మెయిన్ ఫీచర్

ఈ ఏడాదికింతే..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరానికి ఇక ‘శుభం’ కార్డు పడినట్టే. క్లైమాక్స్‌లోనూ ఏమీ ఆర్భాటం లేకుండానే - సినీ కథలు వచ్చే సంక్రాంతి సంబరాల వైపు పరుగులు
తీయబోతున్నాయి. భారీ బడ్జెట్ - భారీ తారాగణం.. భారీ కటౌట్ల వ్యవహారాలన్నీ ‘తెర’మరుగై పోయి- కళ్లు కాయలు కాసేలా.. మనసు తెర
పొరలన్నీ వీడిపోయేలా - ఏదో ఒక రాగం ఏదో ఒక కథ కోసం మళ్లీ అనే్వషణ. సంవత్సరాంతంలోనూ అరకొర సినీ కథలు తప్ప- భూనభోనాంతరాళాలు బద్దలయ్యే సీన్ లేదు.

టాటా సుమోలూ - దుమ్ము రేగొట్టే ఫైటింగ్‌లూ.. కత్తులు ఝళిపించి వొళ్లు గగుర్పొడిచే సన్నివేశాల సమారాధనలూ.. కూసింత ప్రేమ వొలకబోసి.. మరికాస్త సెంటిమెంట్ రంగరించి -ఆనక ఏడ్పుగొట్టు టెన్షన్ల దాగుడు మూతలూ - క్రైం థ్రిల్లర్‌తో సగటు ప్రేక్షకుడి ఆలోచనల రీళ్లకి ఆనకట్ట వేసేట్టు- ఇలా ఎనె్నన్నో తెర మీదికి వచ్చేశాయి. ప్రేక్షకుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎప్పటికప్పుడు థియేటర్‌లోకి వచ్చిన ప్రతి సినిమానీ విశే్లషించటం.. ముందుగానే ఒక అంచనాకి వచ్చేయటం.. తమ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానో.. ఇంకాస్త ఎక్కువగానో -ఉందా సరేసరి. లేకుంటే ఎక్కడెక్కడ ఏయే సూత్రాల్ని పాటించలేదో? తమతమ ఇమేజ్ చట్రాలకు తగినట్టు నటించేసి ఊరుకున్నారా? అసలు ఈ కథని సినిమాగా తీయాలని నిర్మాతకి ఎందుకు అనిపించిందో? దర్శకుడికీ కథకుడికీ ఈ కథలో ఏం కొత్తదనం కనిపించిందో? సినిమాల్ని ఇలా కూడా తీయ్యొచ్చునా? దర్శకుడు ఈ కథని ఇలా చెప్పకుండా ఉండాల్సింది? ఫలానా టర్నింగ్ పాయింట్‌ని డైరెక్టర్ మర్చిపోయాడెందుకో? ఆ సీనియర్ మోస్ట్ నటుడు/ నటి అలా పాత్రలో జీవించకుండా ఉండాల్సింది? ఈ కేరెక్టర్‌ని హఠాత్తుగా ఎందుకు చంపేశాడో? ఇలా ముసిరిన ఎనె్నన్నో ఆలోచనల నడుమ తన సుదీర్ఘ సినీ వీక్షక ప్రయాణాన్ని మరో రెండు నెలల్లో ఈ సంవత్సరానికి ముగించబోతున్న ప్రేక్షకుడి మదిలో ఒక్కసారి ఆయా సిత్రాలు కళ్ల ముందు మెదిలితే?!
పంచెకట్టు సూత్రం?!
ఇండస్ట్రీలో ఓ టాక్. సంక్రాంతికి ‘పంచె’ బిగిస్తే మినిమమ్ గ్యారంటీ అని. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. పంచెకట్టు సూత్రాన్ని హీరోలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారా? అంటే ప్రశ్నార్థకమే అయినప్పటికీ -సోగ్గాడె చిన్ని నాయనా-తో ఆ సంప్రదాయం కొనసాగి.. ప్రేక్షకులకు తన ‘ఆత్మ’కథని వినిపిస్తే.. అలనాటి ఏఎన్నార్‌ని మళ్లీ చూసేశారు. ఇక్కడో తిరకాసు. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి మైండ్‌గేమ్ సినిమాని బ్లాంక్ మైండ్‌తో చూసేసి.. అర్థమరుూ కానట్టు క్వొశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేసిన ప్రేక్షకుడికి ‘సోగ్గాడు’ మాంఛి కిక్ ఇచ్చాడన్న నిర్ధారణకు వచ్చేయ్యొచ్చు. ఒకరా ఇద్దరా? అంతమంది నాయికల్తో గోపీకా వల్లభునికి మల్లే ‘స్టెప్’లేస్తే.. అదీగాక ఏ ఆలోచన లేకుండా సినిమా తిలకిస్తే.. సంక్రాంతి వేడుకలంత వైభవంగా.. కోడిపందేలంత ముచ్చటగా ఉంది. ‘నాన్న’ కథల మధ్య ‘నేను శైలజ’ అంటే ప్రేక్షకుడు ఒప్పుకోలేదు. అబ్బాయితో అమ్మాయి అన్నప్పటికీ.. కిల్లింగ్ వీరప్పన్.. అన్నా.. లచ్చిందేవికి ఓ లెక్కుంది అన్నా.. సీతమ్మ అందాలు.. డిక్టేటర్ -ఇలా ఏమన్నా.. ఎక్స్‌ప్రెస్ రాజా అంత వేగంగా వెనక్కి వెళ్లిపోయాయి.
నో స్పీడ్!
సోగ్గాడిని మరిపించేందుకు ‘స్పీడ్’తో వచ్చిన స్పీడున్నోడికి బ్రేక్‌లు ఫెయిలవటంతో.. ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెళ్లిపోతూ పోతూంటే.. ‘క్షణం’ దగ్గర ఆగేట్టు చేసింది సినీ కథ. లోబడ్జెట్‌తో -చిన్న కథతో క్రైం థ్రిల్లర్‌గా వచ్చి.. సరైన రీతిలో చెప్పిన కథనే చెబితే కచ్చితంగా చూసేస్తారన్న నీతి వాక్యాన్ని తిరగరాసింది. అసలు పాప ఉందా? ఉంటే ఆమెని కిడ్నాప్ ఎవరు చేశారు? ఎక్కడో ఉన్న హీరోని ఇండియాకి రప్పించటం వెనుక ఉన్న అంతఃపుర రహస్యం ఏమిటి? అన్న చిన్న పాయింట్‌తో వచ్చిన ఈ సినిమా ఏ ‘మలుపు’ దగ్గరా ఆగలేదు. వెనె్నల్లో హాయ్‌హాయ్ అంటూ పలకరించినా.. వీరి వీరి గుమ్మడి పండు ఎవరో కనుక్కోమన్నా.. కృష్ణగాడి వీర ప్రేమగాథని మళ్లీ చెబుతామన్నా.. కృష్ణాష్టమి చేసుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చినా.. ‘టెర్రర్’ పుట్టించి ‘పడేశావ్’ అన్నప్పటికీ.. ‘క్షణం’సేపు మాయలో పడిపోయి ఫిబ్రవరి నెలని ఆట్టే గట్టెక్కించేశాడు ప్రేక్షకుడు.
ఓ స్ర్తి.. రేపు రా!
చాన్నాళ్లకి పూర్వం -పట్నాల్లోనూ పల్లెల్లోనూ అన్ని గోడల మీద వెలసిన ఈ మాటలు - సినీ కథగా రూపొంది- ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో? ఏ థియేటర్‌లో ఆడిందో తెలీక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న జనానికి ‘గుంటూరు టాకీస్’తో మంచి పోస్టర్ పడిందని తెగ మురిసిపోయారు. కానీ -అదంతా పోస్టర్ ‘వైభోగమే’ తప్ప టాకీస్‌లో సత్తా ఏం లేదని తెలీటంతో- థియేటర్‌కి వెళ్లి ‘శౌర్య’ ప్రతాపాలు చూపించేందుకు ‘తుంటరి’ ఆలోచనల్తో వెళ్లారు. అక్కడ కూడా చుక్క ఎదురైంది. దాంతో ‘రన్’ చేస్తూండగా - ‘ఊపిరి’ పోసింది ఓ కథ. ‘సోగ్గాడె చిన్ని నాయనా’తో గోపికా వల్లభుడిగా మత్తెక్కించిన కథానాయకుణ్ణి ‘వీల్ ఛెయిర్’లో కూర్చోబెట్టి.. పాటలూ పద్యాలూ లేకుండా.. స్టెప్‌లేసే ఛాన్స్ లేకుండా చేస్తే.. చూస్తారా? అన్న సందేహం థియేటర్‌లోకి అడుగు పెట్టింత్తర్వాత ఒకసారిగా మటుమాయమై.. కథకి ‘ఊపిరి’ వచ్చింది. అదొక ‘దృశ్య కావ్యం’గా నిలిచిపోయి ప్రేక్షకుల్ని ఏప్రిల్ వైపు నడిపించింది.
ఒరేయ్.. రాస్కో!?
సర్దార్ గబ్బర్‌సింగ్ వస్తున్నాడనటంతోనే.. ‘అటాక్’ చేసేవాళ్లూ.. ‘7 టు 4’ అని టైమ్ నిర్ణయించేవాళ్లూ.. ఈడో రకం.. ఆడో రకం అంటూ ఎటూ తేల్చుకోలేని వాళ్లూ.. సరైనోడు సైతం.. సర్దార్ దెబ్బకి అతలాకుతలమై.. చెల్లాచెదరయ్యారు. అలాగని -సర్దార్ గబ్బర్‌సింగ్ కూడా తూటాలు పేల్చాడా? అంటే - ప్రేక్షకుడి తీర్పులో సరైన మార్కులు పడలేదు. ఇక్కడ కమర్షియల్ సాధింపుల మాట లెక్కల్లోకి రాలేదు.
బ్రహ్మరథం?!
స్క్రీన్‌పై ఇంతమంది కనిపిస్తే.. ఏ దిక్కు చూడాలో? ఎవరి ‘మంచి’ మాటలు వినాలో? పచ్చళ్లు తయారుచేయటం ఎలా? ఉమ్మడి కుటుంబంతో కలిసి వడియాలు ఆరబోయటం ఎలా? పెద్దాయన మరణిస్తే.. ఎవరికి వాళ్లు కార్లు వేసేసుకొని.. వెళ్లిపోతూంటే ఏదో ‘్ఫల్’ మిస్సయ్యామే అనుకొంటూండగానే.. ‘బ్రహ్మోత్సవం’ గంట కొట్టేసింది. ఈ బ్రహ్మోత్సవంలో మందీ మార్బలం.. ఖరీదైన కంచిపట్టు చీరలూ.. తరాల వేటలో సాగిన ‘ట్రావెలాగ్’ -ఇలా ఏ అంశాన్ని తలకెత్తుకోవాలో తెలీక.. హీరో ఎద్దుల బండి మీద వస్తూంటే.. చూట్టానికి ‘జీ’ టీవీ ఎపిసోడ్‌లా అనిపించినా.. ‘బ్రహ్మరథం’ (?) పట్టేద్దామనుకొంటే- ఆ ఛాన్స్ ఇవ్వకుండానే మూట ముల్లె సర్దుకొని.. ఏ అనుభూతిని తావీయకుండా తుర్రుమంది.
అ.. అంటే కలవపూడి
నిన్నటి తరం కథని నేటి తరానికి అన్వయించి ‘అ.. ఆ..’ అంటూ అనసూయ రామలింగం - ఆనందవిహారి కథని భేష్షుగ్గా చెప్పేశారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ కామెడీతో అలరించిన ఈ ‘అ.. ఆ’ని ప్రేక్షకుడు చక్కగానే రిసీవ్ చేసుకొన్నాడు. దర్శకుడి స్థాయి పంచ్ డైలాగ్‌లు పడలేదని అక్కడక్కడ కాస్తంత కినుక వహించినా.. మొత్తానికి ‘రైట్ రైట్’ అనేశాడు. అక్కడ్నుంచీ ‘ట్రాఫిక్’లో ఇరుక్కుపోయిన ‘ఒక్క అమ్మాయి తప్ప’.. జెంటిల్‌మేన్.. ప్రేమికుడు.. కుందనపు బొమ్మ విచ్చేసినా.. అవేవీ పులుసుల్లో క్కూడా దొరకలేదు. జెంటిల్‌మేన్ చక్కటి కథాంశమే అయినా.. కానె్సప్ట్ అర్థం కాకపోవటంతో కథ అడ్డం తిరిగింది. ఎంతో కాలంగా ఎనె్నన్నో అంచనాలు వేసుకొంటూ ‘యూ ట్యూబ్’తో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొన్న నిహారిక ‘ఒక మనసు’ మల్లెల తీరం చేరలేకపోయింది. ఆ కేరెక్టర్‌ని చంపేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎన్ని తర్జనభర్జనలు చేసినప్పటికీ.. ‘ఒక్క’ ప్రేక్షకుడూ ఒప్పుకోలేదు.
రోజులు మారాయి..!
ఓ చేత్తో పూల సజ్జ.. మరో చేత్తో నెత్తురోడుతోన్న కత్తి పుచ్చుకొన్న ‘నాయకి’ పోస్టర్ కలకలం సృష్టించింది. కానీ- పోస్టర్‌లో ఉన్నంత ‘కసి’ త్రిషలో కనిపించకపోవటం.. రొటీన్ దెయ్యం చేష్టలతో జనం పిచ్చెత్తిపోయారు. పట్టాలపై వేగంగా వస్తోన్న ట్రైన్‌తో ‘సెల్ఫీ’ కానె్సప్ట్ బాగున్నప్పటికీ.. ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్లాడో తెలీదీ ‘సెల్ఫీ రాజా’. జక్కన్న పరిస్థితి ఇంతే. ఈ ఎపిసోడ్‌లో చెప్పుకోదగ్గ సినిమా అంటే ‘పెళ్లిచూపులు’ ఒక్కటే. డిఫరెంట్ కానె్సప్ట్‌తో.. డిఫరెంట్ స్టైల్‌లో జనాన్ని ఆకట్టుకొని.. మరి కొద్ది రోజులు ఎదురుచూపుల్తో కట్టిపడేసింది.
తిక్కతిక్కగా ఉన్నది..!
ఇక్కడ ‘శ్రీరస్తు శుభమస్తు’ తప్ప ఏదీ నిలవలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘బాబు బంగారం’ క్వాలిటీ పరంగా సరిగ్గా లేకపోవటం.. ‘బొమ్మల రామారం’ లాంటి ‘తిక్క’ సినిమాలతో పాటు ‘బంతిపూల జానకి’ ‘అవసరానికో అబద్ధం’ ‘ఆటాడుకుందాం రా...’ అంటూ ‘మనమంతా’ వచ్చినా అన్నీ నిరాశను వెంట తెచ్చినవే.
టెన్షన్?!
‘నాన్నకు ప్రేమతో’ తర్వాత వచ్చిన ‘జనతా గ్యారేజీ’ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ‘నాన్నకు..’ మైండ్ గేమ్ పనిచేసినట్టుగా.. ఈ ‘జనతా గ్యారేజీ’ అన్ని పార్ట్స్‌ని సరిగ్గా ఫిట్ చేయలేకపోయింది. దీంతో -ప్చ్! అన్న పెదవి విరుపు ప్రేక్షకుల మొహాల్లో కనిపించింది. ‘జ్యో అచ్యుతానంద’ కథాపరంగా బలంగా ఉన్నప్పటికీ.. ‘కిక్’ ఇవ్వలేదు. లేలేత ప్రేమస్పర్శతో వెలువడిన ‘నిర్మలా కానె్వంట్’ కూడా సరైన ‘మార్కులు’ తెచ్చుకోలేక పోయింది.
‘ప్రేమమ్’
మలయాళంలో సంచలనం సృష్టించి తెలుగులో రీమేక్ అయిన చిత్రం ‘ప్రేమమ్’. ఇన్నాళ్లకి ఓ దృశ్య కావ్యాన్ని చూశామన్న సంతృప్తిని మిగిల్చిందీ కథ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇటువంటి ‘ఎపిసోడ్’ ఏదో ఒకటి ఉండటం మూలాన ‘కనెక్ట్’ అయి అనుభూతుల డోలికల్లో విహరింపజేసింది. మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక -అభినేత్రి.. ఈడు గోల్డె హె.. మన ఊరి రామాయణం.. నాగభరణం.. చిత్రాలు ఎటువంటి సంతృప్తిని కలిగించలేదేమో కూడా.
* * *
ఈ సంవత్సరంలో సుమారు 79 సినిమాలు రిలీజైతే.. చెప్పుకోదగ్గవి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. సంఖ్యాపరంగా కాకుండా.. కథాపరంగా నిలిచినవీ తక్కువే. కాకపోతే- ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వినూత్న రీతిలో చెప్పుకొచ్చారని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో.. డిఫరెంట్ యాంగిల్‌లో.. డిఫరెంట్ థింకింగ్‌తో వస్తూన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. కొత్త సంవత్సరంలో సినీ కథ ఏ తీరాల అనుభూతులకు చేరువ చేస్తుందో? వేచి చూద్దాం.

-బిNకె