విపులాచ పృధ్వీ

ఈ సంగతి ఇలాయెందుకు ఎత్తానా అని అనిపించవచ్చు. నాకు కర్ణాటకలోని విద్యాప్రమాణాలు, క్రమశిక్షణ ఎంతగానో అబ్బురపరుస్తూ వుండేవి. ఎక్కడ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడవలసి వచ్చినా కర్ణాటక విశ్వవిద్యాలయాలను గురించి గొప్పగా చెబుతూ వుండే దాన్ని. చివరికి అమెరికా అధ్యక్షుడు ఒబామా బెంగుళూరు, బీజింగ్ విద్యార్థులతో అమెరికా విద్యార్థులు పోటీపడగలగాలి’ అంటూ ఎంతో గొప్పగా మాట్లాడారు బెంగుళూరు విద్యార్థుల ప్రమాణాలను గురించి. అటువంటి బెంగుళూరు విశ్వవిద్యాలయంలో అలజడులు జరుగుతున్నాయంటే చాలా బాధగా అనిపిస్తోంది.
ఢిల్లీలో వున్నప్పుడు ఒక రోజున ఆఫీసుకు వెళుతూ చూస్తే క్రితం రోజులేని బ్యానర్లు వీధులనిండా కనపడ్డాయి. కారాపమని చెప్పి చూస్తే అవి విశ్వవిద్యాలయపు ఎన్నికలకు సంబంధించినవి. అన్ని బ్యానర్లు ఢిల్లీ అంతా పెట్టారంటే ఎంత ఖర్చయివుంటుందో ఊహించుకోండి. ఆ విశ్వవిద్యాలయ ఎన్నికల్లో కోట్లకొద్దీ డబ్బు ఖర్చయిందట. ఎక్కడినుంచి విద్యార్థుల దగ్గరకు అంత డబ్బు వస్తుంది? వారిని వాడుకునే పెద్ద పార్టీలదగ్గరనుంచే కదా!
ఢిల్లీలోనే కాదు ఉత్తరాదిన చాలావరకు విశ్వవిద్యాలయాల్లో ఇదే తంతు అని విశ్వవిద్యాలయ ఉపకులపతుల సమావేశంలో వాపోయారు. హిమాచలప్రదేశ్ గవర్నరుగా నేను అక్కడి విశ్వవిద్యాలయాలకు కులపతిని అంటే ఛాన్స్‌లర్‌ని. పార్టీ రాజకీయ ప్రమేయం లేకుండా యువతను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలు గవర్నరు అజమాయిషీలో వుండడం మంచిదని అలాంటి ఏర్పాటు జరిగింది. అంటే సరైన వ్యక్తిని ఉపకులపతిగా ఎంచడం ముఖ్యం. అందుకు గవర్నరు ఎలాంటి ఒత్తిళ్ళకు లోనుకాకుండా తాను ఏర్పాటుచేసిన నిష్ణాతుల సమితి సలహామేరకు కూడా కులపతిని ఎంపిక చేస్తారు. అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో గవర్నరుకు నామమాత్రపు ఆధిక్యత ఇచ్చి ప్రభుత్వమే నిష్ణాతుల కమిటీ వేసి వారి సూచనల మీదట తాము కూడా ఆలోచించి ప్రభుత్వం ఒక ముగ్గురు వ్యక్తుల పేనల్‌ని పంపుతూ అందులో ఒకరిని ఎత్తిచూపి ఉప కులపతిగా నియమించమని అడుగుతుంది. అలా విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో రాజకీయం చోటుచేసుకోవడం మొదలయింది.
రాజీవ్‌గాంధీ యువతకు ఎన్నికల్లో సరైన వ్యక్తుల్ని ఎన్నుకునే అధికారం ఇవ్వాలి అంటూ ఓటు హక్కు 21 ఏళ్ళ స్థానే 18 ఏళ్ళుగా రాజ్యంగం సవరించారు. ఇక మరీ దాంతో విద్యార్థుల ఓట్లను రాబట్టుకోవడంకోసం రాజకీయ పార్టీలు అన్నివిధాలా వల పన్నుతుంటాయి. ముందు ఉపకులపతిని తనవాడిననుకునేవాడిని నియమిస్తే సగం పని జరిగిపోయినట్టేకదా! హిమాచల్‌లో వుండగా నేను అక్కడికి వెళ్ళేటప్పటికే హిమాచల్ విశ్వవిద్యాలయంలో ఎన్నికలను నిషేధించారు. కారణం ఏమిటంటే బయటనుంచి దుండగులు, కొన్ని రాజకీయ పార్టీలు బరిలోకి దిగి ఎన్నికల్ని హింసాయుతం చేసిపెట్టారు. ఎన్నికల్లో నిలబడ్డ ఒక అభ్యర్థిని చంపేసారు. మరొక అభ్యర్థి చేయి నరికేశారు. అదీ కారణం.
సిమ్లానుంచి నేను మరొక రాష్ట్రానికి ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతూ ఢిల్లీలోని హిమాచల్‌భవన్‌లో బసచేసాను. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు యువకు లునన్ను కలవడానికి వచ్చారు. కూర్చోకుండా మాటిమాటికీ గుమ్మం వైపు చూస్తున్నారు. ‘‘ఏమిటి సంగతి...’’ అన్నాను. ‘‘మా అధ్యక్షురాలండీ... అదుగో వారే వచ్చేసారు’’అని ఆవిడ లోపలికి రాగానే వాళ్ళిద్దరూ ఆవిడ పాదాలకు నమస్కరిస్తూ వుంటే ఆవిడ వాలుగా వుండే చీర కుచ్చెళ్ళు కాస్తపైకి పెట్టుకుంది. నేను తమాషా చూస్తున్నాను. వాళ్ళిద్దరూ నిలబడే వున్నారు. ఆవిడ నా ఎదురుగా సోఫాలో కూర్చొంది. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా కూడా అలా ధీమాగా కూర్చుని వుండేవారు కాదు.
‘‘మీతో ఒక విషయం అర్జంటుగా మాట్లాడవలసి వచ్చింది’’ అంది. క్లాసులకు వెళ్ళకుండా ఇలా మీరు పక్క రాష్ట్రంలోని ఎన్నికలకోసం శ్రమపడి వచ్చారు? ఆ ఇద్దరూ నిలబడే వున్నారు’’ అన్నాను. ‘‘ఒకతను నా ఉపాధ్యక్షుడు. ఒకడు నా కార్యదర్శి’’అంది. అంతేకాని వారిని కూర్చోమనలేదు. వాళ్ళూ కూర్చోలేదు. ‘‘ఇక మీరు క్లాసులకు వెళ్ళండి. హిమాచల్ విశ్వవిద్యాలయపు ఎన్నికలను గురించి మా అధికారులతో ఉప కులపతితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాను. ‘‘విద్యార్థి ఎన్నికలలో గెలిస్తేనే మీరు ఇంత అధికార దర్పం చూపిస్తున్నారు. ఇక దేశ నేతలయితే ఎంతటి అధికారాన్ని చూపిస్తారో! అనుకుంటూ’’ మీరు దేశ నేతలయ్యేవరకూ చక్కగా చదువుకోండి. అని చెప్పి.. మైడియర్ ప్రెసిడెంట్.. ముందు నీతోటి కార్యవర్గం వారిని ఎలా గౌరవించాలో నేర్చుకో. ఇక వెళ్ళిరండి. నాకు కార్యక్రమానికి వెళ్ళే టైమయింది’’ అన్నాను. ఆ ముగ్గురూ ఏమనుకున్నానరో తలవంచుకు వెళ్ళిపోయారు.
బైటి దుండగులు డాక్టరేట్ చేయడంకోసం పరిశోధన పేరుతో విశ్వవిద్యాలయ పరిసరాల్లోను, కొన్నిచోట్ల విశ్వవిద్యాలయపు హాస్టళ్ళల్లోనే వుండి విద్యార్థులను ఉద్రేకిస్తూ అలజడులు మొదలుపెట్టిస్తారు. రాజకీయ ప్రయోగాలకోసం రాజకీయ నేతలు విశ్వవిద్యాలయ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారు. దాంతో ఇక విద్యాప్రమాణాలు తగ్గక ఏమవుతాయి. సమాజానికి వెలుగుచూపే విజ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయాలే ఈ విధంగా దిగజారిపోతూ వుంటే మన యువత భవిష్యత్తు ఎటువైపుకు దారితీస్తుందో!
Add new comment