డైలీ సీరియల్

పూలకుండీలు- 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతో పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ’’ అంటూ అల్లుణ్ణి తీసుకుని మెల్లగా బయటకు నడిచాడు.
మామా అల్లుళ్ళిద్దరూ నేరుగా రాజయ్య సారాకొట్టు దగ్గరికి నడిచి చెరో క్వార్టర్ బాటిల్ చీప్ లిక్కర్, చెరో పది రూపాయల మిక్చర్ పొట్లం కొనుక్కుని అక్కణ్ణుండి పత్తికేశవులు బత్తాయితోట వెనుక పరుపుబండ పక్కన నల్ల తుమ్మ చెట్టుకిందికి చేరుకున్నారు.
సారా సీసాలు, మిక్చర్ పొట్లాలు ఖాళీ అయ్యేసరికి కూతురు విషయంలో అన్ని రోజులుగా తన మనసులో పేరుకుపోయిన బాధనంతా అల్లుని ముందు కక్కేసాడు జగ్గయ్య.
మామ నోటిగుండా జరిగిందంతా విన్న ఎల్లయ్య ముఖం తెల్లగా పాలిపోతుంటే ‘‘లోకం మీద ఇబ్బందులొచ్చినోల్లంతా ఇట్లాంటి బద్మాష్ పనే్ల చేస్తున్నారా? దానికంటే బుద్ధి లేదనుకుందాం మరి అత్తమ్మ కేమైంది తెలివి? తన బిడ్డ చేసిందేదో మంచిపనైనట్టు నామీదనే ఉల్టా లడాయి చేస్తుంది! మందు తాగినపుడల్లా హిందీలో మాట్లాడే అలవాటున్న ఎల్లయ్య ఎప్పటిమాదిరిగానే బడ బడామని హిందీలో మాట్లాడుతూ లేచి మళ్లీ సారా దుకాణానికి దారి తీశాడు.
మామ కూడా అల్లుణ్ణి అనుసరించాడు.
సారాయి దుకాణంలో మరికొంతసేపు గడిపిన మామ అల్లుళ్ళు అక్కణ్ణుండి చికెన్ కొట్టు దగ్గరికెళ్లి ఓ కిలోన్నర చికెన్ కొట్టించుకుని మెల్లగా ఇల్లు చేరారు.
మామ అల్లుళ్ళను ఆ స్థితిలో చూసిన జానకమ్మ మరింతగా మండిపడుతూ ‘‘ఆయనంటే కాలు రెక్కలు దగ్గరికొచ్చి కాటికి బొయ్యేటందుకు తయారైనోడు. అన్ని చూసిండు, చేసిండు. తిన్నా, తాగినా అడిగేటోడు లేడు. మరి నీకేమొచ్చింది మాయరోగం? ఆడ బొంబాయిలో గూడా ఇట్లనే వచ్చిన జీతం వచ్చినట్టే తాక్కుంట కులికినవ్‌లే! ఇట్ల తాగేటోనికాడ ఇంటికి పెల్లాం పిల్లలకు పంపటానికి ఇంక పైసలాడికెల్లి మిగులుతై?
నీకు తప్పినా ఆడదై పుట్టి కడుపు తెరిపి కన్నందుకు పోరగాల్లకింద తిండి పెట్టేటందుకు నా బిడ్డ తన తల్లితనానే్న కిరాయికిచ్చుకుంట, ఎన్నడు ఎరగని మనుషుల మధ్యకు, ఎప్పుడు సూడని రాజ్యంమీదికి బోయింది’’ అంటూ తన తల్లి హృదయ ఘోషను గట్టిగా అరిచి వ్యక్తం చేస్తూ నిల్చున్నచోటే కూలబడిపోయి క్రమంగా ఏడుపులోకి దిగిపోయింది.
తన భార్య దుఃఖాన్ని గమనించిన జగ్గయ్యకు తాగిన మత్తు పూర్తిగా దిగిపోవడంతో ప్రేమగా ఆవిడను దగ్గరకు తీసుకుని ‘‘నీ కడుపులో బిడ్డమీద ఇంత దుమారం రేగుతుందని నేనెన్నడూ వూయించలేదే. ఏం జేస్తాం జెప్పు? వుండి లేని బతుకుల్లో ఇట్టాంటి పుల్లిందలు వచ్చిపోతనై వుంటై తియ్. అసలే జరిగిందానికి బాధపడుతున్న అల్లున్ని సచ్చినపామును సంపినట్టు ఇంకా ఏం సంపుతవ్‌లే వూకో. మనసు నొచ్చుకొని అయింత తనేమన్న చేసుకున్నాడంటే మన గడ్డి మనం తిని ఎదుటి గడ్డికి ఎదురుచూడాల’’ అంటూ పలు రకాలుగా సముదాయించాడు.
దాంతో కోపం కొంత చల్లారిన జానకమ్మ కళ్ళు తుడుచుకుంటూ వౌనంగా లేచి చికెన్ వండడానికి పూనుకుంది.
తను ఎలాంటివాడైనా ఇంటి అల్లుడన్న గౌరవం లేకుండా అత్తగారు అంతంత మాటలనడంతో నొచ్చుకున్న ఎల్లయ్య ‘‘అయ్యాల నేనెలాంటోన్నో తెలుసుకోకుంటనే పిల్లనిచ్చిండ్రా? ఐనా ఇన్నాల్లు నా పిల్లల్ని నేను గాడిదయ్యో, బూడిదయ్యో సాదుకున్నాగాని మీ ఇంటికెప్పుడన్నా వచ్చి పావులా అడిగిన్నా, బేడా అడిగిన్నా, గుడిసో, గుడిసో వుంటున్న ఇల్లు సాలు, ఆ ఇందిరమ్మ డాబా ఇల్లు వద్దని నేను, మా అమ్మా నాయినలు గూడా చెవున ఇల్లు గట్టుకొని శతపోరినా ఇనకుంట ఆ రొంపిలోకి దింపింది మీ బిడ్డగాదా? దాంతోటి వున్న గుడిశ బోయింది, కుతికల్లోతు అప్పుల్ల మునిగిపోయినం. ఆ అప్పులు తీర్చేటందుకే నేను బొంబాయికి బోయిన. నేనటుపోయింది చూసి, ఆ ఆర్‌ఎంపి లింగడు చెప్పిన మాయమాటలు నమ్మి తను ఇంత పని జేసింది. అటువంటి దాన్ని ఏమనకపోగా ఇంటల్లుడని గూడా సూడకుండా నోటికెంత మాటొస్తే అంత మాటంటదా!?’’ కమ్మున పెట్టిన దోసకాయ మాదిరిగా కుత కుత ఉడికిపోతూ అత్తను ఏమనాలో తెలియక మామతో లడాయికి దిగాడు.
‘‘కోపంలో కిందు మీద తెలవక అల్లున్ని పట్టుకొని అట్లా మాట్లాడ్డం నాది బుద్ధి తక్కువే’’ అనుకున్న జానకమ్మ అల్లుడు ఎన్ని మాటలన్నా తనను కాదన్నట్టే వంట పనిలో మునిగిపోయింది.
‘‘మీ అత్త అట్ల మాట్లాడ్డం తప్పేలే అల్లుడా! ఇగ వూకో. నీ మాట కాదని ఇల్లు మెడకు బెట్టుకున్నందుకు నెత్తీ నోరు కొట్టుకున్న నా బిడ్డ ఆ తప్పును దిద్దుకుందుకే అంత తెంపు జేసి హైదరాబాద్ బోయింది. అంతేగాని కాని పని మాత్రం చెయ్యబోలేదు. మనకు తెలవదుగాని ఈ ఏరియాల శానామంది ఆడోల్లు అట్లనే బోయిండ్రంట. ఆ సంగతి తెలిస్తే పోనియ్యనని నాగ్గూడా తెలియనియ్యలే’’ అల్లుని ముందు తన పరువుకు భంగం కలుగకుండా వుండేందుకు మబ్బుకు మాసికేసినట్టు మాట్లడాడు జగ్గయ్య.
‘‘ఈ మాటలన్నీ నాకెందుగ్గాని నా పిల్లలను నేను తీసకపోతా’’ అంటూ కూర్చున్న మంచంమీద నుండి లేచాడు ఎల్లయ్య.
అప్పటిదాకా అమ్మమ్మ, తాతయ్యలతో తండ్రి గొడవ పడుతుండడంతో బిక్కు బిక్కుమంటూ ఓ మూలకు ఒదిగి నిలుచున్న పిల్లలు నలుగురూ ఏడుపు ముఖాలతో అమ్మమ్మ వంక చూడసాగారు.
అప్పటిదాకా అనవసరంగా అల్లుణ్ణి మాటలన్నాను అనుకుంటున్న జానకమ్మ ఎప్పుడైతే అతను పిల్లలను తీసుకుపోతానంటూ లేచాడో వెంటనే మళ్ళీ ఎప్పటిమాదిరిగా మారిపోయి ఒక్కసారిగా నోరు చేసుకుంటూ ‘‘తాను దూర సందులేదు గాని మెడకో డోలు అన్నట్టు నీకే అక్కడ ఓ ముద్ద పెట్టే తెరువు లేదు గాని పిల్లల్ని యాడికి తీసుకుపోతావ్?’’ అంటూ అడ్డం తిరిగింది.
‘‘ఇంక యాడికి? మా ఇంటికే తీసుకపోతా, ఆడ మా అమ్మా నాయినలు లేరా!’’ అత్త స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఎల్లయ్య గూడా బదులిచ్చాడు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు