డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి ముందు తన చేతిని చాపి ‘‘తీసుకోండి. కాలక్షేపం బఠానీలు.. ఒక్కో పొట్లమూ రెండ్రూపాయలే!’’ అన్నాడా కుర్రాడు.
చేతినైతే వారిద్దరిమధ్యకూ చాపాడు గానీ వాడి చూపులు మాత్రం సామ్రాట్‌పైనే ఉన్నాయి.
ఆ కుర్రవాడి అనుభవంలో అలా పార్కుల్లోనూ, ఇతర విహార స్థలాల్లోనూ అటువంటి సరుకును కొనేందుకు ఆడవాళ్లంతగా ఇష్టపడకపోవడమూ, కొండకచో మగవాళ్లు కొనబోయినా ఆడవాళ్లందుకు అడ్డుపడడమూ చాలాసార్లు జరిగింది.
కానీ ఈసారి అతడి ఊహకు భిన్నంగా సామ్రాట్ వద్దంటే, సాహిత్య అతడి చేతిలోంచి పొట్లాల్ని అందుకుని సామ్రాట్ చేతికి ఒక పొట్లాన్ని అందించి, తన హాండ్ బ్యాగ్ తెరిచింది డబ్బులిచ్చేందుకు.
ఈలోగా పాంట్ జేబులో చెయ్యి పెట్టి ఆ కుర్రవాడికివ్వవలసిన డబ్బులిచ్చేశాడు సామ్రాట్.
ఆ కుర్రవాడు డబ్బులు జేబులో వేసుకుని ముందుకు వెళ్ళబోతుండగా సాహిత్య అతణ్ణి ఆపి అంది, ‘‘ఇదిగో అబ్బాయ్ ఇలారా..’’
వాళ్లతో తన వ్యాపార లావాదేవీ ముగిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆక్కడుండడం ఇష్టంలేని ఆ కుర్రాడు ముందుకు వెళ్లబోయినవాడల్లా అయిష్టంగానే ఆగిపోయాడు.
ఆ కుర్రవాడికి తొమ్మిది, పదేళ్లకు మించి ఉండవు. తోటి పిల్లలతో హాయిగా ఆడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో అటువంటి పనులు చేసే పిల్లల్ని ఎప్పుడు చూసినా మనసు ద్రవించి పోతుందామెకు. హృదయం కలచివేసినట్టుగా ఎంతో బాధగా ఉంటుందామెకు.
రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులకు పుట్టిన పాపానికి భవిష్యత్తు మీద ఏ ఆశా లేకుండా అలా జీవిస్తోన్న వాళ్లను చూసి ఎంతో ఆవేదన కలుగుతుందామెకు.
గతంలో అటువంటి వాళ్లు తారసపడనప్పుడు వారి వ్యక్తిగత జీవితాల గురించి తెల్సుకునే ప్రయత్నం చేయకపోలేదామె. ఇంచుమించు అందరిదీ ఒకే కథ!
తాగుడు లేదా జూదం లాంటి వ్యసనాలకు బానిసలైన తండ్రులూ, కడుపు నింపుకుందుకు కూలిపని చేయడం తప్ప మరో ఆధారం లేని తల్లులూ, భవిష్యత్తు గురించి ఎటువంటి ఆలోచనలూ ఊహల్లోకి కూడా వచ్చే అవకాశం లేక తమ పిల్లల్ని అటువంటి పనులు చేయమని పురమాయించడం చూసిందామె.
అందుకే ఆ కుర్రవాడి తల్లిదండ్రుల గురించి అడిగి తన మనసును మరింత వికలం చేసుకోవడం ఇష్టం లేక వౌనంగా బ్యాగ్ తెరిచి పది రూపాల నోటు తీసి ఆ కుర్రవాడికందిస్తూ ‘‘తీసుకో’’ అంది.
ఒక్కక్షణం ఆ కుర్రాడి కళ్ళలో ఆనందమూ, అంతలోనే భయమూ చూసిందామె. అతడి తటపటాయింపుచూసి, ‘‘తీసుకో ఫర్వాలేదు’’ అందామె మళ్లీ.
ఈసారాకుర్రాడు చేయి చాపి ఆమె చేతిలోని నోటునందుకున్నాడు.
‘‘నీకు చదువంటే ఇష్టం లేదా?’’ అని అడిగిందామె. ఆ కుర్రాడు బేలగా మొహం పెట్టాడు ఏం సమాధానం చెప్పాలో తెలియక.
‘‘మీ ఇల్లెక్కడా?’’ అని అడిగిందామె. చెప్పాడు కుర్రాడు.
‘‘మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడ్తాను. నీకు పుస్తకాలూ, బట్టలూ కొనిస్తాను. నిన్ను చదివించమని చెప్తాను, చదువుకుంటావా?’’ అంది సాహిత్య.
‘‘మా అమ్మ ఒప్పుకున్నా మా నాన్న ఒప్పుకోడండీ. రోజూ సాయంత్రమయ్యేసరికి ఈ బఠాణీలమ్మి ఇరవై రూపాయలు నేనివ్వాలి. లేకపోతే నన్ను రక్తం వచ్చేలా కొడ్తాడు మా నాన్న. మా అమ్మ అడ్డొస్తే అమ్మను కూడా కొడతాడు’’ అన్నాడు ఆ కుర్రవాడు దీనంగా.
‘‘నువ్వు చదువుకోవడం మీ నాన్నకిష్టం లేకపోయినా మీ అమ్మకు ఇష్టమే కనుక రోజూ మీ నాన్నతో చదువుకుంటానని చెప్పు. ఒక రోజు కాకపోతే మరో రోజైనా మీ నాన్నందుకు ఒప్పుకుంటాడు. ఇలా రోజూ బఠాణీలమ్మి ఎంతకాలం, ఎంత డబ్బు సంపాదిస్తావు? పెద్దవాడివయ్యాక ఎలా బ్రతుకువు?’’ అంది సాహిత్య.
ఆ కుర్రవాడి వయసుకు తాను మాట్లాడిన పెద్దమాటలు ఆశించిన స్థాయిలో అర్థం కావనీ, ఒకవేళ అర్థం అయినా అతడు వాటిని అమలుపరచలేని అసహాయకుడనీ తెలిసి దుఃఖం కూడా వచ్చిందామెకు.
కళ్లలో సుడులు తిరుగుతోన్న నీటిని బయటకు రానీయకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తూ, ‘‘వెళ్లు.. మీ నాన్నతో చదువుకుంటానని రోజూ చెప్పు. నీకు చదువుకుందుకు సాయం కావాలంటే మా ఇంటికిరా. మా ఇల్లిక్కడికి దగ్గరే!’’ అంటూ తమ ఇంటి గుర్తులు చెప్పింది.
ఆ కుర్రవాడు ‘‘అలాగేనండీ’’ అని వెళ్లిపోయాక అన్నాడు సామ్రాట్, ‘‘నన్నంటారు కానీ.. నాకంటే సున్నిత హృదయం మీది. ముక్కూ, మొహం తెలియని వాళ్ల బాధల్ని చూసి కూడా చలించిపోతున్నారంటే మీ హృదయం ఎంతో మంచిది’’.
అతడి గొంతులోని నిజాయితీకీ.. కనురెప్పలమధ్య దాక్కుని ఉన్న నీటి పొర ఆమె కళ్లనోసారి మూసి తెరవడంతో చుక్కలుగా ఆకారాన్ని సంతరించుకుని చెక్కిళ్లమీదకు జారింది.
‘‘అరే.. ఏమిటి మరీ ఇంత బేలగా’’ అన్నాడు సామ్రాట్.
ఆమె ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. ‘‘ఎందుకో తెలియదు సామ్రాట్‌గారూ.. అటువంటి కుర్రాళ్లను చూస్తే నా మనసు వికలమైపోతుంది. వాళ్ల జీవితాలు బాగుపడటానికి మనమేం చేయలేం అని తెలిసి కూడా ప్రతిసారీ ఇలానే బాధపడుతుంటాను’’ అంది సాహిత్య చేతి రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ.
‘‘స్పందించే మనసున్నవారికలా అనిపించడం సహజం. ఒక విధంగా ఆలోచిస్తే ఏ స్పందనలూ లేనివారి జీవితమే హాయిగా గడిచిపోతుందేమో?!’’ అని అర్థోక్తిగా ఆగాడు సామ్రాట్.్ప ‘‘అవును మావారికిలాగా..’’ అని వాక్యాన్ని పూర్తిచేసింది సాహిత్య.
ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసి అన్నాడు సామ్రాట్, ‘‘మిమ్మల్ని కలిసి మీతో ముచ్చటించాలనే ఆలోచనే నా మనసులో ఉంది తప్ప మీ గురించి నాకూ, నా గురించి మీకూ ఇప్పటివకూ వివరాలేమీ తెలియవు. ఎంత చిత్రమో చూశారా!?’’

-ఇంకాఉంది

సీతాసత్య