డైలీ సీరియల్

బంగారుకల - 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజబంధువుగా హంపీలో అతడు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ అన్నపూర్ణాదేవి బంధువు కాబట్టి ఆమె ఎక్కడ ఉన్నా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాడు’’ మంజరి వీరేంద్రుని కుబుద్ధిని అసహ్యించుకుంది.
‘‘పద్మమహల్ అంటేనే ప్రశాంత సరోరం వంటిది. రాణివాసం స్ర్తిలు చల్లదనానికి ఆ సుందర ప్రదేశంలో విడిది చేస్తారు. వీరేంద్రుని పాదస్పర్శతో అక్కడ తాపమే పెరుగుతుంది’’ చంద్రప్పకి కోపంగా అన్నాడు.
‘‘అంతే జరిగింది. ఆనాడు కూడా వీరేంద్రుడు అన్నపూర్ణాదేవితో ‘రాయలు తిమ్మరుసుకు బానిస’ అన్నాడు’’ వ్యంగ్యంగా మంజరి చెప్పింది.
‘‘ఆ! అంత మాట మన దేవేరిగారు సహించారా’’ చంద్రప్ప సందేహం.
‘‘ఆమె అసహనాన్ని ఇతడు గణించడు’’.
‘‘రాయలవారిని కళ్ళు పీకించి చంపమని రాజాజ్ఞ అయినా తిమ్మరుసు వారు ఒక ఆడ మేక కళ్ళు రాజుగార్కి చూపించి రాయలవారిని రక్షించి తమ ఇంట రహస్యంగా దాచి, విద్యలు నేర్పి ఉపాయంతో ఈ విజయనగరాధీశుని చేశారు. తన శక్తియుక్తులన్నీ వెచ్చించి ఈ విశాల సామ్రాజ్యాన్ని సువర్ణమయం చేశారు. మనం ఇంత ఐశ్వర్యాలతో తులతూగుతున్నామంటే అప్పాజీ వారి దయ కదా’’ చంద్రప్ప వేదన చెందాడు.
‘‘అవును రాయలవారికీ సంగతి తెలుసు గానీ నిన్న మొన్న వచ్చిన అన్నపూర్ణాదేవికేం తెలుసు’’ మంజరి విచారించింది.
‘‘ఎందుకు తెలియదు. ఆమె పతిననుసరించి నడుచుకునే సాధ్వి’’ నమ్మకంగా అన్నాడు చంద్రప్ప.
‘‘నిజమే! ఈ వీరేంద్రుడు ఎంతటి వారినైనా పడగొట్టగలడు. ఇప్పటికే అంతఃపురంలో వాడంటే అందరికీ భయమే! అన్నపూర్ణాదేవిగారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు’’ మంజరి గొంతులో బాధ ధ్వనించింది.
‘‘రాయలవారి మనసును కూడా విరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. తిమ్మరుసులవారు ఏదో ఒకటి చేసి వాడినీ రాజ్యం నుంచి వెళ్లగొడితే బావుండు’’ చంద్రప్ప ఆశ.
‘‘రేపటి సాయంత్రం తులామానం జరుగుతుంది. ప్రభువులవారు విజయయాత్ర ముగించిన ఉత్సవంలో భాగంగా ఈ తులామానం జరగటం నీకూ తెల్సు. ప్రభువు వదాన్యులై అందరికీ తులలేని రత్న మాణిక్యాలు తమ ఎత్తు తూచి పంచుతారట’’ మంజరి సంతోషంగా అంది.
‘‘అదే ప్రభువు గొప్పతనం. దీనికి తిమ్మరుసులవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. వీరేంద్రుడేమిటి ఇటువంటి వారెందరైనా తిమ్మరుసులవారి బుద్ధిబలానికి తలొంచవలసిందే’’ చంద్రప్ప సవాలుగా అన్నాడు.
‘‘పద! వీరేంద్రుడు ఇటుకేసే వస్తున్నాడు. వాడి ఆలోచన దురాలోచన కాకుండుగాక’’.
ఇద్దరూ పూల పొదల మాటునుంచి వడివడిగా అక్కడనుండి నిష్క్రమించారు.
***
రాయలవారి తులామానం జరుగుతోంది. ఒకవైపు రాయలవారు త్రాసులో ఆసీనులైనారు. రెండు ఏనుగుల నిలువుల ఎత్తున్న ఆ తులాదండం రెండోవైపు త్రాసులో నవరత్నాలు రాశులుగా పోశారు. రాయలవారి చిరునవ్వు చంద్రికల సాక్షిగా ఆ రత్నాలు, ముత్యలు, పగడాలు, విలువైన మాణిక్యాలు బ్రాహ్మణులకు, బారులుతీసిన పౌరులకు దేవేరుల చేతులమీదుగా పంచి పెడుతున్నాడు.
వంధిమాగధులు రాయలవారి వితరణను వేనోళ్ల కొనియాడారు. కవి సత్తములలో ఒకరీవిధంగా రాయల తులామానాన్ని శ్లాఘించారు.
ప్రథిత విద్యానగర ప్రాజసామ్రాజ్య
శౌర్యలక్ష్మికి జిత్తశాంతి గాగ
సకలార్త పోషణోత్పుక విరూపాక్షుని
ధన్యకీర్తికి దోహదంబుగా
మజ్జన మాత్ర సమస్తాఘ భంజక
భద్రాంబు చయము సాఫల్యమంద
గజపతీంద్రోగ్ర సంగర జయోపార్జిత
ధన మహాలక్ష్మి సార్థక్య మంద
ఘటిత విత్తము రాజ్యోపకారి తనువు
సమత దాల్పగ శ్రీకృష్ణ జనవరుండు
తగదులామనమున సంచితమ్ము సేసి
జనుల కిప్పించె సతుల హస్తముల చేత
మహారాజు తెల్లని వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలపైన బంగారు గులాబీల అల్లిక ఉంది. విశేషంగా నగలు అలంకరించుకున్నారు. రాజలాంఛనాలతో నిలిచిన ఆయన ఇరుపక్కలా దేవేరులున్నారు. అప్పాజీ, రామలింగనాయకుడు ఉచితాసనాలపై ఉన్నారు. కొంచెం వెనుకగా ఇద్దరు సేవకులు బంగారు రేకు తాపడం చేసిన చామరాలతో వీస్తున్నారు. ప్రత్యేక సింహాసనంమీద ఆసీనుడైన శ్రీకృష్ణదేవరాయలు తులామాన ఉత్సవాన్ని సంతృప్తిగా చూస్తున్నారు. తులాదండంపై రాజు ఇద్దరు దేవేరుల శిలారూపాలు భవిష్యత్ తరాలవార్కి రాయల వదాన్యత తెలిపే సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
రాజ ప్రముఖుడు కృష్ణదేవరాయలకు అభివందనం చేశాడు.
‘‘గోవా గవర్నరు ఏమన్నాడు’’ మంత్రి ప్రశ్నించాడు.
‘‘ఒక గొప్ప మేస్ర్తిని పంపారు అమాత్యా! కానీ ఆ రెండు కొండల మధ్య సరస్సు కోసం గోడను నిర్మించటానికి సున్నం సిద్ధం చేయమని చెప్పాడు’’ రాజప్రముఖుడు చెప్పాడు.
తిమ్మరుసు మంత్రి నవ్వారు.
‘‘సున్నమా! అది మనం ఎరుగనిది. సరే! మనమే పెద్ద పెద్ద శిలలు తెప్పించి లోయలో గోడను నిర్మింపజేస్తాం. రెండు కొండలమధ్య ఆ సరస్సు వల్ల ప్రజలకి భూసాగుకు వీలవుతుంది. ఆ గోడ నిర్మాణానికి ఏర్పాట్లు చూడండి’’ రాయలు తిమ్మరుసుకు కనుసైగ చేశారు.
ఆ రాజప్రముఖుడు అంగీకార సూచనగా రాజుకు అభివాదం చేసి వెళ్లిపోయాడు.
‘‘అప్పాజీ! మన రైతులు గోధుమ, వరి, జొన్నగాక ఇంకేం పండిస్తున్నారు?’’ రాయలు ఆరా తీశారు.
‘‘రాయా! నిరంతరం తాంబూల సేవన భోగం కోరే విజయనగర ప్రజలు తమలపాకు పంట వేస్తారు’’ తిమ్మరుసు సమాధానానికి రాయలు చిరునవ్వుతో తల పంకించారు.
****

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి