వాసిలి వాకిలి

నేను శేషావతారాన్ని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
ఆత్మను అక్షరంలోకి దింపుతానంటే
ఆత్మే అక్షయంగా కదలాడతానంది
అక్షర అక్షరాన్ని దున్నుకుంటూ పొమ్మంది
మట్టిపెళ్లల దాగిన మనిషి కథను చూడమంది
కథను చరిత్రగా మలచిన తీరు కనమంది
చరిత్ర కెక్కని శేషావతారాన్ని ఆత్మకథ చేయమంది
అవును
మానవ చరిత్రలో మనిషి కనిపిస్తుంటాడు
మరి మనిషి కథలో ఆత్మ మేల్కొంటుందా?
మనిషి తన కథ వినిపిస్తేనేగా ఆత్మ కదిలేది
ఆత్మ తన కథ చెపితేనేగా ఆత్మకథ తెలిసేది.
* * *
నేను
మట్టిమనిషిని
మనసు మనిషిని
వెరసి ఆత్మసాక్షిని.
కణం నుంచి కదలి వచ్చాను
క్షణంలో పుడమిని తాకాను
క్షణక్షణం జీవితమయ్యాను
క్షణానికే మృత్యువు నయ్యాను
మనిషి తోడుగా సమూహమయ్యాను
సమూహాల సమాజ మయ్యాను
సమాజాల సరిహద్దు నయ్యాను
సరిహద్దుల భూగోళమయ్యాను
ఖండ ఖండాంతర చరిత్రనయ్యాను
మట్టి మనిషిగా సస్యశ్యామల మయ్యాను
మనసు మనిషిగా ప్రకృతివశ మయ్యాను
ప్రవృత్తిపర చాతుర్వర్ణ వ్యవస్థ నయ్యాను
వృత్తి ప్రధాన జీవనాధార మయ్యాను.
* * *
నేను
మట్టి బ్రతుకును
మనసు వాసనను
ఆకలి తెలిసిన మనసును
బ్రతుకు కథన ఆత్మకథను
చినుకు చినుకున తమిసినవాడను
ఆకు ఆకున కనలినవాడను
రాతి ఒరిపిడిన నిప్పురవ్వను
మనసు రాపిడిన జీవన వెలుగును
నగ్నత్వానికి సిగ్గిలాను
సిగ్గిలి స్ర్తి పురుష నయ్యాను
విభేదంలో అభేద మయ్యాను
కుటుంబ వ్యవస్థ నయ్యాను
వ్యవస్థలో ఒంటరిని
ఒంటరిగా వ్యవస్థను
వ్యవస్థ అంతస్తత్వాన్ని
ఒంటరితన అస్తిత్వాన్ని.
* * *
నేను
మట్టి చెలమను
వరికంకి ధీరతను
గాదె నింపిన బ్రతుకును
గాడి తప్పని పైరగాలిని.
బీజ క్షాత్రాన్ని
కాండ ధర్మాన్ని
వృక్ష క్షేత్రాన్ని
ప్రకృతి పాఠాన్ని.
మట్టి మొలకను
చినుకు తొడిమను
గొంగలి ఎదను
పరపరాగ కేరింతను
క్షేత్ర పాలకుడ్ని
కాడి తూకాన్ని
సస్య సోయగాన్ని
త్రిసంధ్యా సంచారిని.
* * *
నేను
వంశాంకుర మయ్యాను
వంశ ప్రతిష్ఠ నయ్యాను
తర మయ్యాను
తరతరా లయ్యాను
వేటగాడి నయ్యాను
వలస నయ్యాను
కలహ మయ్యాను
శత్రువు నయ్యాను
పోరాట పటిమనయ్యాను
విజయ కేతన మయ్యాను
సామ్రాజ్య హేతువు నయ్యాను
అంతర్యుద్ధ మయ్యాను
ప్రపంచ సంగ్రామ మయ్యాను
* * *
నేను
ఆత్మకథగా కలవర పాటవుతున్నాను
ఆత్మకథతో కలత చెందుతున్నాను.
* * *
నేను
మట్టి మనిషిగా రారాజుని
రాజరికంలో మట్టిమనిషిని
ప్రజా రాజ్యంలో ప్రధానిని
పదవీ పోరులో ఓటరుని.
లెఖ్ఖల ఖాతాలో అక్షరాస్యుడిని
వోటరు వేలిగ నిరక్షరకుక్షిని
స్వదేశాన అప్రయోజకుడిని
విదేశాన మేధాసంపన్నుడిని.
అరువు పొలాల ఎరువు బ్రతుకును
పసిమి క్షేల్ర పలచబడిన వ్యవస్థను
అభ్యుదయ భావాల అడుగంటిన అవస్థను
విప్లవగళాల అరణ్య వేదనా సాంద్రతను
* * *
నేను.. అణుయుగ కర్తను
అణ్వాయుధ నేతను
అరచేతి అణురేఖను
అణుక్షణ అవతరణను
అణువుల భూవలయానికి
అణుబాంబు నయ్యాను
అణువు అణువున
విస్ఫోటన మవుతున్నాను
అణుదిన మవుతున్నాను
అణుదేహ మవుతున్నాను
అణుప్రాయ మవుతున్నాను
అవును, నేను
అణువాద అక్షరాన్ని
అణ్వీక్షణా కలాన్ని
అనే్వషణా పత్రాన్ని
మట్టిపొరల అణురాగాన్ని
అణురంగ అంటురోగాన్ని
అణుబంధ అంతస్తత్వాన్ని
అణుమాన అస్తిత్వాన్ని
అణుయుగ మనిషిని
అణుమాత్ర ఆత్మని.

-విశ్వర్షి 93939 33946