మీ వ్యూస్

భూలోకంలో యమలోకం ( ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, సినిమా అనుసరణ, నిర్వహణ:
ఎస్ భావన్నారాయణ
కళ: పియన్ మీనన్
ఎడిటింగ్: కెయస్‌ఆర్ దాస్
కెమెరా: హెచ్‌ఎస్ వేణు
స్టంట్స్: మాధవన్
నృత్యం: ఎకె చోప్రా
సంగీతం: కోదండపాణి
మాటలు: జి కృష్ణమూర్తి
దర్శకత్వం: జి విశ్వనాథం
నిర్మాత: వైవి రావు
ఆదుర్తి సుబ్బారావును తొలిసారి దర్శకునిగా చిత్రసీమకు ‘అమర సందేశం’ చిత్రం ద్వారా పరిచయం చేశారు సరిదె భావన్నారాయణ. సాహిత్యం పట్ల అభిరుచిగల వీరు తాము రూపొందించే చిత్రాలకు తామే కథలు సమకూర్చుకుంటారు. జానపద బ్రహ్మ విఠలాచార్య వద్ద సహాయకునిగా పనిచేసిన జి విశ్వనాథం దర్శకత్వంలో కొన్ని చిత్రాలను గౌరీ ప్రొడక్షన్స్ పతాకంపై సమర్పించారు.
రాజమండ్రికి చెందిన వైవి రావు 1948లో ‘సువర్ణమాల’ చిత్ర నిర్మాణ బాధ్యత వహించడానికి మద్రాసు వచ్చారు. 1954 నుంచి ‘డిటెక్టివ్’ మాసపత్రిక సంపాదకునిగా, సర్క్యులేషన్ మేనేజర్‌గా వ్యవహరించారు. తన బావ, నిర్మాత ఎస్ భావన్నారాయణ ప్రోత్సాహంతో గౌరీ ప్రొడక్షన్స్ పేరిట నిర్మించిన 12 చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. 1968లో రవి చిత్ర ఫిలిమ్స్ నెలకొల్పి ‘టక్కరిదొంగ- చక్కని చుక్క’ ‘పగసాధిస్తా’, ‘రివాల్వర్ రాణి’ వంటి పలు చిత్రాలు రూపొందించారు. 1966లో గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీరందరి కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం -్భలోకంలో యమలోకం.
***
విశాల దేశపు రాజు చిత్రసేనుడు (ప్రభాకర్‌రెడ్డి). అతని కుమార్తె కళావతి (రాజశ్రీ). మహారాజు ఉంపుడుగత్తె భూదేవి (పుష్పలత). ఆమె కుమార్తె మదనరేఖ (నాగరత్నం). భూదేవి తమ్ముడు ధూమకేతు (సత్యనారాయణ) సైన్యాధిపతి. ఇక విజయపురి యువరాజు రాజ్యవర్ధనుడు. అతని తండ్రి విజయవర్ధనుడు (మిక్కిలినేని).
కథలోకి వెళ్తే.. రుద్రాక్షుడనే మాంత్రికుడు సర్వసిద్ధుల కోసం దేవిని ప్రసన్నం చేసుకుంటాడు. బుద్ధిబలం, భుజబలం, ధైర్య శౌర్యాలు గలిగి వివాహితుడైన బ్రహ్మచారి యువకుడిని వైశాఖ పూర్ణిమనాడు పూజాప్రసూనంగా బలిస్తే, నీ కోరిక తీరుతుందని రుద్రాక్షుడికి దేవి ఆనతిస్తుంది. అలాంటి యువకుని పట్టుకునేందుకు బయలుదేరతాడు రుద్రాక్షుడు (రాజనాల).
అలా చిత్రసేనుని కలిసి యువరాణికి స్వయంవరం ప్రకటించమంటాడు. అందులో మూడు రకాల పరీక్షలు నిర్వహించాలని సూచిస్తాడు. తరువాత రాజ్యవర్ధనుని వద్దకెళ్లి కొన్ని వింత వస్తువులు, స్వప్నదర్శిని ద్వారా కళావతిని చూపించి స్వయంవరానికి వెళ్ళేలా చేస్తాడు. స్వయంవరంలోని అన్ని పరీక్షల్లో విజయం సాధించిన రాజ్యవర్ధనుడు, తన కత్తికి బాసికం కట్టించి కళావతిని పెళ్లి చేసుకుంటాడు. రాజ్యవర్ధనుడిపై ఆశపడిన మదనరేఖ, కళావతికి మత్తుమందిచ్చి ధూమకేతుకు అప్పగిస్తుంది. తండ్రికి కళావతిపై అపనిందలు వేసి, తానే వధువుగా విజయపురి వెళ్తుంది. ఆమె కళావతి కాదని గ్రహించిన రాజ్యవర్థనుడు, తండ్రితో వాదించి భార్య ఆచూకీ తెలుసుకోడానికి స్నేహితుడు కోలాహలం (రాజబాబు)తో బయలుదేరుతాడు. ధూమకేతు బారినుంచి కళావతిని కాపాడిన రుద్రాక్షుడు ఆమెను బంధిస్తాడు. తరువాత రాజ్యవర్ధనుని కలిసి, యువరాణి లభించాలంటే మంత్ర విద్యలు నేర్వాలని చెప్పి తానే వాటిని బోధిస్తాడు. సర్వశక్తులు సంపాదించిన రాజ్యవర్ధనుడు బేతాళుని సాయంతో రుద్రాక్షుడే మోసకారి అని గ్రహించి, అతనితో తలపడి రుద్రాక్షుడి శక్తులు నిర్వీర్యం చేస్తాడు. తన తండ్రి యమధర్మరాజుగా ఒక యమలోకం సృష్టించి, మదనరేఖ, ధూమకేతు మొదలైన వారందరినీ శిక్షించి, నిజం చెప్పిస్తాడు. రాజ్యవర్ధనుని క్షమాపణ కోరిన రుద్రాక్షునికి తిరిగి శక్తులురావటం, దాంతో అతడు యువరాజుతో చిత్ర విచిత్ర వైనాలతో యుద్ధం సాగించటం, యువరాజు చేతిలో మరణించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో కళావతి చెలికత్తెగా వాణిశ్రీ కనిపిస్తుంది. ఇంకా మోదుకూరి సత్యం, రుద్రాక్షుని శిష్యుడు సాకారుగా గణేష్ ఇతర పాత్రలు పోషించారు. పలు జానపద చిత్రాలకు పసందైన మాటలు రాయటంలో నేర్పరి అనిపించుకున్న జి కృష్ణమూర్తి ఆకట్టుకునేలా సంభాషణలు సమకూర్చారు. నటీనటులు పరిణితి గల నటనతో పాత్రోచితంగా మెప్పించారు.
దర్శకులు జి విశ్వనాథం కథానుగుణంగా సన్నివేశాలను రూపొందించి అలరించారు. మాంత్రికుడు మారువేషంలో యువరాజును కలిసి స్వప్నదర్శిని చూపటం, దానిలోంచి కళావతి ఆగమనం, చక్కని గీతం -అందుకో అందిస్తానురా (పి సుశీల, పిబి శ్రీనివాస్- రచన జి.కృష్ణమూర్తి), అద్భుతమైన సెట్టింగ్స్‌తో మనోరంజకంగా తీర్చిదిద్దారు. కళావతిని బంధించిన మందిరం శిల్పాలతో రమణీయంగా చూపటం, చిలక విన్యాసాలు, బేతాళుని వశం చేసుకోవటం. కాంతారావులా సత్యనారాయణచే నటింపచేయటం, చివర మాంత్రికునితో యుద్ధంలో పులిగా, కొండ చిలువగా, మొసలిగా, నేలపైన, నీటిలో విచిత్ర ఆయుధాలతో పోరాటంలాంటి పలు విన్యాసాలను వైవిధ్యంగా చిత్రీకరించారు. కోదండపాణి అందించిన సుస్వర స్వరాలు, కొన్ని గీతాలు వీనులవిందుగా నేటికీ అలరిస్తున్నాయి. కాంతారావు, రాజశ్రీలపై చిత్రీకరించిన యుగళ గీతం -అడగవే జాబిల్లి అడగవే (ఘంటసాల, ఎస్ జానకి -రచన దాశరథి). నాగరత్నం, కాంతారావులపై సభలో చిత్రీకరించిన పొడుపుకథల గీతం -ఓ మీసమున్న మొనగాడా (ఎస్ జానకి, ఘంటసాల- దాశరధి). వాణిశ్రీ, రాజబాబులపై చిత్రీకరించిన హాస్య గీతం ‘గున్నమామిడి తోటుంది’ (ఎస్ జానకి- సినారె).
ఇక యమలోకంలో కొన్ని పద్యాలు ఆకట్టుకుంటాయి. -బలవంతుడు గుర్రంపై (గానం ఘంటసాల బృందం- రాచన పాలగుమ్మి పద్మరాజు.. ఇది హరిశ్చంద్ర నాటకంలో పద్యంలా అనిపిస్తుంది). మాధవపెద్ది పాడిన మరో పద్యం -్భతాళశక్తి కల్పించినావు. -హితము కోరెడు పురోహితుడట్లు (ఎవి సుబ్బారావు- పాలగుమ్మి), -ఓ యమధర్మరాజా మహతోజ్వల తేజ (ఎస్ జానకి -ఆరుద్ర). గుర్రాన్ని అమ్మజూపుతూ కాంతారావు, రాజబాబు బృందంపై చిత్రీకరించిన తమాషా గీతం -ఆడవే, ఆడవే గుర్రమా/ నాతోడు ఠింగణా గుర్రమా (మాధవపెద్ది, పట్ట్భా-రచన కొసరాజు). భూలోకంలో యమలోకం సృష్టించటం, శిక్షలు విధించి కొరడాలతో కొట్టడంలాంటి దృశ్యాలు అప్పట్లో ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రం విజయవంతం కాకపోవటానికి అలాంటి సన్నివేశాలు ఒక కారణమైనా, చక్కని సంగీతంతో సినిమా ఆద్యంతం ప్రత్యేకతను సంతరించుకుంది. కొన్ని సన్నివేశాలతో పట్టుతో చిత్రీకరించిన వైనం, చిలుక, గుర్రం విన్యాసాలు, ఫైటింగులు బాలలకు, వినోదాన్నిస్తూ, పెద్దలకు కాలక్షేపం కలిగించే చిత్రంగా ‘్భలోకంలో యమలోకం’ నిలిచింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి