డైలీ సీరియల్

పూలకుండీలు- 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరిగిన సంఘటనతో ఒక్కసారిగా నిరుత్తరుడైపోయిన ఎల్లయ్య మెల్లగా లేచి, తనను తాను సంభాళించుకుని ఆ రోడ్డు పక్కనే వున్న ఓ కానుగ చెట్టుకింద కూర్చుని తన పరిస్థితిని మొత్తం నింపాదిగా అంచనా వేసుకోసాగాడు.
అదే సమయంలో హాస్పిటల్లో వున్న శాంతమ్మ ‘‘ఆయన అసలే జిడ్డు మనిషి. ఇంత జరిగాక తను మెదలకుండా వూకోడు, తప్పకుండా ఏదో ఒక గత్తర లేపుతాడు?’’ అన్న భయం ఒకటి తన గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంటే కుళ్లి కుళ్లి ఏడవసాగింది.
ఇక్కడ రోడ్డుపక్కన చెట్టు కింద కూర్చున్న ఎల్లయ్య ‘‘దానికి తెలిసే ఈ ఆస్పత్రిలో గూడుపుఠానీ జరుగుతుంది. లేకపోతే అదెందుకట్లా మాట్లాడుద్ది! అసలు సంగతేందో తెలవాలంటే ఒకసారి పాల్వంచ పోయిరావాల్సిందే’’ అనుకుంటూ లేచి అటునుండి అటే రైల్వే స్టేషన్‌కి సిటీ బస్సెక్కాడు.
****
పొద్దు పొడిచీ పొడవకముందే దాదాపుగా ఏడాది తరువాత హఠాత్‌గా ఇంటికొచ్చిన కొడుకును చూసిన ఎల్లయ్య తల్లిదండ్రులు ఒక్కసారిగా అతణ్ణి పట్టుకొని బావురుమంటూ ఏడుపందుకున్నారు.
‘‘ఇంత పొద్దునే్న ఈ ముసలోల్లు ఎందుకేడుస్తున్నారబ్బా!’’ అనుకున్న ఇరుగు పొరుగు వాళ్ళు పరుగు పరుగున వాళ్ళ ఇంటికముందుకొచ్చారు.
వచ్చిన వాళ్ళంతా ఎల్లయ్యను చూసి ‘‘అరే నువ్వెప్పుడొచ్చినవ్?’’ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు.
‘‘ఇప్పుడే’’ అంటూ బదులిచ్చిన ఎల్లయ్య వచ్చిన వాళ్ళతో మాటలు కలిపాడు.
వాళ్ళంతా ‘‘నీ భార్య హైదరాబాద్‌లో ఎవరో డాక్టర్ ఇంట్లో పనికి పోతున్నట్టు చెప్పింది’’
‘‘తను హైదరాబాద్ పొయ్యేముందు ఎప్పుడు జూసినా ఆ ఆర్‌ఎంపి లింగయ్యతో ఏదో గుసగుసలాడేది.
‘‘అయినా పెనిమిటి ఊల్లో లేనపుడు ముసలోల్లను ఈడ, పిల్లగాల్లను తల్లిగారి ఇంటిమీద గాలికి వదిలేసినట్టు వదిలేసి ఆ హైదరాబాద్ బొయ్యి ఏం సంపాయించుకొద్దామనో!?’’
‘‘అసలు శాంతమ్మ హైదరాబాద్ పోయింది పనికి కాదు పాడుగాదంట ఇంకేదో పనిమీద పోయిందని బస్తీలో వాల్లంతా గుస గుస అనుకుంటున్నారు’’
‘‘అయినా ఆ బాయశాలి ఎంత గుండెలు తీసిన బంటు గాకుంటే దూరానవున్న మొగనికి తెలవకుంట దగ్గరవున్న అత్తమామల చెవులకు పిడకలు కట్టి హైదరాబాద్ బొయ్యి కులుకుద్ది’’
‘‘అయినా ఒకరిననేదేముంది? కాలమే ఇట్ల పాడుబడ్డ కాలం అయ్యింది. ఆడదానిగ్గాని, మొగోనిగ్గాని ఇజ్జతన్నది లేకుంట అయ్యింది’’
‘‘ఔను ఇయ్యాల, రేపు పైసల కోసం ఎంత పనికైనా తెగబడుతున్నారు’’ అంటూ ఉన్నవి లేనివి ఒకటికి నాలుగు కల్పించి, శాంతమ్మ ఏదో కానిపనికే పోయింది. అదేదో మాకు తెలిసినా మా నోటితో మేం చెప్పంగాక చెప్పం అన్నట్టు ఏతువు మాటలు మాట్లాడసాగారు.
వాళ్ళు మాట్లాడిన ప్రతిమాటా పొల్లు లేకుండా ఆలకించిన ఎల్లయ్య వాళ్ళకు ఏం బదులివ్వాలో తోచక వౌనంగా నిలబడి చూడసాగాడు.
శాంతమ్మ విషయంలో నెలల తరబడి వాళ్ళ వాళ్ళ కడుపుల్లో మురిగిపోతున్న ఈర్ష్యనంతా పరగడుపునే్న ఎల్లయ్య ముందు కక్కెయ్యడంతో ఏదో భారం దిగిపోయినట్టు సంతృప్తి చెందుతూ ఎవరి ఇండ్లకు వాళ్ళు మెల్లగా జారుకున్నారు కాలనీవాసులు.
ఎవరిదారిన వాళ్ళు అందరూ వెళ్లిపోయిన తరువాత ‘‘అసలేం జరిగిందో చెప్పండి’’ అంటూ తల్లిదండ్రులను కూర్చోబెట్టి నెమ్మదిగా అడిగాడు ఎల్లయ్య.
ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు తమ కొడుకును మానసికంగా ఎంత దెబ్బతీస్తాయో వయసుతో వచ్చిన అనుభవం రీత్యా అర్థం చేసుకున్న ఆ వృద్ధులు కొడుకువంక ఆర్తి నిండిన కళ్ళతో చూస్తూ ‘‘వాళ్ళంతా గిట్టీ గిట్టక ఏదేదో వాగినా మన శాంతమ్మ తప్పు చేసిందంటే మాత్రం మేం ఒప్పుకోం కొడుకా!
నువ్వు దేశం పొయ్యినక పాపం బిడ్డ! పిల్లలతోని ఎన్ని కష్టాలు బడ్డదో కిందున్న ఈ భూదేవికి దెలుసు, పైనున్న ఆ నారాయణమూర్తికి తెలుసు. దాని తిప్పలు అది పడ్డదిగాని ఇప్పుడొచ్చి మాటలు చెప్పినోల్లదగ్గరికి బొయ్యి ఎన్నడు చెయ్యి సాసి దేహీ అని అడగలే. ఆ కుయ్యత్తం కడుపుల్లో పెట్టుకున్న వాల్లంతా వున్నదొకటి లేనిదొకటి నోటికొచ్చిన మాటలు మాట్లాడి పొయ్యిండ్రు. ఆల్ల మాటలు నువ్వేం చెవున బెట్టకు కొడుకా! మంది మాటలిని మారు మనుంబోతే మల్లొచ్చేసరికి ఇల్లాగమైనట్టు సంసారం తెర్లు జేసుకోకు’’ అంటూ భగ భగ కాలిపోతున్న ఎల్లయ్య మనసుకు మాటల వెన్నపూస రాస్తూ సుద్దులు చెప్పారు.
తల్లిదండ్రుల మాటలను ఆలకించిన ఎల్లయ్య ‘‘దాని సంగతి మీకు తెలవదు. మీరనుకుంటున్నట్టు అది హైదరాబాదులో ఎవరింట్లో పనిచెయ్యడం లేదు. ఎందుకో తెలవదుగాని అది ఆస్పత్రిలో జేరి ఈ ఏడు నెల్ల నుంచి పొక్కటంగ తినుకుంట, మిక్కంట కులుకుతుంది’’ అదోలాంటి కసితో అన్నాడు.
‘‘నువ్వు దునియా జెప్పు, కోడలు పిల్ల మాత్రం ఏది జేసినా మన సంసారం కోసమే చేస్తది తప్ప తనకోసం ఏదీ జేసుకోదు. అయితే కుటుంబం కోసమైనా అది కానిపని మాత్రం ఎన్నడు జెయ్యదుగాక జెయ్యదు. అది మర్మం ఇడిసి మాగ్గూడ అసలు ముచ్చట చెప్పలేదంటే ఏదో కారణం వుండే వుంటది. అదేందో చెప్పే సమయమొచ్చినపుడు అడక్కుండ అదే చెప్పుద్ది. దానికోసం నీ బుర్రెందుకు పాడుచేసుకుంటావు గాని వూకో’’ కోడల్ని తమ స్వంత బిడ్డకన్నా ఎక్కువగా కడుపులో దాచుకుంటూ కొడుకును ఊరడించసాగారా వృద్ధులిద్దరూ.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు