రివ్యూ

తియ్యని త్రీడీ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుది-- ది జంగిల్ బుక్

తారాగణం:
నీల్‌సేథీ (ఒక్క పాత్ర మాత్రమే)
సంగీతం: జాన్‌డెబ్ని
కెమెరా: బిల్‌పోప్
నిర్మాణం: వాల్ట్ డిస్నీ
దర్శకత్వం: జాన్ ఫెత్రో

ఒక్కసారిగా మెరిసిన మెరుపు ఫెటిళ్లున విరిగి వేనవేల రంగుల ఇంద్రధనుస్సుగా మారి భూమిపై పడితే ఎలా ఉంటుంది? ఉరకలేసే జలపాతం నింగిని తాకే కొండలపై నుంచి వయ్యారంగా జారుతూ నృత్యం చేస్తే ఎంత ఆహ్లాదంగా తోస్తుంది? మనిషిలోవుండే సహజమైన ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష, కరుణ, ఉత్సాహంలాంటివన్నీ సాధారణంగా కనిపించే జంతువుల్లో ప్రతిఫలిస్తే -ఆ కావ్యాన్ని చూస్తున్న హృదయం ఎంత మెత్తగా మురిసిపోతుంది? ఇలాంటి భావుకతకు అద్దంపట్టే చిత్రాన్ని తీయాలని తలపోసింది వాల్ట్ డిస్నీ. అనుకున్నదే తడవుగా అందమైన సింపుల్ కథను అల్లుకుని సినిమా నిర్మాణానికి సిద్ధమైంది. కెమెరా నేత్రంతో అద్భుతాన్ని కళ్లముందు ఆవిష్కరించగలిగే కెమెరామెన్ బిల్‌పోప్‌ను వెతుక్కుంది. జాన్‌ఫెత్రో తన అంతర్నేత్రంతో అందాల అడవి దృశ్యాలను అచ్చెరువు కలిగేలా ఆవిష్కరించడానికి కుదిరాడు. ఇక అడ్డేముంది? ఓ అద్భుతం భూమిపై ఆవిష్కృతమైంది. అదే -జంగిల్ బుక్.
కథేంటి?:
మోగ్లీ అనే (నీల్ సేథీ) కుర్రాడు చిన్నప్పటినుండి అడవిలోనే పెరుగుతాడు. తండ్రితో కలసి అడవికి వచ్చినప్పుడు ‘షేర్‌ఖాన్’ అనే పెద్దపులి మోగ్లీ తండ్రిని చంపేస్తుంది. అప్పటినుండి భగీర అనే నల్లచిరుత, అకేలా, రక్ష అనే తోడేలు దంపతులు మోగ్లీని కాపాడుతూ పెంచుతాయి. కానీ షేర్‌ఖాన్‌కు ఇది నచ్చదు. మనిషి అనేవాడు ఎప్పటికైనా ప్రమాదమేనని, జంతువుల మధ్య అడవిలో ఉండేందుకు అనర్హుడని వాదిస్తుంది. మోగ్లీని అడవి నుంచి పంపేయమని తోడేలు దంపతులను షేర్‌కాన్ బెదిరిస్తుంటాడు. చివరికి తన మాట విననందుకు ‘రక్ష’ను చంపేస్తుంది షేర్‌ఖాన్. ఇక తప్పక అందరూ కలసి మోగ్లీని అడవి నుంచి వెళ్లిపొమ్మని చెబుతారు. అడవి దున్నల సాయంతో ఆ ప్రాంతంనుండి వెళ్లిపోతాడు మోగ్లీ. మరోచోట ‘ఖా’ అనే పెద్ద పాము మోగ్లీని కలసి, అతని తండ్రిపై షేర్‌ఖాన్ చేసిన దాడి గురించి చెబుతుంది. అక్కడ అతనికి బల్లో అనే ఎలుగుబంటితో స్నేహం కుదురుతుంది. కొండలపై ఉన్న తేనె పట్టులను ‘బల్లో’కు కొట్టిపెట్టి దగ్గరవుతాడు మోగ్లీ. అతన్ని చూడడానికి భగీర వస్తుంది. ఇంతలో వానర సైన్యం మోగ్లీని బలవంతంగా తమ కోతిరాజు లూయిస్ వద్దకు తీసుకెళ్తాయి. వారిని వెంబడిస్తూ భగీర, బల్లో కోతుల రాజ్యం వెళ్తారు. అక్కడ లూయిస్ ఎర్ర పుష్పం (నిప్పు కాగడా)ను తెమ్మంటాడు. అందుకు మోగ్లీ ఒప్పుకోడు. ఇంతలో భగీర, బల్లో కోతిమూకపై దాడిచేసి మోగ్లీని తీసుకెళ్తారు. షేర్‌ఖాన్ ‘రక్ష’ను తన కారణంగా చంపిందన్న నిజం తెలుస్తుంది మోగ్లీకి. ఇక ఉండబట్టలేక తన పెంపుడు తోడేలు తల్లి అకేలా వద్దకు వస్తాడు. అదనుకోసం కాచుకుని ఉన్న షేర్‌ఖాన్ మోగ్లీపై దాడికి తెగబడుతుంది. చివరికి మోగ్లీ ఎలా విజయం సాధించాడు? అన్న విషయాన్ని తెరపై త్రీడీ కళ్లద్దాల్లో చూడాలి.
ఎలా ఉంది?: చిత్రంలో ఒక్కటే లైవ్ పాత్ర. అదీ మోగ్లీగా నటించిన నీల్‌సేథ్‌ది. మిగతా జంతువుల పాత్రలన్నీ సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టుగా గ్రాఫిక్స్ మాయాజాలం, సీజీతో ప్రతిష్టించినవే! మామూలు జంతువుల్లో హావభావాలను చక్కగా పలికించడంలో సాంకేతిక నిపుణుల పనితనానికి మనం ముక్కుపై వేలేసుకుని ఆశ్చర్యపోవాల్సిందే. గతంలో కార్టూన్ సీరిస్ రూపంలో వచ్చిన ఈ కథ, ఇప్పుడు సజీవ పాత్రలతో కళ్లముందు సాక్షాత్కరించింది. అడవిలో ఒక చెట్టుపై సూర్యరశ్మి ఎలా ప్రయాణిస్తుంది? కొండలు, లోయల్లో నీడలు ఎలా పరుగెత్తుతాయి? జలపాతాలలో నీరు గ్రాఫిక్స్ సాక్షిగా ఎన్ని హొయలు పోతుంది? అడవిలో వర్షంపడితే ఎంత అందంగా ఉంటుంది? అడవి దున్న ఛేజ్‌లో బురద మట్టితోపాటుగా, ఒక్కసారిగా కొండలపైనుండి వచ్చిపడిన ప్రవాహంలో కొట్టుకొనిపోయే దృశ్యాలు ఊహకు అందనంతగా చిత్రీకరించారు. మనిషి మామూలుగా చూడలేని అనేక అడవి అందాలను కళ్లముందు కుప్పపోసినట్టు సాగింది చిత్రం. ప్రతి సన్నివేశాన్ని ముఖ్యంగా తోడేలు పిల్లల మాటలు, ఎలుగు తేనె పిచ్చి, కోతుల సామ్రాజ్యం సృష్టి, అది కూలిపోవడం తదితర అంశాలన్నీ కంటికి విందు చేసేవే! మోగ్లీగా నటించిన నీల్‌సేథ్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు నటించాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఎక్కడ ఏదుందో తెలియకపోయినా, అన్నీ ఊహించుకుంటూ అతను చేసిన నటన, మిగతా జంతువుల పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసినట్టుగా కుదిరింది. అతన్ని దృష్టి కోణంనుండి మిగతా జంతువులు నటించాలి కదా! అలా ఎక్కడా బోర్‌లేకుండా, సహజంగా నిర్మాణం చేశారు. ‘జంగిల్’ అంటే అడవి రాజు ‘సింహం’ పాత్ర లేకపోవడం లోటుగానే కనిపిస్తుంది. అయితే కళ్లముందు కదలాడే పాత్రలన్నీ మనతోనే ఉన్నట్టుగా ఉండటంతో ఆ లోటు కనిపించదు.
ఈ వేసవిలో పిల్లలకి గిలిగింతలు పెట్టడానికి వచ్చిందీ పుస్తకం. ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. చూస్తే చాలు. పిల్లల సినిమా అని చిన్నచూపు చూడొద్దు. మనిషి మర్చిపోతున్న ఆనందాలు, ఉద్వేగాలు, తియ్యనైన బాధలు జంతువులతో పలికించారు. నేటి తరానికి అడవి అంటే ఎంత అందంగా ఉంటుందో తెలీదు. ఈ చిత్రం చూస్తేనైనా వారికి భవిష్యత్‌లో అడవి కావాలి, ఉండాలనే భావన కలగడం ఖాయం. అలా భావి జీవితంలో ఆకుపచ్చ ప్రపంచాన్ని సృష్టించడానికి వారో చేయి వేస్తారని ఆశించవచ్చు!

-శేఖర్