డైలీ సీరియల్

బంగారుకల- 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమృతా! అటు చూడు! అక్కడ రాయలవారి అంతఃపురం వుండేది. దాని చుట్టూ ఇది విశిష్టమైన మహానగరంగా నిర్మితమైంది. సుమారు ఏడు మైళ్ళ చుట్టుకొలత కలిగి బలిష్ఠంగా యాభై అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పు గల ప్రాకారం ఉండేది. దీని ప్రధాన ద్వారాన్ని ఇరవై వేల మంది అశ్వికులు రాత్రింబవళ్ళు కాపలా కాసేవారు.
‘‘అభీ! కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం అని ప్రసిద్ధి కెక్కింది గదా!’’
‘‘అవును అమ్మూ! రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అద్భుతమైన సంపదలతో వెలలేని అమూల్య అరుదైన వస్తువులతో దేవలోకంలా ఉండేది. దేనికీ లోటు లేక శాంతి సౌభాగ్యాలతో తులతూగేది. ఇదంతా కేవలం రాయల ప్రతిభ మాత్రమే కాదు. అప్పాజీ మేధస్సు కూడా! వివిధ కార్యక్రమాలతో కృష్ణదేవరాయలు నిమగ్నమై ఉంటే తిమ్మరుసు మహామంత్రి తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో రాజ్యపాలనను నిర్వర్తిస్తూ రాయలను, రాజ్యాన్ని రెండు కళ్ళుగా చూసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి చెప్పేటపుడు తిమ్మరుసు గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే!’’
కారు మళ్లీ ఆగింది.
అభిషేక్ ఆ ప్రాంతమంతా చిరపరిచితమైనట్లు సొంతింట్లో నడుస్తున్నట్లు అనుభూతి చెందటం అతనికే విచిత్రంగా అన్పిస్తుంది. అతను వరుసగా ఒక్కొక్క స్థలాన్ని చూపిస్తూ రాయల స్వర్ణయుగాన్ని మళ్లీ అమృత కనుల ముందు ఆవిష్కరించాడు.
‘‘శ్రీమద్రామాయణంలో వాల్మీకి వర్ణించిన కిష్కింధ ఈ హంపీయే. తుంగభద్రా నదీ తీరంలో కిష్కింధ ముఖ్య పట్టణంగా ఆనెగొంది కలిపి ‘వానరధ్వజ’మనే పేరుతో విలసిల్లాయి. నగరాన్ని భద్రంగా కాపాడే ఐదు పర్వతాలు మాతంగం, మాల్యవంతం, హేమకూటం, బసవశృంగం, కిష్కంథ. వీటిలో మాతంగం సుగ్రీవుడెక్కటానికి సాధ్యమైంది. వాలి దీనిని ఎక్కలేకపోయాడని రామాయణ శృతి. వాలి, దుందుభుల గుహ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది.
రావణాసురుడు సీతని చెరపట్టి ఆకాశ మార్గాన తీసికెళ్లినపుడు ఆమె నగలు మూట కట్టి ఇక్కడి పంపా సరోవరం ఒడ్డున పడేసింది. శ్రీ విరూపాక్ష దేవాలయంలో వున్న ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశిగా వర్ణిస్తారు. కన్నడంలో ‘పాలు’ అనే పదాన్ని ‘హాలు’ అంటారు. ‘పంపా’ అనే పదం ‘హంపా’, ‘హంపీ’గా రూపాంతరం చెందింది. హనుమంతుడు పుట్టిన హనుమత్పర్వతం కన్పిస్తుంది. వాలిని శ్రీరాముడు దహనం చేసిన ‘వాలి కాష్టం’ ఇక్కడ ఉంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో హంపీ రథోత్సవం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు ఈ ఉత్సవానికి వస్తారు.
శిథిల కట్టడాలు, రాతి గుళ్ళు, శిలాకనుమలు, కరకులోయలు, నిర్జన వీధులు, శిథిల దేవాలయాలు, నదిలోంచి వచ్చే కాలువలు, చెరకు, అరటి తోటలతో కన్పించే ఈ హంపీ పట్టణంలో నాటి రాయల ప్రాభవం ఈ శిథిలాల నేపథ్యంలో ఈ పట్టణం ఎంత ఉజ్వలంగా వెలిగిందో కదా’’ తన్మయంగా చెప్పాడు అభిషేక్.
‘‘అవును అభీ! ఈ దేవాలయం పేరేంటి? ఇంతటి శిల్ప కళతో చాలా సంపన్నంగా ఉంది’’, అమృత ఒక పెద్ద దేవాలయం గోడలమీది శిల్పకళను తనివితీరా చూస్తూ అడిగింది.
‘‘ఇది పట్ట్భారామ దేవాలయం. ఇక్కడనుంచి కమలాపురం దాదాపు ఒక కిలోమీటరుంటుంది. ఇది అచ్యుతరాయల నిర్మితం. దీనికి దగ్గరే తుంగభద్రా ప్రాజెక్టు పెద్ద కాలువ ఉంది. ఇక్కడ ఇలాంటి దేవాలయాలన్నీ దీర్ఘ చతురస్రంగా గానీ సమ చతురస్రంగా గానీ ఉన్నాయి. ఐదు కక్ష్యాంతరాలుగా బహిర్ ద్వారం, రంగమండపం, అర్థమండపం, అంతరాళ మండపం, గర్భగృహం అనే పేర్లతో కన్పిస్తాయి. బహిద్వారం ఉపరితలంలో గోపురం వుంటుంది. దీనినే ‘రాయల గోపురం’ అంటారు. ద్వారానికి రెండు వైపులా శిల్పాకృతులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపం సమ చతురస్ర స్తంభాల మండపాలు కన్పిస్తాయి. దేవతా శిల్పాలంకరణలు సర్వ సామాన్యం. గర్భగుహలో ఏ అలంకరణా ఉండదు. పైభాగంలో పరిణతి పొందిన తల విమానం ఉంటుంది. అధిష్ఠానం, పట్టిక, తలం, శిల్పం, పట్టిక పైన కలశం.. ప్రతిభావంతమైన శిల్పాచార్యుల పర్యవేక్షణలో రాయల కాలంలో కట్టుబడిన అనేక దేవాలయాలున్నాయి. పెనుగొండ, లేపాక్షి, కంబ, కదిరి, మధుర, తంజావూరు మొదలైనచోట్ల విజయనగర శైలికి సంబంధించిన వాస్తు కన్పించింది.
ఈ దేవాలయమే కాదు హంపీలో పంపాపతి స్వామి, చక్రతీర్థంలో కోదండ రామస్వామి, విఠలస్వామి దేవాలయాలు ఇలాంటివే!
‘‘అభీ! ఇవన్నీ ఎప్పుడో చూసినట్లన్పిస్తుంది. నేను మొదటిసారి ఇప్పుడేగా వచ్చానిక్కడికి’’ ఆశ్చర్యంగా అడిగింది అమృత.
ఆమె చేతిని సున్నితంగా ప్రేమగా పట్టుకున్నాడు అభిషేక్.
‘‘అమృతా! పద! ఆ మండపంలో విశ్రాంతిగా కూర్చో.. ఆ... ఈ నీళ్ళు తాగు. కళ్ళకి కన్పించినంత మేరా సువిశాలంగా కన్పించే ఈ హంపీ విజయనగర పట్టణంలో మనం ఉండేవాళ్ళమని నాకు చాలాసార్లు అన్పించింది. గత జన్మలు నమ్ముతావో లేదోనని నీతో అనలేదు. ఇపుడు నీక్కూడా అలాగే అన్పిస్తుందంటే మనకి ఈ హంపీకి ఏదో ఆత్మబంధం ఉంది. అమ్మూ! ఇది మనకి చిరపరచితమైన నగరమే! ఈ వీధులు మనం తిరిగినవే! నీకు ఒక్కొక్కటి గుర్తుచేస్తూ రాయలవారి కాలంలోకి తీసుకెళ్తున్నాను. ఇలా నా హృదయానికి నీ అరచేతిని ఉంచు’’ వివశంగా కళ్ళు మూసుకున్నాడు.
ఆమె అలాగే చేసింది.
ఇద్దరూ విజయనగర సామ్రాజ్య వైభవోన్నతికి కారకుడైన ప్రభువు శ్రీకృష్ణదేవరాయల పాలనలో పౌరులుగా రాయల ఆదరణ చూరగొన్న కళాకారులుగా, శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగ అనుభవాలనూ, గతజన్మ జ్ఞాపకాలనూ నిశ్శబ్దంగా మననం చేసుకుంటున్నారు. అదొక విచిత్ర కాలసంయోగం.
***

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి