డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యుద్ధం - బౌద్ధం రెండు కలిసి నడవలేవు. ఆ రోజుల్లో సందీప్ పఠించిన మూలమంత్రం ఇదే. ఈ మంత్రానే్న జపం చేస్తూ తన గాయపడ్డ ఆత్మనీ, రక్తసిక్తమైన విశ్వచేతన గాయాలకి కట్టుకడుతూ ఉండేవాడు. మేజర్ సందీప్ ఇప్పటిదాకా ఒక మిలిటెంట్‌ని కూడా చంపలేకపోయాడు. ఏ ఆపరేషన్‌లోనూ సక్సెస్ కాలేకపోయాడు కాని అతడి సహ ఉద్యోగి మేజర్ విక్రమ్ పాలీవాల్ దాదాపు పధ్నాలుగు మంది ఉగ్రవాదులను ఒక్కడే చంపాడు. అతడికి శౌర్యచక్ర కూడా లభించింది.
ఇప్పుడు రోజురోజుకీ సందీప్‌పైన యూనిట్ ప్రెషర్ పడుతూనే ఉంది. హిందుస్తాన్ రక్షణ అతడి మొదటి కర్తవ్యం. కాశ్మీర్‌లోని గుండ, సోపోర్, రాజౌరీ, అనంత్‌నాగ్ మొదలైన ప్రదేశాలలో ఉగ్రవాదులు తాండవం చేస్తూ ఉంటారు. అసలు వీటిని సందీప్ ఒక్క క్షణం అయినా మరిచిపోదామన్నా మరిచిపోలేడు. అతడు హిందుస్తానీయుడు. అతడికి తన ఆత్మ అంటూ లేదు. తన అస్తిత్వం అంటూ లేదు. అతడు ఒక సమూహానికి, భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాడు. వ్యక్తి స్వాతంత్య్రానికి, వ్యక్తి మనస్సుకు ఇక్కడ స్పేస్ లేదు. అతడికి ప్రతీక్షణం తను ఆర్మీలోకి రాకుండా ఉండాల్సింది అని అనిపించేది. ఎందుకంటే ఇక్కడ మనస్సున్న మనిషిలా మనిషి బతకలేడు. వ్యక్తి ఇక్కడ ఒక ఫ్రేమ్‌లో బంధింపబడతాడు. ఎత్తుకు పైఎత్తులు వేయాలి. ఉగ్రవాదులను ఎట్లా చంపాలన్న ఒక ఉద్దేశ్యంతోటే ఇక్కడ బతకాలి. 18 సం.ల వయస్సులో సీమితమైన అనుభవాల ఆధారంగా సంతకం చేసాడు. వెనక్కి తిరిగి వెళ్లలేడు. కనీసం 20 సం.లు పనిచేయాల్సిందే.
ప్రస్తుతం అతడి ధ్యేయం జమీల్‌ని చంపడమే. అందువలన ఆ కుటుంబంపైన ఆర్మీ ఎప్పుడు కన్నువేసే ఉంచుతుంది. వాళ్లని ఉచ్చులో ఎట్లా పడేయాలో అని ఆలోచిస్తూనే ఉంటుంది. వాళ్లని హింసించడం, ప్రశ్నలనడిగి వేధించడం, యమయాతనలు పెట్టడం ద్వారా వాళ్ళ మనోబలాన్ని క్షీణపరిచి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందాలి. మెల్లి మెల్లిగా ఆ ఇల్లు కూలసాగింది. కుటుంబ సభ్యులు బలహీనులు కాసాగారు. ఇప్పుడు వాళ్ల ఎదురుకుండా రెండే మార్గాలు ఉన్నాయి. జమీల్ చావనైనా చావాలి లేకపోతే కుటుంబం మొత్తం నాశనం అయినా కావాలి.
సందీప్ ఒకరోజు జమీల్ తల్లికి అర్థం అయ్యేలా చెప్పాడు. ‘జమీల్ ఈ రోజు కాకపోతే రేపైనా చస్తాడు. కాని నీవు అనుకుంటే నీ ఇద్దరు పిల్లలను రక్షించుకోగలవు. హమీద్ శరీరంలో మాంసం అనేది లేకుండా పోయింది. ఎముకలు తప్ప ఇంకేమీ లేవు. శరీరం అంతా గాయాలే. వాడు దాదాపు పిచ్చివాడైపోయాడు. వాడిని చూస్తే ఎన్నో సంవత్సరాల నుండి జబ్బుపడ్డవాడిలా ఉన్నాడు. నీ మొండితనం వలన జమీల్ ఎటూ దక్కడు కాని తక్కిన పిల్లలూ దక్కరు. ఎందుకు ఈ పిల్లలని పోగొట్టుకుంటావు? ఒకవేళ బతికినా జీవచ్ఛవంలా బతుకులను ఈడవాలి’’.
‘‘ఒద్దు.. అట్లా మాట్లాడకండి. ఖుదా రహమ్ కరే..’’ జమీల్ తల్లి చెవులు మూసుకుంటూ అన్నది. బలహీనమైన వేళ్లు ఉన్న చెట్టులా ఆమె వణికిపోతోంది. ఒకవేళ రుబీనా చేయూతనియ్యకపోతే ఆమె కింద పడిపోయి ఉండేది. సందీప్ వేసిన బాణం సరిగ్గా తగలాల్సిన చోటే తగిలింది. కుటుంబం క్షణక్షణానికి బలహీనపడుతోంది. బుద్ధుడు ప్రతీక్షణం బాధపడుతున్నాడు. మానవతా విలువలు నెమ్మది నెమ్మదిగా దిగజారిపోతున్నాయి. పిల్లలు భయంతో క్రుంగిపోతున్నారు. జమీల్ తల్లి రెండు ముక్కలైపోయింది. ఒక భాగం జమీల్ కోసం ఆలోచిస్తే మరో ముక్క తక్కిన పిల్లల కోసం
ఒక మధ్యాహ్నం ఆ ఇంటిమీద పిడుగు పడ్డది. అక్కడి సరోవరం ఎండిపోయింది. నీటి చుక్క కరువైపోయింది. గాలి వీచడం మానేసింది. భావోద్వేగాలన్నీ చచ్చిపోయాయి. భయాందోళనలు, హింస, యాతనలు భరిస్తున్న ఆ కుటుంబం పూర్తిగా బలహీనపడ్డది. కుమ్మరివాడి సాన ఆగిపోయి ఉండవచ్చు. జీవించాలి తప్పదు అన్న భావంతో సృష్టికర్త తన మమతానురాగాలతో చేయబడిన సృష్టిని సమాప్తం చేయాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. జమీల్ తల్లి కళ్లలో నీళ్లు నిండుతున్నాయి. హృదయంలో అన్ని జ్వాలలు లేస్తున్నాయి. ఆమె ‘వాడు వస్తున్నాడు. రేపు మమ్మల్ని కలవడానికి వస్తున్నాడు’ అని అన్నది.
ఎవరు జమీలా??
నమ్మకం కలగడంలేదు.
మేజర్ అవాక్కాయ్యడు. భావుకుడయ్యాడు. అతడితో వచ్చిన నలుగురు లాంస్ నాయకుల కళ్లల్లో మెరుపులు మెరిసాయి. ముఖ కమలాలు విచ్చుకున్నాయి. నవ్వు పక్షిలా గెంతులు వేసింది.
జమీల్‌కి తల్లి చెప్పిన విషయం వినగానే ఏం చేయాలో అతడికి తెలియలేదు. మానవత్వం మంట కలిసింది అని అతడికి అనిపించింది. ఆమె నిస్సహాయత, ఆ కుటుంబంపై జరిగే హింస, ఆ కుటుంబం వారిని పెట్టిన యాతనలు పరాకాష్టనందుకున్నాయి. అందుకే ఆమె తక్కిన ఇద్దరు పిల్లలను రక్షించుకోవడానికి మమత ప్రేమల గొంతు నులిమేసింది.
‘‘జమీల్ రేపు మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడా?’ అతడు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ అడిగాడు.
ఆమె అవునని తల ఊపింది. వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె పిల్లలు ఆమెని పిల్లికూనలలాగా గట్టిగా పట్టుకుని బెదురుగా చూడడం మొదలుపెట్టారు. అబ్బూలోని దుఃఖం పెల్లుబికింది. గుండెలపై చేతులతో నిమురుకుంటూ ఆయాసపడసాగాడు.
ఇంట్లో గాలి వీయడం మానేసింది.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత