డైలీ సీరియల్

పూలకుండీలు - 43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైర్మన్ ఇంకేదో చెప్పబోతుండగా ఆయన టేబుల్ మీదున్న నాలుగు ల్యాండ్ ఫోన్లలో ఎర్ర రంగు ఫోన్ ‘ట్రింగ్ ట్రింగ్’ మంటూ మోగింది.
వెంటనే చైర్మన్ ఫోనెత్తాడు.
‘‘......’’
‘‘ఆ ఆ ఆలాంటిదేమీ జరగదులెండీ! మీ ఊరూ, పేరు ఎక్కడ బయటకు పొక్కకుండా చూసే పూచీ హండ్రెడ్ పర్సెంట్ మాదే. అయినా ఇంతలోకే ఈ విషయం ఎక్కడో అమెరికాలో వున్న మీకెలా తెలిసింది!’’ ఓ పక్క ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే మరో పక్క అవతలివాళ్ళకు భరోసా ఇస్తూ అన్నాడు చైర్మన్.
‘‘.....’’
‘‘అదీ నిజమేలెండీ! ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండడం మంచిదే’’ నవ్వుతూ ఫోన్లో వాళ్ళకు బదులిచ్చాడు చైర్మన్.
‘‘....’’
‘‘నేను మీతో తరువాత మాట్లాడతాను’’ పోలీసోడి ముందు ఎక్కువగా మాట్లాడగూడదన్న ఇంగితంతో ఠక్కున ఫోన్‌పెట్టేశాడు చైర్మన్.
‘‘కానీ, అప్పటికే తేనెపట్టు వాసన పసిగట్టిన ఎలుగుబంటి మాదిరిగా ఆ ఫోన్లో మాట్లాడుతున్నదెవరో, విషయమేంటో అర్థం చేసుకున్న ఎస్సై ‘‘సార్! మీ ప్రొఫెషన్ విషయాలు చెప్పగూడదనుకుంటే చెప్పొద్దుగాని, మీ కభ్యంతరం లేకపోతే మాత్రం వాళ్ళెవరో? వాళ్ళ నేపథ్యమేంటో ఏ సందర్భంలో వాళ్ళీ పద్ధతిన పిల్లలు కావాలనుకున్నారో? చెబుతారా?’’ అంటూ తన పోలీస్ గుణాన్ని చాటుకున్నాడు.
‘‘నెత్తురు వాసన చూసిన జలగా, అవినీతిని పసిగట్టిన పోలీసూ వాటి అంతు చూసేదాకా వదిలిపెట్టరు’’ అనుకున్న చైర్మన్ ఎస్సై వంక అసహనంగా చూశాడు.
అతని అసహనాన్ని అర్థం చేసుకున్న ఎస్సై ‘‘సరే ఇక ఆవిషయాన్ని వదిలెయ్యండీ!’’ తనలోనూ పొడుచుకొస్తున్న పోలీస్ అసహనాన్ని అదిమిపెట్టుకుంటూ అన్నాడు.
ఆ క్షణంలో ఎస్సై మనఃస్థితిని అర్థం చేసుకున్న చైర్మన్ అనివార్యంగా కొంత వెనక్కి తగ్గుతూ ‘‘మీరన్నట్టు వృత్తిపరమైన విషయాలు ముఖ్యంగా మాలాంటి మెడికల్ మ్యాటర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టగూడదు. అయినా మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి టూకీగా చెబుతాను. కాని, విన్నవిషయాన్ని విన్నట్టు ఇక్కడే మర్చిపోండి’’ అంటూ అర్థాంగీకారంగానే ఫోన్‌లో తనతో మాట్లాడిన వాళ్ళ తాలూకు విషయాన్ని వివరించడానికి తయారవుతూ ఇంటర్‌కమ్‌లో ‘‘రెండు కప్పులు కాఫీ పంపించండీ!’’ అంటూ తన సెక్రటరీకి చెప్పాడు.
మూడే మూడు నిమిషాల్లో టీ వచ్చేసింది.
టీ తాగిన తరువాత విషయాన్ని ఎలా చెప్పాలా అన్నట్టు కొంతసేపు కళ్ళు మూసుకుని ఆలోచించిన చైర్మన్ ఆఖరికి గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు.
14
రవికిషోర్ వాళ్ళది కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఏటూరు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లల తరువాత అతనొక్కడే కొడుకు. వాళ్ళకు కృష్ణానది ఒడ్డునానుకుని ఒకే చోట పాతిక ఎకరాల రేగడి చేనుంది. దాన్లో పత్తి, మిర్చి, దొరపొగాకు పండిస్తుంటారు. ఓ ట్రాక్టర్ ఇద్దరు జీతగాళ్ళు, ఐదారు పాడిగేదెలు మొత్తంమీద ఆ ఊళ్ళో కలిగిన కుటుంబాల్లో వాళ్ళది కూడా ఒకటి.
కిషోర్ టెన్త్‌వరకు నందిగామ డాన్‌బాస్కో హైస్కూల్లో చదివాడు.
టెన్త్ అయిపోగానే వాళ్ళ నాన్న అతణ్ణి విజయవాడ తీసుకెళ్లి లయోలా కాలేజీలో ఇంటర్‌లో చేర్పిండు.
ఇంటర్ తరువాత ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ కూడా అక్కడే పూర్తిచేసిన కిషోర్ ఎం.ఎస్.కోసం అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేరాడు.
ఎం.ఎస్. చేస్తుండగా అనితశ్రీతో పరిచయం అయింది.
అనిత అతనికన్నా ఓ సంవత్సరం సీనియర్.
అనిత వాళ్ళది నల్లగొండ జిల్లా తిర్మలగిరి మండలం ఫణిగిరి గ్రామం. తల్లిదండ్రులిద్దరూ గవర్నమెంట్ టీచర్స్. వాళ్ళకు ఇద్దరూ అమ్మాయిలే. వాళ్ళల్లో అనిత పెద్దది. అనిత చదువంతా వాళ్ళ మేనమామల ఊరు బోనగిరిలో జరిగింది. తనూ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లోనే ఇంజనీరింగ్ చేసింది.
ఇంజనీరింగ్ అయిపోయాక ‘ఎమ్.ఎస్. చెయ్యడానికి అమెరికా వెళ్తాను’ అంటూ తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.
అనిత నిర్ణయం విన్న వాళ్ళు ‘‘లేదు లేదు సూర్యాపేటలో తెలిసిన సంబంధం వుంది. పిల్లవాడు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఎ.ఇ.గా చేస్తున్నాడు. ఆ సంబంధం ఖాయం చేద్దామనుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
తల్లిదండ్రుల మాటలు విన్న అనిత ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ‘‘అదేంటి! నేనెప్పటినుండో ఎం.ఎస్. కోసం అమెరికా వెళతానని చెబుతూనే వున్నాను కదా, మధ్యలో ఈ పెళ్లి ప్రస్తావనేంటి?’’ అంటూ వాదనకు దిగింది.
‘‘అది కాదమ్మా! కాళ్ళ దగ్గరకొచ్చిన మంచి సంబంధాన్ని కాదని నువ్విప్పుడు అమెరికా వెళితే మళ్లీ అలాంటి సంబంధం దొరకొద్దూ? పైగా నీ తరువాత నీలూ వుంది. నీ పెళ్లి తరువాత దాని పెళ్లి కూడా చేసేస్తే మా బాధ్యతలు తీరిపోతాయి. ఆ తరువాత మేం ఎక్కడన్నా, ఏం చేసినా కోనాయ్ అనేవాడుండడు’’ అంటూ చెప్పుకొచ్చారు అనిత తల్లిదండ్రులు.
వాళ్ళ మాటలు విన్న అనిత మరింత కోపంగా ‘‘ఇంత చదువు చదువుకున్నాను. పైగా ఇద్దరూ టీచర్స్ జాబ్ చేస్తున్నారు. ఇలాగేనా మాట్లాడేది! పెళ్ళనేది నా జీవితానికి సంబంధించిన విషయం. నా జీవిత భాగస్వామిని నేనే ఎన్నిక చేసుకోవాలి గాని మీరు చూపించినవాడి ముందు కూర్చుని గంగిరెద్దులా తలవూపుతూ తాళి కట్టించుకోవడం నా వల్ల కాదు. అన్ని రకాలుగా నాకు నచ్చిన వాణ్ణి ఎంచుకొని అపుడు పెళ్లి చేసుకుంటాను.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు