Others

బ్రహ్మచారి ప్లాష్‌బ్యాక్@ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1925లో కృష్ణా జిల్లా పునాదిపాడులో జన్మించారు అనుమోలు వెంకట సుబ్బారావు. నిర్మాత, దర్శకుడు యల్.వి.ప్రసాద్ పట్ల అభిమానంతో వారి పేరిట ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. తొలుత యల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో 1953లో ‘‘పెంపుడు కొడుకు’’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఆ తరువాత టి.ప్రకాష్‌రావు, ప్రత్యగాత్మ వంటి పలువురు దర్శకులతో తెలుగు (23), హిందీ (5), తమిళ (3), కన్నడ (2), మళయాళం (1) చిత్రాలు రూపొందించారు. ‘‘నవరాత్రి’’ (65) చిత్రానికి ఆ తరువాత 1968లో నిర్మించిన ‘బ్రహ్మచారి’ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. 1935లో కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించిన వీరు సినీరంగంపై అభిలాషతో మద్రాసు వెళ్లి తాతినేని ప్రకాశరావుగారి ప్రోత్సాహంతో, దర్శకులు ప్రత్యగాత్మ వద్ద సహాయకునిగా పనిచేశారు. ‘‘నవరాత్రి’’తో దర్శకులుగా మారిన వీరు ఆపైన 65 దాకా తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిల్లో ఎన్‌టిఆర్ నటించిన యమగోల, కృష్ణ, శోభన్‌బాబుల మంచిమిత్రులు, ఎఎన్‌ఆర్ భార్యాబిడ్డలు, ఆలుమగలు, అంధాకానూన్, జుదాయి వంటి ఎన్నో హిట్ చిత్రాలున్నాయి.
‘‘బ్రహ్మచారి’’ చిత్రానికి ప్రముఖ (కథ, స్క్రీన్‌ప్లే తమిళ, తెలుగు) రచయిత ఎం.బాలమురుగన్ కథ నందించారు. వీరు ఆ తరువాత కొన్ని హిందీ చిత్రాలకు, కథలను అందించటమే కాక, ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
బ్రహ్మచారి చిత్రానికి మాటలు భమిడిపాటి రాధాకృష్ణ, ఫొటోగ్రఫీ పి.యస్.సెల్వరాజ్, కళ జి.వి.సుబ్బారావు, నృత్యం తంగప్ప, స్టంట్స్ రాఘవులు అండ్ పార్టీ, సంగీతం టి.చలపతిరావు, దర్శకత్వం తాతినేని రామారావు.
రావు బహద్దూర్ రాజమార్తాండ కుమారుడు రావు సాహెబ్ పరంధామయ్య (నాగభూషణం) భార్య గజలక్ష్మి (సూర్యకాంతం). వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు ఆనందరావు (ప్రభాకర్‌రెడ్డి), చిన్న కుమారుడు రామకృష్ణ (అక్కినేని నాగేశ్వరరావు). రామకృష్ణ పరమహంస లక్ష్యాలు ఆదర్శంగా భావించే ఆంజనేయ భక్తుడు. జీవితాంతం బ్రహ్మచారిగా జీవిస్తానని శపథం పడతాడు. కాలేజీలో చదువుకుంటున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న వసంత (జయలలిత) అతన్ని ప్రేమిస్తుంది. పెళ్లాడాలని భావించి రామకృష్ణకు ఆ సంగతి తెలియజేస్తుంది. ఆమె కోరికను తిరస్కరించిన రామకృష్ణతో నేను మిమ్మల్నే వివాహం చేసుకొని బిడ్డను కని మీచే జోల పాడిస్తానని శపథం చేసి వెళుతుంది.
ఆ తరువాత వసంత తన సోదరి జానకి (సుకన్య) రామకృష్ణ అన్న ఆనందరావు కారణంగా మోసపోయి బిడ్డను కని మరణించగా, ఆ బిడ్డతో పరంధామయ్య ఇంటికి వచ్చి, ఆ బిడ్డ తనకూ, రామకృష్ణకు పుట్టిన కుమారుడని సాక్ష్యాల పరంగా నిరూపిస్తుంది. చివరకు దీనికంతకూ కారణం ఆనందరావని రుజువు కావటం, బాబును అంతం చేయబోయిన అన్నగారి నుండి రామకృష్ణ బాబు ను రక్షించి వసంత త్యాగానికి ఫలితంగా తన బ్రహ్మచార్యం వదిలి ఆమెను వివాహం చేసుకోవడంతో చిత్రంగా శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఎఎన్‌ఆర్ స్నేహితుడు జోగులుగా (చలం), దేవయ్యగా (రాజబాబు), మల్లికగా (రమాప్రభ), ఆమె తండ్రి బంగారయ్యగా (రమణారెడ్డి), ఆనంద భార్య శాంతగా (పుష్పకుమారి), తాతగా (పెరుమాళ్లు), డాక్టర్‌గా రావి కొండలరావు ఇతరులు నటించారు. డాక్టర్‌గా రావికొండలరావు కొద్దిసేపు గుర్తుండిపోయేలా నటించారు.
దర్శకులు తాతినేని రామారావు సన్నివేశాలను తమాషాగా, కొంత హాస్యభరితంగా, సీరియస్‌నెస్ జోడించి రూపొందించారు. నాగభూషణం తండ్రి పేరు రాజా రంగమార్తాండ ప్రస్తావిస్తూ భార్యను చేతిపై దెబ్బతో అదిలించటం, ఒకోసారి చెంపపై ముద్దు పెట్టమని కోరడం, వసంత, రామకృష్ణల అనుబంధం గూర్చి సందేహాలు, ఇక రామకృష్ణ, వసంతల పరిచయం, ప్రేమ, శపథం, వాటికి వసంత, రామకృష్ణల స్పందన, చలం, రమాప్రభల ప్రేమపెళ్లి చివర ఆనందరావు విలనీ ఎంతో అర్థవంతంగా, కుటుంబపరంగా చిత్రీకరించి అలరించారు. ఇక ఎఎన్‌ఆర్ రామకృష్ణగా కొంత అమాయకునిగా, బ్రహ్మచర్యం పట్ల స్థిర నిశ్చయం, తనవల్ల ఎవరూ బాధపడకూడదని వసంతకు తన గొలుసు ఇవ్వటం, ఆమె ప్రేమను ఎంతో స్థిరంగా తిరస్కరించటం, తన భార్యగా ప్రవేశించాక అది నిజం కాదని పట్టుదలతో నిరూపించే ప్రయత్నాలు, బాబు పట్ల అభిమానం, ఒక దశలో వసంత పట్ల ఆకర్షణ చివరలో బాబును సాహసంతో రక్షించే యత్నం, పలు విధాలైన భావాలను సన్నివేశానుగుణంగా పరిణితితో కూడిన నటనతో మెప్పించారు.
ఇక వసంతగా జయలలితగా మొదట అల్లరిగా ప్రేమించిన ప్రియుడిని పొందాలని ఆరాటం, ఆపైన దాన్ని నెరవేర్చుకోవాలని శపథం, రామకృష్ణ భార్యగా అత్తమామల వద్ద అణకువ, మధ్యలో రామకృష్ణను ఇబ్బంది పెట్టడం, చివరకు ఆనందరావును నిలదీయడం, అత్తమామల వద్ద నిజం తెలియజేయటం పలు సన్నివేశాలను చురుకుగా, అల్లరిగా, తరువాత నిండుతనంతో, నెమ్మదిగా శాంతం, సహనంతో కూడిన ఆకట్టుకునేనటన చూపారు.
టి.చలపతిరావు సంగీతంతో రాజిల్లిన చిత్రగీతాలు టైటిల్ సాంగ్ ‘ఓ బ్రహ్మచారి నిన్నుకోరి’ (రచన-సినారె, గానం-పి.సుశీల, ఎస్,జానకి, బి.వసంత బృందం). (జయలలిత, రమాప్రభ, ఎఎన్‌ఆర్ బృందంపై చిత్రీకరణ), మరో గీతం జయలలిత, ఎఎన్‌ఆర్‌లపై స్వప్నగీతం 3 విధాలుగా మొద ట ఇంగ్లీషు డ్రెస్‌లో మ్యూజిక్, ఆ తరువాత ఎంకినాయుడు బావగా ఆపైన రతీమన్మథులుగా ముచ్చటగా చిత్రీకరణ ‘‘ఎవ్వరూ లేని ఈ చోట (పి.సుశీల, ఘంటసాల, రచన దాశరథి, శ్రీశ్రీ), జయలలిత ఎఎన్‌ఆర్‌ను కవ్విస్తూ పాడేపాట ‘‘ఒక్కసారి సిగ్గుమాని నన్ను చూడండి శ్రీవారు (పి.సుశీల, రచన దాశరథి), ఎఎన్‌ఆర్, బాబుతో జయలలితలపై గీతం ‘‘ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు (ఘంటసాల, పి.సుశీల- రచన ఆత్రేయ), చలం, రమాప్రభలపై హాస్య గీతం ‘‘నిన్ను చూసాను కన్నువేశాను’’ (టిఆర్ జయదేవ్, వసంత, రచన కొసరాజు), ఎఎన్‌ఆర్‌పై పద్యం ‘‘బ్రహ్మచారుల లోకం బంతివైన (రచన సినారె, గానం కెబికె మోహనరాజు)
‘‘బ్రహ్మచారి చిత్రం 1-02-1968లో విడుదలయి విజయవంతంగా ప్రదర్శించబడి సక్సెస్ సాధించింది.
ఈ చిత్రాన్ని తాతినేని రామారావు గారి గురువు ప్రత్యగాత్మ దర్శకత్వంలో హిందీలో ‘ఏక్‌నారి ఏక్ బ్రహ్మచారి’గా రూపొందించబడింది. ఆ చిత్రంలో ముంతాజ్, జితేంద్ర హీరో, హీరోయిన్లుగా, ఆనందరావుగా శత్రుఘ్నసిన్హా నటించారు. హిందీ చిత్ర నేటివిటీకి తగ్గట్టు క్లయిమాక్స్ కొద్దిగా మార్చటం, ఆ చిత్రం కూడా విజయం సాధించడం విశేషం. బ్రహ్మచారి చిత్రంలో పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తుండటం విశేషాంశం.

-సి.వి.ఆర్ మాణిక్యేశ్వరి