రివ్యూ

పండగ సోగ్గాడు ** సోగ్గాడే చిన్నినాయన ( ఫర్వాలేదు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, బ్రహ్మాజి, చలపతిరావు తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత:
నాగార్జున అక్కినేని
దర్శకత్వం:
కళ్యాణకృష్ణ కురసాల

సోగ్గాడి సరసాలు, సరదాలు, వినోదాలకు సోషియో ఫాంటసీని జోడించి ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. యమలోకం నుంచి భూలోకానికి వచ్చిన తండ్రి బంగార్రాజు ఆత్మ -కొడుకు కాపురాన్ని చక్కదిద్ది, ఊరి శుభకార్యాన్ని దగ్గరుండి ఎలా జరిపించిందో చూపించే కథ ఇది.
శివపురం పల్లెటూళ్లో జమీందారు బంగారురాజు (నాగార్జున) కొడుకు రామ్మోహన్ (నాగార్జున), కోడలు సీత (లావణ్యత్రిపాఠి) అమెరికా నుంచి కేవలం విడాకులు తీసుకోడానికి బంగారురాజు భార్య సత్యభామ (రమ్యకృష్ణ) అనుమతి కోసం ఇండియాకు వచ్చినప్పటినుండి సినిమా మొదలవుతుంది. ప్రారంభంలోనే ఆలుమగల మధ్య ఏర్పడిన ఆగాధమేమిటి? వారు చివరికి కలుస్తారా? అన్న సందిగ్ధంలో ప్రేక్షకుడిని ఉంచి మధ్య మధ్యలో బంగారురాజు, రామ్మోహన్ పాత్రలతో నవ్వులు వెదజల్లే ప్రయత్నం చేశారు. సత్యభామ తన భర్తను నిందించే సమయంలో యమలోకంలో ఉన్న బంగారురాజును లోకకళ్యాణార్థం, ఓ ఆధ్యాత్మిక అవసరం దృష్ట్యా భూమీదకు పంపుతాడు యముడు (నాగబాబు). అయితే బంగారురాజు సత్యభామకు మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు. ఈ నేపథ్యంలో కొడుకు కాపురాన్ని బాగుచేయడం కోసం తల్లిదండ్రులు పడే ఆవేదన, దాన్ని నేపథ్యంగా తీసుకుని అల్లుకున్న సన్నివేశాలు తెలుగుదనంతో ఉండటంతో ప్రేక్షకుడు సినిమాలో జరిగే సన్నివేశాలకు కనెక్ట్ అవుతాడు. సెకండాఫ్ నుండి అసలు బంగారురాజు చనిపోవడానికి కారణమేమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా తెరపై సన్నివేశాలు సాగుతుంటాయి. అసలేం జరిగింది? చిన్నవయసులోనే బంగారురాజు చనిపోవడానికి కారణమేమిటే సస్పెన్స్‌తో సెకండాఫ్‌ను చిత్రీకరించారు. బంగారురాజు స్వర్గంలో మహిళా రక్షకభటులతో సరసాల నుండి, భూలోకం వచ్చి భార్య సత్యభామతో, మరదళ్లతో, ప్రియురాళ్లతో చేసే సరసాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా సాగాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతో అసలు దేవాలయంలోని నగలపై కన్నువేసింది ఎవరు? దేవాలయంలో కాపలావుండే నాగసర్పం రామ్మోహన్‌ను ఎందుకు వెంటాడుతోంది? లాంటి సన్నివేశాలకు సమాధానం సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది?
చాలారోజుల తర్వాత గ్రామీణ నేపథ్యంలో అచ్చమైన తెలుగు పలుకుబడులతో రాసుకున్న డైలాగ్స్‌తో సినిమా ఆద్యంతం సాగింది. మధ్యమధ్యలో బావమరదళ్ల సరసాలు, భార్యభర్తల మధ్యవుండే అమలిన శృంగార భావలను సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శృంగారం అంటే యువతీ యువకుల మధ్య సాగేదే అనుకుంటే పొరపాటని, ముదురు సరసాలలో ఉండే మాధుర్యాన్ని తెరపై చిత్రీకరించిన తీరు సరికొత్తగానే సాగింది. ఓరకంగా ఇద్దరు సీనియర్ నటీనటులపై చిత్రీకరించిన సరసాల సరదాలు ప్రయోగంగానే చేశారు. యువహీరో విడాకుల వ్యవహారం, చనిపోయిన హీరో తన కుటుంబంలో రేగిన సమస్యలను ఏవిధంగా పరిష్కరించాడన్న కథనాన్ని సన్నివేశపరంగా ఆకట్టుకునేలా చెప్పగలిగారు. నాగార్జున చాలా రోజుల తర్వాత రెండు పాత్రల్లో రెచ్చిపోయి నటించాడు. పంచకట్టు, కోరమీసం, పులిగోరులాంటి పాత వాసనల సోగ్గాడిగా, తన కర్తవ్యమే పరమావధిగా ఎంచే నేటితరం గూగుల్ ప్రతినిధి రామ్మోహన్‌లాంటి రెండు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్టుగా నటించాడు. సోగ్గాడు బంగారురాజు వచ్చినప్పటి నుండి సినిమాలో వేగం పెరిగి నవ్వులు విరబూసాయి. ఓరకంగా సరికొత్త సన్నివేశాలనే చెప్పడంతో ప్రేక్షకుడు సినిమాలో లీనవౌతాడు. సత్యభామ పాత్రలో అన్ని సంఘర్షణలు స్పష్టంగా పలికించింది రమ్యకృష్ణ. ఆమె పాత్రే సినిమాకి ఎస్సెట్. లావణ్యత్రిపాఠి ఉన్నంతలో తనపాత్ర వరకు ఓకె. హంసానందిని, దీక్షాపంత్, అనసూయ, కృష్ణకుమారిగా అనుష్క, బుగ్గల భాగ్యంగా సన సోగ్గాడిని అలరించే ముద్దుగుమ్మలుగా నటించడం ఆకట్టుకుంటుంది. చివరిలో అసలైన క్లైమాక్స్‌లో మనిషి కనపడని కథనంతో సన్నివేశాలను బాగా రాసుకున్నారు. దెయ్యాలతో మాట్లాడే ఆత్మానందంగా బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత నవ్వులు పూయించాడు. కెమెరా పనితనం, సంగీతం చిత్రానికి తగిన విధంగా సాగాయి. మాటలు పాత్రలకు తగ్గట్టు రాశారు. దర్శకత్వపరంగా కళ్యాణకృష్ణ కురసాల అనికాకుండా సరసాల అని చెప్పేలాగా ప్రతి సన్నివేశంలో సన్నివేశాలను చిత్రీకరించి సినిమాను అందరికి నచ్చేవిధంగా చేయడంలో విజయం సాధించాడు.

-సరయు