డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యకూ ఓ మనసుంటుందనీ, ఆ మనసులో చిన్నవో, పెద్దవో కోరికలంటూ ఉంటాయనీ, వాటిని గౌరవించవలసిన బాధ్యత భర్త అనే వాడికి ఉంటుందనీ.. ఇటువంటి ఆలోచనలేవీ ఆయనకు రావు.
వారానికోసారి ఇంటికి రావడం, స్నానం చేయడం, భోజనం చేయడంలానే భార్యతో సంసారాన్నీ దైనందిన కార్యక్రమాల్లో ఒకదానిలానే భావించి ముగించడం- ఆయన లక్షణాలు.
మనసనేది లేకుండా మగాడు ఆడదానితో సంసారం ఎలా చేస్తాడో నా ఊహకు ఎప్పుడూ అందని విషయం. ఒక పలకరింపు, చిన్న పొగడ్త, కొద్దిగా లాలన చూపించే భర్తకు దాసోహమనని భార్య ఉండదు ఈ లోకంలో.
కానీ నా ఊహ కూడా పూర్తిగా నిజం కాదేమోలే! స్ర్తిని నీలా గౌరవించే, అభిమానించే, లాలించే నిన్నుకూడా అర్థం చేసుకొని నీ భార్యను చూశాకగానీ ఆడవాళ్లలో అటువంటి వాళ్లు కూడా ఉంటారనే విషయం నాకు తెలియదు.
జన్మతః పురుషుడితో పోలిస్తే స్ర్తి అల్పసంతోషి. నీ భార్య ఇందుకు మినహాయింపనుకో!
పురుషుడు మొదట్లో స్ర్తి ఒంపుసొంపులపట్ల ఆకర్షితుడైనా క్రమేణా ఆ ఆకర్షణ ప్రేమగా, పటిష్టమైన బంధంగా రూపాంతరం చెంది స్థిరపడాలంటే స్ర్తిలో బాహ్య సౌందర్యాన్ని మించిన అంతఃసౌందర్యం ఉండడం తప్పనిసరి.
పురుషుడిలా స్ర్తి వౌలికంగా సౌందర్య పిపాసి కాదు. పురుషుడిలో ఆమె చూసే లక్షణాలు వేరు. తాను మెచ్చిన తనకు నచ్చిన గుణాలున్న పురుషుణ్ణి ఇష్టపడని స్ర్తి ఉండదు సాధారణంగా. ఆ పురుషుడికి అందం కూడా ఉంటే దాన్నొక అదనపు అర్హతగా స్ర్తి భావిస్తుందే తప్ప అదే ప్రధానం అనుకోదు.
మరి నువ్వు నాలో బాహ్య సౌందర్యాన్ని చూశావో, అంతః సౌందర్యాన్ని చూశావో నాకు తెలియదు గానీ నేను మాత్రం నీ సభ్యతాయుతమైన ప్రవర్తననిష్టపడడంవల్లే నీతో ఇంతకాలమూ చనువుగా ఉండగలిగాను’’ అంది సాహిత్య.
‘‘ఇంతకాలమూ నా అందాన్ని చూసి నాతో స్నేహం చేశావనుకుంటున్నాననే నేనూ!’’ అన్నాడు సామ్రాట్ విషయాన్ని తేలికపరిచే ప్రయత్నం చేస్తూ.
ఓసారి అతడి వైపు పరికించి చూసి ‘‘చూపులకు బానే వుంటావు నువ్వు. కానీ నిజాయితీగా చెప్పాలంటే మావారి ముఖ లక్షణాలు కూడా నీకంటే ఒక రవ్వ బాగానే వుంటాయి. ఉడుక్కోకు. అయినా నీతో నా స్నేహానికి అది కారణం కాదని నీకు తెలియదూ?
మళ్లీ ఇప్పుడిదేమిటి కొత్తగా... మనమేమీ ప్రేమించి పెళ్లి చేసుకోబోవటంలేదు కదా’’ అంది సాహిత్య అతణ్ణి ఆటపట్టిస్తూ.
సాహిత్య మాటలతడిలో నిద్రాణమై ఉన్న ఏ భావాల్ని తట్టి లేపాయో గానీ...’’ అవును సాహిత్యా.. మన పెళ్లిళ్లు కావడానికి ముందు మనం కల్సుకుని ఉంటే బావుండేది కదూ!’’ అన్నాడు సామ్రాట్ హఠాత్తుగా.
ఆమె ఒక్క క్షణం అతణ్ణి తేరిపార చూసి ‘‘జరిగిపోయిన విషయాల్ని తల్చుకుంటూ అలా జరిగి వుంటే బావుండేది, ఇలా జరగకపోయి వుంటే బావుండేది- అనే మాటలంత నిరర్థకమైన మాటలు బహుశః ఏ భాషలోనూ ఉండవు. గతాన్ని తలచుకుని వగచే అటువంటి మాటలంటే నాకిష్టం ఉండదని నీకు తెల్సుగా?’’ అంది సాహిత్య.
‘‘నీలో భావుకతతోపాటు వాస్తవిక దృక్పథం కూడా ఉంది సాహిత్యా.. ఆ విషయం ఎప్పుడు తలచుకున్నా నీ పరిచయ భాగ్యం కలిగినందుకు నాకెంతో గర్వంగా ఉంటుంది’’ అన్నాడు సామ్రాట్ మనఃస్ఫూర్తిగా.
‘‘పొగడ్తలంటే ఇష్టపడని నన్ను పొగుడుతున్నట్టు తెలియకుండా సందర్భానుసారంగా మెచ్చుకుంటూ నువ్వు ననె్నప్పుడూ పొగుడుతావో అని నేనెదురు చూసే స్థితికి నన్ను తీసుకొచ్చావు. పొగడ్తలు కాస్త తగ్గించుకుంటే మంచిది ఇకముందైనా!’’’ అంది సాహిత్య.
‘‘అదేం.. పొగడ్తలాంటి నా మాటలు నీకూ ఇష్టమని చెప్పావుగా! ఇంకేవిటీ నీ బాధ!’’ అన్నాడు సామ్రాట్.
‘‘పొగడ్త పన్నీరు వంటిది. దాన్ని వాసన చూసి వదిలేయాలే గానీ, అదే పనిగా దాన్ని త్రాగుతూ కూర్చుందామనుకోకూడదు. నీ పొగడ్తలు వినీ వినీ నేను వాటి మత్తులో పడి నా వ్యక్తిత్వాన్ని కోల్పోతానేమోనని నా భయం’’ అంది సాహిత్య.
‘‘మరేం ఫర్వాలేదు. నీ వ్యక్తిత్వం అంత బలహీనమైనది కాదులే.. అయినా నేను ఉన్న మాటలే కదా అంటున్నాను. అవి నీకు పొగడ్తల్లా ధ్వనిస్తున్నాయంతే! అయినా నా మాటల పట్లా, చర్యలపట్లా నీ స్పందన నాకూ అలానే నీ మాటల పట్లా, చేష్టలపట్లా నా స్పందన నీకూ ఒకరికొకరం నిజాయితీగా చెప్పుకోకపోతే మన స్నేహానికర్థం ఏం ఉందీ!’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఒకరి మాటలనొకరు ఇష్టపడుతున్నాం కూడా అని ఇద్దరమూ ఎదుటివారి కిష్టమయ్యే మాటలే మాట్లాడ్డంమీద దృష్టి సారిస్తే అతి త్వరలోనే మొహం మొత్తి తర్వాతేం మాట్లాడాలో తెలియని స్థితికి చేరుకుంటాం.
ఏదైనా హద్దుల్లో ఉంటేనే దానికి విలువ ఉంటుందనేది నీకు తెలియని విషయం కాదు కదా?’’ అంది సాహిత్య.
‘‘సరే.. ఇంతకూ మన భవిష్యత్ కార్యక్రమమేటి? జీవితాంతమూ ఈ ఊళ్లో ఎక్కడో ఒక చోట కల్సుకుని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ మన గురించి మనను కట్టుకున్నవాళ్లకు ఎవరెటువంటి సమాచారం చేరవేస్తారోనని భయపడుతూ ఇలానే రోజులు గడిపేద్దామా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం!’’
‘‘ఏం లేదు సాహిత్యా.. ఎప్పటినుంచో నిన్నడగాలని అనుకుంటున్నాను. తీరా అడిగాక కాదనకూడదు మరి!’’
‘‘ఇదేం షరతు? చిన్నపిల్లాడిలా..’’ అంది సాహిత్య అతడడగబోయేది ఏవై ఉంటుందా అని ఆలోచిస్తూ.
ఈ ఊళ్ళో మనం ఎప్పుడు కల్సుకున్నా కొన్ని గంటల కంటే ఎక్కువ సేపు గడపలేకపోన్నాం. అదే మనం.. ఈ ఊళ్ళో కాకుండా వేరే ఎక్కడైనా కల్సుకునే వీలుందనుకో! అప్పుడు కనీసం కొన్ని రోజులు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపొచ్చు కదా..!’’

-ఇంకాఉంది

సీతాసత్య