచి డిమాండ్‌లో యిద్దరు యంగ్ హీరోలను బుక్ చేద్దామనుకుంటున్నాను.. ఇద్దరి కాల్‌షీట్స్ కుదరాలి కాబట్టి కొంచెం లేటవుతుంది.
హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌ను గ్లామరస్ హీరోయిన్‌ని తీసుకుని, రెండో హీరోయిన్‌ను కొత్త అమ్మాయిని తీసుకుంటున్నాం.. ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గనుక కొత్త అమ్మాయి అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. అది సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది..’’ అని చెప్పాడు రణధీర్.
‘‘టెక్నీషియన్స్?..’’ అని అడిగాడు రాజశేఖర్.
‘‘డైరెక్టర్ కొత్తవాడు.. స్టోరీ అతనిదే.. మిగిలిన టెక్నీషియన్స్ అందర్నీ టాప్ టెక్నీషియన్స్‌నే పెడుతున్నాం..’’ అన్నాడు రణధీర్.
‘‘బడ్జెట్ ఎంత?..’’
‘‘వంద కోట్లకు ప్రిపేర్ అయ్యాను..’’
‘‘మొత్తం మీరేనా? పార్ట్‌నర్స్ ఏమన్నా ఉన్నారా?’’
‘‘నేనే..’’
‘‘మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?..
‘‘పెద్దలు సంపాదించి ఇచ్చిన పొలాలున్నాయి. అదిగాక నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లున్నాయండి.. రెగ్యులర్ ఇన్‌కం ఉంటుందండి..’’ అన్నాడు రణధీర్.
‘‘ఎప్పుడూనండీ సినిమా బడ్జెట్ మన కంట్రోల్‌లో ఉండదండి.. పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు గానీండి ఆ కాలంలో ఇన్ని సినిమాలు వచ్చుంటే, సినిమా తీసి చూడు అనేవోళ్ళు.. పైగా ఇది పెద్ద రిస్క్‌తో కూడిన యవ్వారమండి..
కొబ్బరికాయ కొట్టినకాడ్నుంచీ ప్రింట్ థియేటర్‌కి వెళ్ళేదాకా అనుకోని అవాంతరాలు ఎన్నో వస్తాయండి.. ఇక కొత్తోళ్ళకైతే చెప్పక్కర్లేదండి.. అంచేత సరే, మీరు హేపీగా సినిమా రిలీజ్ చెయ్యాలని కోరుకునేవాళ్లలో నేను మొదటివాడ్ని. ఒకవేళ ఏదన్నా టైంకి డబ్బు సర్దుబాటు కాకపోతే మన దగ్గరకొచ్చి పట్టుకెళ్ళండి.. స్వామీజీ కూడా చెప్పారు.. మీది మహర్జాతకమని.. ఆయన ఏదన్నా అంటే జరిగి తీరుతుందండి..’’ అన్నాడు రాజశేఖర్.

- ఇంకాఉంది

శ్రీధర