మంచి మాట

ముక్తికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతికి, ధర్మానికి మూలమైనది వేదం. వేదాధ్యయనం అందరికీ సాధ్యం కాదు గనుక వేదసారాన్ని కమనీయంగా కథలతో, కల్పనతో మేళవించి మహాభారతాన్ని అందించారు వ్యాసమహర్షి. పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన భారతంలో విష్ణు సహస్రనామ స్తోత్రం- భగవద్గీతలు అనర్ఘరత్నాలుగా చెప్పబడ్డాయి.
ఆదిశంకరులు భగవద్గీత స్తోత్రంలో ‘గేయం గీతా.. నామ సహస్రం’ అన్నారు. ఈ రెండింటిలోనూ గీత ఆచరణీయమైనది. సహస్రనామం సర్వజనులకు నిత్య పారాయణ యోగ్యమైనది. జగత్‌ప్రభువైన నారాయణుని కల్యాణ గుణాలను కీర్తించే స్తోత్రం కాబట్టి దీనిని అభిజ్ఞులు మహామంత్రమని అన్నారు. నిజానికి ఈ స్తోత్రంలోని మంత్రాలన్నీ మోక్షప్రదాలు.
మహాభారతం అనుశాసనిక పర్వంలో- కురుక్షేత్రంలో విజయం సాధించి పట్ట్భాషిక్తుడైనప్పటికీ మనశ్శాంతి లేని యుధిష్ఠిరునికి మహాభక్తుడైన భీష్మపితామహుడు అనేక రాజధర్మాలను తెలియజేసి, చివరకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించి మనశ్శాంతిని కలిగిస్తాడు. భీష్ముడు ధర్మరాజు ఉపదేశిస్తూండగా విని శ్రీకృష్ణుడు తన ఆమోదాన్ని ప్రకటిస్తాడు. కనుకనే విష్ణుసహస్రనామం ఆశ్రీతులకు కామధేనువుగా, కల్పవృక్షంగా చెప్పబడింది.
జాతి కుల మత భేదాలు లేకుండా అందరికీ ఆరాధ్యుడు, అత్యంత ప్రియుడు, సులభ సాధ్యుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు సర్వదేవతా స్వరూపుడు. ఆయనే పరతత్వం. అందుకే ఈ స్తోత్రంలో సూచించబడని దేవతలు లేరు. అన్ని నామాలూ నారాయణునికే వర్తిస్తాయని వ్యాసమహర్షి సుస్పష్టంగా తెలియజేశారు.
శంకర భగవత్పాదులు ప్రప్రథమంగా భాష్యం రాసింది విష్ణు సహస్రనామ స్తోత్రానికే. అనంతర కాలంలో శ్రీమద్రామానుజుల అంతేవాసి పరాశర భట్టాచార్యులు భగవద్గుణ దర్పణం అనే సార్థకమైన వ్యాఖ్యానం రచించారు. పిమ్మట ద్వైత సంప్రదాయానికి చెందిన సత్యానంద తీర్థులు విష్ణు సహస్రనామ భాష్యాన్ని విరచించారు.
మొత్తానికి ఎవరు ఏ రకంగా వ్యాఖ్యానించినా అన్నింటిలోనూ శ్రీమన్నారాయణుడి లీలా విశేషాలు, కల్యాణగుణాలు అందరూ ఆస్వాదించడానికి అనువైనవే. ఒక్క మాటలో చెప్పాలంటే లౌకిక ప్రపంచాకర్షణకు లోనై నిజతత్వాన్ని కోల్పోతున్న జీవుని దృష్టి పరమాత్మవైపు మరల్చడానికి విష్ణు సహస్రనామ స్తోత్రానికి మించింది లేదు.
విష్ణు సహస్రనామ స్తోత్రం మానవునకు కావాల్సిన శ్రేయస్సాధనకు, ప్రేమస్సాధనకు కూడా పనికొచ్చే మహామంత్రాల మాలగా పెద్దలు పేర్కొన్నారు. దీన్ని పారాయణం చేసే వ్యక్తి ఈ మాలను ఆను ధరించి, పరమాత్మకు అర్పిస్తాడు. దేశ కాల వస్తువులకు అందనివాడు, అనంతుడు అయిన శ్రీకృష్ణ్భగవానుని సహస్రనామాలతో ఏ భక్తుడు స్తుతిస్తాడో అతడు జన్మ సంసారం బంధనాలనుండి విముక్తుడవుతాడని, సకల శుభాలు ఆ భక్తునికి కలుగుతాయని అంటాడు. కృత త్రేతా ద్వాపర యుగాలలో, ధ్యాన యజ్ఞ అర్చనల చేత పొందగలిగిన ఫలితం కలియుగంలో నామ సంకీర్తనల వల్ల పొందవచ్చని చెబుతారు. యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని అని పరమాత్మే ప్రవచించాడు
కాబట్టి సర్వధర్మ శ్రీమన్నారాయణుని సహస్ర నామాలతో కీర్తించడం మానవుల పరమ ధర్మం.
ఈ స్తోత్ర పారాయణవల్ల జనన, మరణ, జరా వ్యాధి భయాలు ఉండవని, విష్ణు సహస్రనామ సోత్ర పారాయణం ముక్తికి సోపానమని శాస్తవ్రచనం.

-చోడిశెట్టి శ్రీనివాసరావు