డైలీ సీరియల్

బంగారుకల 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా అనకు అమ్మూ! మనతో వచ్చేది డ్రైవర్ కం గైడ్. నేను ఆర్కియాలజీ విద్యార్థినే! అయినా మనం చదువుకోని ఎన్నో విషయాలు స్థానికులకు తెలుస్తాయి...’’ నవ్వాడు.
‘‘వాటి ఆధారాలుంటాయా?’’ అనుమానంగా అడిగింది.
‘‘ఉండకపోవచ్చు.. కానీ జనశ్రుతిలో పుట్టిన కథలుండొచ్చు...’’
‘‘అసలు భారతదేశ చరిత్రే సరిగ్గా రికార్డు కాలేదంటారు. పోర్చుగీసు యాత్రికులు, బ్రిటీషు చరిత్రకారులు, శిలాశాసనాలు, సాహితీ గ్రంథాలు ఇవే కదా మన చరిత్రకు ఆధారాలు.’’
‘‘నిజమే!’’ ఒప్పుకున్నాడు అభిషేక్.
‘‘మనవాళ్ళు సరిగ్గా అన్నీ రికార్డు చేసి ఉంటే మనకి ఇంకెంత విలువైన సమాచారం తెలిసేదో! నాకు మాత్రం విజయనగర సామ్రాజ్యం గురించి ఇంత అభిమానం పెరగటానికి కారణం నువ్వే అభీ! నేను తెలుగు లిటరేచర్ విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయల సాహితీ ప్రియత్వం, కవిపోషణ, ఆ కవుల గురించి వాళ్ల కావ్యాల గురించి చదువుకున్నాను. కానీ నీలా విజయనగర సామ్రాజ్య శిథిలాల వెనుక దాగిన చరిత్ర పునాదుల నుంచి తెలయదు. నీ మాటల్లో నేను ఆ ‘స్వర్ణయుగం’ మళ్లీ చూశాను. ఈ హంపీ గురించి మనిద్దరికీ ఎందుకింత ప్రేమ అభీ!’’’
అతని చేయి తన చేతిలోకి తీసుకొని అడిగింది అమృత.
‘‘తెలీదు అమ్మూ! కారణం ఇదని చెప్పలేను. మేం ఈ ప్రాంతం వాళ్లమేననీ, మా పూర్వీకులు తెలుగునాడుకు వలస వెళ్లారని అమ్మ చెప్పేది. అయినా రాయల పాలనలో తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాలున్నాయని అందరికీ తెలుసు.
‘‘మరి అలా ఎందరో ఉంటారు. నీకు మాత్రం ఎందుకింత ఇది’’
‘‘ఏమో! చిన్నప్పట్నుంచీ శ్రీకృష్ణదేవరాయల పేరు వింటే నా మనసు పులకరించేది. హంపీ విజయనగర సామ్రాజ్యం నేపథ్యం గల సినిమాలు గానీ పాటలు చాలా ఇష్టంగా అన్పించేవి. శ్రీకృష్ణదేవరాయల అసలు చిత్రపటం లభ్యం కాలేదు గానీ లేకపోతే రాయల చిత్రం చూస్తే అది ఏ జన్మలోనైనా గుర్తించగలను’’ అభిషేక్ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు.
‘‘నాక్కూడా అంతే అభీ! విచిత్రంగా లేదూ! మనిద్దరి అభిరుచి ఒకటే కావటం’’ నమ్మలేనట్టు చూసిందామె.
‘‘అవును. కొన్నిసార్లు జన్మాంతర సంస్కారాలు వెంట వస్తాయి. అందుకే నర్తకిగా నువ్వు, గాయకుడిగా నేను కళ పట్ల సహజాభిమానంతో ఉన్నాం. ఇది మన జన్మాంతర హృదయ ధర్మంగా ఉంది’’.
‘‘మనం ఈ హంపీ విజయనగర సామ్రాజ్య ఆత్మని పూర్తిగా స్పర్శించే లోపు ఇన్నాళ్ళూ నాకు చూపించాలని నువ్వు కలలుగన్న ఈ పుణ్యస్థలం గురించి కొంచెం చెప్పు అభీ!’’
‘‘అలా అయితే ప్రస్తుతానికి నేనే నీ గైడ్‌ని, విను’’ అంటూ అభిషేక్ ఏదో ప్రపంచంలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆర్కియాలజీ స్టూడెంట్‌గానే కాదు, ఈ మట్టిగురించిన జ్ఞాపకాలతో అతని మాటల్లో ఆ మట్టి బంధం పరిమళిస్తోంది.
‘‘నీకు తెలుసా అమ్మూ! ఇందాక మనం అనుకున్నట్లు మన వాళ్ళు రాసిన ఆధారాలే కాదు... ‘రాబర్ట్ సీవెల్’ అనే ఆంగ్ల ప్రభుత్వాధికారి ‘‘ద ఫర్‌గాటన్ ఎంపైర్’ పేరుతో ఈ మట్టిలో కలిసిన విజయనగర సామ్రాజ్యం అనే మాణిక్యాన్ని వెలికితీసేదాకా మనకెవ్వరికీ దీన్ని గురించి తెలియలేదు’’
‘‘అయ్యో! ఇప్పటికీ పూర్తిగా తెలీదని నువ్వే అన్నావోసారి’’
‘‘అవును. శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులు బళ్లారివారంటారు. ఈ రాజ్యాన్ని సంగమ, సాళు, తుళువ, ఆరవీటి వంశాలు పాలించారు. రాయలు తుళువ వంశీకుడు. రాయల తాత ఈశ్వర నాయకుడు, తల్లిదండ్రులు నాగాంబ, నరసరాయలు. నరసనాయకుని పెద్దకొడుకు వీరనరసింహరాయలు. ‘సాళువ’ వంశాన్ని కూలదోసి రాయి తుళువ వంశాన్ని ప్రతిష్ఠించాడు. అతని మరణం తర్వాత తిమ్మరసు సహాయంతో శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక సింహాసనానికి క్రీ.శ.1509లో అధిపతి అయ్యాడు.
‘‘ఈ తిమ్మరసుకేగా తర్వాతికాలంలో రాయలు కళ్ళు పీకించింది’’ అమృత ఉద్విగ్నంగా అడిగింది.
‘‘అవును!’’ విచారంగా చెప్పాడు అభిషేక్.
‘‘మరి కుందేళ్ళు వేటకుక్కల్ని తరమటం హరిహరరాయలు బుక్కరాయలు విద్యారణ్యస్వామి కథ?’’ అర్థంగానట్లు చూసింది.
‘‘నువ్వు విన్నది సరైన ఐతిహ్యమే! దక్షిణాపథంలో తెలుగుల కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక అక్కణ్నుంచి పారిపోయి హరిహర బుక్కరాయలనే అన్నదమ్ములు విద్యారణ్యస్వామి ఆశీస్సులతో ఈ స్థల ప్రభావం గుర్తించి ఇక్కడ సామ్రాజ్య స్థాపన చేశారని ప్రతీతి. కొందరయితే ఆ కాలానికి విద్యారణ్యస్వామి లేరనీ, విజయనగర రాజగురువు క్రియాశక్తియోగి అనీ అంటారు. ఏదయితేనేం ఇంతటి కళావైభవాన్ని సంతరించిన ఆ పాలన మరుపురానిది. మహనీయమైనది కదా!’’ అభిషేక్ మాట పూర్తి అవుతూనే రూం అటెండంర్ కాలింగ్ బెల్ కొట్టాడు.
అమృత తలుపు తీసింది.
‘‘వెహికల్ రెడీ మేడమ్!’’ చెప్పేసి వెళ్లిపోయాడతడు.
అమృత అభిషేక్‌లు కార్లో కూర్చున్నారు. అమృత బ్యాగ్‌లో కెమెరా, బైనాక్యులర్స్, సెల్, వాటర్ బాటిల్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకుంది.
కొత్త మోడల్ ఎసి కారు, కొత్తగా పెళ్లయిన జంట, పాత వైభవాన్ని చూడటానికి బయలుదేరారు. దోవలో పడిపోయిన ప్రాకారాలు, శిథిలమైన కట్టడాలు కన్పిస్తున్నాయి. అభిషేక్ వాటి దగ్గర రెండు నిమిషాలు కారాపి ఫొటోలు తీసుకుంటున్నాడు. ఆ మొండిగోడలను ఆత్మీయంగా తడుముతున్న అభిషేక్‌ని చూస్తుంటే అమృతకి విచిత్రంగా అన్పించింది. మనిషి హృదయం ఎంత గొప్పది. ఎంతగా స్పందిస్తుంది. ఒక్కొక్క మనిషి జీవమున్నా రాయిలాగే ప్రవర్తిస్తుంటాడు. కొందరు సున్నిత మనస్కులు రాళ్ళల్లో కూడా ప్రాణాన్ని చూస్తారు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి