డైలీ సీరియల్

బంగారు కల - 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతకి కృష్ణశాస్ర్తీగారి పాట గుర్తొచ్చింది.
‘‘రాల లోపల పూలు పూచిన
రామ మందిర లీల
ఆరామ సుందర హేల
రాలలో హదృయాలు మ్రోగిన రాచకేళీశాల
ఆరామమందిర లీల
నిన్నటిదా మరి మొన్నటిదా ఆది
ఎన్ని జన్మల గాధ!’’
పాటని హమ్ చేస్తూ అభిషేక్ చేయి పట్టుకొని ఆ ప్రాచీన శిథిలాల్లో తిరుగుతుంటే అమృతకి గమ్మత్తుగా అనిపించింది. హంపీ శిథిలాల మీంచి గెంతుకుంటూ వెళ్తున్నాయి కోతుల గుంపులు. కొన్ని పిల్ల కోతులు ఆగి వీళ్ళ చేతుల్లో ఏమైనా తినే వస్తువులున్నాయేమో లాక్కుని పోదామని చూస్తున్నాయి. అభిషేక్ గాగుల్స్ చూసి వెక్కిరించిందో పిల్లకోతి. మళ్లీ ఇంతలోనే తల్లి పొట్ట కరచుకొని వెళ్లిపోయింది. సృష్టిలో ఏ ప్రాణికైనా మాతృత్వం అనే వరాన్ని భగవంతుడు ఇవ్వకపోతే ఈ కాస్త ప్రేమ, కరుణ కూడా మాయమైపోయేవేమో!
‘‘అమ్మూ! ఇటు చూడు. గత వైభవదీప్తికి చిహ్నాలుగా ఈ ప్రాకారం మీద అద్బుత శిల్పాలు. ఇది రాయల రాజముద్ర. ఈ అందమైన స్ర్తిమూర్తి మొహాన్ని ఇలా చెక్కేయటానికి దాడిచేసి ఆక్రమించిన ఆ దురాత్ములకి మనసెలా ఒప్పిందో! ఏ శిల్పి కలగని ఈ శిల్పాన్ని చెక్కాడో, ఇప్పుడీ శిల్పాన్ని చూస్తే ఆ శిల్పికి గుండె ముక్కలవదూ...’’
అమ్మూ! ఇటు చూడు కొండకు కొండ కొక్కేలు వేసినట్లు బారులు తీరి ఇంత పటిష్ఠంగా ఉన్న ప్రాంతం కాబట్టే విజయనగర రాజులు దీనిని రాజధానిగా కోట కట్టారు. ఇపుడు బీటలు వారిన వీటిని చూస్తుంటే కొడాలి సుబ్బారావుగారి ‘హంపీక్షేత్రం’లో ఆ పద్యమే గుర్తొస్తున్నది.
‘‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లో ...........................’’
అంటూ మధురంగా అభిషేక్ పాడిన ఆ పద్యానికి అమృత పరవశించి పోయింది. అతని కంఠం అచ్చంగా ఘంటసాల గళమే! అదే భావోద్దీపన. అందుకే ఆ పాట వినేవాళ్ళ హృదయాలలో తిష్టవేసుకుంటుంది. అమృత కళాహృదయం దోచుకున్న గాయకుడు అభిషేక్. ఆమెకి ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు అతని పాట.
‘‘అమృతా! కొడాలివారు ఈ హంపీ చూసే అంత గొప్ప కావ్యం రాశారు! మరి నువ్వేం రాస్తావు!’’ అభిషేక్ కవ్వించాడు.
‘‘నేను హంపీలో మన ప్రేమ కావ్యానికి మారాకు తొడిగిస్తాను’’ అమృత గుసగుసలాడింది.
విజయనగర సామ్రాజ్య వైభవ ద్వారంలో అడుగుపెట్టిన ఆ దంపతులకి కళ్ళముందున్న శిథిల కట్టడాల నుంచి నాటి విజయనగర శోభ మనోహర కథన దృశ్యంగా సాక్షాత్కరించింది.
***
సప్తప్రాకార పరివేష్టితమై ఆదర్శ ప్రావీణ్యంతో కట్టబడిన అరవై మైళ్ళ చుట్టుకొలత వున్న ఆ పట్టణం మొదటి కోటగోడ వరస హాస్పేట్‌కి ఆగ్నేయంగా రెండు కొండలు కలిసే చోట ఉంది. మొదటి ప్రాకారంనుంచి మూడో ప్రాకారం వరకు, పొలాలు, తోటలు. రెండవది హాస్పేట్‌లో ఉంది. దానికి ఉత్తరంగా మూడోది, మలపనహోగుడి గ్రామానికి దక్షిణాన నాల్గోది. దానికి ఉత్తరంగా కన్పించేది ఐదోది. కమలాపురం చెరువుకు దక్షిణాన ఆరోది. నిలిచి వున్నది ఏడోది. ఇదే అంతర్భాగ ప్రాకారం. నిరంతరం కట్టుదిట్టమైన పహారాలతో ‘మూరురాయలగండ’ శ్రీకృష్ణదేవరాయలు అమిత ధీశక్తిశాలి తిమ్మరుసు మహామంత్రి చల్లని నీడలో విలసిల్లుతోంది. ఈ ప్రాకారాల లోపలే నగరానికి కావలసిన సర్వసంపదలు నెలకొని ఉన్నాయి. అందుచేత కోట తలుపులు మూసివేసినా ఎవరికీ ఎటువంటి కష్టం కలుగదు.
రాజభవనానికి దగ్గరలో ఎదురుగా నాల్గు విపణి వీధులున్నాయి. ఆ వీధులలో పురుషులంతా సమస్త వస్త్రాలంకార భూషితులయి కన్పిస్తున్నారు. వీధుల్లో రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్ముతున్నారు.
రక్షక భటులు గుర్రాలపై హడావుడి చేస్తూ వచ్చారు. తొలగండి.. తొలగండి..
ప్రజల మధ్యనించి మార్గం ఏర్పడింది.
గుర్రాలు ఆగాయి. రాజోద్యోగి దిగటంతో అంతా భయభక్తులతో లేచి నిలిచారు. ఆయన ఒక వర్తకుని వద్దకు వెళ్లి
‘‘మీ వర్తకం బాగా జరుగుంతోందా!’’ గంభీరంగా అడిగాడు.
‘చిత్తం’ వర్తకుడు గౌరవంగా బదులిచ్చాడు.
‘‘బీజాపూర్‌తో యుద్ధం జరిగింది. తెలుసు కదా మన సైన్యం కుటుంబాలకు ఆర్థిక సాయానికి’’ అర్థోక్తిలో ఆగాడు.
‘‘చిత్తం!’’
‘‘మహామంత్రులవారు రేపు సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటుచేశారు మీరంతా’’
‘‘చిత్తం! ఏలినవారి కృప’’
వర్తకుల రాజభక్తి ఆ సమావేశంలో మణి మాణిక్యాల రూపంలో ప్రతిఫలించింది.
విజయనగర సామ్రాజ్యంలో రాయల పాలన వచ్చాక ముందు అంతశ్శత్రువుల్ని సరిచేయటం జరిగింది. మహామంత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో తిమ్మరుసు ఇలా చెప్పాడు.
‘‘అధికారులు సత్యాహింసలు, నీతి సూత్రాలకు కట్టుబడి ఉండాలి. మనం పోర్చుగీసువారితో స్నేహం చేసి వారివద్ద గుర్రాలు, తుపాకులు, ఆయుధాలు కొంటున్నాం. సైన్యానికి వివిధ భాగాల్లో శిక్షణ ఇచ్చాం. అశ్వారోహకులు, గజారోహకులు, విలుకాండ్రు, సైనికులు అంతా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మన ప్రభువు కూడా యుద్ధ విద్యలో అసమానులే!
ఆయన జగజెట్టి, వీరుడు. తాను స్వయంగా సైన్యం ముందుండి నడిపిస్తారు. మన ప్రభువు ప్రతివిజయానికి మన వంతు కర్తవ్యం నెరవేర్చాలి.’’
కాదంటే బతకలేరు అనే కఠోర హెచ్చరిక అందరికీ తెలుసు. తిమ్మరుసు మహామంత్రి మేథో కుశలత ఆ ప్రముఖులకి తెలియంది కాదు.
***
దృశ్యాన్ని కళ్ళకు కట్టించిన ఆ శిథిల వైభవాన్ని చూస్తూ కారులో ముందుకు కదిలారు అభిషేక్ అమృతలు. అభిషేక్ కళ్ళతో చూసినట్లుగా అమృతకు చెప్తున్నాడు.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి