Others

వార్త-వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరీ అంత భీషణ క్రౌర్యమా?
ఒక కుర్రాడు మనతోపాటు రైలులో ప్రయాణం చేస్తూ మన వాటర్ బాటిల్ తీసుకుని నాలుగు గుక్కలు నీళ్లు తాగాడే అనుకోండి- ఏం చేస్తాం? నాలుగు మాటలు అంటాం, వూరుకుంటాం గాని, రుూ సంఘటన పరికిస్తే మాత్రం నిశే్చష్టులైపోతాం. పోయినవారం ముంబాయికి వస్తున్న లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి పదకొండు గంటల వేళ జబల్‌పూర్‌లో ఆగింది. పాతికేళ్ల కుర్రాడు సుమీత్ అనేవాడు తెల్లారేపాటికి ముంబాయి చేరుకుందామని హడావుడిగా రైలు ఎక్కాడు. అతనికి ముంబాయిలో ఉద్యోగం. అదే కంపార్టుమెంటులో ముగ్గురు యువకులు ముంబాయిలో ఏవో పోటీ పరీక్షలు రాయడానికి వెళ్తున్నారు. సుమీత్ దాహానికి తట్టుకోలేక వాళ్ల దగ్గర వున్న వాటర్ బాటిల్ అందుకుని నాలుగు గ్రుక్కలు మింగాడో లేదో వాళ్లు అతనిమీదకి లేడిపిల్ల మీదకి లంఘించిన పెద్ద పులిలా పడి కొట్టిన చోట కొట్టకుండా చితకబాదేశారు. అతను తాగింది నీళ్లు, వాళ్లు తాగుతున్నది మద్యం. అప్పటికే నిద్రావస్థలో వున్నారు జనం- రక్షక భటులు ఎప్పుడో నిద్రాదేవి వొడిలో హాయిగా పడుకుని ఉంటారు. ఈ ముగ్గురు ముష్కరులకి సుమీత్‌మీద యింకా కసి తీరలేదు. మా బాటిల్ తీస్తావా? నీ గుండెలు తీస్తాం అంటూ వాళ్లు బెర్తుపైన వున్న గొలుసు లాగేశారు. రైలాగిపోయింది. ఈ కుర్రవాణ్ణి కంపార్ట్‌మెంట్ బయిటికి లాగి వెలుపల కిటికీ కడ్డీలకి చేతులు, కాళ్లు పెట్టి త్రాళ్ళతో గట్టిగా కట్టేశారు. అలా వ్రేలాడుతు వున్న ఆ కుర్రవాణ్ణి, వాళ్ళు తమ బెల్టులు తీసి దెబ్బలు కొట్టి ట్రయిన్‌లోకి వెళ్లిపోయారు. రైలు డ్రయివరు మరీ బద్ధకస్తుడు. ఎందుకో ఆగిందిలే అనుకుంటూ బ్రేకులు రిలీజు చేసి రైలుని లాగించేశాడు. నాలుగు గంటలసేపు ఆ రైలు ‘ఏకటాకీ’న పరుగులు తీసి- ఇటార్సిలో ఆగేసరికి రుూ దుష్టులు (విక్కీ, రవీ, బలరాంలు వాళ్ల పేర్లు) మళ్లీ రైలు దిగి తమ బెల్టులు వూడదీసుకొని కుర్రవాణ్ణి బాదటం మొదలెట్టారు. ఫ్లాట్‌ఫామ్‌మీదగల జనాలు విస్తుబోయి అంతలో తేరుకుని రుూ ముగ్గురి అడ్డుకున్నారు. ఆర్.పి.ఎఫ్ భటుల్ని నిద్రలేపి తీసుకొచ్చి వాళ్లకు వీళ్లని అప్పగించారు. కుర్రవాడికి ప్రాణాలు దక్కాయి. కాని స్పృహ లేదు. ఈ ముగ్గురు పాట్నాకి చెందిన వాళ్లు- సాధారణంగా బీహార్, పాట్నా ప్రాంతం వెళ్ళే - వచ్చే రైలు బండిల్లో దౌర్జన్యాలు ఎక్కువ అంటారు. అదే ఋజువు అయింది. కాకపోతే శోచనీయమైన విషయమేమిటంటే ఆ ముగ్గురు దుష్టులకి మరునాడే ‘బెయిల్’ దొరికిపోయింది.
అక్కడ అన్యమత దూషణ అపచారం!
అక్కడ అంటే అమెరికాలో మన దేశంలో కాదు, టెక్సాస్‌కి చెందిన ‘కెమావ్‌టవున్’లో ఒక పాకిస్తానీ అమెరికన్ మహమ్మూద్ దార్ అనే అరవై ఐదు సంవత్సరాల పెద్దమనిషి ఒక పెద్ద ‘డైరీ -రెస్టారెంట్’ చాలాకాలంగా నడుపుకుంటున్నాడు. విఖ్యాత పాల ఉత్పత్తుల విక్రయ సంస్థ ‘క్వీన్స్ డైరీ’కి రుూ సాయిబుగారు అధీకృత విక్రేత. తన డైరీ రెస్టారెంట్‌ల నిండా హిందూమతాన్ని దేవతల చిత్రపటాలని విస్తారంగా తగిలించాడు. మంచిదేగా అనుకోకండి. కాని అన్నీ దూషణలతో నింపేశాడు. ‘‘హిందూయిజం చీకటి యుగం నాటి వానర తత్వంగల మతం. మూఢనమ్మకాల పుట్ట’’ అంటూ వేళాకోళ వ్యాఖ్యలతో గడిచిన ఆరు మాసాలుగా రంగు రంగుల పోస్టర్లు, పెయింటింగ్‌లూ వ్రేలాడదీసి వ్యాపారం సాగిస్తున్నాడు. ఇది ఆ నోట ఆ నోట ప్రాకింది. మీడియాలో పెద్ద పెట్టున పబ్లిసిటి దొరికింది. క్వీన్స్ కంపెనీ దృష్టికి వెళ్లింది. ‘‘మా అధీకృత వ్యాపారి చేస్తున్న దుశే్చష్టలను మేం ఖండిస్తున్నాం. అతని పద్ధతి మార్చుకోపోతే మేము లైసెన్సు రద్దుచేస్తున్నాం’’ అని ప్రకటించారు. మహమ్మూద్ దార్ (65) యిది వాస్తవం అన్నాడు. హిందువులు కోతులు అని నేను పధ్నాలుగు సంవత్సరాలు పరిశోధనలు చేసి ప్రకటిస్తున్నాను అంటూ మొండికేశాడు. ఆ విధంగా తన షాపుని, రెస్టారెంటుని మూసేసుకున్నాడు. కొత్త డీలరు వచ్చేదాకా క్వీన్స్ డైరీ రెస్టారెంటూ తెరుచుకోదు. మహమ్మూద్ దార్ నలభై సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డాడు. అయితే అన్యమత దూషణ అతనికి ఒక వ్యసనంలాగా అయింది. నిజానికి అతని రెస్టారెంట్‌లో ఎలిజిబెత్ రాణి, పోప్ పాల్ జాన్, దలైలామా లాంటి మత నాయకుల బొమ్మలు పెట్టాడు. వాళ్లంతా ‘జాతి విచక్షణ’ను పోషిస్తున్నవారేనంటూ ఎన్నో వంకర రాతలు రాశాడు. ‘‘ఇంతటి అన్యమత దూషణను సహించడం కష్టం’’ అని ఎందరో క్వీన్స్ డైరీ రెస్టారెంట్‌కు రావడం తగ్గించారుట. దీంతో దుకాణాన్ని మూయించేశారు. అమెరికాలో యూదులకి చెందిన మోటారు కార్లమీద, ద్విచక్రవాహనాల మీద కూడా కొందరు ‘స్వస్తిక్’ గుర్తుపెడుతూ వుంటారు. కాని అధికారులు దుండగులు పట్టుకోలేకపోతున్నారు అటువంటివాళ్లని- ‘‘దయచేసి మీ వాహనాలను సిసి కెమెరాలు వున్న దగ్గర పార్కింగ్ చేసుకోండి’’ అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారుట!

దేశం మారితే తీరు మారునా?
అలవాట్లు చస్తేగాని పోవు అంటారు. కారా, జర్దా, మసాలా కిళ్లీలు బుగ్గని బిగించి- బాగా నమిలి ఉమ్మితేగాని జన్మ ధన్యం కాదు, కొందరు మనవాళ్లకి.
ఇది గుజరాతీల స్పెషల్- కాని లండన్ వెళ్లినా యిలా గోడలు, వీధులూ రక్తవర్ణశోభితం చేసి అక్కడి జనాల్ని చంపడం కూడా మన వాళ్ల జన్మహక్కేననిపిస్తోంది. లండన్ దగ్గిర లీసెస్టర్ నగరంలో (దాన్ని వాళ్లు ‘లెస్టర్’ అనే పిలుస్తారు) గుజరాతీ నగల వ్యాపారులు, నగల దుకాణాలూ ఎక్కువ. వీళ్లంతా పాన్‌ప్రియులు, కారా కిళ్లీదాసులు. పాపం, వాళ్ల పబ్లిక్ రోడ్లన్నీ ఎర్రటి ఉమ్ములతో ఖరాబు చేస్తున్నారు. ఏమంటే గోడమీద ‘నో స్పిట్టింగ్’ అని బోర్డేది? అంటారు. బోర్డు వుంటే ‘చూడలేదు, సారీ!’ అంటారు. మన అపార్ట్‌మెంట్‌లులాగా రోడ్ కార్నర్‌లలో దేవుళ్ల బొమ్మలు అతికించాలి కాని అక్కడ అది కుదరదు. ఇక స్థానిక మున్సిపాలిటీ ప్రత్యేకంగా ఒక చట్టం చెయ్యాలనుకుంటుంది. అమ్మేది వజ్రాలు, రత్నాలు బంగారం నగలు- ఉమ్మేది కిళ్లీ తమీలు. ఈ సిటీలో రెండు వీధులున్నాయి. ఝువేరీ వర్కులకు ఫేమస్ అవి. ఒకటి బెల్‌గ్రేడ్ వీధి, రెండోది మెల్టన్ రోడ్- వీటికి నిక్‌నేమ్ ‘గోల్డెన్‌మైత్’- కాని యిప్పుడు మున్సిపాలిటీ వర్కరులు వీటిని ఎర్ర (మరకలు) వీధులని పిలుస్తున్నారట. కిళ్లీ తిని ఉమ్మితే ఎనభై పౌండ్ల జరిమానా అని రాసినా రుూ కల్చర్ ఆగటం లేదు అని వాపోతున్నారు సిటీ బాసులు. ఎంత కడిగినా పోవండీ రుూ మరకలు అంటూ పారిశుద్ధ కార్మికులు గోల!
కొసరు
గడియారాల ప్రకటనలలో టైము ఎప్పుడూ పదీ పది చూపెడుతూ వుంటుంది, గమనించే వుంటారు. దీనికి ఎన్నో కారణాలు, ఉత్తి పుక్కిటి పురాణాలున్నాయి. కాని వాస్తవం వాచ్ కంపెనీలు చెప్పేశాయి. గడియారం ఏదయినా దాని మొహం మీద కంపెనీ ‘లోగో’- పేరూ వివరం వెయ్యాలి. అది 12 గంటల క్రింద లేదా మధ్యన వెయ్యాలి. అలా వేసి అవి కనపడాలంటే ముళ్లకి బెస్టు చోటు ‘పదీ పది’ లేదా నాలుగూ యిరవై నిమిషాలు- రెండోది ఎవ్వరికీ అందంగా లేదుట. అంచేత ఏ రెండు గడియారాలైనా మన చేతికి, గోడకీ వుంటే ఒకే టైము చూపించవు కాని ప్రకటనలలో మాత్రం ఎల్లవేళలా ఎల్లచోట్ల ఒకే టైము చూపెడతాయహో!
*

-వీరాజీ veeraji.pkm@gmail.com