రాష్ట్రీయం

వర్శిటీల్లో సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాన్సలర్లుగా ఇక న్యాయమూర్తులు
విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం
కళాశాలల్లో కిస్ ఫెస్టివల్సా
ఇన్ని బిఇడి, డిఇడి కాలేజీలా?
అంతమంది టీచర్లను ఏంచేయాలి?
అసెంబ్లీలో ప్రశ్నలు సంధించిన కెసిఆర్

హైదరాబాద్, మార్చి 13: వర్సిటీలకు చాన్సలర్లుగా న్యాయమూర్తులను నియమించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. వర్శిటీలకు వైస్ చాన్సలర్లను నియమించలేదన్న విమర్శకు స్పందిస్తూ ‘నియమించలేదు. నిజమే, ఉద్దేశ పూర్వకంగానే నియమించలేదు’ అన్నారు. గతంలో వైస్ చాన్సలర్లుగా పనిచేసిన కొందరు పదవినుంచి దిగిపోయేటప్పుడు ఉద్యోగాలను అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయని, రెండు మూడు వందలమంది సిబ్బందిని నియమించుకున్న సందర్భాలు చూశామని సిఎం ప్రస్తావించారు. ‘ఆలస్యం కావచ్చు. కానీ వర్శిటీలను బాగుచేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు. వైస్ చాన్సలర్‌ను నియమించే అధికారం ఇప్పటివరకు గవర్నర్‌లకు ఉండేదని, గవర్నర్‌తో చర్చించిన తరువాత ఈ నిబంధన మార్చామన్నారు. ప్రభుత్వమే చాన్సలర్లు, వైస్ చాన్సలర్లను నియమిస్తుందన్నారు. ఇటీవల హైకోర్టు సిజెను కలిసి ‘వర్శిటీల పరిస్థితి మెరుగుపర్చాలని భావిస్తున్నాం. కొంతమంది న్యాయమూర్తులను సైతం చాన్సలర్లుగా నియమించే అవకాశం కల్పించాలి. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన ఒక వర్శిటీకి మీరు చాన్సలర్‌గా ఉండాలి’ అని కోరామన్నారు. వైస్ చాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీని నియమించామన్నారు. జగదీశ్‌రెడ్డి విద్యా మంత్రిగా ఉన్నప్పుడే వైస్ చాన్సలర్ల వివరాలు సేకరించామని, కొందరు ఉద్యోగాలు అమ్ముకున్నట్టు తేలిందని కెసిఆర్ వివరించారు.
1969 తెలంగాణ ఉద్యమం తరువాత ఉస్మానియా వర్శిటీకి పూర్వవైభవం తెచ్చేందుకు అప్పటి వైస్ చాన్సలర్ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని, ఉస్మానియాకు పూర్వవైభవం వచ్చిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు వర్శిటీలను సంస్కరించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వర్సిటీలకు నిధులు కేటాయిస్తామన్నారు. యూజిసి నిధులు ఏవిధంగా వస్తాయి? మనం ఏవిధంగా కేటాయించాలో పరిశీలిస్తున్నట్టు చెప్పారు. లండన్‌లో ప్ట్రాక్టీస్ చేసే డాక్టరైనా ఎంబిబిఎస్ పక్కన బ్రాకెట్‌లో ఉస్మానియా అని గౌరవంగా రాసుకునేవారని కెసిఆర్ గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్టు ఊరికో డబ్బా వర్శిటీలు ఏర్పాటు చేశారు. కానీ వాటికి నిధులు కేటాయించలేదన్నారు. వాటిని తొలగిస్తే మేం ఏర్పాటు చేసిన యూనివర్సిటీని కెసిఆర్ తొలగించారని అదో రాజకీయం చేస్తారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్సిటీలను పటిష్టపర్చనున్నట్టు చెప్పారు. నిప్పురవ్వల్లాంటి వైస్ చాన్స్‌లర్లను నియమిస్తామన్నారు. నాలుగు నెలలు ఆలస్యమైనా ఫరవాలేదంటూనే, సరైన నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ ప్రకటించారు.
ఇన్ని సీట్లు అవసరమా?
రాష్ట్రంలో 197 బిఇడి కాలేజీలు, 285 డిఇడి కాలేజీలు ఉన్నాయని, వీటిద్వారా ఏటా 40 వేలమంది విద్యార్థులు బయటకువస్తున్నారని సిఎం చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఏటా 40 వేలమంది టీచర్లను నియమిస్తుందా? మరి వీళ్లంతా ఏం చేయాలని ప్రశ్నించారు. ఇన్ని కాలేజీలకు ఎవరు అనుమతి ఇచ్చారో, ఎందుకిచ్చారో తెలియని పరిస్థితి అని విమర్శించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 60వేల మంది వరకు వస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పుణ్యమా అని ఇష్టం వచ్చినట్టు కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. 399 బోగస్ కాలేజీలు బయటపడ్డాయని, ఒకే ప్రొఫెసర్ 11 కాలేజీల్లో పని చేస్తున్నట్టు తేలిందని, ఒకేరోజు ఆదిలాబాద్‌లో, హైదరాబాద్‌లో పని చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చివరకు ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలుగా వెళ్తున్నారని తెలిపారు. ఎంతమంది అవసరమో గుర్తించి, వారికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కాలేజీల్లో సన్నబియ్యం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాలేజీలు, వర్శిటీల హాస్టళ్లలోనూ విద్యార్థులకు సన్నబియ్యం అందచేస్తామని సిఎం ప్రకటించారు.
హవ్వ కిస్ ఫెస్టివల్
వర్సిటీల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తూ వాటి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సిఎం విమర్శించారు. బీఫ్ ఫెస్టివల్, కిస్ ఫెస్టివల్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ, కిస్ ఫెస్టివల్‌ను ఎవరైనా ఆమోదిస్తారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.