డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లేదు.. స్వర్గంలో పెళ్లిళ్లు నిర్ణయించేది ఎవరా? అని ఆలోచిస్తున్నాను’’ అని నవ్వాడు సామ్రాట్.
ఆమె భ్రుకుటి ముడిపడిందతడి మాటల్తో. ‘‘చూడబోతే మీదీ నాలాంటి సమస్యలానే కనిపిస్తోంది. అవునా?’’ అంది సాహిత్య.
‘‘ఊ.. ఇంచుమించుగా అంతే. కాకపోతే మా సంసారంలో నేను మీరైతే, మా ఆవిడ మీవారు’’ అన్నాడు సామ్రాట్ భావరహితంగా.
‘‘నా సొద విన్నాక మీకు మాట్లాడే మూడ్ పోయినట్టుంది. మళ్లీ కల్సినపుడు మాట్లాడుకుందాం లెండి. ఇహ లేద్దామా!’’ అంది సాహిత్య లేచి నిలబడుతూ.
5
‘‘నీలో ఈమధ్య ఏదో కొత్త అందం కనిపిస్తోందోయ్ నాకు’’ అన్నాడు మహర్షి.
‘‘సాయంత్రం కళ్ల డాక్టర్ దగ్గరకెళ్దాం. ఆఫీస్ అయిపోయాక గుర్తుచెయ్’’ అన్నాడు సామ్రాట్ మిత్రుణ్ణి ఆటపట్టిస్తూ.
‘‘డాక్టర్ దగ్గరకు కాదు కానీ.. మన ఆఫీసు వాళ్లమంతా విహారయాత్ర ఏర్పాటు చేశామోయ్.. కేవలం మగవాళ్లకు మాత్రమే పరిమితం మన యాత్ర’’ అన్నాడు మహర్షి.
‘‘ఎందుకలా?! ఆడవాళ్లు రామని అన్నారా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఉహూ.. వాళ్లు రామనీ అనలేదు.. మనవాళ్లు వాళ్లను రమ్మనీ అడగలేదు. నీకు తెల్సుగా.. మనతో వాళ్లూ ఉంటే.. మన సరదాలెలా తీరుతాయ్! మనం మందుకొడుతూనో, పేకాడుతూనో, పనిలో పనిగా ఖుషీగా ఖుషీగా పడకింటి జోక్స్ పచ్చిగా చెప్పుకుంటూంటేనో.. వాళ్లకు ఇబ్బంది కాదూ?’’ అన్నాడు మహర్షి.
‘‘నువ్వెళ్లు.. నేను రానులే’’ అన్నాడు సామ్రాట్.
‘‘అదేం.. మందు కొట్టడం, పేకాడ్డం నీకు అలవాటు లేకపోయినా గతంలో ఇటువంటి యాత్రంటే ఎగిరి గంతేసేవాడివిగా! ఇప్పుడేమిటి.. కొత్తగా.. మీ ఆవిడతో రాజీ కుదిరిపోయిందా?’’ అన్నాడు మహర్షి ఆటపట్టిస్తున్నట్టుగా.
‘‘ఉహూ..’’ అన్నాడు సామ్రాట్ ముక్తసరిగా.
‘‘అంటే నాకు తెలియకుండా.. కొత్త కథేవైనా?’’ అని అర్థోక్తిగా ఆగిపోయాడు మహర్షి. సమాధానం చెప్పకుండా వౌనం వహించాడు సామ్రాట్.
అతడి భుజం పట్టుకుని కుదుపుతూ, ‘‘నా దగ్గర రహస్యాలేనా?’’ అన్నాడు మహర్షి.
చిరునవ్వు నవ్వుతూ అన్నాడు సామ్రాట్, ‘‘ఇందులో రహ్యం ఏమీ లేదు. వీలు చూసుకుని నేనే చెప్దామనుకుంటున్నాను. ఈలోగా నువ్వే ఆ ప్రస్తావన తెచ్చావు. కాకపోతే నువ్వనుకున్నట్టు కథేమీ లేదు. భావసారూప్యతగల ఒక వ్యక్తితో స్నేహం ఏర్పడిందిటీవలే.. అంతే! అంతుమించిన విశేషమేమీ లేదు.’’
‘‘ఇంతకూ ఆ వ్యక్తి ఆడా? మగా?’’ అన్నాడు మహర్షి కుతూహలంగా.
‘‘సాహిత్య అనీ.. మొన్నామధ్య ఆఫీస్ పనిమీద టూర్ వెళ్లాను గుర్తుందా? అప్పుడు బస్‌లో పరిచయమైంది ఒకావిడ. ఆవిడ మనస్తత్వం సామ్రాజ్ఞి మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. టూర్ నుంచి తిరిగొచ్చాక కూడా అప్పుడప్పుడూ కలుస్తాం, స్నేహపూర్వకంగానే. దానికి వేరే అర్థాలు తీయకు!’’ అన్నాడు సామ్రాట్.
‘‘్ఛ.. ఛ.. నిన్ను నేను అపార్థం చేసుకుంటే మన స్నేహానికి అర్థం ఏం ఉంది? పోనీలే.. మనసుకు నచ్చిన వ్యక్తి భార్యగా దొరక్కపోయినా స్నేహితురాలిగా అయినా దొరికింది.. అభినందనలు!’’ అన్నాడు మహర్షి మనఃస్ఫూర్తిగా.
‘‘నువ్వు మాతో వన విహారానికి రాననడానికి కారణం ఆవిడేనా?!’’ అన్నాడు మహర్షి తిరిగి.
‘‘అవునూ.. కాదూ..’’ అని అర్థం వచ్చేలా తలాడించాడు సామ్రాట్.
‘‘నీ ధోరణి చూస్తోంటే.. మీ పరిచయం స్నేహాన్ని మించి ఎదిగినట్టుగా అనుమానం వస్తోంది నాకు’’ అన్నాడు మహర్షి.
‘‘అదేంకాదు. కనీసం రెండు రోజులకొకసారి ఎక్కడో ఒకచోట కల్సుకుంటున్నాం. కాస్సేపు కబుర్లు చెప్పుకుని విడిపోతున్నాం. మర్నాడు ఆవిణ్ణి కల్సుకోబోతున్నాననే ఊహ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, విడిపోయి ఎవరిళ్లకు వాళ్లు వెళ్తున్నప్పుడు మళ్లీ ఎప్పుడు కలుస్తానో అని తహతహగా ఉంటుంది’’ అన్నాడు సామ్రాట్.
‘‘అంతసేపు ఏం మాట్లాడుకుంటారు మీరు?’’ అన్నాడు మహర్షి.
మిత్రుణ్ణి అమాయకుణ్ణి చూసినట్టు చూసి అన్నాడు సామ్రాట్, ‘‘సినిమాలు, కథలు, రాజకీయాలు, కుటుంబ విషయాలు, సమాజంలో నిత్యం జరిగే సంఘటనలూ, చరిత్ర, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం.. ఒకటేవిటి? కాదేదీ చర్చకనర్హం అన్నట్టుగా ఈ లోకంలో ప్రతి విషయమూ మాకు చర్చనీయాంశమే’’
‘‘మరేం ఫర్వాలేదు. ఓ నాల్రోజులు మీ చర్చా కార్యక్రమాన్ని వాయిదా వెయ్యి. ‘విరహము కూడా సుఖమే కాదా!’ అన్నట్టుగా మీ తదుపరి చర్చా కార్యక్రమాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తే మాట్లాడేందుకు మరిన్ని కొత్త విషయాలు జమ అవుతాయి’’ అన్నాడు మహర్షి. ‘‘సరే నువ్వింతగా అడుగుతున్నవు కాబట్టి సాహిత్యతో ఈ విషయం చెప్పి తను ఒప్పుకుంటే వస్తాను’’ అంటూ షరతులాంటి అంగీకారాన్ని తెలియజేశాడు సామ్రాట్.
‘‘అలా అనకు సామ్రాట్.. నువ్వు లేకుండా అక్కడికి వెళ్లి ఆనందంగా గడపలేను. నీకు తెల్సు కదా.. నా మనసులో ఎటువంటి భావాన్నైనా నీతో పంచుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుందనీ! నీ తరఫున సాహిత్యగారితో మాట్లాడి నువ్వు మాతో రావడానికి మార్గం సుగమం చేస్తాను, సరేనా?’’ అన్నాడు మహర్షి.
‘‘ఆగాగు.. అక్కడికి మేమిద్దరం ఏదో ప్రేమికులమైనట్టూ, మేం తాత్కాలికగా కల్సుకోనంత మాత్రన ఆ ఎడబాటును ఆవిడ భరించలేకపోతోందన్న భావనతో నువ్వు ఆవిణ్ణి సముదాయించి ఒప్పించడవేమిటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఆ ప్రయత్నం నువ్వు చేస్తే ఆవిడ ఈ జన్మలో నా మొహం చూడదు. నీకది ఇష్టమైతే అలాగే కానీ!’’ అన్నాడు సామ్రాట్ నిష్ఠూరంగా.
‘‘నేనావిడతో మాట్లాడ్డం నీకిష్టం లేకపోతే సరే! నువ్వే ఆవిడకు ఏదో సాకు చెప్పి మాతో రావడానికి సిద్ధంగా ఉండు’’ అన్నాడు మహర్షి.

-ఇంకాఉంది

సీతాసత్య