మెయిన్ ఫీచర్

హీరోయన్‌కు దయ్యంపట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హారర్ సినిమా తీయాలంటే -అందమైన దయ్యాన్ని వెతుక్కోవాలి. ఆమె -తెరకు
తొలి సినిమాగా పరిచయమయ్యే ఆత్మ అయ్యుండాలి. బాతుగుడ్డులాంటి కళ్లు, ప్రేక్షకుడిని హిప్నటైజ్ చేయగలిగే అందమైన శారీరక సౌష్టవం, భయపెట్టగలిగే అభినయం... లాంటివీ ఆమె సొంతమై ఉండాలి. ఇదీ ఆధునిక తెలుగు హారర్ సినిమాల్లో హీరోయిన్ తీరు. అయితే, ఇన్ని క్వాలిటీలున్న అమ్మాయిని వెతుక్కునే ఒపిక, తీరిక నిర్మాత, దర్శకులకు ఉండటం లేదు. పోనీ -కష్టపడి వెతుకుదామన్నా దొరికే పరిస్థితీ లేదు. అందుకే -స్టార్ హీరోయిన్లకే దయ్యం వేషం వేస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే -ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమేనంటున్న స్టార్లను ఆత్మ పాత్రలకు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ తరహా పాత్రలు చేసి మెప్పించడానికి హీరోయిన్లూ సై అంటుండటం మరో విశేషం.
సో.. సౌత్ సినిమా హీరోయిన్లకు ఇప్పుడు దయ్యంపట్టిందన్న మాట.

ఆకాశం నిర్మలంగా వుంది. సాయంకాలం కావడంతో ఇంకొంచెం ఆహ్లాదంగా కనిపిస్తోంది. అక్కడక్కడా మేఘాల తునకలు -సూర్యుడు పూర్తిగా ఒదిగిపోయాడన్న విషయాన్ని తెలియజేస్తున్నట్టు ఎరుపందాలు అద్దుతున్నాయి. సూర్యాస్తమయమైన ఆకాశం -రుధిరవర్ణంతో చూడ్డానికి భయంగొలిపేలా ఉంది. క్రమంగా వెలుగు తగ్గింది. ఆకాశం చీకటైంది. ఈ వర్ణనంతా ప్రస్తుత తెలుగు కథానాయిక కోసమే.
హీరోయిన్ అంటేనే గ్లామర్ డాల్. ఇప్పటికీ ఈ మైండ్‌సెట్‌తోనే తెలుగు ప్రేక్షకుడు చూస్తున్నాడు. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచీ కథానాయికలు తమ అందాలతోనే ప్రేక్షకుల్ని థియేటర్లవైపు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కోసారి హీరోయిన్ డ్రెస్ స్టయిల్స్, ధరించిన ఆర్నమెంట్స్, ఆమె హెయిర్ స్టైల్‌ను అనుకరించడానికో, చూసి ఎంజాయ్ చేయడానికో అన్నట్టు.. -ఆడియన్స్ థియేటర్లవైపు దారి తీసేశారు.
ఇప్పుడు హీరోయిన్లు -దయ్యాలగానూ బాగానే కనిపిస్తున్నారు. అప్పుడే అడుగుపెట్టిన ఫ్రెష్ హీరోయిన్ నుంచి.. సీనియార్టీ సంపాదించిన స్టార్ హీరోయిన్ వరకూ ‘దయ్యం’ క్యారెక్టర్ అంటే పడి చేస్తున్నారు. అందమైన హీరోయిన్‌ని దయ్యంగా చూపిస్తే ఎలా ఉంటుందో చూడ్డానికన్నట్టు -ఇలాంటి పాత్రలకూ అభిమానులూ కనెక్టవుతున్నారు. సినిమాలను ఆదరిస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే -ఇప్పుడు సౌత్ సినిమాల హీరోయిన్లకు దయ్యం పట్టిందంటే అతిశయోక్తి కాదు.
***
తెలుగు సినిమా హీరోయిన్ గతంలో సంప్రదాయబద్ధంగా కనిపించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా -కాస్త పట్టువిడుపులనూ ప్రదర్శించింది. సినిమా ఆధునిక స్థాయికి చేరాక -ఒక రకమైన గ్లామర్‌నూ చూపించింది. ఇప్పుడు -వెంటపడి మరీ దయ్యంగా
ప్రేక్షకులను భయపెట్టడానికీ సిద్ధపడుతోంది. కొద్దికాలం క్రితం వరకూ -ఎంటర్‌టైన్‌మెంట్ కోసమంటూ క్లబ్ డాన్సర్లు వేరుగా ఉండేవారు. క్లబ్ సాంగ్స్‌లో చెలరేగిపోయేవారు. వేరే వాళ్లేందుకు -మేమున్నామంటూ అలాంటి పాటలు చేయడానికి హీరోయిన్లూ సిద్ధమైపోవడంతో ‘ఐటెమ్స్’ పుట్టుకొచ్చాయి. స్టార్ హీరోయిన్లు సైతం పాపులార్టీ కోసమో, ప్రాజెక్టు ఇమేజ్ పెంచడం కోసమో భారీగా పారితోషికాలు తీసుకుంటూ ‘ఐటెమ్స్’కు క్యూగట్టారు. ఫలనా సినిమాలో ఫలానా హీరోయిన్ ఐటెమ్ చేస్తుందంటే -ప్రాజెక్టుకంటే హీరోయిన్‌కే పాపులార్టీ పెరగడం మొదలైంది. ఇలాంటి ‘హీరోయినిజం’ కొద్దికాలం బాగానే సాగింది. ఇప్పుడు దయ్యం సంస్కృతి మొదలైంది.
***

అప్పుడెప్పుడోనాటి సినిమా తీరును పరిశీలిస్తే -దయ్యాలుగా నటించడానికి అందవిహీనంగా ఉన్న నటీనటులను ఎంపిక చేసుకొనే వారు. మాయల దర్శకుడు బి.విఠలాచార్య రూపొందించిన జగన్మోహిని చిత్రంలో జయమాలిని దయ్యమే అయినా, మోహినిగా అందంగానే చూపించారు. అందులో దయ్యం వేషం వేసింది నటీమణి కాదు, నటుడు. కాలం మారింది. హీరోయిన్లూ మారారు. పాత్ర డిమాండ్ చేస్తుంది కనుక -పవర్‌ఫుల్ దయ్యాలుగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందమైన హీరోయిన్లూ హాట్‌హాట్‌గా జుట్టు విరబోసుకుని, పెద్ద బొట్టుపెట్టి భయంకరంగా భయపెట్టడానికి రెడీ అంటున్నారు. అలా కనిపిస్తే సినిమా హిట్ అన్న సెంటిమెంటూ టాలీవుడ్‌లో బలపడింది. దీంతో హీరోయినే దయ్యం పాత్ర వేయడం అన్నది ఆసక్తి నుంచి ఆనవాయితీగా మారిపోతోంది. అలాంటి పాత్రల్ని ఏరి కోరుకుంటున్నారు. దొరికితే -ఎగిరి గంతేస్తున్నారు. ‘నిజానికి దయ్యం పాత్ర అనగానే ముందు భయమేసింది. పీడించే ఆత్మగా కనిపించడానికి ఒప్పుకోకూడదనుకున్నా. కానీ, దర్శకుడు స్టోరీ లైన్ చెప్పిన తరువాత కాదనలేకపోయా. ఐ ఎంజాయ్ ద సీన్స్’ అంటూ ముద్దు ముద్దు స్టేట్‌మెంట్లు కూడా ఇస్తున్నారు.
***
హారర్ చిత్రాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో, హీరోయిన్లకు దయ్యం పాత్రలు బాగా కలిసొస్తున్నాయి. దయ్యంగా నటిస్తే మంచి గుర్తింపూ వస్తోంది. ఆమధ్య కథానాయికల రేసులో చాలా వెనుకపడిన అంజలికి దయ్యం పాత్రే కలిసొచ్చింది. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు కష్టమే అనుకున్న టైంలో -గీతాంజలి చిత్రం ఆమెను నిలదొక్కుకునేలా చేసింది. అందులో చేసిన దెయ్యం పాత్ర -మరికొన్ని సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో అందమైన దయ్యంలా అంజలి కనిపించిన తీరు ప్రేక్షకులకు కలెక్టైంది. సినిమా సక్సెస్ అయ్యింది. ఇంకా చాలామందే హీరోయిన్లు దెయ్యం పాత్రల వెనుక పరుగులు తీస్తున్నారు.
రెండుమూడు దశాబ్దాలు వెనక్కెళ్లి చూస్తే -అందమైన దెయ్యాలుగా విజయనిర్మల -బుల్లెమ్మ బుల్లోడు, దేవుడే గెలిచాడు చిత్రాల్లో నటించి మెప్పించారు. విజయలలిత సైతం అదే తరహా కొన్ని పాత్రల్లో మెప్పించారు. అంతస్థులు చిత్రంలో దెయ్యంపాటే చిత్రాన్ని నిలబెట్టేసింది. నిను వీడని నీడను నేనే/ కలగా కదిలే కథ నేనే’ అన్న పాటొక్కటే సినిమాను ‘అంతస్థులు’ ఎక్కించింది. కానీ అప్పట్లో హీరోయిన్లను దెయ్యం రూపంలో చూపించడానికి టాలీవుడ్ దర్శకులు సుముఖత చూపలేదు. వేరే నటీనటుల చేత ఆ సన్నివేశాన్ని డిజైన్ చేయించేవారు. కవిత, వెన్నిరాడై నిర్మల లాంటివాళ్లూ దెయ్యాలైనా అందంగానే కనిపించారు. ఇప్పుడు మాత్రం ఎంత అందమైన -్భయంకరమైన వేషంతో ప్రేక్షకుడిని భయపెడుతోంది. అందంగా కనిపిస్తూ భయపెట్టటం అనేది వైవిద్యమైన పాత్రగా మారుతోంది. దానికి ఉదాహరణే -మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథాచిత్రమ్‌లోని నందిత పాత్ర. ఆ చిత్రం విజయవంతం అయ్యాక దాదాపు అందరు హీరోయన్లూ దెయ్యం పాత్రలు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందు అప్పుడప్పుడు వచ్చిన ఉద్ధృతికన్నా ఇప్పుడు ఈ పద్ధతి పెరిగింది. పున్నమిరాత్రిలో శ్రద్ధాదాస్, చంద్రకళలో ఆండ్రియా, హన్సిక, నాగవల్లిలో అనుష్క, వైశాలిలో శరణ్యామోహన్, ఆ ఇంట్లో చిత్రంలో ఆషా శైని, నీలాంబరిలో రమ్యకృష్ణ అందమైన దెయ్యం లేదా ఆత్మ పాత్రలతోనే మెప్పించారు. త్రిష, నయనతార, లావణ్య త్రిపాఠి, ఛార్మి, శ్రీయ, స్వాతి, మీరా జాస్మిన్, పూర్ణ, లక్ష్మీరాయ్ లాంటివాళ్లంతా దెయ్యాలుగా మెప్పించినవాళ్లే.
హీరోయిన్ -జీవితంలో అనేక ఎదురుదెబ్బలు తగులుతాయి. చిట్టచివరికి లైంగిక వేధింపులతో ఎవరో ఒకరి చేతిలో చనిపోతుంది. తరువాత దెయ్యమవుతుంది. పగ తీర్చుకుంటుంది. హీరోయిన్ దెయ్యమైన ప్రతి చిత్రంలోనూ దాదాపు ఇదే కంటెంట్. కాకపోతే హీరోయిన్లు మారుతుంటారంతే. దెయ్యమంటే ఇక్కడ కేవలం భయంకరంగా ఉండటమే కాదు, అవసరమైతే అందాన్నీ ఎక్స్‌పోజ్ చేయాలి. ఈ అర్హత కూడా హీరోయిన్లనే దెయ్యం పాత్రలకు ఎంపిక చేయడానికి కారణమవుతోంది. దర్శకులు స్క్రీన్‌ప్లే నైపుణ్యంతో సరికొత్తగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుండటంతో -కొన్ని సినిమాలు విజయవంతం అవుతున్నాయి. పైన చెప్పిన విధంగా అన్ని సినిమాలూ విజయవంతమైన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం ట్రెండ్ అలా సాగుంతుంది కనుక, హీరోయిన్లంతా దయ్యాల వేషాలు వేయక తప్పడంలేదు.
మొత్తానికి అందమైన హీరోయిన్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్న టాలీవుడ్ దర్శకుల ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే, ఏమాత్రం తేడా జరిగినా ప్రేక్షకుడు ఆ చిత్రాన్ని ఉఫ్‌మంటూ ఊదేస్తున్నాడు. ఈ విషయం దర్శకులకు తెలిసినా ధైర్యం చేసి హీరోయిన్‌నే దెయ్యంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు విజయవంతమైతే -మరికొందరు చేతిలో హీరోయిన్లు దెయ్యాలుగానే మిగిలిపోతున్నారు. తరువాత వారికి ఎలాంటి అవకాశాలూ రావడంలేదు. ఒకవేళ వచ్చినా -దెయ్యం పాత్రలే మిగులుతున్నాయి. ప్రతిభవుంటే దెయ్యంగా నటించినా కానీ -తరువాత మంచి పాత్రలు వస్తుండటం చూస్తున్నాం. ఏతావాతా తేలేదేమంటే, అందమైన దెయ్యాలు తెలుగు తెరపై భయపెట్టడానికి వచ్చినా, తనకు నచ్చితేనే ప్రేక్షకుడు భయపడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకొని దర్శక నిర్మాతలు ఆయా చిత్రాలను రూపొందిస్తే పరిశ్రమకి, ప్రేక్షకుడికి మంచిది.

-సరయు