మీ వ్యూస్

కుందనపు బొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపు రమణల దృశ్యకావ్యాలు అపురూపాలు. ముత్యాలముగ్గు, అందాల రాముడు, బుద్ధిమంతుడు, పెళ్ళిపుస్తకం లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుడు ఎన్నటికీ మరువడు. సంపూర్ణ రామాయణం, భక్తకన్నప్ప లాంటి చిత్రాలు అజరామరం. అలాంటి వంశవృక్షం నుండి వచ్చిన వర ముళ్ళపూడి మారిన కాలానుగుణంగా మంచి చిత్రాలు తీయాలి. అలాకాకుండా బాపు బొమ్మలాంటి హీరోయిన్ చాందినీని పెట్టుకొని ఏమాత్రం పసలేని ‘కుందనపు బొమ్మ’లాంటి సినిమా తీయడం బాధాకరం. ఏమాత్రం కథలేని పాత చింతకాయను పట్టుకొని ప్రేక్షకులను అసహనానికి గురిచేశారు. ఇకముందైనా వర మంచి చిత్రాలు తీయాలని మనసారా కోరుకుందాం. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. సంగీతం పస లేదు. మొత్తానికి తెలుగు సినిమా అంటే మొహం మొత్తేలా చేశారు. హీరోయిన్ మాత్రం తెలుగు పరిశ్రమకు కచ్చితంగా కుందనపు బొమ్మ..
-కె శ్రీనివాసులు, హైదరాబాద్

రాజేశ్వరరావుపై
గ్రంథమేది?
ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితంపై ఆయన కుమార్తె శ్యామల నిష్పాక్షిక వివరాలతో ఒక గ్రంథం సవివరంగా రాశారు. కానీ ఆయన సమకాలికులైన ప్రఖ్యాత సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గురించి ఎటువంటి గ్రంథమూ వెలువడలేదు. రాజేశ్వరరావు తన 20వ ఏటనుంచే దాదాపు 50ఏళ్లపాటు అనేక చిత్రాలకు అజరామరమైన సంగీతం అందించారు. మల్లీశ్వరి, మిస్సమ్మ, విప్రనారాయణ, భక్తప్రహ్లాద, డాక్టర్ చక్రవర్తి, పూజాఫలం, కాలం మారింది, అమెరికా అబ్బాయి, బొబ్బిలియుద్ధం, భక్తజయదేవ వంటి అనేక చిత్రాలకు ఇప్పటివరకు గుర్తుండే బాణీలు ఇచ్చారు. అటువంటి ప్రఖ్యాత సంగీత దర్శకుని జీవితం ముందుతరాలకు స్ఫూర్తినింపడానికి ఆయన జీవితం ఒక గ్రంథంగా రావాలి. ఆయన కుమారులు కోటి, వాసూరావు ఇందుకోసం పూనుకొని సంగీత అభిమానులకు ఆనందం కలిగిస్తారని ఆశిద్దాం.
-కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్

అంత సీన్‌లేదేమో..
డబ్బింగ్ సినిమాలపై వ్యాసంలో జంగిల్‌బుక్, ఎక్స్‌మెన్ లాంటి ఆంగ్ల డబ్బింగ్ చిత్రాలు తెలుగు చిత్రాలను దెబ్బతీస్తున్నాయడం పూర్తిగా సరికాదనుకుంటాను. బి, సి సెంటర్లలో ఆంగ్ల, ఆంగ్ల డబ్బింగ్ చిత్రాలను చూసేవారు తక్కువే. ఏ సెంటర్లలోనూ కుటుంబాలు కాక యూత్ మాత్రమే ఎక్కువగా చూస్తారు. వాళ్లుకూడా ఆంగ్ల చిత్రం చూశాం కదాని తెలుగు చిత్రాలు చూడం అనుకోరు. ఇదీ, అదీ కూడా చూస్తారు. అయితే తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు తెలుగు చిత్రాల్ని దెబ్బతీయని చెప్పవచ్చేమో. అదీ కొంత మేలే.
-చంద్ర, కాకినాడ

అభినందిద్దాం
నవతరం తారామణులు నటనకన్నా స్కిన్ షోకే ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. అయితే కొందరు స్కిన్ షోని తిరస్కరించి నటనకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న కథనాలు కొత్త ఆశలు రేపుతున్నాయి. అలాంటివారిలో నిత్యమీనన్ పేరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక అగ్రనటుని చిత్రాన్ని తిరస్కరించి అభిమానులకు కోపం తెప్పించింది. భవిష్యత్‌లో కుటుంబ సభ్యులతో నా సినిమాలు చూసేటప్పుడు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. అందుకే స్కిన్ షో చెయ్యనని కీర్తిసురేష్ చెప్పింది. శ్రీదివ్య, సురభి, నాగబాబు కుమార్తె నీహారిక ఈ లిస్టులో ఉన్నారు. చూద్దాం ఎవరు ఎంతకాలం మాట నిలబెట్టుకుంటారో..
-యోగి, అనకాపల్లి

మన దగ్గర సరుకులేదు
డబ్బింగ్ సినిమాలపై వ్యాసం ఆలోచింపజేసింది. డబ్బింగ్‌ల్లోనూ ఫ్లాప్‌లున్నాయి. అయితే స్ట్రెయిట్, డబ్బింగ్ అనే తేడాలేకుండా సత్తా ఉన్నవే రాణిస్తాయి. డబ్బింగులవల్ల మన చిత్రాలకు కొంత నష్టం ఉంటుంది. కాని వాటివల్లనే మన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి అనడం సరికాదేమో. జంగిల్‌బుక్, ఎక్స్‌మెన్‌లాంటి చిత్రాలు తొంభైశాతం థియేటర్లలో వారం మించి ఆడలేదు. అవి వెళ్లిపోయాక అయినా మన చిత్రాలు పుంజుకోవాలి కదా. సత్తాఉంది కాబట్టి అఆ పుంజుకుంది. సత్తాలేక సర్దార్, బ్రహ్మోత్సవం పుంజుకోలేకపోయాయి. బాహుబలి జపాన్, జర్మనీల్లో ఫ్లాప్ అయింది. అలాంటి చిత్రాలు చైనా, కొరియాల నుంచి చాలానే వచ్చాయి. బాహుబలి చైనాయాత్ర ఎలా ఉంటుందో మరి..
-సాహిత్యదీప్తి,
రమణయ్యపేట

ట్రాక్ మార్చారు!
‘వీళ్ళేరా విలన్స్’.. వ్యాసం బాగుంది. అయితే ఒక ఇమేజ్ చట్రంలో బిగుసుకున్న నటీనటులతో నెగెటివ్ రోల్ చేయించి మెప్పించడానికి ఆ పాత్రను ఎంతో శ్రద్ధగా డిజైన్ చెయ్యాలి. రామ, రావణ పాత్రలు రెండూ చేసి మెప్పించడం ఎన్టీఆర్‌లాంటి వారికే సాధ్యం.
అరవిందస్వామి, సుమన్, జగపతిబాబులు ఇంక హీరోలుగా పనికిరారు కాబట్టి విలన్ ట్రాక్‌లోకి మారిపోయారు. హీరో, విలన్ పాత్రలు రెండూ చేయాలంటే సూర్యలాంటివారు రెండు పాత్రల్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. అంజలిదేవి, సావిత్రి హీరోయిన్లుగా మంచి పాత్రలు చేసి భేష్ అనిపించుకున్నారు. వారిచేత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు (ఆదర్శ కుటుంబం, చంద్రహాస) చేయిస్తే ప్రజలు ఛీకొట్టారు.
-ప్రసాద్, గొడారిగుంట

భాషాభేదం ఎందుకు?
ఇటీవలి కాలంలో పర భాషా నటుల హవా తెలుగులో కొనసాగుతుందని విమర్శలు అధికంగా వస్తున్నాయి. కొన్ని పాత్రలకు తెలుగు నటుల కొరత ఏర్పడటంవల్ల వారు వస్తున్నారు. క్యారక్టర్ ఆర్టిస్టులు తగ్గిపోయారు. చాలామంది కాలం చెందారు. నటన బాగుంటే ఏ భాషా నటుడినైనా ప్రేక్షకుడు ఆదరిస్తాడు. మన తెలుగువారు హిందీ, తమిళం, కన్నడం, ఇతర భాషల్లో నటిస్తున్నారు. భాషాభేదాన్ని సృష్టించరాదు. నటనకు కులం, మతం, ప్రాంతం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలలో సైతం భారతీయులు గుర్తింపు పొందారు. పాత్రకు హత్తుకుపోయే ఏ నటుడినైనా ఎంపిక చేసుకునే హక్కు ఉంది.
ప్రేక్షకుడు కొత్తదనాన్ని ఆహ్వానిస్తాడు. భాషాభేదం పర భాషా నటులు అనుకుంటే నటులు మంచి నటులు దొరక్కుండా పోయే అవకాశం వుంది. ఈ భావజాలాన్ని కొందరు స్వస్తిపలకాలి. పాత్ర చిత్రీకరణ, కథాకథనం నటుల ఎంపిక ముడిపడి వుంటుంది.
-ఎ రఘరామారావు, ఖమ్మం