డైలీ సీరియల్

బడబాగ్ని 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒక పని చేద్దాం. నీ దగ్గర వున్న అన్ని సాక్ష్యాధారాలతో ‘సాహూ’ మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇయ్యి.. ఇంతవరకూ జరిగిన మొత్తం హత్యలలో అతనే నేరస్థుడనీ, దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలూ కోర్టులో ప్రవేశపెడతామని అందులో వ్రాయి.. దాని ఆధారంగా అతనిని కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తారు. వాళ్ళు అతనిమీద ఇనె్వస్టిగేట్ చేసి నేరం రుజువైతే కోర్టులో ప్రవేశపెడతారు. అప్పుడు మన వాదన వినిపించి, సాక్ష్యాధారాలతో నిరూపించి అతనికి శిక్షపడేలా నే చేస్తా...’’ ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలిపాడు భగవాన్.
ఇంక ఆలస్యం చెయ్యలేదు రాహుల్.. చకచకా అన్ని వివరాలతో ఒక కంప్లైంట్ తయారుచేశాడు. దాని కాపి ఒకటి భగవాన్‌కి, ఒకటి మీడియాకి ఇచ్చాడు. ఒకవేళ సాహూ తమ డిపార్ట్‌మెంట్ మనిషి కనుక వాళ్ళు ఆ కంప్లైంట్ ఖాతరు చెయ్యకపోయినా, లేదూ సాహుకి ఉప్పంది కంప్లైంట్ మాయం అయి, తనని ప్రమాదంలో పడేసి తన ఉసురు తీసినా.. ఆ కేసు మళ్లీ నీరుగారిపోకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశాడు.. అతని కంప్లైంట్ ఆధారంగా సాహూని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ఇంటరాగేట్ చేసిన తరువాత, సేకరించిన సాక్ష్యాధారాలన్నీ అతని నేరాల్నీ బలపరుస్తున్నాయి కనుక అతనిని అరెస్టు చేసు కేసు కోర్టులో ఫైల్ చేశారు.
ఆ రోజు ఆ కేసు తొలి హియరింగ్... కేరళ నుంచి అనే్వష్, హైదరాబాద్ నుంచి అజిత్, హిమాచల్‌ప్రదేశ్ నుంచి అరుణ్ వచ్చారు.. ఈలోగా మీడియా ఇచ్చిన పబ్లిసిటీతో అదొక సంచలనాన్ని కలిగించింది.. నేరాలను అరికట్టే స్థాయిలో ఉండి తనే స్వయంగా నేరస్థుడైన సాహూ కేసు ఫాలో అవడానికి చాలామంది జనం కోర్టుకి వచ్చారు.. ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి.
సాహూ సంకెళ్లతో బోనులో నిల్చున్నాడు. కోర్టు సంప్రదాయాన్ని అనుసరించి భగవద్గీత మీద ప్రమాణం చేసి...
‘‘సాహూ అనే నేను దేముని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను..’’
‘‘మీ మీద ‘ఆరు’ హత్యల నింద మోపబడింది. దానికి మీ సమాధానం..’’ లాయర్ భగవాన్ సాహూని ప్రశ్నించాడు.
‘‘నేను చేసినవి రెండే హత్యలు. ఒకటి అమాయకుడైన అమర్, రెండు విధి నిర్వహణలో నా మీద దర్యాప్తు జరిపి నా నేరాల్ని వెలికి తీసిన కమల్..’’
‘‘అదేమిటి మరి మిగతావి ఎవరు చేసేరంటారు, మీరు చెయ్యలేదా..’’
‘‘అవి హత్యలు కావు. వాళ్ళు చేసిన తప్పులకి, పాపాలకీ వేసిన శిక్షలు..’’ నిర్లిప్తంగా చెప్పాడు సాహూ.
‘‘ఒక బాధ్యతాయుతమైన పొజిషన్‌లో ఉండి అలా నేరాలు చెయ్యడానికి మీరు సిగ్గుపడటంలేదా..’’
‘‘పడుతున్నాను.. వాళ్ళు చేసిన ఘోరానికి ప్రత్యక్ష సాక్షినై వుండి కూడా, ఒక పోలీస్ ఆఫీసర్ని అయి వుండి కూడా వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను, అంతకుమించి బాధపడుతున్నాను’’ పదునుగా ఉంది అతని జవాబు.
‘‘ఏమిటి వాళ్ళు చేసిన నేరం, ఎప్పుడు జరిగింది... ఆ నేరానికి సాక్ష్యం ఏమిటి..’’ అతనిని చూస్తూ సూటిగా ప్రశ్నించాడు లాయర్ భగవాన్.
‘‘చెబుతాను.. ఎప్పుడో జరిగిపోయినదే అయినా, యిప్పుడు తెలియడంవలన వచ్చే ఉపయోగం ఏమీ లేకపోయినా.. కాలంతోబాటు పెరుగుతూ వస్తున్న ఈ ఘోరాలు ఎంత ప్రమాదకరమైనవో, అవి ఎంతమంది జీవితాల మీద ఎంత దుష్ప్రభావాన్ని కలుగజేసి, జీవితాలను నాశనం చేస్తాయో, సమాజంలో ప్రేమ రాహిత్యాన్ని, నీతి రాహిత్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని రాక్షసత్వాన్ని ఎంతలా విస్తరింపజేస్తున్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కోసమైనా చెబుతాను. ప్రొద్దుట లేచి పేపర్ చూస్తే.. ఏ మూల చూసినా ఇవే వార్తలు.. కొంతమంది బాధపడి పేపర్ విసిరేస్తే.. ఇంకొంతమంది కాసేపు తిట్టుకుని వదిలేస్తే.. చాలామంది ఆ.. ఇది మామూలేలే అన్నంత నిర్లిప్తత.. మనం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం.. సరే విషయంలోకి వస్తా.. అవి నేను డిగ్రీ ఫస్ట్ యియర్ చదువుతున్న రోజులు.. చదువు, స్నేహాలూ, ఆడపిల్లలూ, ఏడిపించడాలూ.. ఆటలూ అన్నీ అన్నీ అందరి జీవితాల్లోనూ సర్వసాధారణం.. అలాగే నా జీవితంలోనూ.. మేము ఒరియా వాళ్ళమే అయినా మా తాతల కాలం నుండి ఆంధ్రాలో సెటిల్ అయ్యాం.. మాది విజయవాడ పక్కన పల్లెటూరు.. మధ్యతరగతి కుటుంబం.. నాన్నది సాధారణ సంపాదన. నన్ను బాగా చదివించాలనీ, మంచి ఉద్యోగస్థుడిని చెయ్యాలని. తన శక్తికి మించినదే అయినా నాన్న నన్ను విజయవాడ కాలేజీలో చేర్చి, హాస్టల్‌లో ఉంచి చదివించాలని అప్పు చేసి మరీ పంపాడు.. నేనూ అది గ్రహించి బాగా కష్టపడే చదివేవాడిని.. చదువులో ముందుండి, మంచి మర్యాదా కలిగి, కాస్తో కూస్తో అందగాడనైన నన్ను అమ్మయిలంతా ఇష్టపడేవారు. కానీ నేను మాత్రం ‘మల్లిక’నే యిష్టపడేవాడిని.. అందమైన తన నవ్వు, అమాయకమైన ఆమె కళ్ళు అంటే నాకు ప్రాణం.
చదువు, మల్లిక ఈ రెండే నా లోకం.. తనతో నువ్వంటే నాకు యిష్టం, నీకు నేనంటే యిష్టం..

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్