డైలీ సీరియల్

పూలకుండీలు 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటిసారిగా అల్లుడి కోపాన్ని ప్రత్యక్షంగా చూసిన జానకమ్మ కొద్దిగా తగ్గుతూ ‘‘తీసకపొయ్యి ఏం జేస్తావ్?’’ అడిగింది బేలగా.

‘‘ఎవరికన్నా అమ్ముకుంటా’’ మరింత విసురుగా బదులిచ్చాడు ఎల్లయ్య.
‘‘అమ్ముకోడానికి వాళ్ళేమన్నా వంకాయలా? బెండకాయలా? ఐనా ఇప్పుడు వాళ్ళను తీసుకుపోయి ఆ ముసలోల్లమీద వదిలిపెట్టి నీదారిన నువ్వు ఎల్లిపోతే వాల్ల గతేం గావాల?’’ అంటూ అంతలోనే గోడుకు కొట్టిన బంతిలా తిరిగి అల్లుడు మీదికి లడాయికి లేచింది జానకమ్మ.
‘‘ఔను వంకాయలు, బెండకాయల్లెక్క గర్భాన్ని అమ్ముకున్నపుడు లేని తప్పు పిల్లల్ని అమ్ముకుంటనంటెనే వచ్చిందా?’’ పచ్చి కర్రను విరిచినట్టు మాటలు విరిచాడు ఎల్లయ్య.
అల్లుడంత సూటిగా మాట్లాడేసరికి ఊపిరి సలపనట్టు వౌనంగా వుండిపోయంది జానకమ్మ.
‘‘అయినా ఇగ నేనెక్కడికి పోవట్లేదు వూల్లోనే వుంటా. మునుపటిలెక్కే ఏదో కష్టం జేసుకొని నా పిల్లల్ని నేను సాదుకుంటా. అయినా నా పిల్లలు నా ఇష్టం, మధ్యన నీ పెత్తనమేంది’’ అంటూ తనో గట్టి నిర్ణయానికి వచ్చినవాడిలా తేల్చి చెప్పాడు ఎల్లయ్య.
ఆ పాటికే పిల్లలు నలుగురూ ‘‘మనింటికి మనం ఎల్లిపోదాం నాన్నా!’’ అంటూ తండ్రి దగ్గరికెళ్లి నిలుచున్నారు.
అంతే...
అత్తా మామలు ఎంత బ్రతిమాలుతున్నా విన్పించుకోకుండా అన్నం కూడా తినకుండా పిల్లలను తీసుకొని పాల్వంచ బయలుదేరాడు.
****
దాదాపు ఏడు నెలల తరువాత మనుమలు, మనుమరాళ్ళు కంటబడటంతో కదిలిపోయిన ఎల్లయ్య తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకుంటూ వళ్ళంతా పునికి పునికి ముద్దులు పెట్టుకోసాగారు.
కొంతసేపు వాళ్లనలా వదిలిపెట్టిన ఎల్లయ్య ఆఖరికి తల్లిదండ్రుల వంక చూస్తూ ‘‘పిల్లలనిక్కడే వుంచుకుందామని మీకు చెప్పకుండనే తీసుకొచ్చిన’’ పిల్లల విషయంలో ఓ వంక తాను తొందరపడలేదు కదా? అన్న అపరాధ భావానికి లోనవుతూ మరో వంక సంజాయిషీ ఇస్తున్నట్టుగా అన్నాడు.
కొడుకు మాటలు విన్న ఎల్లయ్య తల్లి ఒక్కసారిగా తల పంకిస్తూ ‘‘మంచి పని చేసినవు కొడుకా! చెట్టుకు కాయలు బరువా? చెరువుకు నాచు బరువా? రెక్కల్లో చేవ వున్నోనికి అన్నం కరువా తియ్’’ అంటూ కొడుక్కి మనస్ఫూర్తిగా తను భరోసా ఇచ్చింది.
పిల్లలను తెచ్చి ఇంట్లో పెట్టిన ఎల్లయ్య జరిగిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోనూ లేక అట్లాగని ఆ గరళాన్ని కడుపులో దాచుకోనూ లేక భార్యనే తలపుల్లో మోసుకుంటూ పిచ్చివాడి మాదిరిగా ఊరు వాడా అనకుండా తిరగసాగాడు.
కొడుకు వాలకాన్ని చూసిన ఎల్లయ్య తల్లి కమలమ్మ ఓ రోజు రాత్రి అన్నం తిన్న తరువాత కొడుకును దగ్గరికి తీసుకుని ‘‘ఇట్లా బికారోని లెక్క తిరిగితే ఎట్ల కొడుకా! ఇంట్లో ఉప్పుతో సహా సకలం నిండుకున్నాయ్! నలుగురు పిల్లలు, ముగ్గురు పెద్దలం మొత్తం పూటకు ఏడు కంచాలు లేవాల్నంటే ఎంత అన్నం కావాల? అండ్లకు ఎంత కూర కావాల? నీకు తెలవని ముచ్చటా చెప్పు? ఏదన్నా పనికి బోయ్యి సాయంత్రంకల్లా నాలుగు రూపాయలు తేకపోతే పిల్లలు ఆకలికి సచ్చిపోతరు కొడుకా!’’ కడుపులో పేగులు కదిలిపోయేలా మొరపెట్టుకుంది.
తల్లి మాటలు విన్న ఎల్లయ్య చాలాసేపు ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఆఖరికి ‘‘ఔనమ్మా! నేను కూడా ఏదన్నా పనికి పోవాల్ననే అనుకుంటున్నా. కాకపోతే ఒక్కసారి హైదరాబాద్ బొయ్యి దాని సంగతేందో తేల్చుకొని వద్దామనుకుంటున్నా’’ అంటూ తన మనసులోని ఆంతర్యాన్ని బయటపెట్టాడు.
‘‘ఏమో కొడుకా! నేను చెప్పేది చెప్పిన, ఇగ ఆపైన నీ ఇష్టం’’ అంటూ పక్క దులిపి వేసుకుని పిల్లలను తన చుట్టూ పడుకోబెట్టుకుంది.
అన్నట్టే ఆ మరునాడు పొద్దునే్న లేచి కొత్తగూడెం వెళ్లిన ఎల్లయ్య ప్యాసింజర్ రైలు పట్టుకొని మధ్యాహ్నం పనె్నండు గంటలకల్లా హైదరాబాద్ హాస్పిటల్‌కి చేరుకున్నాడు.
హాస్పిటల్ మెయిన్ గేట్లో వున్న సెక్యూరిటీ గార్డులు ఎల్లయ్యను చూడ్డంతోనే పోలీస్ స్టేషన్ నోటీస్‌బోర్డులో వుండే పాత నేరస్థుల ఫొటోల్లోని ఓ వ్యక్తి హఠాత్తుగా తన ముందు ప్రత్యక్షమైనపుడు కంగారుపడిపోయే కొత్త పోలీసుల మాదిరిగా అతణ్ణి గుచ్చి గుచ్చి చూస్తూ లోనికి వదలాలా వద్దా అన్న సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడి ఎలాగైతేనేం ఆఖరికి వదిలారు.
గేట్‌లోనుండి నేరుగా రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్లిన ఎల్లయ్య ‘‘నా భార్యను చూడాల యాడుందో చెప్పండి!’’ అంటూ అడిగాడు.
అతను అడిగిన తీరుకు కొంచెం ఆశ్చర్యపడిపోతూ అతని వంక చూసిన ఆ రిసెప్షనిస్ట్ ‘‘నా భార్యంటే!’’ అంటూ మెల్లగా అడిగింది.
‘‘శాంతమ్మ’’ కొట్టినట్టే చెప్పాడు ఎల్లయ్య. ఆమె పేరు వింటూనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘‘ఓ ఆవిడా! ఆవిడ ఎప్పుడో డిశ్చార్జ్ తీసుకుని వెళ్లిపోయింది గదా! నువ్వు ఇప్పుడొచ్చి అడుగుతున్నావేంటి!? అంటూ ప్రశ్నించిన ఆ రిసెప్షనిస్ట్ అంతలోనే ఏదో ఫోన్ రావడంతో అటు మాట్లాడుతూ ఎల్లయ్యను అసలు పట్టించుకోడమే మానేసింది.
పది నిమిషాలపాటు ఆమె వంకే చూస్తూ నిల్చున్న ఎల్లయ్య, ఆవిడ ఎంతకూ తన వంక చూడకపోవడంతో కోపంతో ఉడికిపోతూ ఒక్కసారిగా గొంతెత్తి ‘‘అదేంటి? మొన్న నేనొచ్చినపుడు ఇక్కడే వున్న మనిషి ఇంతలోకే ఎటు మాయమైపోద్ది!?

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు