డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య వంటి వ్యక్తి తనకు స్నేహితురాలిగా దొరికిన తర్వాత కూడా సామ్రాజ్ఞి ప్రవర్తన గురించి బాధపడడంలో అర్థం లేదనిపించిందతడికి.
ఇష్టంగానో, అయిష్టంగానో ఇల్లు సర్దుకోవడం, విడిచిన బట్టల్ని ఉతికించి ఇస్ర్తి చేయడం, వేళకు భోజన సదుపాయాలు చూడడం.. వగైరా పనులు ఒక భార్యగా తనకు తాను నిర్దేశించుకున్న మేరకు చేయడంలో సామ్రాజ్ఞి ఎటువంటి లోటూ చేయకపోవడం వరకూ సామ్రాట్‌కెటువంటి పేచీ లేదు. కానీ ఆమె చేసే పనుల్లో జీవం లేకపోవడం గురించే అతడి బాధంతా.
మరోలా చెప్పాలంటే ఒక భార్యగా కాకుండా తన ఊహలకు, అంచనాలకు భిన్నంగా ఒక యంత్రంలా ఇంటి పనులు చేసుకుపోవడం, తననూ ఇంట్లోని ఒక వస్తువులానో, మరమనిషిలానో భావించడాన్ని గురించే అతడు బాధపడుతూ వచ్చాడు తొలి రాత్రి నుంచీ ఆనాటివరకూ.
కానీ సాహిత్యతో పరిచయానికి నాంది అతడిలో అతడికే ఇతమిత్థంగా తెలియని ఏదో కొత్త సంతోషాన్నీ, ఉద్వేగాన్నీ నింపింది.
ఇకముందు సామ్రాజ్ఞి తనతో ఎలా ఉన్నా ఏమీ పర్వాలేదనిపించిందతడికి. తనకో ఇల్లుంది కాబట్టి ఇంటికి వస్తాడు.. అవసరమైనంత మేరకు మాత్రమే ఆమెతో మాట్లాడ్తాడు. వయసులో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడూ భార్యతో సంసారం చేస్తాడు. అంతే! ఒకసారి ఆ నిశ్చయానికి వచ్చాక అతడి మనసెంతో తేలికపడింది.
తనతణ్ణి పట్టించుకోకపోయినా పనిగట్టుకుని ఏదో ఒక వంకతో తనను పలకరించి దగ్గరవుదామని ప్రయత్నించే సామ్రాట్ ఆరోజు తన ఉనికినే పట్టించుకోనట్టుగా లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని ఏదో పుస్తకం చేత్తో పట్టుకుని హాల్లోకి వచ్చి తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని పుస్తకం తెరిచి పరీక్షకు దీక్షగా చదువుతున్న విద్యార్థిలా చదువుతూండడం ఆమెకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇతరులు తమ పట్ల ఆసక్తి చూపిస్తే తాము పట్టించుకోనట్టు నటించడం, ఇతరులు తమను పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తే వారి దృష్టిని తమ వైపు తిప్పుకోవాలనుకోవడం ఎక్కువమంది మనుషుల్లో సాధారణంగా ఉండే వ్యక్తిత్వ లోపం. అదే లోపం సామ్రాజ్ఞిలోనూ ఉంది.
అతడు తన కడగంటి చూపుకోసం, సాహచర్యం కోసం వెంపర్లాడితే వీలైనంతగా అతడిని తన చుట్టూ తిప్పుకుని, తనకిష్టం లేకపోయినా అతడిమీద జాలిపడి అతడికోసమే తప్పక అతడి కనుగుణంగా మసలుకుంటున్నాననే విషయాన్ని అతడికి తెలిసేలా ప్రవర్తించడం ద్వారా ప్రతిరోజూ తన అహాన్ని తృప్తిపరచుకునే సామ్రాజ్ఞికారోజు ఆశాభంగం కలిగింది, ఎదురుచూడని అతని ప్రవర్తనతో.
తనకు నచ్చని విషయాలపట్ల వౌనంగా ఉండడం ఆమె స్వభావానికే విరుద్ధం కనుక ఉండబట్టలేక అడిగింది, ‘‘ఏవిటంత దీక్షగా చదువుతున్నారూ?’’ రేపు మీ బాస్‌కేదైనా పాఠం అప్పచెప్పాలా?’’
అతడోసారి ఆమె వైపు చూసి ‘‘మరే...’’ అని తిరిగి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు.
‘‘ఎప్పుడూ మొహం వేళ్లాడేసుకుని ఏడుపు మొహంతో ఉంటారు కదా.. పోనీలే పాపం అని నేనేదో సరదాగా పపలకరించబోతే అందుకు సంతోషించడం మానేసి ‘మరే..’ అన్నారంటే.. నన్ను వెటకారం చేస్తున్నట్టేగా? నా మాటలంటే ఎంతమాత్రమూ లెక్కలేనట్టుగా!’’ అంది సామ్రాజ్ఞి దెప్పిపొడస్తున్నట్టుగా. చేతిలోని పుస్తకాన్ని పక్కన పెట్టి, ‘‘నేను పదిసార్లు పలకరిస్తే నోట్లో ముత్యాలు రాలిపోతాయన్నట్లుగా ఒకసారి బదులిచ్చే రాణిగారికీరోజు నామీదింత దయ కలగడానికి కారణమేమిటో?!’’ అన్నాడు సామ్రాట్ వెటకారంగా.
‘‘ఈరోజు వంకాయ కూర సరిగా కుదర్లేదు. అందుకని భోజనం చేసేటపుడు మీరు నన్ను తిట్టకుండా ఉండేందుకు మిమ్మల్ని ముందుగా మంచి చేసుకుంటే మంచిదనీ!’’ అంది సామ్రాజ్ఞి సాగదీస్తూ.
‘‘్ఫర్వాలేదే! భర్తను ముందుగా బుట్టలో వేసుకోవడం భార్యలకుండాల్సిన ప్రాథమిక లక్షణాల్లో ఒకటని బాగానే తెల్సిందే. నువ్వు రోజూ చూసే టీవీ సీరియల్స్ విజ్ఞానమా ఇదీ!?’’
‘‘టీవీ సీరియల్స్ చూసి తెల్సుకోవలసినంత కర్మ నాకేం పట్టిందీ? కావాలంటే భార్యలకుండాల్సిన లక్షణాలను గురించి అరగంటసేపు ఆపులేకుండా ఉపన్యాసమివ్వగలను. మొగుడు ఆవులిస్తే పేగుల్లెక్కపెట్టగలగడం ఆడవాళ్లకు పుట్టుకతో అబ్బే విద్య.
కానీ నేను ఆవులించకుండానే పేగుల్లెక్కపెట్టగలనని మున్ముందు మీకే తెలుస్తుది’’ అంది సామ్రాజ్ఞి. ‘నన్ను తక్కువగా అంచనా వేసి కోరి కష్టాలు తెచ్చుకోవద్ద’న్న హెచ్చరిక మాటల్లో ధ్వనింపజేస్తూ.
‘‘నీ మేధాశక్తికి జోహార్లు! నన్ను కాస్సేపు ఒంటరిగా వదిలేస్తే ఈపుస్తకం చదువుకుంటాను’’. ‘‘కాస్సేపేం ఖర్మ! రాత్రంతా మెలకువగా ఉండి చదువుకున్నా నాకు అభ్యంతరం లేదు. నామీద దయ తలచి భోజనాలవేళకు భోజనాల బల్ల దగ్గర కొచ్చి కూర్చుంటే చాలు.. అంతకంటే పెద్ద ఉపకారుమేమీ చెయ్యనక్కర్లేదు నాకు’’ అంది సామ్రాజ్ఞి.
అవశ్యం మహారాణీ.. మీరెంతో కష్టపడి వంకాయ కూర వండిన తర్వాత నేను కనీసం తిని తరించే పనైనా చేయకపోతే ఎలా?’’ అన్నాడు సామ్రాట్.
తను ఎంత పెడసరంగా మాట్లాడినా తనను ప్రసన్నం చేసుకునే రీతిలో అంతవరకూ స్పందిస్తూ వస్తోన్న సామ్రాట్ ఆ రోజు అందుకు భిన్నంగా మాట్లాడుతూ ఉండడం వెనుక వున్న కారణవేమిటా? అని ఆలోచిస్తోందామె మనసు.
తన స్వంత ఆలోచనలనెంత కలియబెట్టినా సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఇటువంటి పరిస్థితులెదురైనప్పుడు ఆడదాని ఆలోచనలు ఏ దిశలో నడవాలో గతంలో తన తల్లి తనకేదైనా చెప్పిందా?’’ అని ఆలోచించింది. ఆలోచించగా.. ఆలోచించగా.. ఒకసారి ఏదో సందర్భంలో తన తల్లి చెప్పిన మాటలు స్ఫురణకు వచ్చాయి సామ్రాజ్ఞికి.

-ఇంకాఉంది

సీతాసత్య