ఈ వారం తార

ఇంటి గుట్టు ( ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం
పాటలు: మల్లాది రామకృష్ణశాస్ర్తీ
సంగీతం: యంయస్ ప్రకాష్
(మెంట్రరెడ్డి సూర్యప్రకాష్)
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
కెమెరా: సి నాగేశ్వరరావు
కళ: గోడ్‌గావ్‌ర్
ఎడిటింగ్: పివి నారాయణ
నిర్మాత: ఆకెళ్ళ శాస్ర్తీ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వేదాంతం రాఘవయ్య

నిర్మాతలను అలరించి ఒప్పించేలా సినిమా కథలను వివరించగల ప్రజ్ఞాశాలి వెంపటి సదాశివబ్రహ్మం. ఆంధ్ర, సంస్కృత భాషల్లో అపార పాండిత్యంతో పలు అష్టావధాన, శతావధానల్లో మేటిగా నిలిచారు. ‘చూడామణి’ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేశారు. దర్శకత్వం వహించిన తొలి చిత్రం రాధిక (1947). పలు చిత్రాలకు రచనలు అందించి కథాశివబ్రహ్మంగా వినుతికెక్కారు.
విశాఖపట్నానికి చెందిన ఆకెళ్ళ శాస్ర్తీ, బొంబాయిలో సంగీత కళాకారునిగా వున్న మిత్రుడు మెంట్రరెడ్డి సూర్యప్రకాష్‌తో కలిసి సంగీతా ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించారు.
బాలీవుడ్‌లో సుబోధ్ ముఖర్జీ దర్శకత్వంలో దేవానంద్ హీరోగా వచ్చిన ‘మునీంజి’ (1955) చిత్ర కథ నచ్చి, వెంపటి సదాశివబ్రహ్మంచే కొన్ని మార్పులు చేయించి సంగీతా నిర్మాతలు తెలుగులో రూపొందించిన చిత్రం ‘ఇంటిగుట్టు’.
(ఈ సందర్భంలో పరిచయమైన సదాశివబ్రహ్మంను తరువాత దేవానంద్ నటించిన ‘తీన్‌దేవియా’ (1965) చిత్ర కథ కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అమర్‌జిత్ బొంబాయికి పిలిపించుకోవటం తెలుగు రచయితకు దక్కిన ఓ అరుదైన గౌరవం).
***
జమీందారు రావుబహద్దూర్ తిరుమలరావు (గుమ్మడి) భార్య మహాలక్ష్మి (పుష్పవల్లి), అతని చెల్లెలు నాంచారమ్మ (సూర్యాకాంతం) గర్భవతులు. ఒకనాడు ఇద్దరూ మగపిల్లలను ప్రసవిస్తారు. ఆస్తికి ఆశపడిన నాంచారమ్మ భర్త శేషావతారం (మహంకాళి వెంకయ్య) బిడ్డలను మార్చేస్తాడు. తన బిడ్డను మహాలక్ష్మి వద్ద, ఆమె బిడ్డను నాంచారమ్మ వద్దకు చేరుస్తాడు. ఇది నచ్చని నాంచారమ్మ తన బిడ్డను చేరదీసి, వదినె బిడ్డను నిర్లక్ష్యం చేయటమేకాక, ఆమెపై నిందలు వేసి ఇంటి నుంచి బయటకు పంపించేలా కుట్ర చేస్తుంది. ఇల్లు వదిలిన మహాలక్ష్మి ఓ అనాథ శరణాలయం చేరుతుంది. అన్న కుమారుడిని వదిలించుకోవాలని భర్తకు పురమాయించగా, అతడు మహాలక్ష్మి వున్న శరణాలయం వద్ద బిడ్డని వదిలివేస్తాడు. ఆశ్రమంలోని స్వామిజీ (కెవియస్ శర్మ) ఆ బిడ్డను చేరదీసి మహాలక్ష్మిని పెంచుకోమంటాడు. గోపాల్ (ఎన్టీఆర్) పేరుతో పెరిగిన ఆమె కొడుకుకు ఇన్‌స్పెక్టరుగా అదేవూరికి వస్తాడు. నాంచారమ్మకు ఓ ఆడ పిల్ల శోభ (సావిత్రి) జన్మించటం, ఆమె పెద్దదయ్యే సమయానికి తండ్రి శేషావతారం పాముకాటుకు గురై మరణిస్తాడు. గత్యంతరం లేని స్థితిలో కూతురితో నాంచారమ్మ అన్నవద్దకు చేరుతుంది. తిరుమలరావు కొడుకుగా పెరిగిన ఆమె బిడ్డ ప్రభాకరం (ఆర్ నాగేశ్వరరావు) వ్యసనపరుడిగా, దోపిడి దొంగగా, ఒక ముఠాతో కలిసి థియేటర్ నడుపుతూ అకృత్యాలకు పాల్పడుతుంటాడు. డాన్సర్ రీటా (రాజసులోచన) అతనికి తోడు. ఆ ముఠా గుట్టు తెలుసుకోవాలని కానిస్టేబుల్ భద్రాచలం (రేలంగి) సాయంతో గోపాల్ (ఎన్టీఆర్) వేషాలు మారుస్తూ నిఘా పెడతాడు. తొలుత శోభను అనుమానించి, తరువాత నిజం గ్రహించి ఆమెను ప్రేమిస్తాడు గోపాల్. ప్రభాకర్ బాగుకోరి శోభకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు తిరుమల రావు. ఆ ఆలోచనతో ఆస్తి శోభపేర వ్రాస్తాడు. ఆస్తికోసం శోభతో పెళ్ళికి సిద్ధపడిన ప్రభాకర్, ఆ పెళ్లివద్దని అడ్డుపడిన నాంచారమ్మను గాయపరుస్తాడు. దాంతో ఆమె మరణిస్తూ నిజం చెప్పటంతో తిరుమలరావు, మహాలక్ష్మిలు తమ బిడ్డ గోపాల్ అని తెలుసుకుంటారు. గోపాల్ ఈ ముఠా ఆటకట్టించి అందరినీ పోలీసులకు పట్టించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
సన్నివేశాలను సహజంగా, అర్ధవంతంగా తీర్చిదిద్దారు దర్శకులు వేదాంతం రాఘవయ్య. పిల్లలను మార్చటానికి మంత్రసానితో శేషావతారం ప్రణాళికలు వేయటం, మార్పు ఇష్టంలేని నాంచారమ్మ పోకడలు, వదినె మీద నిందవేయటానికి ఆమె పన్నిన కుట్ర, అన్నాచెల్లెళ్ళకు పెళ్ళి జరగకూడదని, కూతురిని మరో యువకునితో ప్రేమ గురించి వాకబు చెయ్యటం, ప్రభాకర్ దొంగ అని తెలిసి, ఆ రహస్యం వెల్లడికాకుండా చివరి వరకూ దాయటంలాంటి సన్నివేశాలను రక్తికట్టించేలా తీర్చిదిద్దారు. చిత్రంలో నాంచారమ్మ పాత్రను ఎంతో సహజంగా, కుటిల స్వభావం వెల్లడయేలా రూపొందించారు. ప్రభాకరే తన కొడుకని భావించే తల్లి మహాలక్ష్మి, గోపాల్ గురించి నిజాలు అతనికి వెల్లడించే సన్నివేశాల్లో మాతృహృదయ మమకారం వెల్లడయెలా చూపటం ఆకట్టుకుంటుంది. ఇక గోపాల్, శోభను అనుమానించటం, ఓ చిన్న మాటలో డాన్సర్ మెడలో హారం చూసి శోభ స్పందన ద్వారా నిజం గ్రహించటం, శోభకు నిజం చెప్పి ఆమెపై ప్రేమ వ్యక్తపర్చటంలాంటి సన్నివేశాల్లో సంస్కారవంతమైన లక్షణాన్ని, హీరోయిజాన్ని అర్ధవంతంగా చిత్రీకరించారు.
ఈ చిత్రంలో హీరో గోపాల్‌గా ఎన్టీ రామారావు ముచ్చటగొలిపే అభినయాన్ని ప్రదర్శించారు. హీరోయిన్ వద్ద క్రమశిక్షణతో డ్యూటీ నిర్వహించే పోలీస్ ఆఫీసర్‌గా గంభీరంగా, తల్లిపట్ల ప్రేమ గల కుమారునిగా వాత్సల్యాన్ని, అభిమానాన్ని ఎంతో నిండుతనంతో ప్రదర్శించారు. శోభగా సావిత్రి ఆ రోజుల్లోనే బిఏ చదివిన అమ్మాయిగా వ్యక్తిత్వం, చొరవ, మంచితనం, కొంత దూకుడు, నిజాయితీగల యువతిగా నేర్పు మొదలైన లక్షణాలను నటనలో ఎంతో ఈజ్‌తో చూపటం విశేషం. భద్రాచలంగా రేలంగి ‘జంబలకిడిపంబ’ ఊతపదంతో హాస్యాన్ని తమాషాగా పలికించారు. ఆ ఊతపదమే చివరకు ఓ సినిమా టైటిల్‌గా రావడం చెప్పుకోదగ్గది.
హిందీ ‘మునీంజి’ చిత్రంలో ప్రాణ్ పోషించిన పాత్రను ఆర్ నాగేశ్వరరావు తెలుగులో పోషించి విలనీని తన తరహాలో చూపించి మెప్పించారు. రాజసులోచన నృత్యాలు, వ్యాంపుగా నటన చూపిస్తూ పాత్రోచితంగా నటించారు. గుమ్మడి సాత్విక, గంభీర, విషాద భావాలనూ, ఇక పుష్పవల్లి తొలుత భార్యగా ఆపైన తల్లిగా పరిపక్వతను నటనలో చూపారు.
చిత్రంలో రాజసులోచనపై చిత్రీకరించిన నృత్యగీతాలు -పలు వనె్నల చినె్నల దానా వరసైన దాన’ (జిక్కి), మరో గీతం -చక్కని వాడా సరసములాడ’ (జిక్కి కోరస్), రేలంగి, రాజసులోచనలపై నృత్యగీతం -చిటారు కొమ్మ మీద చెట్టాపట్టాలేసుకొని (పిబి శ్రీనివాస్, జిక్కి). రేలంగిపై చిత్రీకరించిన గీతం -మందుకానిమందు మన చేతిలోనె ఉందన్న (పిఠాపురం). ఎన్‌టిఆర్ మారువేషం చూసి సావిత్రి ఆటపట్టించే గీతం -నీ లీలలన్ని చాలించవోయి (జిక్కి) తమాషాగా సాగుతుంది. ఎన్‌టిఆర్, సావిత్రిపై కారులో చిత్రీకరించిన గీతం -ఆడువారి మాటలు రాకెన్‌రోల్ (ఎఎం రాజా), ఎన్‌టిఆర్, సావిత్రి, బాల నృత్య తారలతో చిత్రీకరించిన గీతం -రాజు నీవోయి రాణి చిలకో (జిక్కి బృందం), చక్కని తోట, వెనె్నల నేపథ్యంలో వీరిరువురిపై చిత్రీకరించిన ఆహ్లాదకర గీతం -ఓహో వరాల రాణి, ఓహో వరాల రాజా/ వెనె్నల రేయి వెలిగే హాయి (ఘంటసాల, జిక్కి), పుష్పవల్లిపై చిత్రీకరించిన ఊయల గీతం -పాపాయుంటే పండుగ మా యింట పండుగ (పి లీల బృందం). ఆమెపై చిత్రీకరించిన మరో నేపథ్య గీతం న్యాయంబిదేనా ధర్మంబిదేనా (ఘంటసాల). చిత్ర గీతాలు అలరించేలా సాగటం, మల్లాది సాహిత్యానికి తోడు మెంట్రరెడ్డి సూర్యప్రకాష్ స్వరాలు కూడి చక్కని మేళవింపుగా తోస్తుంది.
చిత్ర నిర్మాణ సమయంలో సావిత్రి గర్భవతి కావటంతో సినిమా పూర్తి కొంత ఆలస్యం జరిగింది. విజయ, వాహిని స్టూడియోలలో సెట్స్‌వేసి సినిమాను పూర్తి చేశారు. అక్టోబర్ 31, 1958లో చిత్రం విడుదలైతే, డిసెంబరులో సావిత్రికి విజయ చాముండేశ్వరి జన్మించింది.
ఈ చిత్రం విజయం సాధించటంతో ఆ తరువాత ఈ నిర్మాతలే రేలంగి, సావిత్రి జంటగా పుష్పవల్లి, ఎస్‌వి రంగారావు, సిఎస్‌ఆర్ కాంబినేషన్‌లో ‘మామకు తగ్గ అల్లుడు’ నిర్మించారు. ఆ చిత్రం తరువాత (శాస్ర్తీ, ప్రకాష్) విడిపోగా, ఆకెళ్ళ శాస్ర్తీ రెండు మూడు చిత్రాలు ఎన్టీఆర్ హీరోగా నిర్మించారు. వాటిలో ఎన్టీఆర్, అంజలీదేవి జంటగా నటించిన ‘వారసత్వం’ ఒకటి. సంగీతావారి ‘ఇంటిగుట్టు’ చిత్రం ఓ మంచి కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది. అభినయపరంగా, గీతాలపరంగానూ ఆనాటి ప్రేక్షకుల ఆదరణ పొంది, నేటి ప్రేక్షకులకూ ఆ అనుభూతి అందించగలుగుతుంది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి