రివ్యూ

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట (పేరుకు తగని ప్రయత్నం) *

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: శేఖర్ వర్మ, దీప్తిషెట్టి, మధుసూదన్‌రావు, గౌతంరాజు, మధుమణి, గీతాంజలి, నాగేంద్రప్రసాద్, రామరాజు.
నిర్మాత: కె.ఎన్.రావు
రచన, సంగీతం, దర్శకత్వం: నరేష్ పెంట

పోస్టర్‌పై సినిమా పేరు (శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట) చూసి ఆకర్షితులై థియేటర్‌కెళ్లిన వారు అంతగా సంతృప్తి పొందని చిత్రమిది. దానికి కారణం కథలో వౌలికంగా కన్పడే లోపాల్ని సరిచేయకుండా కథనాన్ని నడిపేయడం ఒకటి కాగా, చూసిన సన్నివేశాల్నే తిరిగి తిరిగి చూపిన తీరు మరొక కారణం. అన్నింటికంటే ముఖ్యం ఇంత మంచి టైటిల్ (శ్రీరాముడింట...)కు సినిమాలో ఎక్కడా జస్ట్ఫికేషన్ లేదు. కథా కమామీషు వివరాల్లోకి వెళితే...
సాఫ్ట్‌వేర్ కంపెనీలో రెండు లక్షల హార్డ్‌మనీ ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్న ఇందు (దీప్తిషెట్టి) మోసపోతుంది. అలా జాబ్ ఇప్పిస్తానని మోసం చేసిన గౌతమ్ (శేఖర్ వర్మ)ని పట్టుకునే ప్రయత్నంలో విసిగిపోయి ఇంటిదారి పడుతుంది. బస్సెక్కి వెళ్తున్న ఆమెకు పక్క సీట్లోనే గౌతమ్ ప్రత్యక్షమవుతాడు. అలా వెతకబోయిన తీగె కాలికి దొరకడంతో అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి తదుపరి చర్యల కోసం తండ్రి రావుగారు (మధుసూదన్‌రావు)కి అప్పగిస్తుంది. తను కూడా మరొకరి చేతిలో మోసపోవడంవల్ల ఇలా అయిందని చెప్తూ, త్వరలోనే డబ్బు తిరిగిస్తానని నమ్మబలుకుతాడు. మరి అతను డబ్బిచ్చాడా? లేదా? ఆ పరిస్థితిలో వారింటికి వచ్చిన వ్యక్తి అల్లుడెలా అయ్యాడు? అన్నది మిగతా కథ. ఉద్యోగార్థులనుంచి డబ్బు తీసుకుని ఎగ్గొట్టడం, కంపెనీలు బోర్డు తిప్పేయడం లాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. అలాంటివాళ్లను పట్టుకోవడం, దర్యాప్తు చేయడంలాంటివి పోలీసు విభాగాలు చేస్తాయి. కానీ ఇందులో మోసం చేసిన గౌతమ్‌ని బాధితురాలు ఇంటికి తీసుకువెళ్లడం సహజంగా అనిపించదు. పైగా మాట తప్పని, ధర్మం పాటించే లక్షణాలున్న రావుగారూ ఈ విధానాన్ని సమర్థించడం మింగుడుపడని విషయం. ఈ ముఖ్య అంశాన్ని విస్మరించి మిగతా సన్నివేశాల కల్పనలో దర్శకునికున్న భావ పరంపర మాత్రం మెచ్చతగ్గదే! ఎందుకంటే కొత్త దర్శకుడైనా ఎక్కడా వాణిజ్య అంశాల వెంపర్లాటకుపోక, స్వచ్ఛమైన గోదావరి అందాలను బ్యాక్‌డ్రాప్‌గా చిత్రించారు. సంభాషణలోనూ సాధ్యమైనంతవరకూ ఏదో ఒక మంచి విషయం చెప్పాలన్న తపన కనిపించింది. ‘దేవుడిచ్చిన దాంతో తృప్తిపడితే మనుషుల జీవితాలు ఎంతో బాగుంటాయి’, ‘హామీ ఇవ్వడం అంటే ఒక నమ్మకం లేని వ్యక్తికి నమ్మకమైన వ్యక్తి ఇచ్చే భరోసా’, ‘పొలాన్ని, పల్లెటూరినీ తొలిపొద్దున చూస్తే మంచిది..’ లాంటివి మెచ్చుతునకలు. పాటల్లో పెద్దగా ఆకట్టుకున్నవి లేవు. ఈ పై మూడు విభాగాలకీ ప్రశంసార్హుడు దర్శకుడు నరేష్ (దర్శకుడే సంగీతం, సంభాషణలందించారు). కేవలం రెండు లక్షలు తిరిగివ్వడం కేంద్రంగా రావుగారు, గౌతమ్ పొలం వెళ్లి రావడం సీన్లతోనే ప్రథమార్థం గడిచిపోవడం విసుగు పుట్టించింది. ద్వితీయార్థం కూడా సినిమాలో కావలసిన వేగం కొరవడి ప్రేమ, పెళ్లిపై పడి అనాకర్షణీయంగా తయారైంది. నటీనటుల్లో నాయకా నాయికలు ఇద్దరూ కొత్తవారైనా (శేఖర్ వర్మ, దీప్తిషెట్టి) అనుభవజ్ఞులైనవారిలాగే నటించారు. ముఖ్యంగా కథానాయిక పాత్రకు కావాల్సిన చిలిపిదనాన్ని, గొప్పింటి కోడలు కాబోతున్నానన్న అహంకారాన్నీ, తర్వాత పశ్చాత్తాపాన్ని బాగా పలికించింది. వీళ్లందరికన్నా మంచి ఎన్నదగిన నటన ప్రదర్శించింది రావుగారి పాత్రధారి మధుసూదన్‌రావు. ప్రత్యేకించి గోదావరి యాసను బాగా పలికారు. ఈ సందర్భంగా ఆ పాత్రకు రాసిన సంభాషణ - ‘మా గోదవారి జిల్లాల భాషలో వెటకారం ఉంటుంది అంటారు కానీ, అది అందరూ మనోళ్లే అన్న మమకారంతో మ్లాడినవి తప్ప, ఎదుటోణ్ణి బాధపెట్టాలన్న భావంతో కాదు’.. అన్నది ఆడిటోరియంలో బాగా పండింది. అలాగే పతాక సన్నావేశానికి ముందుగా ‘నాకు కొడుకులాంటి అల్లుడు కావాలి’ అన్న సీన్లోనూ ఈ నటుడి నటన ఆకట్టుకుంది. కథానాయిక బామ్మగా గీతాంజలి, తల్లిగా మధుమణి పాత్రల పరిధి మేరకు నటించారు. వడ్డీ వ్యాపారిగా గౌతంరాజు అందించిన హాస్యం అంతంత మాత్రం. గోదావరి అందాన్ని జయకృష్ణ కెమెరా ఉన్నంతలో బాగా క్యాప్చర్ చేసింది. ‘పూడిగుడిసెల్లో పూసే నవ్వులు అనురాగం విరిసే లోకం మరిచావో’ (యాసే కొత్తగుంది) పాటలో పదాలు బాగున్నాయి. మొత్తానికి సినిమా గురించి ఈ చిత్రం భాషలోనే (నారు బాగుంటే పంట బాగుంటుంది కానీ, ఎరువు బాగుంటే బావుంటుందా) చెప్పాలంటే కథలో బలం ఉంటే సినిమా బాగుంటుంది కానీ, మిగిలినవి బాగుంటే బాగుంటుందా అనే చెప్పాలి.

-అనే్వషి