సబ్ ఫీచర్

వర్సిటీలను విభజించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 మేరకు హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని, అలాగే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని విభజించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈమేరకు గవర్నర్ చొరవ ప్రదర్శించి తగు ఏర్పాట్లుచేయాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు నొక్కిచెబుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రెండుగా విభజించారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చి ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంగా (తెలంగాణ) నామకరణం చేసారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి రాజధానిలో ఎన్.జి.రంగా పేరుతోనే వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తవుతున్నాయి.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి దాన్ని 1985 డిసెంబరు 2న ఏర్పాటుచేసారు. 1990 మే 2నుంచి విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యు.జి.సి) నుంచి నిధులు మంజూరవుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజనతో (2014 జూన్ 2) ఈ విశ్వవిద్యాలయం రెండిళ్ల చుట్టంగా మారింది. ఫలితంగా విశ్వవిద్యాలయ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. దీంతో భాషా, సాంస్కృతిక కార్యక్రమాలు కుంటి నడకతో సాగుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశ్వవిద్యాలయాన్ని విభజిస్తే తప్ప తమకు న్యాయం జరగదంటూ ఉద్యోగులు గత ఆర్థిక సంవత్సరంలో ఆందోళనలు సాగించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో లలిత కళాతోరణం (హైదరాబాద్), పోతన ప్రాంగణం (వరంగల్), పాల్కురికి సోమనాథుని ప్రాంగణం (శ్రీశైలం), నన్నయ ప్రాంగణం (రాజమండ్రి), సిద్ధేంద్రయోగి ప్రాంగణం (కూచిపూడి) ఉన్నాయి. వీటిలో నన్నయ ప్రాంగణం, పాల్కురికి సోమనాథుని ప్రాంగణం, సిద్ధేంద్రయోగి ప్రాంగణం కలిపి రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు పేరుతోనే కొత్త తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏడెనిమిది నెలల క్రితమే ప్రకటించారు. అయితే కార్యరూపం దాల్చలేదు. కాగా లలిత కళాతోరణం, పోతన ప్రాంగణంతో కలిపి తెలంగాణకు ప్రస్తుత విశ్వవిద్యాలయానే్న కొనసాగేందుకు నిర్ణయించారు. ఈ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విశ్వవిద్యాలయం విభజన జరగనందున సమస్యల హోరుతో ఉమ్మడిగానే కొనసాగడం దురదృష్టకరం. ఇక హైదరాబాద్‌లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) కూడా విభజనకు నోచుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ విశ్వవిద్యాలయం తన సేవలను తెలంగాణకే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీని శాశ్వతంగా విభజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి. అలాగే ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఉద్యోగులు ఇదే అంశంపై తమ సమస్యలను రాష్ట్ర విపక్ష నేత, వై.ఎస్.ఆర్.సి.పి. అధ్యక్షులు వై.ఎస్.జగన్‌ను జూలై 30న కలిసి విన్నవించారు. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయాన్ని 1982లో ఏర్పాటుచేసారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 206 అధ్యయన కేంద్రాలున్నాయి. వీటిలో ఆంధ్ర ప్రాంతంలో 92 అధ్యయన కేంద్రాలున్నాయి.
రాష్ట్ర విభజన జరిగి 13 నెలలు పూర్తయినా దీన్ని అలానే కొనసాగించడం ఎంతమాత్రం సబబుకాదని వేరేగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 సెప్టెంబర్‌లో విడుదల చేసిన 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలో శ్రీకాకుళంలో సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నట్టు స్పష్టంగా పేర్కొన్నది. ఈ ప్రణాళిక మొత్తం పాఠాన్ని సమాచార, పౌర సంబంధాలశాఖ విడుదల చేసింది. అంచేత ఉమ్మడిగా కొనసాగుతున్న అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని వెంటనే విభజించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్తగా శ్రీకాకుళంలో ఏర్పాటుచేయడానికి ప్రతిపాదించిన ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి గరిమెళ్ళ సత్యన్నారాయణ పేరును పెడితే అంతా సంతోషిస్తారు.

- వాండ్రంగి కొండలరావు