మెయిన్ ఫీచర్

కో అంటే కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమె ఆనందం.
నిజానికి -ఈ రెండు పదాల పరమార్థం వేరు. పరిశ్రమలో చెప్పుకుంటున్న అర్థం వేరు. గోరంత అందంవుంటే.. కాలం కలిసొచ్చి ఒకటో రెండో హిట్లుపడితే -ఆ అందగత్తె కెరియర్ కోటలు దాటేసినట్టే. కోట్ల పారితోషికం ఆమె అందంముందు వినమ్రంగా వాలినట్టే. అవునుమరి.. పరిధిపరంగానూ, బడ్జెట్ పరంగానూ -విస్తరిస్తున్న తెలుగు సినీ పరిశ్రమలో కోట్లు దండుకుంటున్న.. సారీ కోట్లు అందుకుంటున్న స్థాయికి హీరోయిన్ చేరుతోంది. టాలీవుడ్డంతా హీరోల రాజ్యమేనన్న పరదా వెనుక నిలబడే -తన అందాలకు భారీగానే పారితోషికాన్ని అందుకుంటోంది.
---

ఇచ్చేవాళ్లుంటే -పుచ్చుకునేవాళ్లంతా అందగత్తెలే. ఇప్పుడు టాలీవుడ్‌లో నడుస్తోన్నదిదే. అందగత్తె -అందంగా కనిపిస్తే ఒక రేటు. అందాన్ని -మరింతందంగా చూపిస్తే మరో రేటు. కాల్షీట్లు ఎక్కువిస్తే సెప’రేటు. పాటేసుకోవడమో.. డబ్బింగ్ చెప్పడంలాంటి ఎక్స్‌ట్రా గ్లామర్‌కు ఇంకో రేటు. ఏతావాతా -పారితోషికంగానో, స్పెషల్ గిఫ్ట్‌ల రూపంలోనో టాలీవుడ్ తారలకు పరిశ్రమ బాగానే ముట్టచెబుతుంది.

---
టాలీవుడ్డంతా హీరోల రాజ్యమేనన్న ట్రాన్స్‌పరెంట్ తెరవెనుకే నిలబడినా -అవకాశమున్నచోట, మేకర్స్ సహకరించినచోట అగ్రతారలు బరువైన పారితోషికాలే అందుకుంటున్నారు. హీరోకి ఫిఫ్టీ పర్సంట్.. హీరోయిన్‌కి ట్వెంటీ ఫైవ్ పర్సంట్.. నిర్మాణం ట్వెంటీ ఫైవ్ పర్సంట్ ఈక్వెషన్‌తో తెలుగు సినిమాలు తయారవుతున్నాయంటే -అందగత్తెలకు పరిశ్రమ నుంచి అందుతున్న ప్రోత్సాహం ఎలాంటిదో అంచనా వేయొచ్చు.
ఇక -కథానాయిక చుట్టూ తిరిగే కథలొచ్చినా.. పోస్టర్ మీద ఆమె ఎక్స్‌ట్రా అట్రాక్షనైనా.. స్క్రీన్‌మీద వీలైతే నాలుగు మత్తెక్కించే మాటలు, కుదిరితే అరడజను చిలిపి ఎక్స్‌ప్రెషన్లు ప్రత్యేకంగా పలికించాల్సి వచ్చినా -తనకున్న స్టార్ ఇమేజ్‌తో సినిమాను గుణకార భాగాహారాలు చేసి -రేటును మరికాస్త బలంగా బిగించడం స్పెషల్ స్టయిల్. పాత్ర తీరు, పరిధి, నటనకు అవకాశంలాంటి పనికిరాని మాటలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది కనుక -సినిమాని వారంపాటు భుజస్కంధాలపై మోయడంలో తన అందానిదీ ప్రధాన పాత్రేనంటూ ‘హీరోయిన్లు’ కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. కోట్లకు పడగలెత్తుతున్నారు. ఫలానా హీరో పక్కన ఫలానా హీరోయిన్ అన్న కాంబో కబుర్లు వచ్చిన ప్రతిసారీ -రెమ్యూనరేషన్ ఎంతై ఉంటుందన్న ప్రశ్నాసక్తి తలెత్తడం సహజం. నిజానికి -రేటెప్పుడూ రహస్యమే. బడ్జెట్‌ను బట్టి, నిర్మాణకర్త సత్తానుబట్టి, బ్యానర్‌తోవున్న అనుబంధాన్ని బట్టి, కాంబినేషన్లపై జయాపజయాల కాలిక్యులేషన్స్ బట్టి, ఆ సినిమాకు ఆమె ఇవ్వాల్సిన కాల్షీట్లబట్టి -హీరోయిన్ పారితోషికం మారుతూ ఉంటుందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
మూడేళ్ల క్రితం నాటి తెలుగు సినిమా వేరు. మూడేళ్ల కాలంలో వచ్చిన, వస్తోన్న మార్పులు వేరు. దీనికి అనుగుణంగానే హీరోయిన్ల ధరవరలూ, వాళ్లకు ముట్టజెబుతున్న పారితోషికాల హెచ్చుతగ్గులూ మారుతూ వస్తున్నాయి. మూడేళ్ల క్రితం వరకూ పట్టుమని పాతిక కోట్లుపెట్టి సినిమా తీయడం అంటే గగనం. ఇప్పటి ఆర్థిక పరిస్థితులు మారాయి. పెద్ద సినిమా అంటే 50నుంచి వంద కోట్ల బడ్జెట్ లెక్కలు వినిపిస్తున్నాయి. సో.. పెరుగుతున్న బడ్జెట్ పరిమితి, విస్తృతి, స్థాయి, సత్తాను బట్టి హీరోయిన్ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది, పెరుగుతుందని అంటున్నారు. మార్కెట్ వర్గాలనుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం -టాప్ హీరోయిన్ల పారితోషికాల లెక్కలు తీసుకుంటే...
***
ముదిరిన వయసులోనూ ముదిమి అందాలతో అవకాశాలను అందుకుంటున్న నయనతార -నాలుగు కోట్ల రేంజ్‌కు చేరుకుంది. సీనియర్ హీరోల సరసన ఏ పాత్రకైనా ఇమిడిపోగల నయన్ టైం టాప్ రేంజ్‌లో పరిగెడుతుంది. బాలీవుడ్‌లో సెనే్సషన్ క్రియేట్ చేసిన ‘క్వీన్’ ప్రాజెక్టు తమిళ వర్షన్‌ను -పైకం సెట్టవ్వక వదిలేసుకుందంటే.. నయన్ రేంజ్ ఎక్కడికి చేరిందో అంచనా వేయొచ్చు. ఒకప్పుడు -కోటి డిమాండ్ చేస్తుందంటే.. అవునా! అన్నవాళ్లే.. ఇప్పుడు మూడు నాలుగు కోట్ల తక్కువకాకుండా అడుగుతుందంటే -ఇవ్వొచ్చులే అంటున్నారు. అదీ మల్లూ బేబీ రేంజ్. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఒక రేంజ్‌తో దూసుకుపోతున్న నయన్ -ఈమధ్య తమిళంలో రెండు మూడు హారర్ హిట్లందుకుని పారితోషికాన్ని నాలుగుకు చేర్చేసిందని అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన ‘బాబు బంగారం’ చేస్తున్న నయన్‌ను, 150వ చిత్రంతో స్క్రీన్ టర్న్ తీసుకుంటున్న చిరంజీవి ప్రాజెక్టు కోసం పెద్ద మొత్తంతోనే కాంటాక్ట్ చేస్తున్నట్టు వినికిడి. ప్రాజెక్టు ఇచ్చినా ఇవ్వకున్నా పారితోషికంలో రిబేట్లు ఉండవని తెగేసి చెప్పేస్తుండటంతో, ఆమె కోసం క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న నిర్మాతలు, దర్శకులు కిక్కురుమనకుండా వెనుతిరుగుతున్నార్ట. అటు కుర్రాళ్ల సరసన గ్లామర్ పాత్రలకూ, ఇటు సీనియర్ల పక్కన పెద్దరికం పాత్రలకూ సరిగ్గా సూటవుతున్న నయన్, కుటుంబ కథా చిత్రాలకూ కొత్త సోకు తెచ్చింది. అందుకే -ప్రమోషన్‌కు రానంటూ కండిషన్లు పెడుతున్నా చచ్చినట్టు అడిగినంతా ఇచ్చి ఆమె కాల్షీట్లు సంపాదిస్తున్నారు.
***
అరుంధతి, వర్ణ, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరోలాంటి వైవిధ్యమైన సినిమాలతో స్వీటీ అనుష్క రేంజ్ టాప్‌కు చేరింది. కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలు, కుర్ర హీరోలతో క్యూట్‌గా చిందులేసే అందమైన పాత్రలకూ స్వీటీకి ప్రత్యామ్నాయం లేరు. సో, అరుంధతి హిట్టునుంచి ఆమె పారితోషికం కోటిదాటితే, బాహుబలి నుంచి రెండు కోట్లు దాటేసిందని అంటున్నారు. తమిళంలోనూ స్వీటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకపక్క బాహుబలి 2, మరోపక్క సింగం -3తో బిజీగావున్న స్వీటీ -కన్నడ శివలింగను తమిళంలో తీస్తున్న పి వాసు ప్రాజెక్టుకూ డేట్స్ ఇవ్వడానికి సిద్ధపడిందట. చంద్రముఖి -2 పేరిట చేయబోతున్న ప్రాజెక్టులో లారెన్స్ పక్కన కనిపించేందుకు భారీగానే డిమాండ్ చేసిందని అంటున్నారు. తెలుగు, తమిళంలో మంచి ఇమేజ్ తెచ్చుకోవడంతో -ద్విభాషా చిత్రాల్లోనూ అనుష్కకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే -దక్షిణాది హీరోయిన్లలో టాప్ రేట్‌కు చేరిన స్టార్ హీరోయిన్‌గా గౌరవాన్ని అందుకుంటుంది. రెండు కోట్లకు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తున్న స్వీటీ, నిర్మాత, దర్శకుడు, హీరోని బట్టి పారితోషికంలో హెచ్చుతగ్గులు చూపిస్తోందని వినికిడి.
***
తెరమీదకు అడుగు పెట్టడంతోనే ఫ్లాపులు మూటగట్టుకున్న కమల్ కూతురు శృతిహాసన్ రేంజ్ ఇప్పుడు వేరు. ఒకప్పుడు ఆమె పేరు చెబితే భయపడిన నిర్మాతలు, గబ్బర్‌సింగ్ ప్రాజెక్టు నుంచీ ఆమె కాల్షీట్ల కోసం ఎదురు ఎగపడుతున్నారు. గబ్బర్‌సింగ్‌తో శృతి కెరీర్ ఊపందుకుంటే, శ్రీమంతుడి సూపర్ హిట్టుతో, టాప్ స్టార్ హోదా వచ్చేసింది. వరుసగా రెండు భారీ హిట్లు పడటంతో పారితోషికాన్ని రెండు కోట్లకు చేర్చేసిందని అంటున్నారు. ఇప్పుడు శ్రృతితో సినిమా అంటే కనీసం 1.5 కోట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తమిళంలోనూ శృతికి ఇదే డిమాండ్ కొనసాగుతుండటంతో, బాలీవుడ్ చిత్రాలకు కాస్త ఎక్కువ రేటు చెబుతోందన్నది పరిశ్రమ టాక్. హీరోయిన్‌గా ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ విషయంలో నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టదన్న టాక్ తెచ్చుకున్న శృతిని -అడిగినంత ఇచ్చి ఎంకరేజ్ చేయడానికి నిర్మాతలూ ఆసక్తి చూపుతున్నార్ట.
చిన్న సినిమాలతో అడుగుపెట్టి -టాప్ రేంజ్‌కు చేరుకున్న కాజల్, తమన్నా, సమంతాల రేజ్ ఒకేలా సాగుతోంది. ఫ్లాపులు లేకుండా జాగ్రత్తపడుతున్న ముగ్గురు అందగత్తెల పారితోషికం -ఒకటీ ఒకటిన్నర కోట్ల మధ్య సాగుతోందని అంటున్నారు. హ్యాపీడేస్‌లో అతి తక్కువ పారితోషికానికే చేసిన తమ్మూ జాతకం వరుస విజయాలతో ఎప్పుడో మారిపోయింది. కాల్షీట్లు ఎక్కువ ఇవ్వాల్సివస్తే ఎక్కువ డిమాండ్ చేస్తూ, అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాల్లో చెప్పుకోదగ్గ పారితోషికానికి మెరుస్తూ.. అగ్రశ్రేణి కెరియర్ సాగిస్తోంది. కార్‌వ్యాన్ లాంటి సౌకర్యాలు, బస కోసం ఐదు నక్షత్రాల హోటళ్లు ఈమెకు ఎక్స్‌ట్రా చార్జి. చిత్రం ఏమిటంటే పారితోషికం విషయంలో నిక్కచ్చిగావుండే తమన్నా -ఇటీవల ఓ తమిళ సినిమాకు 40లక్షలకే సైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చిందట. విజయ్ సేతుపతితో ‘్ధర్మా దురై’ ప్రాజెక్టుకు 40 లక్షలకే సైన్ చేసిన తమన్నా -కోలీవుడ్‌లోనూ అవకాశాలు మెరుగుపర్చుకోవానికే పారితోషికాన్ని తగ్గించుకుందని అంటున్నారు. ఇక లక్ష్మీ కళ్యాణం, చందమామ చిత్రాల్లో నామమాత్రపు పారితోషికమే తీసుకున్న కాజల్ ఫేట్ -మగధీరతో మారిపోయింది. అగ్ర దర్శకులు, పెద్ద హీరోల దృష్టిలోపడి కోటిన్నర పారితోషికానికి చేరిపోయింది. మధ్యలో ఒకట్రెండ్ ఫ్లాపులు పలకరించినా,
తగిలినా, ఆమె పారితోషికంలో ఎలాంటి మార్పూ లేదు. భారీ అంచనాలతో వస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం చిత్రల్లో నటిస్తున్న కాజల్, రెండు కోట్లకు చేరిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో చిత్రం కోసం సంప్రదిస్తే రెండు రేటు చెప్పిందని అంటున్నారు. ఇక ఒక్క సినిమాతో మాయ చేసిన సమంత, వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో చాన్స్‌లు అందుకుంటూ రేంజ్ పెంచుకుంది. వన్ క్రోర్ రేంజ్‌కు చేరుకోవడానికి నిజానికి ఆమెకు పెద్దగా టైం పట్టలేదు. అత్తారింటికి దారేది చిత్రంతో సమంత ఫేట్ మరింత మారిపోయింది. ఇటు తెలుగు, అటు తమిళంలో అరడజను చిత్రాలకు పైగా సమంత చేతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి -సమంత రెండు కోట్ల రేంజ్‌కు చేరిపోతుందని అంటున్నారు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచీ జెట్ వేగంతో దూసుకుపోయిన రకుల్ కెరియర్‌కు -నాన్నకు ప్రేమతో ఊపునివ్వడంతో పారితోషికాన్ని బాగా పెంచేసిందట. కాకపోతే -మధ్యలో బ్ల్రూస్‌లీతో ఆమెకు సడెన్ బ్రేక్ పడింది. కోటిన్నర రేంజ్‌కు చేరిపోవచ్చని అనుకుంటున్న తరుణంలో తగిలిన ఎదురు దెబ్బతో -రకుల్ పారితోషికం 80నుంచి కోటి మధ్యలో నిలిచిపోయింది. సినిమానిబట్టి, కాల్షీట్ల సర్దుబాటునిబట్టి రేటులో మార్పులు చేస్తోందని అంటున్నారు. నిజానికి రామ్‌చరణ్‌తో బ్రూస్‌లీ చేయడానికి ముందువరకూ కోటి డిమాండ్ చేసిన రకుల్, బ్రూస్‌లీ కాస్తా డిజాస్టర్‌గా మిలగడంతో రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గింది. మళ్లీ నాన్నకు ప్రేమతో ఊపుతో పెంచేసేసరికి -వరుణ్ తేజ్‌తో ప్రాజెక్టు కోసం ఆమెను కాంటాక్ట్ చేసి వదిలేసుకన్నాడట దర్శకుడు శ్రీను వైట్ల. దీంతో, ప్రాజెక్టుల విషయంలో వెనుకపడకూడదన్న ఉద్దేశంతో ఈమధ్యే ఓ కొత్త చిత్రానికి 60 లక్షలకే సైన్ చేసిందని అంటున్నారు. ఈ రేటు తరువాతి చిత్రాలకు ఉండదని సైన్ చేస్తున్నపుడే కండిషన్ పెట్టిందని అంటున్నారు. ఇక త్రిష, హన్సిక రెమ్యునరేషన్ రేంజ్ ఒక్కో సినిమాకు ఒక్కోలావుంటే, రాశి ఖన్నా, రెజీనా, నిత్యమీనన్, అంజలిలాంటి మీడియం హీరోయిన్ల రేంజ్ 35 నుంచి 50 లక్షల మధ్య పలుకుతోందని పరిశ్రమ వర్గాల టాక్.

మహాదేవ