వాసిలి వాకిలి

నేను.. శుద్ధ సిద్ధత్వాన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1
నేను
దాటాలి
నన్ను నేను దాటాలి
నన్ను నేను దాటిపోగలగాలి
దాయటం దాటాలి
దాగటం దాటిపోగలగాలి.
*
కదలిన గాలి
దాటింది నిన్నూ నన్నూ కాదు
తనకు తానుగా పరిణమించటానికే!
ప్రవహిస్తున్న నీరు
ఇరువైపులా వొరుసుకునేది
తనకు తాను ఉధృతం కావటానికే!
రాజిల్లిన నిప్పు
పైపైకి మంటలా ఎగయటం
తన హద్దులను పెంచుకోటానికే!
ఉరుము ఆకాశాన దాగిన శబ్దానిదే
ఉగ్రత్వం శబ్ద ఉనికిని పంచటానికే!
చీకటింట కాపురముంటేనే
కాంతికి పుట్టినింటి చిరునామా
ఏడడుగులతో మెట్టినింటి చిరునామానే
నడక సాగుతున్న కొద్దీ విస్తృత వేగమే!
గొంగళి పురుగే సీతాకోకచిలుక
వేపగింజే పరివ్యాప్త మహామ్రాను
ఎగిరినా ఎదిగినా దాటటమే.
*
నా దేహాన్ని దాటాలి
దేహాభ్యంతరాలను దాటిపోగలగాలి.
నా మనస్సును దాటాలి
మానసికాంశాలను దాటిపోగలగాలి
నా అంగాలను దాటాలి
అంగాంగ వైభోగాన్ని దాటిపోగలగాలి
నా చూపును దాటాలి
చూపుడును దాటిపోగలగాలి
నా నీడను దాటాలి
వీడని నీడను దాటిపోగలగాలి
నా ధ్యాసను దాటాలి
ధ్యానయాసను దాటిపోగలగాలి
నేను ధ్యానం కావాలి
యోగభాషను అవ్వాలి
2
నేను
అక్షరాన్ని దాటాలి
క్షరసంపదను దాటాలి
అక్షర మేధస్సును దాటిపోగలగాలి
గురువును దాటాలి
గురు పీఠాన్ని దాటిపోగలగాలి.
*
నా జీవితాన్ని దాటాలి
భవిష్య కాలాన్ని దాటిపోగలగాలి
నా మూర్తిని దాటాలి
వర్తమానం నుండి విడివడగలగాలి
నా కృతకాన్ని దాటాలి
గత అరువుకు గతం కాగలగాలి
నేను మూడు కోట్లను దాటాలి
మూఢమతులను కాదనగలగాలి
నేను అనుకరణను దాటాలి
అడుగు అడుగున ముందడుగు కావాలి.
3
నేను
భాషను దాటాలి
భావలయ భాషను దాటాలి
భూవలయ భాషను దాటిపోగలగాలి
పుట్టని శబ్దాన్ని చేదుకోగలగాలి
పుట్టిన నిశ్శబ్దాన్ని చేరుకోగలగాలి.
*
నా పుట్టుక
ప్రశ్న అయితే సమాధానం నేనే
సందేహించటం సమాధానించటం
రూపించిన భౌతిక అస్తిత్వానివా!
సాధించటం సంయోగించటం
రూపించని నిశ్శబ్ద అంతస్తత్వానివా!!
నాతోబాటు నా అహంభావమూ పుట్టింది
జంటగా వచ్చిన మాకు విడాకులెందుకు
లెక్కగా వుందామన్న ఒడంబడిక మాకుంది
అవును, నేను
పర అహాన్ని ఇహ చైతన్యాన్ని
4
విరిగిన అల
తన విరుపును దాటి సాగటం లేదూ
పెరిగిన కల
తన పరిధిని దాటి పరిక్రమించటం లేదూ
ప్రాపంచికంగా పెరిగిన ఆలోచన
ఎల్లలు చెరుపుకుని పరాన్ని చేరటం లేదూ
పగలయినా రాత్రిలో కలవాల్సిందే
రాత్రయినా పగలును చేరాల్సిందే.
అవును,
ఇహ పర్వాలు సార్వకాలికాలే
అహ చైతన్యాలు యోగభూమికలే.
*
ఆలోచన ఆకాశానికి నిచ్చెన వేస్తుంది, సరే
లోచన దిగంతాలను చేరాలి కదా
కాంతి మండలాలు కనిపిస్తాయి, సరే
కళ్లు పెనుచీకట్లను కనాలి కదా
వాసనలు భౌతిక సంపదలు, సరే
నాసికాగ్రాన పరవాసన నిలవాలి కదా
చెవులకు సుస్వరాలు ఇంపులు, సరే
ప్రళయఘోష వినిపించాలి కదా
అవును,
సూర్యచంద్రులు స్నేహిస్తుంటేనే
ఇడా పింగళుల ధ్యానం నిరాటంకమయ్యేది.
5
నేను
దేహానికి ఇరు పోకడల ప్రాణవాహికను
మూడున్నర చుట్ల నిర్వాణ వేదికను
బాహ్యానికి రెండు రూపాల శ్వాస నిర్వహణను
అంతరంగానికి నిత్యమైన ఏకశ్వాసను
పూరక చర్యను కుంభక క్రియను రేచక యోగాన్ని
జన్మ రహస్యాన్ని మృత్యు స్పర్శని జీవకణాన్ని
మూడు కోశాలకు అందని మూలకోణాన్ని
దేహ సంస్కారానికి చేతనాంకాన్ని.
*
నాడీ నాడీ నడుమ బ్రహ్మనాడిని
కుడి ఎడమల జీవ ప్రమోదాన్ని
స్థూల సూక్ష్మల శక్తి ప్రభంజనాన్ని
అగుపించని నాడికి ఆజ్ఞాప్రజ్ఞానాన్ని
కపాలాన నిలిచిన సహస్రోదంతాన్ని
కుండలినిన పదిల ఆత్మస్రోతస్సుని.
6
నా సంకల్పం చీకటి వలయానికి కేంద్రం
నా రూపం అరూప చిత్రానికి మూలం
అవును, నేను
రూప అరూపాల మేలు జగతిని
ఆది అంతాల మూల సృష్టిని
దేహ విదేహాల విశ్వసనీయ విశ్వాన్ని
మురిపించే మనసుకు దిశా నిర్దేశాన్ని
అభేదానికి సిద్ధత్వాన్ని శుద్ధత్వాన్ని
*
కాను, విగ్రహావతారుల భక్తి సంస్కారాన్ని
కాను, మతబడిన నేర్చిన భక్తి సంప్రదాయాన్ని
నేను, గర్భాలయాన
జీర్ణించుకున్న యోగ సంసారాన్ని
చనుబాలతో
పారాడిన యోగ సంస్కారాన్ని.
7
నేను బ్రహ్మయోగిని
చతుర్ముఖ శుద్ధబ్రహ్మని
పర పశ్యంత మధ్యమ వైఖరుల శబ్ద స్పర్శని
నిమీలిత నిర్మోహ నిశ్శబ్ద సంకల్ప లోచనని.

-విశ్వర్షి 93939 33946