ఖమ్మం

కిడ్నాప్ వ్యవహారంలో రంగంలోకి గులాబీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముఖ్యమంత్రి దృష్టికి మావోల డిమాండ్లు
* వరవరరావుతో మాట్లాడిన మానె రామకృష్ణ భార్య
భద్రాచలం, నవంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన భద్రాచలం మన్యంలోని తెరాస నేతల కిడ్నాప్ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు పడింది. వారిని విడిపించేందుకు జిల్లా తెరాస నాయకత్వం రంగంలోకి దిగింది. శుక్రవార జిల్లా అధ్యక్షులు బేగ్‌తో పాటుగా అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు భద్రాచలం చేరుకుని మానె రామకృష్ణ భార్య లక్ష్మిని ఓదార్చారు. ప్రభుత్వం వారిని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆమెకు వివరించారు. మరో వైపు మానె రామకృష్ణ భార్య లక్ష్మి విరసం నేత వరవరరావుతో ఫోన్లో మాట్లాడారు. తన భర్త ఉద్యోగం వదిలి ఆదివాసీలకు సేవ చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారని, ఎక్కడా ఎటువంటి మచ్చ లేదన్నారు. 48 గంటల తర్వాతైనా తెరాస జిల్లా నాయకత్వం స్పందించడంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల వౌనం, ప్రభుత్వం నుంచి మావోయిస్టుల డిమాండ్లపై ఎటువంటి స్పందన లేకపోవడంతో ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా జిల్లా తెరాస అధ్యక్షులు బేగ్ భద్రాచలంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ద్వారా వారిని విడిపించేందుకు చర్చలు జరుపుతోందని, దీనిపై ముఖ్యమంత్రి కెసీఆర్‌కు ఇప్పటికే పూర్తి నివేదికను జిల్లా పార్టీ తరుపున ఇచ్చామని వివరించారు. 6గురు నేతలు పేదల కోసం పనిచేసే వారేనని వారిని సహృదయంతో విడిచిపెట్టాలని ఆయన కోరారు.
మావోల ఎజెండానే తెరాస ఎజెండా
మరోసారి తెలంగాణ ప్రభుత్వం తన ఎజెండా మావోయిస్టుల ఎజెండాయేనని స్పష్టం చేసింది. జిల్లా అధ్యక్షులు బేగ్ ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, పోడు భూములకు పట్టాలు, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ ద్వారా జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పథకాల గురించి వివరిస్తూ ఇదంతా మావోయిస్టుల ఎజెండాయేనని వివరించారు. మావోయిస్టుల చెరలో ఉన్న తెరాస నేతలు క్షేమంగా తిరిగి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ ఎన్‌కౌంటర్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా జరిగిపోయిందన్నారు. వాటికి ప్రభుత్వం వ్యతిరేకమని, కొందరు తెరాసకు, మావోయిస్టు పార్టీకి మధ్య దూరం పెంచేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మావోయిస్టుల డిమాండ్లు అన్నీ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.
మానె లక్ష్మికి పరామర్శల వెల్లువ
కిడ్నాప్‌నకు గురైన తెరాస నియోజకవర్గ ఇంఛార్జ్ మానె రామకృష్ణ భార్య లక్ష్మికి పరామర్శల వెల్లువ ఎక్కువైంది. తన భర్త అపహరణకు గురయ్యారన్న వార్తతో రక్తపోటు తగ్గి కుప్పకూలిన ఆమెను జిల్లా అధ్యక్షుడు బేగ్‌తో పాటుగా నియోజకవర్గ ఇంఛార్జ్‌లు డా.శంకర్‌నాయక్, ఆర్జేసీ కృష్ణ, నరేందర్, బీరెడ్డి రామచంద్రారెడ్డి, యశోద నగేశ్, తిప్పన సిద్ధులు ఇతర పార్టీల నేతలు కూడా ఆమెను పరామర్శించారు.
గిరిజన సంఘాల ఆందోళన
ఇదిలావుండగా మానె రామకృష్ణ కిడ్నాప్ ఉదంతంతో ఆదివాసీ సంక్షేమ పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, మావోయిస్టుల కొట్లాటలో అమాయక ఆదివాసీలు బలైపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.

మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా
24న దేశ వ్యాప్త టోకెన్ సమ్మె ఆగదు
* సింగరేణి కార్మిక సంఘాల జెఎసి నేతల స్పష్టం
కొత్తగూడెం, నవంబర్ 20: ఈనెల 24న తలపెట్టిన టోకెన్ సమ్మెను అడ్డుకోవాలని, కార్మికసంఘాల మధ్య విభేదాలు కల్పించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా జరిగి తీరుతుందని సింగరేణి కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 సాఫ్ట్ గనిలో శుక్రవారం జరిగిన పిట్ సమావేశంలో నాయకులు పాల్గొని ప్రసంగిస్తూ బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా కార్మిక చట్టాలను రూపొందిస్తోందని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తూ బొగ్గు రంగాన్ని సంక్షోభం వైపు నెడుతున్న తరుణంలో జాతీయ కార్మిక సంఘాల ఈనెల 24న టోకెన్ సమ్మెకు పిలుపు నిచ్చాయని పేర్కొన్నారు. దేశీయ బొగ్గుగనులు విదేశీ ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళితే కార్మికులకు భవిష్యత్ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె విజయవంతం చేయడానికి జాతీయ కార్మికసంఘాలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుంటే యూనియన్ల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. జాతీయ కార్మికసంఘాలలో ఒకటైన బిఎంఎస్ మొదట సమ్మెకు సిద్ధమని చెప్పి తరువాత మాట మార్చి సమ్మెలో పాల్గొనడంలేదని ప్రకటించడం వెనుక బిజెపి పాత్రవుందని అన్నారు. కేంద్రప్రభుత్వం బొగ్గుగనుల వేలం పాటల పారదర్శకత పేరిట ప్రతిపాదించిన ప్రక్రియ ఏకంగా బాహాటంగా గనుల ప్రైవేటీకరణకు దారితీసేవిధంగా మారుతుందని అన్నారు. కేంద్రప్రభుత్వ దుష్టవిధానాన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు ఇతర సంఘాలు కూడా తీవ్రంగా నిరసిస్తున్నాయని వివరించారు. ఈక్రమంలోనే సింగరేణి సంస్థకు కూడా ముప్పు వాటిల్లేప్రమాదంవుందని ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్ సమ్మెను సింగరేణి కార్మికవర్గం ఐక్యంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మికసంఘాల నాయకులు, ఎఐటియుసి నుండి దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, కూసన వీరభద్రయ్య, జి వీరస్వామి, టిబిజికెఎస్ నుండి కాపు కృష్ణ, పద్మారావు, మధురదాసు, ఐఎన్‌టియుసి నుండి గుండా రాజమొగిలి, రవీందర్, హెచ్‌ఎంఎస్ నుండి ఎవి రామారావు, జి రవి, సిఐటియు నుండి నల్లమల వెంకటేశ్వర్లు, రఘు తదితరులు పాల్గొన్నారు. ఎస్‌అండ్‌పిసి వద్ద కూడా పిట్ సమావేశం నిర్వహించి టోకెన్‌సమ్మెను విజయవంతం చేయాలని జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు ఎస్‌వి రమణమూర్తి, ఎన్‌ఎస్‌ఆర్ మూర్తి, విజేందర్, నల్లమల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా గో తులాభారం ‘అందరితో కలిసి - అందరి వికాసం’
* జెవిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఛాయాచిత్ర ప్రదర్శన
సత్తుపల్లి, నవంబర్ 20 : పేదల గురించి ఆలోచిస్తూ, వారు చెప్పేది వింటూ వారి కోసం పాటుపడే ప్రభుత్వమని, పేదల ఆత్మగౌరవం కోసం శ్రమిస్తున్న పేద ప్రజల కోసం, కోట్లాది యువత కోసం, ప్రభుత్వం కృషి చేస్తుందని తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య అన్నారు. అందరితో కలిసి - అందరి వికాసం అనే అంశంపై స్థానిక జెవిఆర్ ప్రభుత్వ కళాశాలలో సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు, రైతులు, గిరిజనులు, దళితుల, అణగారిన వర్గాల ప్రజల కోసం వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ చిత్ర ప్రదర్శనలో లక్ష్యం, సుఖీభవ,సిద్ధాంతం, అన్నదాత సుఖీభవ - రైతుల సంక్షేమం, సర్వేజనా సుఖినోభవంతు, పారదర్శకత విశ్వాసం, విద్య, నైపుణ్యం, స్వచ్ఛ్భారత్, విదేశీ వ్యవహారాలు, అష్టలక్ష్మీ- ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి తదితరాలు ఏర్పాటు చేశారు.

కొండచిలువ హతం
వెంకటాపురం, నవంబర్ 20: మండల పరిధిలోని నూగూరు ఆయకట్టులో శుక్రవారం సుమారు 12 అడుగుల పొడవు ఉన్న కొండ చిలువను హతమార్చారు. వరి పంట కోస్తుండగా మడుల్లో కనబడిన కొండ చిలువ ఒక్క ఉదుటున మనుషులపైకి దూసుకువచ్చింది. అయితే వరి పంట కోస్తున్న యంత్రం టైర్ కొండచిలువ నడుముపై నుంచి వెళ్లడంతో కదల్లేక పోయింది. ఇదే అదనుగా రైతులు దానిని హతమార్చారు. కాగా నూగూరు కంకలవాగు పరిసరాల్లో మరో 10 వరకు భారీ కొండ చిలువలు, వాటి పిల్లలు సంచరిస్తున్నట్లు పశువుల కాపరుల ద్వారా తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఖమ్మం అథ్లెట్స్: ఎమ్మెల్యే అజయ్
* సబ్ జూనియర్ జట్ల ఎంపిక
ఖమ్మం, నవంబర్ 20: జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్, బ్లూమింగ్‌మైడ్ సెంట్రస్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలుప్రారంభమయ్యాయి. బ్లూమింగ్‌మైండ్స్ సెంట్రస్ స్కూల్ మైదానంలో జరిగిన పోటీల్లో స్కూల్ చైర్మన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ అథ్లెటిక్ అకాడమి ద్వారా ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించారని, ఈ సందర్భంగా కోచ్ గౌస్‌ను అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి మహిధర్‌ను ఆయన అభినందించారు. పోటీల నిర్వాహక అధ్యక్షుడు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పోటీలకు హాజరైన క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలను స్కూల్ యాజమాన్యం కల్పించిందన్నారు. వచ్చేనెల 6వ తారీకున ఖమ్మంలో జరిగే రాష్టస్థ్రాయి పోటీలకు సుమారు 400మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు.
జిల్లా స్థాయి టోర్నీలో బాలుర, బాలికలకు నిర్వహించిన అండర్-10,12,14 వయస్సు విభాగాల్లో 600, 200, 800 లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, అదే విధంగా క్రాస్‌కంట్రీ విభాగంలో 3,6,8,12 కిలోమీటర్ల విభాగంలో పోటీలు నిర్వహించామని అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి మహిధర్ తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో ఎంపికైన బాల, బాలికల జట్లు రంగారెడ్డిలో జరుగు రాష్టస్థ్రాయి పోటీలకు హాజరవుతారని ఆయన అన్నారు. క్రాస్ కంట్రీ విభాగంలో ఎంపికైన జిల్లా జట్లు ఖమ్మంలోని బ్లూమింగ్‌మైండ్ సెంట్రల్ స్కూల్లో జరిగే రాష్ట్ర స్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి కబీర్‌ధాస్, అథ్లెటిక్ అకాడమి కోచ్ ఎండి గౌస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ లకావత్ రవి, క్రీడల కన్వీనర్ అరుణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

క్షీణిస్తున్న ఆశాల ఆరోగ్యం
ఖమ్మం , నవంబర్ 20: ఆశా వర్కర్ల ఆరోగ్యం క్షీణిస్తుందని, వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ కుమారి హెచ్చరించారు.శుక్రవారం స్థానిక ధర్నా చౌక్‌లో ఆశాల 3వ రోజు దీక్షలనుద్దేశించి ఆమె మాట్లాడారు. మారు మూల గ్రామాల్లో అమ్మలా సేవలందిస్తున్న ఆశాలు 80 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలోని 10 మంది ఆశా వర్కర్లు ధర్నా చౌక్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయన్నారు. వారికి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని, ఇప్పటికే షుగర్ లెవల్స్ పడిపోయి, లో బిపితో సతమతవౌతున్నారని తెలిపారు. వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే భాద్యత వహించాలని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే ఆశాల బ్రతుకులు బజారున పడ్డాయని, దీక్షల్లోని వారికి ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబమే వీధిన పడాల్సి వస్తుందని ఆవేదన చెందారు. ఆడబిడ్డలు 80 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటాలు చేస్తుంటే, ఫాంహౌస్‌ల్లో పార్టీలు చేసుకోవడం దారుణమన్నారు.
తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి ఆశాల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ముందుగా ధర్నా చౌక్‌లో కనీస వేతనం 15 వేలు ఇవ్వాలని, ప్రమాదభీమా సౌకర్యం కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని పెద్ద పెట్టున పిడికిలి బిగిచి నినదించారు. ధర్నా చౌక్ నుండి రోడ్డుపైకి వచ్చి వైరారోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. కలక్టర్ బయటకు రావాలి, దీక్షలోని ఆశాల పరిస్థితిని తెలుసుకోవాలని నినదించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె నరసింహారావు, ఆశా నాయకులు పిఆర్ దేవి, మంగ, లత తదితరులు పాల్గొన్నారు.

మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపర్చడమే లక్ష్యం
ఖమ్మం, నవంబర్ 20: రైతుకు ప్రయోజనం చేకూరేలా వ్యవస్థను మెరుగుపరచడమే మార్కెటింగ్ శాఖ లక్ష్యమని వరంగల్ రీజియన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని సిసిఐ కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల ధృవపత్రాలను, వేమెంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి రైతుకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను అందించే విధంగా మార్కెటింగ్‌శాఖ పని చేస్తుందన్నారు. కనీస మద్దతు ధర రైతు దక్కేలా సిసిఐ కేంద్రాలలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ఎటువంటి అదనపు భారం పడకుండా ఎప్పటికప్పుడు సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నామన్నారు. రీజియన్‌లో 66 సిసిఐ కేంద్రాలకు అనుమతి లభించిందని, ఇప్పటికే చాల కేంద్రాలను ప్రారంభించామని, సోమవారం నాటికి మిగిలిన కేంద్రాలను సైతం ప్రారంభించి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు చేపడుతుందన్నారు. సిసిఐ కేంద్రాలను ప్రారంభం అయిన నాటి నుండి వరంగల్ రీజియన్‌లో 4.60 లక్షల క్వింటాళ్ళ పత్తిని రైతుల వద్ద నుండి సేకరించిందన్నారు. సిసిఐ కేంద్రాలకు పత్తిని తరలించే రైతులు ఖచ్చితంగా సిసిఐ నిబంధనలను పాటించాలని, అలా పాటిస్తేనే కనీస మద్దతు ధర లభిస్తుందని రైతులకు వివరించారు. లూజు రూపంలో తేమ శాతం 8-12 లోపు ఉండే విధంగా చూసుకొని మార్కెట్‌కు తరలించాలన్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా గో తులాభారం

ఖమ్మం, నవంబర్ 20: రాష్ట్రంలోనే మొట్ట మొదటి గో తులాభారం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం నగరంలోని శ్రీ వేంకటేశ్వర గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసచార్యులు, కమిటి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన గోతులాభారానికి భక్తులు విరివిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కపిలవాయి అచ్యుతరామారావు చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గో తులాభారంలో గోవుకు ఇష్టమైన దాణాను గోవు ఎత్తు ఇవ్వడమే నన్నారు. గోపూజ, గోదానం, గోవులకు ఇష్టమైన ధాణాను ఇవ్వడం హిందువుల సాంప్రదాయం. గోవు అగ్నితో సమానంగా పురాణాలు, వేదాలు సూచిస్తున్నాయన్నారు. గోవులకు దాణా సమర్పించడం ద్వారా గోవు పొందే సంతృప్తి ద్వారా శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహాం పొందువచ్చునన్నారు. ఈ తులాభారంలో పాల్గొన్న వందలాది మంది భక్తులు తమ శక్తి కొలది నల్లనువ్వులు, కందులు, బొబ్బర్లు, గోధుమలు, మినుములు, ఉలవలు, పెసలు, శెనగలు, బెల్లం వంటివాటిని సమర్పించుకున్నారు. అలాగే గోతులాభారాన్ని చూసినా గ్రహస్ధితి అనుకూలించి పితృదోషనివారణ, సంతాన సమస్య, కుటుంబ సమస్యలు, నరదృష్టి, వివాహా, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వేలాది మంది భక్తులు జిల్లా నలు మూలల నుండి బారీగా తరలి వచ్చారు. అందుకే భక్తులు గోతులాభారంతో ముక్తి పొందుతారన్న విశ్వాసంతో పోటీలు పడి అనేక మంది దాణాను గోమాతకు ఇచ్చేందుకు భక్తి భావంతో ముందుకు వచ్చారు. 525 కేజీల బరువుకల్గిన గోమాతకు అదే బరువు కల్గిన దాణాను ముగ్గురు భక్తులు సమర్పించారు. ఒక్కొక్కరు ఇచ్చిన దాణా ఖరీదు 8250 రూపాయలుగా ఉంటుందని నిర్వాహాకులు తెలిపారు. దేవసి రాజారాం, మంగళ్ పటేల్, నరేందర్ మణియార్‌లతో పాటు 475 కేజీల బరువుతో ఉన్న గోమాతకు అదే బరువుతో ఉన్న దాణాను శాంతినాథ్ ఎలక్ట్రికల్స్, శ్రావణ్‌జీ లు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఉదయం 5:30 గంటలకు సుప్రనాతసేవ, ఆరాధనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 8 గంటల నుండి స్వస్తివాచనం, చతుస్తానార్చన, శ్రీ లక్ష్మీనారాయణ పూలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం 5:30 గంటలకు శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, గోవిందనామాలతో గోశాల ప్రాంగణం మారుమ్రోగింది. రాత్రి 7 గంటలకు నిత్యహోమం, శ్రీకృష్ణపూజ పూర్ణాహుతి ఎంతో ఆడంబరంగా జరిగాయి.