వాసిలి వాకిలి

నేను.. సంభవాన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను-
పలికితే పరవశించే నమ్మకాన్ని
తడిమితే పులకరించే విశ్వాసాన్ని
మాటను అందలమెక్కించే అధికారాన్ని
సమాలోచనల సిద్ధాంతాన్ని
సంఘర్షణల రాద్ధాంతాన్ని
నచ్చిన బాటన ప్రణాళికను
మెచ్చిన మార్గాన ప్రబోధాన్ని
పరంపరల ఉపదేశాన్ని
గాయపడ్డ చేతను
పట్టు తప్పిన ఉద్విగ్నతను
నొచ్చుకున్న మానసికతను.
నేను
చేతనాచేతన కలశాన్ని
ఆత్మవిద్యా కౌశలాన్ని
మూడు మెట్లెక్కిన నాడీమండలాన్ని
నాలుగో మెట్టున నిలబడ్డవాణ్ణి
ఏడోమెట్టున నవ అవతారాన్ని
ధ్యానమే అహమయిన ప్రజ్ఞానాన్ని.
ఇక్కడి నేను
సప్తాగ్ని శిఖల జీవ ప్రజ్ఞను
స్వరపేటిక అధిభౌతిక మంత్రాన్ని
అదృశ్యనేత్ర దృశ్య తంత్రాన్ని
సప్తశోభిత సుప్త ప్రాంగణాన్ని.
* * *
నేను-
సామూహిక చేతనను
ఖగోళ చేతనను
గిక చేతనన
అయినా, నేను
వైయక్తిక చేతననే!
అహంజనిత చేతననే!
తురీయాస్థిత చేతననే!
అవును, నేను
భయపూరిత జాగ్రత్ చేతనను కాను.
భయకంపిత స్వప్న చేతనను కాను.
భౌతికాతీత, మానసాతీత కేతన చేతనను.
నేను
ప్రవిమల సత్య దర్శనను
సప్త విశ్వ అణుసృజనను
సప్త సూత్ర కణ విచికిత్సను
సప్త చేతనల అంతరాగ్నిని
సుప్త చేతనల అంతర్లయను
సృష్టి సృజనా అంతఃకరణను.
* * *
నేను-
అస్తిత్వ తొలి ప్రాంగణంలో
అంధకారం సంధించిన అస్త్ర కిరణాన్ని
కిరణ సంయోగ అణు అల్లికను
అణువణువుల మట్టి ముద్దను
పాంచభౌతిక ఆవాహనను
ప్రకృతి ప్రసవించిన శక్తి విలసనాన్ని
మానవావతార మూలతనాన్ని..
కణ కదలికల చైతన్యాన్ని
చేతనను తొడుక్కుంటున్న పార్థివతను
పార్థివతత్వ పదార్థ ఆవిష్కరణను
సాంద్రతను తొలగించుకుంటున్న మాయను
సృష్టి సృజనకు బ్రాహ్మీ ముహూర్తాన్ని.
అస్తిత్వ మలి ప్రాంగణంలో
తపస్సు ప్రయోగించిన తేజస్సును
ఓజస్సంపన్న గిక భామికను
సృష్టికి ప్రతిసృష్టిగా నిలిచిన పుడమితల్లిని
ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రాణ స్పందనను
ప్రకృతి పరిష్వంగనా అయోనిజను
విశ్వవీక్షణా బీజాంకురాన్ని
ప్రసవానంతర ప్రాణ స్పందనను
మట్టిని తాకిన మహిమాన్వితాన్ని.
అస్తిత్వ తృతీయ ప్రాంగణంలో
మాయను పొదువుకున్న వాస్తవాన్ని
భ్రమాన్విత మానవ అవతారాన్ని
జగన్నాటక పాత్రల పల్లవిని
వికల్పతల ఉద్విగ్న చరణాన్ని
సంకల్ప సంజనిత సంయోగాన్ని
కారణజన్ముణ్ని.. కర్మయోగిని.
అస్తిత్వ చతుర్థ ప్రాంగణంలో
వంశ ప్రతిష్ఠతో నడుస్తున్న చరిత్రను
అపవిశ్వాసాలను విడుస్తున్న నిఘంటువును
భౌతిక అధిభౌతికతల విజ్ఞాన సర్వస్వాన్ని
బొడ్డూడిన నాడే పాతను వదిలిన వాణ్ని
కొత్త అడుగులకు మడుగులొత్తుతున్నవాణ్ని
భాషా మాధ్యమ వ్యక్తీకరణ కేతనాన్ని
శాబ్దిక నిశ్శబ్దతల వౌనధ్యానిని
మాట, చూపు, వినికిడిల నియంత్రణాశీలిని
బ్రతుకుతూ మృత్యువుతో చరిస్తున్నవాణ్ని
నేలను తన్నుకుని నింగికి ఎగసినవాణ్ని
అస్తిత్వ అయిదవ ప్రాంగణంలో
అందీఅందని భూమికల నిర్వచనాన్ని
ధూప దీపాల అతీత తత్వాన్ని
నీ-నా మత్తు వదులుతున్నవాణ్ని
నాతో నేనే పోరాడుతున్నవాణ్ని
నాలో నేనే సంఘటితమవుతున్న వాణ్ని
నేనే సంయోగాన్ని.. సంభవాన్ని
అస్తిత్వ ఆరవ ప్రాంగణంలో
రంగు - రుచి - వాసనలను
కర్త - కర్మ - క్రియలను
ప్రకృతి - వికృతులను
విద్వత్తును - విద్యుత్తును
అహంకారాన్ని - నిరహంకారాన్ని
ఆకర్షణను - నిరాకర్షణను
కాలాతీత ఆకాశిక ప్రమాణాన్ని.
అస్తిత్వ ఏడవ ప్రాంగణంలో
జాగ్రత్ - స్వప్న- సుషుప్తుల తురీయతను
సత్వ రజ స్తమో గుణాతీత వ్యాప్తిని
శుద్ధ ఆజ్ఞను- విశుద్ద ప్రజ్ఞను
సత్యవాహినిని - నిత్య చైతన్యాన్ని
సృష్టి సృజనను... విశ్వంభరను.

-విశ్వర్షి 9393933946