Others

సర్వర్ సుందరం (ఫ్లాష్‌ బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: కె.బాలచందర్
మాటలు, పాటలు: అనిశెట్టి
కళ: ఏకె శేఖర్
ఎడిటింగ్: ఎన్‌ఎస్ ప్రకాశం
నృత్యం: కె తంగప్పన్
కెమెరా: యస్ మారుతీరావు,
సంగీతం: విశ్వనాథం,
రామ్మూర్తి, ఆర్ గోవర్ధనం
నిర్మాత: కాంతారావు పహిల్వాన్
దర్శకత్వం: కృష్ణన్- పంజు

తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జన్మించారు కైలాసం బాలచందర్ (కె.బాలచందర్). మద్రాస్‌లో అకౌంట్స్ జనరల్ ఆఫీసులో పనిచేస్తున్న రోజుల్లో పలు నాటకాలు వ్రాసి ప్రదర్శించేవారు. అలా వీరు వ్రాసిన ఓ నాటకాన్ని అదే పేరుతో ‘సర్వర్ సుందరం’ తమిళ చిత్రంగా రూపొందించారు. ఎవియం ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత ఎవి మొయ్యప్పన్, కృష్ణన్, పంజులు కలిసి నిర్మించిన ఆ తమిళ చిత్రం 1964లో డిసెంబర్ 11న విడుదలైంది. నేషనల్ ఫిలిమ్స్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ తమిళ ఫీచర్ ఫిలిమ్’ అవార్డ్, మద్రాస్ ఫిల్మ్‌ఫేర్‌లో ‘బెస్ట్ తమిళ చిత్రంగా’ అవార్డు అందుకుంది. ఈ చిత్రాన్ని టైగర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత పహిల్వాన్ కాంతారావు తెలుగులోకి అనువాద చిత్రంగా తీసుకొచ్చారు. 1966 జూలై 29న విడుదలైంది.
టైటిల్స్‌కు ముందు సుందరం (నాగేష్) సర్వర్ వేషంలో వరుసగా నిలువుగా ఉంచిన కాఫీ కప్పులతో ప్రవేశించి టిఫిన్స్ సర్వ్ చేస్తుండగా టైటిల్స్ రావటం చూపారు. సుందరం సినిమాల్లో చేరాలనే ఆశతో మద్రాస్ వచ్చి, ఆ ప్రయత్నం ఫలించక గ్రీన్‌లాండ్ హోటల్ యజమాని చక్రవర్తి (మేజర్ సౌందర్‌రాజన్) దయతో హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తుంటాడు. అనుకోకుండా చక్రవర్తి కుమార్తె రాధ (కెఆర్ విజయ)ను ఒక పిక్‌నిక్ పార్టీ కేటరింగ్‌లో కలుసుకుంటాడు. ఐ లైక్ యువర్ ఇన్నోసెంట్ అని రాధ చెప్పిన మాటలకు, ఆమె తనని ప్రేమిస్తుందని భ్రమపడతాడు. ఆమె తన యజమాని కూతురని తరువాత తెలుసుకుంటాడు. బీదవాడైన సుందరానికి తల్లి లక్ష్మి తప్ప ఎవరూ లేరు. అతని స్నేహితుడు రాఘవ (ముత్తురామన్) ఒకసారి హోటల్‌లో సుందరాన్ని కలుస్తాడు. తన ప్రేమకథను సుందరం అతనికి చెబుతాడు. రాధను పెళ్ళి చేసుకోవాలని వచ్చిన రాఘవ, ఇది విని ఆమె సుందరాన్ని ప్రేమిస్తోందని భావిస్తాడు. సుందరాన్ని పైకితేవాలని తనకు తెలిసిన ప్రొడ్యూసర్‌కి పరిచయం చేసి నటునిగా అవకాశం ఇప్పిస్తాడు. ఆ సందర్భంలో రాధను కలిసిన రాఘవకు, ఆమె సుందరాన్ని ప్రేమించటం లేదని తెలుస్తుంది. కానీ ఈ విషయం సుందరానికి చెప్పవద్దని రాధ వద్ద రాఘవ మాట తీసుకుంటాడు. సుందరం గొప్ప నటుడిగా, డబ్బూ పేరూ సంపాదిస్తాడు. ఒకనాడు రాధవద్దకు వెళ్ళి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు సుందరం. రాధ అతనికి నిజం తెలిపి తానూ, రాఘవ పెళ్ళి చేసుకోబోతున్నామని చెబుతుంది. సుందరం సంస్కార హృదయంతో రాఘవను అభినందిస్తాడు. నటుడిగా బిజీ అయిన సుందరం -తన తల్లి లక్ష్మి మెట్ల మీదనుంచి జారిపడి సీరియస్‌గా ఉన్నా రాలేకపోతాడు. సుందరం వచ్చేసరికి తల్లి మరణిస్తుంది. రాధ, రాఘవల పెళ్ళిలో తన సర్వర్ దుస్తులతో వచ్చిన సుందరం, ఇదే తనకు నిజమైన తృప్తినిచ్చే వృత్తి అని, వారిని తన జోకులతో నవ్వించటంతో చిత్రం ముగుస్తుంది.
స్వర్గీయ భీంసింగ్ మేనల్లుడు, ఎడిటింగ్ సహాయకులు పంజు, తమిళ చిత్రాలకు దర్శకత్వం శాఖలో పనిచేసిన కృష్ణన్ కలిసి, ‘కృష్ణన్-పంజు’ పేరిట పలు తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సర్వర్ సుందరం తమిళ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే కె బాలచందర్ నిర్వహించగా, వీరిరువురూ దర్శకత్వం చేపట్టారు. సన్నివేశాలను ఎంతో తమాషాగా సరదగా తీర్చిదిద్దుతూ, దానికి సెంటిమెంట్ జతచేసి చిత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
సాధారణంగా హోటల్‌లో జరిగే సన్నివేశాలు, సుందరం తన స్నేహితుడిని హోటల్‌లో కలుసుకోవటం, రాధ తనను ప్రేమిస్తోందని భ్రమించి అద్దంలో చూసుకుని మురిసిపోవటం, రాఘవ పెళ్ళిచూపులకు వెళ్తున్న సమయంలో కలిసిన సుందరం తన ప్రేమకథను వివరించటం, నటునిగా పరిచయమవటానికి మంచి చొక్కా కోసం తల్లి ఇచ్చిన పరీక్ష ఫీజు ఉపయోగించటం లాంటి సన్నివేశాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు దర్శకద్వయం. నటునిగా సుందరం రిహార్సల్స్, రాధ తనని ప్రేమిస్తోందని భ్రమలో ఎదగడం, లవ్ ప్రపోజ్ చేయడనికి పూలగుత్తితో వెళ్లి ఆమె నిరాకరించాక చెత్తబుట్ట కానుకగా అడిగి తీసుకువెళ్ళటం లాంటి చమత్కార సన్నివేశాల్లోనూ ఎమోషన్‌ను చొప్పించగలిగారు దర్శకద్వయం. రాఘవే రాధను వివాహం చేసుకోబోతున్నాడని తెలిసి ఆనందపడటం, రాఘవ గిల్టీగా ఫీల్‌కావటం, తన సన్మానానికి తల్లిని రమ్మంటే రానని బయటి జనంలోనుంచే కొడుకు ఆటోగ్రాఫ్ తీసుకోవటం లాంటి కొన్ని సీన్లు హృదయానికి హత్తుకుంటాయి. తండ్రి ఆబ్దీకానికి రానంత బిజీగావున్న కొడుకును చివరిక్షణాల్లో తనవద్ద వుండమని తన కోరికగా తల్లి తెలియచేయటం, తల్లి చివరి కోరిక తీర్చలేని స్థితిలో సుందరం వేదన అత్యద్భుత సన్నివేశాలే. ఇవేకాక కుటుంబ నియంత్రణపై హాస్య నాటికను చిత్రంలో సన్నివేశంగా చూపించారు. శ్రీమహావిష్ణువుగా హరనాథ్, బహు కుటుంబీకునిగా నాగేష్, మనోరమ నటించారు. సినిమాలో డైరెక్టర్‌గా ఎస్‌వి రంగారావు కనిపిస్తారు.
కొత్తగా వచ్చిన నటుడు సుందరానికి మంచినీళ్ళు తాగటానికి టైములేదని, హీరోయిన్ మనోరమకు ఆపిల్ జ్యూస్ ఇవ్వటం వంటి పలు సన్నివేశాలు చమత్కారంగా సాగుతాయి. రాధగా కెఆర్ విజయ తొలుత మహాబలిపురం వద్ద స్నేహితురాళ్ళతో కలిసి పాడే గీతం -కటిక శిలే ఒక కనె్నపడుచై’ (పి.సుశీల). చక్కని శిల్పాలను చూపుతూ ఎంతో ఆహ్లాదకరంగా చిత్రీకరించారు. ముత్తురామన్‌తో కలిసి సముద్రపు ఒడ్డున యుగళ గీతం -పూత పూచే హృదయం (పిబి శ్రీనివాస్, పి.సుశీల) చక్కని నృత్యంతో ఒక ప్రేమికురాలిగా, స్నేహమయిగా నటన, అందంతో కెఆర్ విజయ మెప్పించింది. ఒక స్నేహితుడి కోసం, అతని అభివృద్ధి కోసం తపనపడి తన ప్రేమను త్యాగంచేయడానికి సిద్ధపడిన మంచి స్నేహితునిగా, వ్యక్తిగా ముత్తురామన్ కనిపిస్తాడు. ఇక సర్వర్ సుందరం నాగేష్ నట జీవితంలో చిరస్మరణీయమైన పాత్ర. నాగేష్ తారాపధంలో ముందుకు దూసుకుపోవటానికి ఆలంబనగా నిలిచింది. ఈ చిత్రంలోని సుందరం పాత్రలో నాగేష్ ప్రతి సన్నివేశాన్నీ ఎంతో పరిణితితో నటించి అలరించారు. నాగేష్, ఒక నటిపై చిత్రీకరించిన నృత్య గీతం -నవ యువతి, చక్కని ఓ నవ యువతి’ (ఘంటసాల, యల్‌ఆర్ ఈశ్వరి). ఈ గీతంలో నాగేష్ నృత్యం, వెరైటీగా (ఈ పాటలో గాయకునిగా టిఆర్ సౌందర్‌రాజన్ కన్పిస్తారు) డిజైన్ చేసి చిత్రీకరించారు. కుటుంబ నియంత్రణపై చిత్రీకరించిన గీతంలో -పాడి పంటలు పొంగిపొర్లినది ఆనాటి భారతం’ అన్న గీతంలో చిన్న సంసారాన్ని చూపటం, వీటిలో నాగేష్ అభినయం ముచ్చట గొలుపుతుంది. ‘సర్వర్ సుందరం’ తెలుగు చిత్రం సందర్భోచిత మాటలతో, చక్కని పాటలతో అలరించేలా రూపుదిద్దుకుంది. అనిశెట్టి రచనతో పాటలు కొన్ని నేటికీ నిలవటం, చిత్రం విజయం సాధించటం హర్షదాయకం. తెలుగు స్ట్రెయిట్ చిత్రాలలోనూ కమెడియన్‌గా, క్యారెక్టర్ నటుడిగా నాగేష్, అందాల హీరోయిన్‌గా, క్యారెక్టర్ నటిగా కెఆర్ విజయ తెలుగువారికి దగ్గరకావటానికి ‘సర్వర్ సుందరం’ దోహదపడింది. అదేవిధంగా రచయిత బాలచందర్, దర్శకునిగా, నిర్మాతగా, తెలుగువారికి మరింత ఉత్తేజాన్ని కలిగించారు. ‘సర్వర్ సుందరం’ చిత్రాన్ని హిందీలో (1971) మై సుందరం హూ.. పేరిట మహమూద్ ఆలీతోను, కన్నడంలో జగ్గేష్‌తో 1993లో సర్వర్ సోముగా నిర్మించారు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి