Others

ఆస్తిపరులు ( ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: ఆచార్య ఆత్రేయ
కళ: జివి సుబ్బారావు
కూర్పు: అక్కినేని సంజీవరావు
నృత్యం: హీరాలాల్
ఫొటోగ్రఫీ: సి నాగేశ్వరరావు
స్టంట్స్: రాఘవులు
సంగీతం: కెవి మహదేవన్
అసోసియేట్ దర్శకుడు: పిసి రెడ్డి
దర్శకుడు: వి మధుసూధనరావు
నిర్మాత: విబి రాజేంద్రప్రసాద్.

కృష్ణా జిల్లాకు చెందిన వీరమాచినేని బాబూరాజేంద్రప్రసాద్ కాకినాడలో డిగ్రీ చదువుకునే రోజుల్లో నాటకాల పట్ల ఆసక్తిచూపేవారు. ఆ ఆసక్తి, అనుభవంతోనే ‘కప్పలు’ నాటకంలో కథానాయిక పంకజం పాత్రకు ‘ఉత్తమ నటి’ బహుమతి పొందారు. నటనపై ఆసక్తితో మద్రాసు చేరిన రాజేంద్రప్రసాద్ చిత్ర నిర్మాణం పట్ల దృష్టి మరల్చి, తండ్రి జగపతిరావు అందించిన ఆర్థిక సాయంతో మరో మిత్రుడు రంగారావుతో కలిసి ‘జగపతి పిక్చర్స్’ నెలకొల్పారు. తొలి ప్రయత్నంగా జగ్గయ్య, జమునల కాంబినేషన్‌లో ‘అన్నపూర్ణ’ రూపొందించారు. అ, ఆల క్రమంలో చిత్రాలు నిర్మించడం అలవాటుగా మారిన ఈ సంస్థ నిర్మించిన ‘అంతస్తులు’ చిత్రానికి పలు అవార్డులు పొందింది. తరువాత 1966లో వీరు రూపొందించిన చిత్రం ‘ఆస్తిపరులు’.
విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వి మధుసూధనరావు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆస్తిపరులు చిత్రానికి దర్శకులు వి మధుసూధనరావే.
***
జమీందారు రాజశేఖరం (గుమ్మడి) మొదటి భార్య సంతానం కృష్ణ (అక్కినేని). రెండో భార్య కాసులమ్మ (సూర్యాకాంతం) సంతానం భాస్కర్ (జగ్గయ్య), అమ్మలు (బేబి పద్మిని). జమీందారు చెల్లెలు రాజ్యలక్ష్మి (జి వరలక్ష్మి). ఆమె కుమారుడు ప్రసాదం (రేలంగి), కుమార్తె రాధ (జయలలిత). మంచివాడైన కృష్ణ జమీందారి వ్యవహారాలు నడుపుతూ అందరి ప్రశంసలు అందుకుంటుంటాడు. భాస్కర్ చెడు అలవాట్లకు లోనై విలాసాలతో జీవిస్తుంటాడు. డబ్బుకోసం భాస్కర్ తండ్రికి ఎదురు తిరగటంతో, జమీందారు రాజశేఖరం గుండెనొప్పితో మరణిస్తాడు. విల్లులో ఆస్తికి సంరక్షకులుగా కృష్ణను, చెల్లెలిని నియమిస్తాడు జమీందారు. కృష్ణ అజమాయిషి నచ్చని భాస్కర్ అతన్ని అంతమొందించాలని అనుకుంటాడు. బోటులో తీసుకువెళ్ళి, జల గండంవల్ల ఈత రాని అన్నను నదిలో ముంచేసి వస్తాడు. కృష్ణతో అనుబంధంగల అమ్మలు దిగులుతో మంచం పడుతుంది. కృష్ణ లేకపోవటంతో ఆస్తిని, రాధను భాస్కర్‌కు అప్పగించాలని వారి మేనత్త సంకల్పిస్తుంది. ఆ సమయంలో కృష్ణ, ప్రసాదం ద్వారా శ్రీనుగా పరిచయం కాబడి కృష్ణగా బంగళాకు వస్తాడు. వచ్చింది కృష్ణేనని అర్థం చేసుకున్న భాస్కర్ ఎన్నో పరీక్షలు పెడతాడు. చివరకు అతన్ని ఇంటినుంచి పంపించేయాలని కుట్ర పన్నుతాడు. కుట్రలో భాగంగా వచ్చింది కృష్ణకాదని, ప్రసాదం చేత మేనత్త, రాధల చేత నిరాకరించబడేలా చేస్తాడు. ఒక్క అమ్ములు మాత్రమే అన్న కోసం విలవిల్లాడుతుంది. ఆ సమయంలో తానెవరో నిజం నిరూపించుకోవటానికి తండ్రి చెప్పిన రహస్యం గుర్తుకుతెచ్చుకున్న కృష్ణ, పాడుబడిన బావిలో దాచిన తల్లి జవహరీ తేవటానికి వెళ్తాడు. మరోసారి కృష్ణను అంతం చేయాలని విశ్వ ప్రయత్నం చేసిన భాస్కర్ విఫలుడవటం, కాలువిరిగి బావిలో పడనున్న అతన్ని కృష్ణ రక్షించి దగ్గరకు తీసుకోవటం, తల్లి సైతం అతన్ని చావనివ్వమని కోరగా భాస్కర్‌లో మరింత పరివర్తన కలగటంతో రాధ, కృష్ణల చేతులు ఒకటిగా కలపటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో దివాన్‌గా నాగయ్య, పల్లె యువతిగా వాణిశ్రీ, భాస్కర్ కృష్ణల బంధువు పరాత్పరంగా చదలవాడ, అతని కూతురు సినిమాపిచ్చి వరంగా గిరిజ కనిపిస్తారు. వారితో హాస్య సన్నివేశాలు, గిరిజ సినిమా పాటల పల్లవులు పాడటం, జుట్టుకోసం ప్రహసనం, అక్కినేని, గిరిజ, రేలంగిలపై హాస్య సన్నివేశాలతో చిత్రానికి నిండుతనం తెచ్చారు. దర్శకులు వి మధుసూధనరావు చిత్రాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దారు. టైటిల్స్ వస్తుండగా చిన్నతనంలో భాస్కర్, కృష్ణ గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చుకోవటం, కృష్ణకు జలగండం వుందని, భాస్కర్ మాత్రమే ఈత నేర్చుకోవటం, తండ్రి మరణించాక అన్నను బోటు ప్రమాదంలో చంప యత్నించటం, తిరిగి బ్రతికి వచ్చిన కృష్ణకు భాస్కర్ పెట్టిన పరీక్షలు, రాధ నృత్యం చేస్తుండగా కొరడాతో కృష్ణ ఆమె సిగలో పూవులు తీయటంలాంటి సన్నివేశాలు ఎంతో ఉత్కంఠ కలిగిస్తాయి. భాస్కర్, కృష్ణల మధ్య కత్తియుద్ధం, వంతెన అంచుపై నిలబడి సాగించే పోరాటం థ్రిల్లింగ్‌గా చిత్రీకరించారు. కృష్ణను అనుమానించి మేనత్త, పిన్ని, భాస్కర్, చివరకు రాధ అతన్ని నమ్మకపోవటం, అమ్ములు మాత్రం నీవే నా అన్నవు అంటూ వేదన ఎంతో బరువుగల సన్నివేశాలు అనిపిస్తాయి. ‘చిట్టిఅమ్మలు’ విషాద గీతంలో ప్రధాన పాత్రల రియాక్షన్, కృష్ణ వేదనతో గుడిముందు విచారిస్తుంటే తండ్రి ఆత్మ ఫొటోనుంచి రహస్యాన్ని గుర్తుచేయటం, పతాక సన్నివేశంలో నూతిలో దాచిన తల్లి జవహరిని కృష్ణ సాధించే యత్నంలో భాస్కర్ అడ్డంకులు ఎంతో ఎఫెక్టివ్‌గా చిత్రీకరించారు.
ఆత్రేయ సందర్భోచిత మాటలు, పాటలు అలరించేలా సాగాయి. గుమ్మడి -తొలుత మనం మనుషులం/ తరువాతే ఆస్తిపరులం అని... అక్కినేని చివర జగ్గయ్యతో ‘ప్రేమే మన ఆస్తి. అదివుంటే ఆస్తిపరులు లేకుంటే దురాశాపరులం అన్న ప్రయోగాలు అర్థవంతంగా తోస్తాయి.
‘హృదయాలను మూయవీతలుపులు’, ‘విడదీసినారమ్మ మన తనువులు’ (విషాద గీతం), చిట్టి అమ్మలు (సంతోష గీతం)లో ‘ఎవరికెవరు వేశారు బంధము/ ఒకరికొకరమయినాము ప్రాణము/ నీకు నేను అమ్మను, నాన్నను/ నాకు నీవే లోకాన సర్వము’... కొరడా పాటలో రాధ నృత్యంలో ‘ఎవ్వరింత మొనగాడయిన పువ్వు, నవ్వు విడదీసేరా’లాంటి అర్ధవంతమైన ప్రయోగాలు పాటల్లో చూపారు ఆత్రేయ. అవి యుగళ గీతాల్లోనూ ప్రతిబింబించాయి.
కథానాయకుడు కృష్ణగా అక్కినేని నల్లేరుపై నడకలా ఎంతో పరిణితితో జమీందారి వ్యవహారాలు, తండ్రివద్ద, పెద్దల ఎడ కనపర్చిన గౌరవ మర్యాదలు చూపిస్తూ హుందాగా మెప్పించారు. ఇక మేనత్త కూతురు రాధతో చిలిపి మాటలు, కవ్వించే చూపులతో సరసునిగా మనోల్లాసం కలిగించారు. తననితాను నిరూపించుకునే సన్నివేశంలో దృఢత్వం, అమ్ములు పట్ల వాత్సల్యం, వేదన ఆకట్టుకునేలా నటించి మెప్పించారు. రాధగా జయలలిత సన్నివేశానుగుణంగా బావతో అల్లరిగా, ప్రేమగా, భాస్కర్‌తో వివాహనిశ్చయంతో విచారం, బావకాదేమోనన్న శంకతో వేదన భావయుక్తమైన నటనతో మెప్పించింది. మేనత్త రాజ్యలక్ష్మిగా జి వరలక్ష్మి గంభీరమైన, బాధ్యతాయుతమైన ప్రవర్తన నటనలో ఎంతో సహజంగా ఒప్పించారు.
అక్కినేని, జయలలితలపై -మిడిసిపడకు, మిడిసి పడకు అత్తకూతురా, -నడుము లేని నడకే ఒక నాట్యం (ఘంటసాల), మరో 3 యుగళ గీతాలు -అందరికి తెలియనిది నీ అందులో ఒకటుంది. -చలి చలి వెచ్చని చలి/ గిలిగిలి చక్కని గిలి, -ఎర్రఎర్రని బుగ్గలదానా (ఘంటసాల, పి సుశీల) ఆత్రేయ రాశారు. శ్రీకృష్ణుని గుడిలో గుమ్మడిపై పద్యం -శ్రీకృష్ణా కృష్ణేవరాయాదరా (ఘంటసాల, ఆత్రేయ). ‘చిట్టి అమ్మలు’ (సంతోషం-విషాదం- ఘంటసాల, ఆత్రేయ) ఈ చిత్రంలో మరో ఆకట్టుకునే గీతం వాణిశ్రీ, జగ్గయ్యలపై చిత్రీకరణ -సోగ్గాడే చిన్నినాయనా (పి సుశీల- కొసరాజు).
ఆస్తిపరులు చిత్రం అర్ధవంతమైన కథ, కథనాలతో రూపొంది విజయవంతమైన కుటుంబ కథాచిత్రంగా నిలిచింది. నవరసాలు సమపాళ్ళలో అమిరి చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఈనాటికి అలరించటం ప్రత్యేకాంశం. ఈ చిత్రానికి ఫిలిమ్‌ఫేర్ అవార్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాంస్య నంది అవార్డు లభించాయి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి