Others

కనె్న మనసులు (ఫ్లాష్‌ బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: ముళ్లపూడి వెంకటరమణ
మాటలు: ఎన్‌ఆర్ నంది
నృత్యం: హీరాలాల్, పిఎస్ గోపాలకృష్ణ
ఎడిటింగ్: టి.కృష్ణ
కెమెరా: పిఎల్ రాయ్
కళ: తోట
సంగీతం: కెవి మహదేవన్
నిర్మాత: సి సుందరం
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు

బాబు మూవీస్ పతాకంపై కొత్త తారలతో ‘తేనె మనసులు’ రూపొందించారు. తరువాతి సంవత్సరంలో కొత్తవారితోపాటు కొందరు అనుభవజ్ఞులైన నటీనటులతో బాబుమూవీస్ రూపొందించిన చిత్రమే ‘కనె్న మనసులు’. 1966 జూలై 22న ఈ చిత్రం విడుదలైంది.
గంగాభవాని (సూర్యకాంతం) ధనవంతురాలు. ఆమె తమ్ముడు శేఖరం (వెంకటేశ్వరరావు)కు దుర్గ (పుష్పకుమారి)తో పెళ్లి జరిపి వస్తుండగా గజదొంగ శివయ్య (గుమ్మడి) తన గుంపుతో వారిని దోచుకుంటాడు. దుర్గను చూసి మోజుపడిన శివయ్య ఆమెను తనకు అప్పగిస్తే దోచిన సొమ్ము తిరిగి ఇస్తానంటాడు. డబ్బుకాశపడి గంగాభవాని, దుర్గను వదిలి వెళ్లిపోతుంది. దుర్గను బలవంతం చేయబోయిన శివయ్య లాంతరు తగలి కళ్లు పోగొట్టుకుంటాడు. అతని భార్య సీత (రాధాకుమారి) మగబిడ్డను ప్రసవించి మరణిస్తూ తన బిడ్డను ఈ పాపపు సొమ్ముతో పెంచవద్దని కోరుతుంది. అక్కడినుంచి తప్పించుకున్న దుర్గ భర్త దగ్గరకు వెళ్లగా, గంగాభవాని అతనికి మరో పెళ్లి చేయిస్తూ గర్భవతియైన ఆమెను వెళ్లగొడుతుంది. దుర్గ ప్రాణం తీసుకోవాలని నదిలో దూకగా చాకలి సోములు (చలపతిరావు) రక్షిస్తాడు. ఒక ఆడపిల్ల కృష్ణ (సుకన్య)ను కని పెంచి పెద్దచేస్తుంది. ఘర్షణలో దుర్గ పోగొట్టుకున్న గాజులు తీసుకుని జైలుశిక్ష అనుభవించి వచ్చిన శివయ్య, వ్యాపారం చేసి ధనవంతుడై ఆ గాజులతో గాజులమ్మ పేరిట ఓ గుడి కట్టిస్తాడు. శేఖరం భార్య ఒక కూతురుని కని మరణిస్తుంది. సంధ్య (సంధ్యారాణి) మేనత్త గారాబంతో తనతో పెళ్లిచూపులకు వచ్చిన శివయ్య కుమారుడు మోహన్ (రాంమోహన్)ను అల్లరి పెడుతుంది. ఆ ఊరిలోని దిక్కులేని మరో చాకలి గంగులు (కృష్ణ) సాయంతో మోహన్ వారి ఆటకట్టిస్తాడు. మోహన్, కృష్ణను ప్రేమిస్తాడు. తండ్రి శివయ్య వారిపెళ్లికి అంగీకరిస్తాడు. కానీ జమీందారు శివయ్య, గజదొంగ ఒకరేనని గుర్తించిన దుర్గ ఈ పెళ్లికి ఒప్పుకోదు. కృష్ణను గంగులికిచ్చి వివాహం చేయాలనుకుంటుంది. శివయ్య, గాజులమ్మ గుడిలో దుర్గను క్షమాపణ కోరటం, భవాని రగిలించిన మంటలు కారణంగా గుడి తగులబడిపోయి శివయ్య మరణించడం జరుగుతుంది. పశ్చాత్తాపంతో తనవద్దకు వచ్చిన సంధ్యను గంగులు, కృష్ణ, మోహన్‌తో పెళ్లికి దుర్గ అంగీకరించడం, శేఖరం, దుర్గను స్వీకరించడంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో హీరోలు కృష్ణ, రాంమోహన్‌లకు రెండవ చిత్రమే అయినా, వారి పాత్రల పరిధిమేరకు పూర్తి న్యాయం చేకూరేలా ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించారు. అమాయకమైన ఇల్లాలుగా ‘తేనె మనసులు’లో నటించిన సంధ్యారాణి, ఈ చిత్రంలో అల్ట్రా మోడరన్ గాళ్‌గా ఎంతో చురుకుదనం చూపగా, అమాయకత్వం, కొంత గడుసుతనం కలిగిన యువతిగా సుకన్య అలరించింది.
దాష్టీకం, దుష్టబుద్ధితోపాటు ఎడమ చేతితో టేబుల్ టెన్నిస్ ఆడుతూ బాబ్డ్ హెయిర్‌తో ఆధునిక పోకడలుగల ప్రౌఢగా సూర్యకాంతం గెటప్, నటనతో ఆకట్టుకుంది. చేసిన నేరం తాలుకు పాపభారాన్ని పశ్చాత్తాపంతో అనుభవించిన శివయ్యగా గుమ్మడి సహజమైన నటన చూపారు.
బలమైన సన్నివేశాలను రూపొందించి అవుట్‌డోర్ చిత్రీకరణ, పాటల చిత్రీకరణలో కొత్త ఒరవడికి ఆలంబనగా నిలిచిన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు బాబు మూవీస్ ద్వారా మంచి, మూగ, తేనె మనసులు అందించారు. అయితే, కనె్నమనసులు చిత్రానికి వైవిధ్యమైన కథను ఎన్నుకోవడం దర్శకుడిగా ఆయన అనుభవం కనిపిస్తుంది. నూతన తారలకు రెండవ అవకాశం ఇవ్వడమేకాక, గుమ్మడి, సూర్యకాంతంవంటి సీనియర్ నటులకు ఈ చిత్రంలో ప్రాధాన్యత కల్పించారు. సరళంగా చిత్రాన్ని నడపిస్తూ, గాజులమ్మ బుర్రకథ ద్వారా చిత్రం కథ తెలియజేయడం ఓ కొత్త అనుభూతి. గుర్రంపై స్వారీచేస్తూ రాంమోహన్ ఆహ్లాదభరితంగా ఆలపించిన గీతం ‘ఈ ఉదయం నా హృదయం’ పాట (ఘంటసాల, ఆత్రేయ) చిత్రీకరణ బావుంటుంది. గుర్రంపై సుకన్య ఎక్కి భయంగా నడపడం, మరోసారి కృష్ణ గుర్రం ఎక్కి చురుకుగా నడపడం, చేతగాని భర్త వెంకటేశ్వరరావు అద్దంముందు స్వగతం లాంటివి ఆదుర్తి దర్శకత్వ ప్రతిభకు కొన్ని ఉదాహరణలు.
సంధ్యారాణి, రామ్మోహన్‌లపై చిత్రించిన పెళ్లిచూపుల గీతం -ఓహో తమరేనా చూడవచ్చారు (పి సుశీల బృందం- ఆత్రేయ). తిరిగి ఈ గీతం ఘంటసాల గానంతో -ఓహో తమరేనా చూడవచ్చారు ఓ భామా అని వస్తుంది. చాకిరేవులో సుకన్య వారిపై చిత్రీకరించిన గీతం -చుక్కలాంటి చిన్నోడు షోకుచేసుకొచ్చాడు (పి సుశీల, జమునారాణి బృందం- కొసరాజు). బుర్రకథగా కృష్ణ, సుకన్య బృందంపై చిత్రీకరించిన గీతం -అమ్మలగన్న యమ్మా గాజులమ్మ (వెంకటరావు, పి సుశీల, కె జమునారాణి బృందం- దాశరథి). రాంమోహన్‌పై చిత్రీకరించిన గీతం -ఓ హృదయంలేని ప్రియురాలా (ఘంటసాల -ఆత్రేయ) రాంమోహన్, సుకన్యలపై ఆరుబయట ఆహ్లాదకరమైన ప్రకృతిలో వర్షంలో నైట్ ఎఫెక్టుతో అందంగా చిత్రీకరించిన గీతం -చిత్రంగా ఉన్నదీ ఈవేళ/ ఊగింది నా మనసు ఉయ్యాల (పి సుశీల- దాశరథి) ఆదుర్తి మార్కు చిత్రీకరణతో సాగుతుంది.
బాబు మూవీస్ ముందు చిత్రాల వలె కనె్న మనసులు చిత్రానికి సాంకేతికంగా పిఎల్ రాయ్ ఫోటోగ్రఫీ, కెవి మహదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యం నటీనటుల, దర్శక సామర్థ్యం వంటి అన్ని హంగులు కలిగినా ఇది యావరేజ్ చిత్రంగా మాత్రమే గుర్తింపు పొందింది. ఈ చిత్రం సమయంలో హీరో కృష్ణకు ‘గూఢచారి 116’లో నటించే అవకాశం లభించడం, ఆయన ఆ చిత్రంతో సూపర్ స్టార్‌గా ఎదగడం గమనార్హం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి