Others

ఆదర్శమూర్తి అక్కినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా రామాపురానికి -సినీ కళా చరిత్రలో ప్రత్యేక పేజీని కల్పించిన నటుడు అక్కినేని. పున్నమ్మ కడుపున పుట్టి పుణ్యమూర్తిగా ఎదిగిన వ్యక్తి. చదువుకునే స్థోమతులేని ఇంట పుట్టాడు. కానీ -తననే పదిమందీ చదువుకునే స్థాయికి ఎదిగాడు. నాటక రంగానికి ఆకర్షితుడై -బాల్యంలోనే స్ర్తిపాత్రలతో అలరించిన అక్కినేనికి -1941లో ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్ర దొరికింది. చరిత్ర సృష్టించే సంకల్పం ఉన్న వ్యక్తులకు గడ్డిపోచ దొరికినా చాలు.. అనుకున్నది సాధిస్తారు. అక్కినేని విషయంలోనూ అదే అయ్యింది. ఒకరోజు నాటకంవేసి రైలులో తిరిగొస్తుంటే ఘంటసాల బలరామయ్య కంటపడ్డాడు. ఆ చల్లని చూపుల్లోంచే -ప్రపంచం గర్వించదగ్గ నటుడయ్యాడు. సీతారాంపురంలో పుట్టిన కుర్రాడు -1944లో ‘సీతారామ జననం’ ద్వారా శ్రీరాముడు వేషం వేశాడు. తర్వాత ఎన్నో చిత్రాలు, ఎన్నో పాత్రలు, ప్రతి పాత్రా ఒక ఛాలెంజ్. కట్‌చేస్తే -ఏఎన్నార్ అభిమాన సంఘాలు పుట్టుకొచ్చేంత హీరో అయ్యాడు. మొదట జానపద హీరోగా కీలుగుఱ్ఱం, బాలరాజుగా ఆంధ్ర దేశాన్ని ఒక ఊపుఊపాడు. తర్వాత దొరికిన అద్భుత పాత్ర దేవదాసు. అజరామరమైన నటనతో జీవంపోసి విమర్శకులను మెప్పించాడు. ఆ తర్వాత సాంఘిక చిత్రాలకు అక్కినేని ఒక బ్రాండ్ అంబాసిడర్.
డాక్టర్ చక్రవర్తిలో హీరోగా తొలి నందిని అందుకున్నాడు అక్కినేని. తరువాత అవార్డులు ఆయనే్న వెతుక్కోవడం మొదలెట్టాయి. అంతస్తులు, స్వీయ నిర్మాణంలో నటించిన సుడిగుండాలు చిత్రాలకు మళ్లీ నందులు అందాయి. 1968లో పద్మశ్రీ అందుకున్న తొలి హీరో. మరపురాని మనిషిగా ఫిల్మ్‌ఫేర్ అందుకుని అవార్డుల రారాజయ్యాడు. రాసికన్నా వాసి మిన్న అనేవారు అక్కినేని. అందుకే చిత్రాల సంఖ్య తక్కువైనా వాసిలో వినుతికెక్కిన చిత్రాలే చేశారు. తెలుగు సినిమా స్టెప్పులకి స్వీకారం చుట్టిందీ -అక్కినేనే. అక్కినేని నటుడే కాదు -రచయిత, వేదాంతి, విద్యాదాత, ధర్మదాత, నిర్మాత. అంతఃకోణంలో కనిపించని రూపాలెన్నో. అక్కినేని అనుభవ ఆలోచనలు తరువాతి తరాలకు ఆదర్శ పాఠాలంటే అతిశయోక్తికాదు.
***
రోజులుమారాయి -తొలి శత దినోత్సవ చిత్రం. దసరాబుల్లోడు -రెండువందల రోజులకు పైగా ఒకే థియేటర్‌లో ప్రదర్శించిన చిత్రం. ప్రేమాభిషేకం -మూడువందల రోజులకు పైగా నడిచిన చిత్రం. వారానికే సక్సెస్ మీట్లు పెట్టుకుంటున్న ఈరోజులతో పోలిస్తే -ఆయన సినిమాలకు కొన్ని వేల సక్సెస్ మీట్లు పెట్టుకోవాలి. ఇక -తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేనికి ఆరోగ్యకరమైన పోటీ ఎన్టీఆర్. ఎవరి తరహా సినిమాలు వాళ్లవే అయినా -మహామహులైన ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఉండేది. అందుకే -1982లో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్ళినపుడు అక్కినేని ఓ మాటన్నారు. ‘ఇక నా చిత్రాలకు పోటీలేనపుడు నేనెన్ని చిత్రాలు చేసినా ఎంత పేరొచ్చినా అందులో నా గొప్పతనం ఏమీ ఉండదు’ అనేవారు. పోటీవుంటేనే మంచి చిత్రాలొస్తాయన్నది అక్కినేని అంతరార్థం. ఎన్టీఆర్‌తో కలసి 16 చిత్రాల్లో నటించారు అక్కినేని. ఆ తరం తర్వాత మల్టీస్టారర్ చిత్రాలే కరువయ్యాయి. ఇటీవల మళ్లీ మల్టీస్టారర్స్ చేస్తున్నా -అంత గొప్పగా చూడగలిగే పరిస్థితి లేదన్నది కాదనలేని నిజం.
కుటుంబం అంటే ఎలా ఉండాలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు అక్కినేని. 1990వ దశకంలో బంగారుకుటుంబంలో అలాంటి ఆత్మీయతల్ని చూపించారు కూడా. చిట్టచివరి సినిమా ‘మనం’లోనూ అలాంటి అనుబంధాల్నే రుచిచూపించారు. మహాకవి కాళిదాసుగా అద్భుత నటనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస సమ్మాన్ బిరుదుతో సత్కరించింది. ఆయన రచించిన మేఘసందేశానికి జీవంపోసి 18 అవార్డులు తెచ్చిపెట్టింది. మరోసారి బంగారునందిని అందించింది. నిజ జీవిత పాత్రని సీతారామయ్యగారి మనవరాలిలో నటించి ఫిలింఫేర్ స్వంతం చేసుకున్నారు అక్కినేని. 1988లో పద్మభూషణ్ అందుకున్న తొలి తెలుగు హీరో అక్కినేని. 1990లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది నటుడు. తెలుగువాడిగా ఆయన సృష్టించిన రికార్డులు కళామతల్లి సేవకు నిదర్శనం. ఆ అవార్డుతో వచ్చిన మొత్తానికి మరికొంత జోడించి తన పేరిట అక్కినేని అవార్డు నెలకొల్పారు. బహుశా ప్రపంచంలో ఒక నటుడు బతికుండగానే తన పేరుమీద అవార్డు ప్రవేశపెట్టటం అనేది జరిగి ఉండదేమో. మన ధరించే పాత్రలతో సమాజానికి మంచి జరగకపోయినా ఫరవాలేదు, చెడు మాత్రం జరగకూడదని నమ్మిన నటుడాయన. అందుకే -అక్కినేని ధరించిన ఎన్నో పాత్రలు సమాజానికి చక్కటి సందేశాన్నిచ్చాయి. పదిమందికి ఆదర్శంగా నిలిచాయి. 1996లో ఎన్టీఆర్ అవార్డు అందుకున్న అక్కినేని కళాసేవకు -2011లో పద్మవిభూషణ్ వరించింది. ఎన్నో సంస్థలు ఆయన్ని సన్మానించి, సత్కరించి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. బతికున్నంత వరకూ నటిస్తూనే ఉంటానన్న అక్కినేని -తన మాటను నిజం చేశారు. తరతరాలు గుర్తుంచుకొనేలా.. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా ‘మనం’లో నటించి ఆంధ్రుల హృదయాల్లో ఎవర్‌గ్రీన్ హీరోగా నిలిచాడు. లవ్ అండ్ రొమాంటిక్ కింగ్‌గా మహిళా మనసుల్లో నిలిచిపోయారు. ద్విపాత్రాభినయమే గొప్పనుకునే రోజుల్లో ఒకే సినిమాలో తొమ్మిది పాత్రలతో మెప్పించి -లెజెండ్ అనిపించుకున్నారు అక్కినేని. ఆ చిత్రమే -నవరాత్రి. అందుకే -ప్రేక్షక హృదయాల్లో ఆయన స్థానం చిరస్థాయి. భౌతికంగా లేకున్నా అక్కినేని తన చిత్రాలతో -పలకరిస్తారు, కవ్విస్తారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నారు.
(జనవరి 22 అక్కినేని ద్వితీయ వర్ధంతి
సందర్భంగా)

-సిహెచ్‌వియస్ బ్రహ్మానందరావు, విజయవాడ