వాసిలి వాకిలి

‘నేను’ ఆకాశిక ప్రకృతిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-1-
నేను స్వప్నాన్ని
అవును, స్వప్నమా!
నువ్వు నా స్వంతానివి
నా సంతానానివి
నేను నీ అస్తిత్వం
నువ్వు అంతస్సత్వం
నా ఆలోచనా తరంగాల
తెరచాపవు నువ్వు
నా కలవరింతల
పరుసవేదివి నువ్వు
నీ జననం
నా కనురెప్పలు ముడివడిన చంద్రకాంతిలో
నీ మరణం
నా కనులు విత్తుతున్న భానూదయంలో
నే మేల్కొంటేనే
నీ తావుల తావలం
నా నిద్రలోనే
నీ అస్తిత్వ రాజసం
నా పుట్టుక, గిట్టుక నీతోనే!
నీ జననమైనా, మరణమైనా నాతోనే!
అన్నట్లు
నువ్వు ఎవరికీ కనిపించవు - నాకు తప్ప
నేను కనులు మూసుకుంటేనే నీకు ఉనికి
నువ్వు బలంగా ఉంటేనే నాకు ఆనందం
నువ్వు నా ఊతం - నువ్వు నా మధనం
అవును, నువ్వు
నా లక్ష్యానికి ప్రణాళికవు
నా అడుగుకు ముందడుగువు
నా విజయానికి తొలి చిత్తరువువు
నా ఉపచేతనా ఇంద్రచాపానివి
నా మానస సరోవరానివి
నా ఆంతరిక అంతరిక్షానివి
అయినా
నీ ఆహార్యం, ఆహారం నేనే
నా ఒడలు మైమరిస్తేనే
నువ్వు రెక్కలు విప్పుకునేది
నీ రెక్కలపై నన్ను మోసి మురిపించేది.
-2-
నేను కలను
నేను
‘కల’వరపాటును
కనురెప్పల వెండితెరను
నేను
మనసు పొరల వాస్తవాన్ని
ఇహలోక భ్రమణరాగాన్ని
పరలోక పరిణామ వేగాన్ని
ఇహపర వలయ భోగాన్ని
నేను
కలను
కలకళను
ఈ ఇలన కలగా ఎగసే అలను
జీవన కడలిపై కలివిడి ప్రయాంన్ని
సుఖనిద్ర మిగిల్చిన రంగుల చాపాన్ని
తొలి ఉషస్సుతో కరిగిన అస్తమయాన్ని
మాయామోహిత మానసిక చిత్రణాన్ని
*
నేను
కలను
కళాగర్భను
మెచ్చిన రూపానికి మాతృమూర్తిని
కారుమేఘాన దాగిన నచ్చని సంఘటనను
ఒంటరి పరిష్వంగణా వేదనను
జతలేని నడిరేతిరి ప్రసవ వాదనను
సూర్యరశ్మి తడిమిన బాలింతను
*
నేను
కలను
కలల కాణాచిని
నా కలాప్రావీణ్యమంతా కనురెప్పల మాటున
నా సృజన కౌశలమంతా మానస వీధిననే
నా సారథ్య వ్యాసంగం కళ్లుమూతలతోనే
నేను హిమవన్నగ ప్రవృత్తిని
గగనచుంబిత ఆకాశిక ప్రకృతిని
-3-
నేను సముద్ర క్షేత్రాన్ని
నేను
కడలి క్షాత్రాన్ని
అలల గాత్రాన్ని
కలల గోత్రాన్ని
ఉభయచర వంశజాన్ని
దశావతార కథనాన్ని
అలల చైతన్యాన్ని
కలల కౌమారాన్ని
అలల అంతర్లయను
కలల సౌందర్య లహరిని
ఘోషించే మానవత్వాన్ని
శ్వాసించే గికత్వాన్ని
పాంచభౌతిక కేంద్రాన్ని
అధిభౌతిక వలయాన్ని
నేను
అలలను మీటితేకానీ అర్థంకాను
కలలను దాటితేకానీ అందను
కొన్ని అలలు పాదాలను పలకరిస్తాయి
కలలు రెప్పలను కలవరపెట్టినట్లు
ఇంకొన్ని అలలు మోకాళ్లను తడుముతాయి
కలలు మనసును మోసుకొచ్చినట్లు
మరికొన్ని అలలు నడుమును కొలుస్తాయి
కలలు కవ్వమై జీవితాన్ని చిలుకుతున్నట్లు
అసలైన అలలు నిలువునా తడుపుతాయి
సిసలైన కలలు ఇలన సాకారమయినట్లు
*
నేను
అఖండాన్ని
కడలి కేంద్రాన్ని
బిందు అంతస్సత్త్వాన్ని
తుంపర తెంపరితనాన్ని
ముత్యమంత ఒంటరిని
అయినా
తీరం నిండా
నా అడుగుజాడలే
నా చరిత్ర చెలమలే
*
అవును
సముద్రమంత అస్తిత్వం నాది
ఉదయమంత ఉద్యమం నాది
అస్తమయమంత అంతర్గమనం నాది
అవునవును
మిట్టమధ్యాహ్న తాపాన్ని నేను
నడిరేతిరి వౌనాన్ని నేను
శబ్ద వలువను నేను
నిశ్శబ్ద విలువను నేను
*
అన్నట్టు
నేను-
ఉభయసంధ్యల
పున్నమి కెరటాన్ని
అమవస కిరణాన్ని
అప్పుడప్పుడు
తుఫాను నవుతుంటాను
ఎప్పుడో ఒకప్పుడు
సునామీ నవుతుంటాను
*
అయినా
నేను
దశావతార సృజనను
తరతమల గమనికను
నవనాడుల చరిత్రను
నాది
తారలతో సహజీవనం
గ్రహాలతో సమభోగం
రుషులతో సంయోగం
ఆది అంత జీవనయోగం
దృశ్య అదృశ్య యోగ జీవనం

-విశ్వర్షి 9393933946