డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ్ చిటికె వేసి చూన్నాడు, ‘‘చూడబోతే సామ్రాట్ గారు ప్రస్తుతం ఏదో తీరని సమస్యతో కొట్టుమిట్టాడుతున్నట్టున్నారు. అదేవిటో మాకూ చెపితే మాకు తోచిన తరుణోపాయం మేమూ చెప్తాం కదా!’’
‘‘తప్పకుండా.. మన మధ్య స్నేహం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఎందుకో నా సమస్య మీతో చెప్పుకోవాలనిపిస్తోంది’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఇంకెందుకూ ఆలస్యం? కానివ్వండి’’ అంటూ అప్పుడే అటుగా వచ్చిన బేరర్‌కు ఆర్డర్ ఇచ్చి కుతూహలంగా సామ్రాట్ వైపు చూశాడు గౌతమ్.
‘‘ఒక్క మాటలో చెప్పాలంటే మా మధ్య వున్న సమస్య- మనస్తత్వ వైరుద్యం. టీవీ చూడ్డం ఆవిడకిష్టం. పుస్తకాలు చదవడం నా కిష్టం. ఇంట్లో ఉన్న అనేకానేక వస్తువుల్లో మొగుడు కూడా ఒక వస్తువని ఆవిడ అభిప్రాయం.
కాకపోతే మిగిలిన వస్తువులకు ప్రాణం లేకపోతే మొగుడనేవాడు ప్రాణమున్న వస్తువు మాత్రమేనని ఆవిడ ప్రగాఢ విశ్వాసం.
భార్యాభర్తలు ఒకరి మనసులోకి మరొకరు పరకాయ ప్రవేశం చేయగలిగితే ఆ సంసారం సజావుగా సాగుతుందని నేనంటే పరకాయ ప్రవేశాలూ, సొరకాయ ప్రవేశాలూ చేయడానికి తానేమీ విఠలాచార్య సినిమాల్లో యువరాణినీ కాననీ, ఏ మంత్ర శక్తులూ లేని మామూలు మనిషిననీ వెటకారంగా అంటుంది.
భావుకత అంటే నాకు ప్రాణం. అటువంటి పదమొకటి ఉందనే ఆలోచన కూడా ఆవిడ ఊహల్లోకి రాదు.
మనసులో కలవకుండా శరీరాలు కలవడమంటే వ్యభిచారంతో సమానమని నా ఉద్దేశ్యం. ఒకసారి మొగుడూ పెళ్లాలయ్యాక శారీరకంగా కలవడానికి మధ్యలో మనసుల గోలేమిటనేది ఆవిడ వాదం.
మా సంసార జీవితం దుర్భరంగా ఉందనడానికి ఇంతకంటే వేరే కారణాలేం కావాలి?’’ అన్నాడు సామ్రాట్.
‘‘మన దేశంలో చాలామంది మొగుడూ పెళ్లాల పరిస్థితి ఇంచుమించు ఇదే! కాకపోతే కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని చాలామంది చెప్పుకోరు. మీరు చెప్పుకున్నారు. అంతే!’’
ఒకరకంగా చెప్పాలంటే నాదీ మీలాంటి జీవితమే! కాకపోతే మా ఆవిడ మీకెలాంటిదైతే నేను మీ ఆవిడలాంటివాణ్ణి.
చూడండి బ్రదర్! ఇలాంటి సందర్భాల్లో మగాడికున్న వెసులుబాటు ఆడదానికి లేదీ సమాజంలో.
అందుకు మనం సంతోషించాలి. మీ ధోరణి చూస్తోంటే మీ పరిస్థితికి బాధపడుతూ కాలం గడుపడం తప్ప దానికి తరుణోపాయం ఏవిటో మీరు ఆలోచిస్తున్నట్టు లేదు, అవునా?
అయినా ఇంత సత్యకాలపు వాళ్లేమిటండీ మీరూ! లోకం గొడ్డుపోయిందా? ప్రపంచంలో సగం జనాభా ఆడవాళ్లేగా!
మీ మనస్తత్వానికి దగ్గరగా ఉండే అమ్మాయిని వెదకి పట్టుకుని భవిష్య జీవితాన్ని ఆనందంగా అనుభవించేయడమే!
నన్ను చూడండి. మీలానే మొదట్లో మా ఆవిడ నాకు నచ్చినట్టుగా లేదని
అసంతృప్తి చెందినా, తర్వాత నా దారేవిటో నాకు స్పష్టంగా తెలిసింది. ఒకసారి ఎటువెళ్లాలో తెలిశాక ముందూ, వెనుకా చూడకుండా ఆ దారిలో నడక సాగించడమే! నేనూ అదే చేస్తున్నాను ప్రస్తుతం!
నా భార్యకు నా మీద ఇంకా ఏవైనా ఆశలున్నాయేమో తెలియదుగానీ, నాకైతే ఆమెపట్ల ఎటువంటి అంచనాలూ లేవు. మీరిప్పటికే మీ మనసుకు నచ్చిన మగువ కోసం వేటలో ఉంటే సరే!
లేకపోతే నేను చెప్పినట్టు చేసి చూడండి. మీ జీవితంలో ప్రస్తుతం వున్న శూన్యత మాయమవడం ఖాయం. నాదీ హామీ!’’ అన్నాడు గౌతమ్.
చెప్పాలా, వద్దా అని తటపటాయించి చివరకు అన్నాడు సామ్రాట్ మొహమాట పడుతూ, ‘‘నా ప్రయత్నం లేకుండానే నా మనస్తత్వానికి దగ్గరగా వున్న ఒకావిడతో నాకు పరిచయమైందిటీవలే! ఆ పరిచయపు పరమార్థమేమిటో నాకూ, ఆవిడకూ అవగతం కాకముందే.. మా మా పరిచయానికి చిలవలూ, పలవలూ కల్పించి ఆ విషయాన్ని ఎవరో నా భార్యకు జాగ్రత్తగా చేరవేశారు.
అదేవిధంగా ఆమె గురించీ ఆమె భర్తకూ త్వరలోనే మరెవరో ఉప్పందించవచ్చు. అప్పుడు నా పరిస్థితితోపాటు ఆవిడ పరిస్థితేవిటనేదే నా ముందున్న ప్రస్తుత సమస్య!
‘‘ఆహా.. అయితే గురూగారూ నేననుకున్నంత అమాయకులు కారన్నమాట. వీలైతే గురువుకే పంగనామాలు పెట్టే సామర్థ్యం కూడా ఉన్నవారే! అందుకు సందేహం లేదు.
ఇంకేం.. మీ ఆవిడకు మీరు గుడ్‌బై చెప్పేయండి.. ఆవిణ్ణీ అలాగే వాళ్లాయనకు ఆఖరిసారి దణ్ణం పెట్టివచ్చేయమనండి. ఇద్దరూ చక్కగా చిలకా గోరింకల్లా ఓ చెట్టుమీద గూడు కట్టుకుని యుగళగీతాలు పాడుకుంటూ గడిపేయండి. ఇక సమస్య ఏం ఉందీ?’’ అన్నాడు గౌతమ్.
‘‘మీరు చెప్పినంత తేలిక కాదీ వ్యవహారం. నేను ఇంతకముందే చెప్పినట్టుగా మా పరిచయమింకా ప్రారంభ దశలోనే ఉంది.
నా భార్యనుంచి నేనూ, ఆవిడ భర్తనుంచి ఆవిడా విడిపోయి మేం ఇద్దరం కలిసి బ్రతకాలనే స్థాయికి రాలేదు మా పరిచయం’’’ అన్నాడు సామ్రాట్.
‘‘అంటే మీ భార్య కళ్లు గప్పి మీరూ, భర్తను కబోదిగా భావించి ఆవిడా మరికొంతకాలం ఇలానే ప్రేమ ఊసులు చెప్పుకుంటూ ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేరని నమ్మకం కుదిరాక మీ ఆవిణ్ణి మీరు గంగలోకీ, ఆవిడ భర్తనావిడ గోదాట్లోకి తోసేసి మీరిద్దరూ పడవెక్కి మానస సరోవరం వెళ్లిపోతారా?’’ అన్నాడు గౌతమ్ వెటకారంగా.
‘‘ఉహూ.. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. మేం ఇప్పటివరకూ పరస్పరం ఇష్టపడే విషయాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఒకరి భావాలను మరొకరితో పంచుకుంటున్నాం.
ఒక్కమాటలో చెప్పాలంటే మా జీవితాల్లో ఏర్పడిన శూన్యతను మా స్నేహంతో భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతే! అంతకుమించి మరేం లేదు’’ అన్నాడు సామ్రాట్ దెబ్బతిన్నట్టుగా చూస్తూ.

-ఇంకాఉంది

సీతాసత్య