Others

సంగీత లక్ష్మి (ఫ్లాష్‌ బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు: ఆచార్య ఆత్రేయ
కూర్పు: ఎంయస్‌ఎన్ మూర్తి
కెమెరా: అన్నయ్య
కళ: రాజేంద్రకుమార్
నృత్యం: కెఎస్ రెడ్డి
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
గిడుతూరి సూర్యం

సీతారామాంజనేయ పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు పి నరసింగరావు, అమరా రామసుబ్బారావులు రూపొందించిన చిత్రం సంగీత లక్ష్మి. 1966 జూలై 7న ఇది విడుదలైంది.లలిత కళలపట్ల అభిరుచి కలిగిన గిడుతూరి సూర్యం వివిధ నాట్యాల గురించి పరిశోధన చేశారు. రష్యా దేశానికి వెళ్ళి అక్కడ చిన్నారులకు మన నాట్యరీతుల గురించి తెలియచేశారు. చలనచిత్ర నిర్మాణంలో మెళకువలు గ్రహించారు. స్వదేశానికి వచ్చిన తరువాత తొలిసారి ‘సంగీత లక్ష్మి’ చిత్రానికి కథను కూర్చి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ఆ తరువాత ‘కథానాయకురాలు’, ‘పేదరాశి పెద్దమ్మకథ’, ‘విక్రమార్క విజయం’, ‘రణభేరి’, ‘పంజరంలో పసిపాప’ వంటి పలు చిత్రాలు రూపొందించారు.
****
రిటైర్డ్ కల్నల్ కొండలరావు, నిర్మల దంపతులు. వారి కుమారె్తై రాధ (జమున) సంగీత విద్వాంసురాలు. వారి మేనల్లుడు ఆనంద్ (నాగభూషణం). ఒక పాటల పోటీలో పరిచయమైన వేణు (ఎన్టీ రామారావు), రాధ గయోపాఖ్యానం నాటికలోనూ నటిస్తారు. వారి ఇరువురి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కొండలరావు (యస్వీ రంగారావు) రాధను ఆనంద్‌కు ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అది ఇష్టంలేని రాధ, వేణు ఇంటికి వెళ్ళి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా అతన్ని వివాహం చేసుకుంటుంది. రాధ, వేణులకు ఒక ఆడపిల్ల లక్ష్మి జన్మిస్తుంది. వేణు సంగీత కళాశాలలో ఉద్యోగం చేస్తున్నా వారి ఆర్థిక పరిస్థితి సజావుగా లేనందున ఇబ్బందులు పడుతుంటారు. మనమరాలు పుట్టాక కూతురు ఇంటికి వస్తాడు కొండలరావు. అక్కడి పరిస్థితిని చూసి ఆయన ఇవ్వబోయిన ఆస్తిని స్వాభిమానంతో వద్దంటాడు వేణు. ఆనంద్ స్నేహితురాలు డాన్సర్ నళిని (యల్ విజయలక్ష్మి)తోపాటు గాయకునిగా విదేశాలు వెళ్తాడు. అక్కడ పాశ్చాత్య సంగీతపు మెలకువలు గ్రహిస్తాడు. వేణు పొరపాటువల్ల నళినికి యాక్సిడెంట్ కావటంతో ఇండియాకు ప్రయాణం అవుతాడు. దారిలో స్టీమర్ ప్రమాదం జరగటంతో వేణు జాడ తెలియదు. కొంతకాలం తరువాత ప్రమాదం నుంచి బయటపడిన వేణు ఇండియా వస్తాడు. తల్లి రాధ వద్దనుంచి తప్పిపోయి పెరుమాళ్ళు ప్రాపకంలో పెరిగిన కూతురు లక్ష్మిని కలుస్తాడు. తానే ఆమె తండ్రినని తెలియనీయక ఆమెకు శిక్షణనిచ్చి ఒకసారి తల్లితోటే పోటీకి సిద్ధం చేస్తాడు. కూతురని తెలియని రాధ, లక్ష్మిల మధ్య సంగీత పోటీలో లక్ష్మి విజేతగా నిలవటం, మనోవ్యధవల్ల అనారోగ్యం పాలైన రాధ, అక్కడ వేణును చూసి ఉద్వేగంతో సొమ్మసిల్లిపోతుంది. రాధను ఒడిలో చేర్చుకుని ఆమె కోరికపై వేణు పాడిన, వారి అనురాగ గీతంతో రాధ స్వస్తురాలు కావటం, అందరూ అక్కడకు రావడం, అపార్థాలు తొలగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో డ్రామా కంపెనీ యజమాని గోవిందరావుగా రమణారెడ్డి, అతని భార్య కాంతంగా సూర్యాకాంతం, కొడుకు చిక్కేశ్వరరావుగా రాజ్‌బాబు నటించారు.
సంగీతం, నృత్యం ప్రధానాంశాలుగా సెంటిమెంటు ప్రేమ అంశాలు జోడించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. తొలిచూపులోనే రాధ వేణు ఒకరినొకరు ఇష్టపడడం, వేణుకు వచ్చిన బహుమతి రాధకు ఇవ్వటం హృద్యంగా ఉంటాయి. వేణు వద్ద సంగీతం నేర్చుకుంటున్న రాధతో చిత్రీకరించిన గీతం (ఘంటసాల, సుశీల-ఆత్రేయ) పాటకు పల్లవి ప్రాణంలో తొలి చరణం ‘సరిగమ పదని సప్తస్వరాలు’లో మబ్బుల సెట్టింగ్స్‌లో ఏడుగురు కన్యలను చూపిస్తూ రాధను పద్మంలో చూపటం బావుంటుంది. రెండవ చరణం ‘గువ్వల జంటల కువకువలు’లో తోటలో సాధారణ దుస్తులలో వేణు, రాధలను చక్కని ప్రకృతిలో చూపటం అలరించేలా సాగింది. యల్ విజయలక్ష్మిపై ‘నందగోపాల’ పాటలో విదేశాల్లో నాటి పలు వైవిధ్యభరితమైన నృత్యాలను చిత్రీకరించారు. గయోపాఖ్యానం నాటకంలో కృష్ణునిగా జమున, అర్జునునిగా ఎన్టీ రామారావు భుజం తాకబోవటంలో సంకోచం, సభికుల్లో ఆ నాటకానికి రియాక్షన్.. యస్వీ రంగారావును కలిసినప్పుడు సూర్యకాంతం హావభావాలు.. అజ్ఞాతం నుంచి వచ్చిన వేణు కుమార్తెను గుర్తించి దేశ విదేశీ సంగీత తీరులు మేళవించి ఆమెను తీర్చిదిద్దాలనే తపన, తల్లీకూతుళ్ళ పోటీ గీతం ‘రాసక్రీడ ఇకచాలు నీకై రాధవేచే’ (పి సుశీల, ఎస్ జానకి -ఆత్రేయ) గీతంలో భావుకతకు తగ్గట్టు యస్ రాజేశ్వరరావు స్వరాలు, చిత్రీకరణ అలరించేలా సాగాయి. వేణు, రాధల కుమారె్తై లక్ష్మి పుట్టినపుడు చిత్రీకరించిన గీతం ‘పాపా కనుపాప’ (పి సుశీల-ఆత్రేయ), ‘తప్పటడుగులు ఇప్పుడు ముద్దు’, ‘నడకనేర్పిన అమ్మా, నాన్నా, నీ నడత చూసి మురియాలమ్మా’లో సన్నివేశాలు సందేశాత్మకంగా ఉంటాయి.
తొలి ప్రయత్నంలోనే దర్శకులు సన్నివేశాలనూ, గీతాలను అలరించేలా పరిణితితో చిత్రీకరించారు.
ఇక ఈ చిత్రంలో వేణుగా ఎన్టీ రామారావు ఎంతో ఆహ్లాదభరితంగా, ప్రణయ సన్నివేశాల్లోనూ రాధతో సున్నితంగా, ఆర్థిక పరిస్థితి గూర్చి భార్య రాధతో గంభీరంగా, మామగారితో ఘర్షణలో ఆవేశాన్ని, ఆవేదనను, స్థిర నిర్ణయాన్ని, భార్యపై ప్రేమానురాగం, కూతురిపట్ల మమకారం.. సన్నివేశాలకు తగ్గట్టు ప్రదర్శించారు. రాధగా జమున ప్రేమించిన భర్తపట్ల అనురాగం, ఆత్మాభిమానం, సంగీతం పట్ల మక్కువ, కూతురి పట్ల వాత్సల్యం, భర్త, కుమారె్తై దూరమయ్యాక మనోవ్యధతో సంగీతాన్ని ఆలంబనగా జీవితం సాగించటం, ఒక ఉత్తమ భారతీయ ఇల్లాలిగా ఆకట్టుకునేలా నటించింది.
విలనీకి పేరుపడిన నాగభూషణం, విలన్‌గా కనిపించే మంచివాడిగా ఎంతో ఈజ్‌తో మెప్పించారు. ధీర గంభీరుడు యస్వీ రంగారావు కూతురి పట్ల మమకారంగల తండ్రిగా, పట్టుదలగల వ్యక్తిగా బాధ, ప్రేమ, సమపాళ్ళలో ప్రదర్శించి రక్తికట్టించారు. మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా నటించారు.
‘గయోపాఖ్యానం’ నాటకంలో సంవాద పద్యాలు ‘ఔరౌరా ఐదుగురు అన్నదమ్ములు’ (ఘంటసాల, సుశీల- రచన శ్రీశ్రీ), ఎన్టీఆర్, నాగభూషణం, యల్ విజయలక్ష్మి నృత్యంపై చిత్రీకరించిన గీతం ‘కదలించే వేదనలోనే ఉదయించును’ (ఈ గీతంలోనే నాటి రాధ తీయని బాధ చరణం... ఘంటసాల -సినారె) చిత్రాన్ని రక్తికట్టించాయి. ‘సంగీతలక్ష్మి’ చిత్రం సంగీతపరంగా నేటికీ వీనులవిందు కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి